నమ్మకం నిలబెట్టింది.. నడిపించింది!
ఎప్పటిలానే తిరుమల అలిపిరి మెట్ల మార్గం భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. కానీ, అంతమంది భక్తుల నామస్మరణలోంచి.. ఒక సన్ననైన గద్గద స్వరం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే, ఆమె శతాధిక వృద్ధురాలు. తన నమ్మకమైన వెంకన్నను చేరుకుని దర్శనం చేసుకునేందుకు మెట్ల మార్గంలో నడకదారినెంచుకుంది. దారి వెంటా గోవిందా గోవిందా నామస్మరణ చేస్తూ వెళ్తోంది. భక్తి, విశ్వాసాలు ఇచ్చే మానసిక, శారీరక స్థైర్యానికి ఒక మెటాఫర్ లా ఆ తాతమ్మ నడక సాగడమే ఇప్పుడు విశేషంగా చెప్పుకోవడానికి కారణం.

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు లక్షలాది మంది సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకునేందుకు కారణమైంది. కర్నాటకకు చెందిన నవనీతమ్మ అలియాస్ లక్ష్మవ్వ అనే శతాధిక వృద్ధురాలు 116 ఏళ్ల వయస్సులో ఏడు కొండల వాణ్ని దర్శించుకునేందుకు రావడమే ఈ విశేషం. ఏకంగా 3 వేల 550 మెట్లెక్కి కలియుగ దైవం వెంకన్నను దర్శించుకుంది ఈ అవ్వ. భీమవ్వ వయస్సెంత అనేది అధికారికంగా తెలియకపోయినా.. వారి కుటంబీకులు చెబుతున్నదాని బట్టి శతాధిక వృద్ధురాలనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
బజ్జుంటే పనులు జరుగవోయ్ నీ సిగతరగ పాదాలకు పదును పెట్టవోయ్ అని ఓ సినీ కవి చెప్పినట్టు.. ఇళ్లల్లో ఉదయం తొమ్మిది దాటినా లేవని కుర్రకారును తల్లిదండ్రులు తట్టి లేపుతుంటే… భీమవ్వ వంటి మనుషులు ఈ సమాజంలో వచ్చిన మార్పులను మరింత స్పష్టం చేస్తున్నారు. ఏ వ్యక్తికైనా ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ఇరవైల్లోనే అరవైలా వ్యవహరించేవారికి ఓ పాఠం..లక్ష్మవ్వ అలిపిరి మెట్ల బాట.
చేతిలో కర్ర… నోట గోవింద నామస్మరణ!
తిరుమల ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అలిపిరి కాలిబాటను అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇక్కడికొచ్చే భక్తులు. వేలాది మెట్లెక్కి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడమంటే అంత సులభమేం కాదు. మంచి మంచివాళ్లే ఒక దశలో ఎందుకొచ్చాంరా బాబు అనుకుంటారు. మధ్య మధ్యలో సేద తీరుతూ వెళ్తారు. కానీ, ఒకే ఒక కర్ర సాయంతో… శతాధిక వృద్ధురాలైన లక్ష్మవ్వ ప్రయాణమంతా నమ్మకంతోనే సాగింది. గోవిందా గోవిందా అనే నామస్మరణే ఆమె ప్రయాణ విజయానికి ప్రధాన కారణం. ఒక్కో మెట్టూ నెమ్మదిగా ఎక్కుతూ ధైర్యంగా ముందుకు సాగుతున్న తీరు.. నీరించిపోతున్న భక్తుల్లో కొత్త స్ఫూర్తికి కారణమైంది. కొందరైతే ఆశ్చర్యంగా నిశ్ఛేష్ఠులైపోయారు. కానీ, దృఢ సంకల్పముంటే ఎలాంటి కఠిన మార్గాన్నైనా అధిగమించొచ్చనే ఒక సందేశం నవనీతమ్మ పాదయాత్ర మళ్లీ ఓసారి తెలియపర్చింది.
ఏజ్ ఒక నంబర్ మాత్రమే… సంకల్పమే అసలైన బలం.. విశ్వాసమే ధైర్యం!
సాధారణంగా అరవై, డెబ్బైలు వచ్చాయంటే మోకాళ్ల నొప్పులని, చేతనైతలేదని, అలసిపోతామని.. ఇలా శారీరక బలహీనతలున్నవాళ్లే అధికంగా కనిపిస్తారు. కానీ సెంచరీ కొట్టినా వేలాది మెట్లెక్కి ఇంకా తాను సూపర్ బ్యాట్స్ మన్ అని నిరూపించింది నవనీతమ్మ. క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో లక్ష్మవ్వలా ఎలా బతుకొచ్చు… జీవన ప్రయాణాన్ని ఎలా సాగించవచ్చు.. ఎలాంటి సవాళ్లనైనా ఎలా అధిగమించవచ్చో చెబుతోంది.
సమతుల్యమైన జీవన శైలే… భీమవ్వ వంటి వృద్ధుల శారీరక చురుకుదనానికి ప్రధాన కారణం. అలాగే, దృఢమైన మానసిక స్థితి కూడా ఇలాంటి అరుదైన మనుషులను, ఘటనలను మన ముందుంచి స్ఫూర్తి నింపుతుంటాయి.
భక్తుల మధ్య చర్చగా మారిన భీమవ్వ యాత్ర!
లక్ష్మవ్వ చేసిన ఏడుకొండల యాత్ర విస్తృత చర్చగా మారింది. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహమని కొందరు భావిస్తే.. అసాధారణ సంకల్ప బలమే ఆమె పాదయాత్రకు కారణమనేవారూ కొందరు. అచంచలమైన భక్తికి నిదర్శనంగా.. ఆధ్యాత్మిక యాత్రలంటే, కేవలం గమ్యాన్ని చేరుకోవడమే కాదు.. సహనం, అంకితభావం, ఆత్మవిశ్వాసానికి పరీక్ష అనే లెస్సన్ కూడా నవనీతమ్మ స్టోరీ చెబుతోంది.
చిన్న చిన్న కష్టాలకే నిరుత్సాహపడే వారెందరికో ఓ గొప్ప స్ఫూర్తి పాఠం లక్ష్మవ్వ పాదయాత్ర. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే పరిమితం చేయలేనిది. విశ్వాసం, అందుకు కావల్సిన అంకితభావముంటే ఎంతటి వయస్సులోనైనా, ఎలాంటి పరిస్థితులెదురైనా విజయానికవేవీ అడ్డంకులు కావనే ఒక సందేశాన్నిచ్చింది నవనీతమ్మ ఆధ్యాత్మిక యాత్ర.



