దక్షిణాసియా నుంచి తొలి రోలెక్స్ నేషనల్ జాగ్రఫిక్ ఎక్స్ప్లోరర్ అవార్డ్ గ్రహీత!
ఆమె ధ్యాస పర్యావరణం.. ఆమె ఆశ అటవీ సంరక్షణ… ఆమె శ్వాస పకృతి పరిరక్షణ.. అందుకు ఆమె 7 వేల గ్రామాల్లో పర్యటించింది. వంద పరిశోధనా పత్రాలు సమర్పించింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ప్రకృతి పరిరక్షణ అవార్డును గెల్చుకున్న తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి దక్షిణాసియావాసిగా కీర్తికెక్కింది ఆ కృతి. ఎవరా కృతి.. ఏంటా కీర్తి..?
భారతదేశంలోని అడవులు, వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల్లో నివశించే ప్రజలు.. ఇగో ఇవే కృతి. కే. కారంత్ నిత్యకృత్యంగా మమేకమయ్యే పనులు. పంటలను అటవీ జంతువులు నాశనం చేయడం వల్ల.. రైతులు ఎదుర్కొనే సమస్యల నుంచి.. పులులుండే అభయారణ్యాలు, ఏనుగులు సృష్టించే బీభత్సాలను నివారించుకుని సురక్షితంగా ఎలా జీవించాలో బోధిస్తోంది కృతి. ఇందులో మోటో ఒక్కటే మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణ, వేట తగ్గించడమే.

ఇప్పుడీ ప్రముఖ సంరక్షణురాలికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. అత్యంత ప్రతిష్ఠాత్మక గౌరవాల్లో ఒకటిగా భావించే నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ సంస్థ ఈమెను.. 2026 ఏడాదికిగాను, రోలెక్స్ నేషనల్ జాగ్రాఫికా ఎక్స్ప్లోరర్ ఆఫ్ ది ఈయర్ గా ప్రకటించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా కృతి. కే. కారంత్ చరిత్ర సృష్టించారు. ముంబై వేదికగా నేషనల్ జాగ్రాఫిక్ సొసైసీ మే 6వ తేదీనే ఈ ప్రకటన చేసింది.
ప్రజలెంతో.. వన్యప్రాణులూ అంతేనంటున్న కృతి!
కృతి కారంత్ ప్రస్తుతం బెంగళూర్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థకు సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ భారతదేశ వ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తోంది. అడవులు, టైగర్ రిజర్వ్ సమీప ప్రాంతాల్లో మనుషులు, జంతువులు ప్రశాంతగా కలిసి జీవించే మార్గాలను అన్వేషిస్తూ, అభివృద్ధి చేయడమే కృతి టార్గెట్.
ఆసియాలోని దాదాపు సగం ఏనుగులతో పాటు, ప్రపంచంలోని అడవి పులుల్లో మూడో వంతు ఇప్పుడు భారతదేశంలో నివశిస్తున్నాయి. కానీ, పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న అటవీ సంపదతో జనం, వనం మధ్య దూరం తగ్గిపోతోంది. దీంతో మనుషులు, జంతువుల మధ్య ఘర్షణలూ ఎక్కువయ్యాయి.
ఈ సవాల్ ఎదుర్కొనేందుకు కారంత్ తో పాటు.. ఆమె బృందం కలిసి వైల్డ్ సేవ్ అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. అడవి జంతువుల వల్ల పంటలు, పశువులు, ఆస్తులు నష్టపోయిన కుటుంబాలకు పరిహరం ఇప్పించడంలో కారంత్ బృందం సాయం చేస్తోంది. అలాంటి కుటుంబాలు ఎవ్వరైనా ఉంటే వీరి టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే శిక్షణ పొందిన ఫీల్డ్ సిబ్బంది వారి వద్దకు వెళ్లి.. నష్టం నమోదు చేస్తారు. పరిహారం కోసం అవసరమైన పత్రాలను పూర్తి చేయడంలోనూ సహకరిస్తారు.

కృతి కారంత్ చేపట్టిన ఈ సేవ ద్వారా సుమారు 17 వేల కుటుంబపాలు పరిహారాన్నందుకున్నాయి. దీనివల్ల ప్రజల్లో జంతువులపై కోపం తగ్గడంతో పాటు.. ప్రతీకారంగా వాటిని చంపడం, వేటాడటం వంటివి కూడా తగ్గిపోతుండటం.. కారంత్ సాధించిన ఓ విజయం.
ప్రజలు గాయపడకుండా, ప్రాణాలు కోల్పోకుండా, ఆర్థిక నష్టాలు ఎదుర్కోకుండా ఎలా చూడాలన్నదే ఎప్పటికప్పుడూ మా ముందుండే సవాల్. ఎందుకంటే, అలాంటివి జరిగితే వెంటనే కోపం పెరిగి జనం జంతువులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న భావనతో చెలరేగిపోతారు అంటోంది కృతి.
వేలాది మంది పిల్లలకు చేరిన వైల్డ్ షెల్!
కారంత్ నేతృత్వంలో ప్రారంభమైన మరో ముఖ్య కార్యక్రమమే ఈ వైల్డ్ షెల్. షెల్ అంటే సహజసిద్ధంగా ఏర్పడే ఓ చిప్ప, గూడు, నెలవు అని అర్థం. అంటే వైల్డ్ లైఫ్ స్కూల్ అని అర్థం. ఈ కార్యక్రమం ద్వారా అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లోని పిల్లలకు కథలు, ఆటలు, కళాప్రదర్శనలతో వన్యప్రాణుల గురించి బోధిస్తోంది కృతి. కే. కారంత్.
జంతువులతో ఘర్షణలు ఎందుకు జరుగుతాయి… వాటి సమీపంలో మనల్ని మనం కాపాడుకునేలా ఎలా సురక్షితంగా ఉండొచ్చు… ఇలాంటి విషయాలన్నింటినీ అర్థమయ్యేలా చేయడమే వైల్డ్ షెల్ లక్ష్యం. 2018లో చిన్న పైలట్ ప్రాజెక్టుగా ఆరంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా పదహారు వందల పాఠశాలల్లో అమలవుతోంది. సుమారు 72 వేల మంది పిల్లలకు వైల్డ్ లైఫ్ ప్రాధాన్యతపై పాఠాలు చెబుతున్నారు.
కారంత్ నాయకత్వంలో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ సంస్థ ఎనిమిది రాష్ట్రాల్లోని 100కు పైగా వన్యప్రాణి రిజర్వ్ ఫారెస్ట్స్ పరిధిలో 7 వేల గ్రామాల్లో పనిచేస్తోంది. 50 వేల మందికి పైగా ప్రజలకు శిక్షణనిచ్చింది. దాదాపు పదివేల మంది రైతులతో కలిసి వన్యప్రాణులతో ఇబ్బంది లేకుండా.. అనుకూలమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించింది.
కృతి కారంత్ వందకు పైగా శాస్త్రీయ పరిశోధనా పత్రాలు రచించారు. చిలీ, చైనా, ఇండోనేషియా, యూకే వంటి దేశాలకు చెందిన 300 మందికి పైగా యువ పరిశోధకులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.
అసలెవరు ఈ కృతి. కే. కారంత్..?
కృతికి ప్రకృతి ప్రపంచంపై ఆసక్తి చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. భారతదేశంలోనే పులుల నిపుణుల్లో ఒకరైన ఉల్లాస్ కారంత్ కుమార్తెగా తన బాల్యమంతా ఎక్కువగా అడవుల్లోనే గడిపింది. అమ్మ కూడా బిజీగా ఉండే వృత్తి నిపుణురాలు కావడంతో… నాన్న వెంటే అడవుల్లో తిరుగుతుండేది. అలా జంతువులను గమనిస్తూ పెరిగారు కృతి. 1984లో తన తండ్రి ఉల్లాస్ కారంత్ స్థాపించిన సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ (CWS) సంస్థకు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తోంది.
ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆర్థికవేత్త, నేషనల్ జాగ్రఫిక్ సొసైటీలో కీలక మెంబర్ గా ఉన్న జిల్ టైఫెంతాలర్ ఏమంటారంటే… కృతి భారతదేశ వ్యాప్తంగా ఎవ్వరూ ఊహించని, ఆలోచించనటువంటి గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. శాస్త్రం, విద్య, సమాజ భాగస్వామ్యం కలిపి.. ప్రజలు ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలో ఆమె కొత్తదారిని చూపిస్తున్నారు. జీవ వైవిధ్య సంరక్షణ సమాజానికి ఎంత ఉపయోగకరమో ఆమె నిరూపిస్తున్నారంటారు.



