గాయాల్ని మాన్పడంలో 94 ఏళ్ల చరిత్ర: బోరోలిన్.. మేడ్ ఇన్ ఇండియా!

యాంటీ సెప్టిక్ క్రీమ్… బోరోలిన్… 94 ఏళ్ల చరిత్ర… మేడ్ ఇండియా కథ ఇది.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో.. ఓ బెంగాలీ వ్యక్తి రూపొదించిన క్రీమ్ ఇవాల్టికీ చాలామంది ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. బ్రిటీషర్స్ అడ్డంకులు, విదేశీ బ్రాండ్స్ పోటీని తట్టుకుని గత 94 ఏళ్ల నుంచి భారతీయ సమాజంలో ఓ సుస్థిర స్థానం సంపాదించుకుంది.

చలి అధికంగా ఉండే చాలా చోట్ల కనిపించినట్టే.. పశ్చిమబెంగాల్ లో కూడా శీతాకాలం మొదలైతే చర్మం పొడిబారిపోతుంది. పెదాలు, ముఖ్యంగా పాదాల మడిమెల స్థానంలో పగుళ్లు సర్వసాధారణం. అప్పుడు ప్రతీ ఇంట్లో గుర్తొచ్చే ఒకే ఒక్క క్రీమ్ బోరోలిన్. ఆకుపచ్చని ట్యూబ్ లేదా గ్రీన్ అండ్ వైట్ డబ్బా చాలా ఇళ్లల్లో దర్శనమిస్తాయి. కొందరు ఫస్ట్ ఎయిడ్ బాక్సులో కూడా పెట్టుకుంటారు. ఇంకొందరు స్కిన్ కేర్ క్రీమ్ గా… లేదా, యాంటీసెప్టిక్ గా కూడా వాడతారు. ఇలా మల్టీపర్పస్ గా మధ్యతరగతి కుటుంబాలతో అనుబంధాన్ని పెనవేసుకుంది బోరోలిన్.

1929లో కోల్ కత్తా ఈ బోరోలిన్ తయారీకి వేదికైంది. ఈ మేడ్ ఇన్ బెంగాల్ క్రీమ్… 1990ల కాలంలో ఓ టీవీ జింగిల్ తో ఐకానిక్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రతీ ఇంట్లోకీ వచ్చి చేరింది. గత 94 ఏళ్లుగా విదేశీ బ్రాండ్స్ ఎన్నింటింకో ఎదురొడ్డి నిల్చి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

బోరోలిన్ తయారీదారెవరు అసలు..?

రెండో ప్రపంచ యుద్ధకాలంలో గౌర్ మోహన్ దత్తా కోల్ కత్తాలో జీడీ ఫార్మాసెట్యుకల్స్ ను స్థాపించారు. స్వదేశీ వస్తు ఉద్యమం ప్రభావంతో.. భారతీయ మందులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో.. పేద, మధ్య తరగతి ప్రజలకు చర్మ సంరక్షణ, గాయాలకూ ఉపయోగపడే ఓ మల్టీపర్పస్ క్రీమును తయారు చేయడానికి తన పరిశ్రమ ఆరంభమైంది.

ఎలాంటి దాపురికం లేకుండా బోరోలిన్ ఫార్మూలాను కూడా గౌర్ మోహన్ దత్తా ప్రజల ముందుంచారు. బోరిక్ యాసిడ్, జింక్ ఆక్సైడ్, లానోలిన్ వంటి మిశ్రమంగా బోరోలిన్ ను తయారుచేస్తారు. ఏనుగు లోగోతో ఉండటంతో… బోరోలిన్ ను ఎలిఫెంట్ క్రీమ్ అని కూడా పిల్చేవారు. మొదట్లో యుద్ధసయమంలో ఏ డబ్బాలోనైనా ప్యాక్ చేసేవారు. బోరిక్ యాసిడ్ లోని బోర్.. అయిల్ అనే అర్థాన్ని కల్గి ఉండే ఒలిన్ ను అనే పదాన్ని ల్యాటిన్ లో ఓలియమ్ నుంచి తీసుకుని బోరోలిన్ గా నామకరణం చేశారు దత్తా.

ఇంటింటికీ బోరోలిన్!

1947లో భారత స్వాతంత్ర్యం సాధించే సమయంలో కంపెనీ 1 లక్ష ట్యూబులను ఉచితంగా పంపిణీ చేసింది. మొదట బెంగాలీ మార్కెట్ పైనే దత్తా ఎక్కువ దృష్టి సారించేవారు. దసరా సమయంలో బెంగాల్ లో జరిగే దుర్గా మాత ఉత్సవాల సమయంలో అందమైన యాడ్స్ తో ఆకట్టుకునేవారు. కొద్దికాలం తర్వాత ఇమామి అనే కంపెనీ బోరో ప్లస్ పేరిట మార్కెట్ లోకి మరో క్రీమ్ ను బోరోలిన్ కు పోటీగా తెచ్చింది. అందుకోసం, తమ అడ్వర్టైజ్మెంట్స్ లో అమితాబచ్చన్, జయాబచ్చన్ జోడీని బ్రాండ్ అంబాసిడర్స్ గా వినియోగించుకుని ప్రచారం చేసింది. అయినప్పటికీ బోరోలిన్ మాత్రం దాని మార్కెట్ ను కోల్పోలేదు. తమ మార్కెటింగ్ కోసం రితుపర్ణఘోష్ తో… బోరోలిన్ బెంగాళీల జీవితంలో అంతర్భాగమన్నట్టుగా.. బోంగో జిబ్నోర్ ఓంగో అని జింగిల్ రాయించి మరీ ప్రచారం చేసి సక్సెస్ అయింది జీడీ ఫార్మాసెట్యుకల్స్. 1950లో గౌర్ మోహన్ దత్తా తర్వాత తన వారసుడైన ఆయన కుమారుడు మురళీ మోహన్ దత్తా కంపెనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పుడిక వ్యాపారం మరింత విస్తరించింది. ఆయన నాయకత్వంలో జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ గోల్డ్ కప్ కు స్పాన్సర్ చేసి.. తమ బోరోలిన్ ఉత్పత్తులకు మరింత ప్రచారం కల్పించారు మురళీమోహన్ దత్తా. ఆ తర్వాత పండుగలు, స్పోర్ట్స్ ఇలా ప్రతీ ఈవెంట్ ను బోరోలిన్ మార్కెట్ ను పెంచేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులతో పాటు, సినీ తారలు కూడా బోరోలిన్ ఉపయోగించారు. ఆ తర్వాత యూఏఈ, ఒమన్ వంటి దేశాలకూ విస్తరించింది బోరోలిన్.

2017 నాటికి యాంటీసెప్టిక్ స్కిన్ కేర్ విభాగంలో బోరోలిన్ 25 శాతం మార్కెట్ షేర్ సాధించింది. 2021 సంవత్సరంలో 31. 7 మిలియన్ డాలర్స్ ఉత్పత్తులను విక్రయించి.. 10.1 మిలియన్ డాలర్స్ లాభాలాను ఆర్జించింది. మొత్తంగా బెంగాలీ వ్యాపార ప్రతిభతో ఇంటింటికీ చేరి.. నాస్టాల్జిక్ గా నిల్చింది బోరోలిన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles