చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్!

మనకూ ఓ టైం మిషన్ ఉండుంటే బాగుండేదేమో..!?

సరదాగా అనుకోవడానికేముందండీ… ఏదైనా అనుకోవచ్చు. జీవితం వాస్తవం కన్నా ఊహల్లోనే బాగుంటుంది. నేల విడిచి సాము చేయడమే మనిషికి థ్రిల్. వాస్తవంలో బతుకుతున్న మనకు ఆ వాస్తవం పట్టదు. ఆ వాస్తవం కానిదింకేదో కావాలనే మనసు పడే ఉబలాటమే మనల్ని అలాంటి ఊహల వెంట తీసుకెళ్తుంది. ఇంకోమాటలో చెప్పాలంటే సృజనాత్మకతకూ తలుపులు తెరుస్తుంది. అలాంటి ఇల్యూషన్ కు తెరతీసినప్పుడు వచ్చే ఆలోచనల సారమే టైం ట్రావెలింగ్ థాట్ పోలీసింగ్. అలాంటి సబ్జెక్ట్ తో సింగీతం తెరకెక్కించిన ఆదిత్య 369లో మనమూ ఓసారి విహరిద్దాం పదండి.

ఆదిత్య 369… ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ సంస్థ కూడా పదికి 8.4 రేటింగ్ ఇచ్చిన సినిమా. సింగీతం శ్రీనివాసరావు కథ, కథనం, దర్శకత్వంలో వచ్చి ఓ సంచలనం సృష్టించిన ఈ సినిమా మనిషి ఊహలకు, ఆలోచనా శక్తికి ఓ ప్రతిరూపం. అందుకే సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన గుర్తు చేసుకోవడానికెన్నో అద్భుతమైన సినిమాలు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఓ పుష్పక విమానం, ఓ ఆదిత్య 369, ఓ భైరవద్వీపం.. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి ఆలోచింపజేసే, చర్చించుకునే సినిమాలు మళ్లీ ఓసారి ఆయన టైం మిషన్ లానే మనల్ని ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి.

మానవ సమాజం అడుగడుగునా సమస్యలు, సవాళ్లతో ఎదురీదాల్సిందే. వ్యక్తగత సమస్యలకు తోడు, అనుకోకుండా ఎదురయ్యేవి, ఎంత వెతికినా పరిష్కారానికి నోచుకోనివి, పరిష్కరించుకున్నకొద్దీ కొత్తగా వచ్చి చేరేవి.. కొంచెం దుందుడుకు స్వభావముంటే కొని తెచ్చుకునేవి. అలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలేంటి.. ఈ సవాళ్లేంటి.. హాయిగా ఎవ్వరకీ అందకుండా ఎగిరిపోతే ఎంత బాగుండనిపించడం మానవమాత్రులకు సర్వసాధారణం. అలాంటి సందర్భాల్లో పర్యటనల్లో కొంత సేద తీరుతుంటాం. కానీ, ఎక్కడున్నా పక్కలో బల్లెంలా ఎప్పటికప్పుడు బాధ్యతలను గుర్తు చేసే అలారిమింగ్ మోబైల్ ఫోన్స్… సమస్యల నుంచి భౌగోళికంగా దూరముంచొచ్చేమోగానీ కాస్సేపుగానీ, మానసికంగా ఉండనీయవు. అదిగో అలాంటి సందర్భంలోనే మనకూ ఓ ఆదిత్య 369 టైం మిషన్ ఉంటే బాగుండుననిపిస్తుంటుంది.

బాలకృష్ణ, మోహిని, టిన్నూ ఆనంద్, అమ్రిష్ పురి, చంద్రమోహన్, శుభలేఖ సుధాకర్, సిల్క్ స్మిత, చలపతిరావు, నాటి మాస్టర్, ఆ తర్వాతి హీరో తరుణ్ వంటివాళ్లు ప్రధాన నటీనటులుగా నటించిన ఈ సినిమాలో…. బాలకృష్ణ నేటి సమాజపు ఆధునిక మనిషి రూపంలోనూ… మరోవైపు నాటి శ్రీకృష్ణదేవరాయల పాత్రలోనూ ద్విపాత్రాభినయంతో అలరించారు. ఈ సినిమా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న కారణమేంటంటే… ఆ సినిమా ఊహ ఇప్పుడు నిజమైతే… ఓసారలా కొత్త బంగారులోకంలోకి వెళ్లే అవకాశముండుంటే అన్న ఓ గొంతెమ్మ కోరికే. ఆ సినిమా పాటలోలా చిలిపి యాత్రలో ఛల్ ఛల్ ఛల్ అంటూ… ఓసారి అలా అలా ఆ ఊహల పల్లకిలో విహరించే ప్రయత్నం.

సింగీతం శ్రీనివాసరావైతే సినిమా నిడివి ఓ రెండున్నర గంటలే కాబట్టి అలా వెనక్కి రాయలకాలానికి.. భవిష్యత్తులో మరో వందేళ్ల ముందుకన్నట్టుగా సినిమాలో చూపించారేమోగానీ… మనమైతే నిజాం జమానాను చూడొచ్చు, పురుషోత్తముడు- అలెగ్డాండర్ ఫైటూ చూడొచ్చు, రాకెట్లలో అంతరిక్షంలోకి ఉదయం వెళ్లి రాత్రికి తిరగొచ్చే ప్రయాణ సౌకర్యాలూ వీక్షించొచ్చు, ఒక్కో గ్రహంలో ఒక్కో వాతావరణంలో ఇళ్లు నిర్మించుకుని ఆయా వాతావరణాలకు తగ్గట్టుగా జీవించడాన్నీ అలవాటు చేసుకోవచ్చు, త్రేతాయుగంలో రామరావణ యుద్ధాన్నీ చూసిరావొచ్చు, భగవద్గీతను పఠించేకన్నా.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సందేశం వినిపించే వేళకే చేరుకుని మనమూ వినిరావొచ్చు, ఆకాశంలోనే జీవిస్తే మనిషి బతుకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మనకూ ఓ టైం మిషన్ ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది.. ఎగిరిపోతే ఎంత బాగుండనిపిస్తుంది.

పైన చెప్పినవన్నీ గొంతెమ్మ కోర్కెలే అయినా.. కనీసం మన బాల్యానికైనా వెళ్లే వెసులుబాటు ఆ టైం మిషన్ ఇస్తే ఎంత బాగుంటుందోనన్న ఓ చిన్న ఆశ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles