SAI VAMSHI.. ✍️✍️
2002-03 ప్రాంతంలో స్వాతి సపరివార పత్రికలో మేర్లపాక మురళి గారు రాసిన ‘అతడు ఆమెను జయించాడు’ సీరియల్ వచ్చేది. అప్పట్లో అది చాలా ఫేమస్. వాటికి వేసే బొమ్మలు మరింత ఫేమస్. శృంగారమూ, సింగారమూ కలగలిసిన ఆ బొమ్మల చివర ఓ నల్లరంగు సంతకం ఉండేది. ‘కరుణాకర్’. ఆయన బొమ్మకు బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని చూడకనే ఆయన మీద చెప్పలేనంత ఇష్టాన్ని, ఆసక్తిని, గౌరవాన్ని పెంచుకున్నవారు ఉన్నారు.

రంగుల్ని తిని రంగుల్నే నెమరేస్తారేమో అన్నట్టు బతికిన కరుణాకర్ గారంటే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు కానీ, రెండు దశాబ్దాల క్రితం ఆయన బొమ్మ లేని తెలుగు పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. దీపావళి, ఉగాది, దసరా లాంటి సమయాల్లో వార పత్రికల నిండా ఆయన బొమ్మలు కనిపించేవి. అందంగా, ఆహ్లాదంగా నిలిచి కళ్లు జిగేలుమనిపించేవి. ఆయన వేసే ఆడపిల్లల బొమ్మలు కొంటె చూపు, నాజూకు నడుము, తళుకు నవ్వులతో మైమరిపించేవి. అందచందాలు వాటి నిండా ఇమిడి ఉండేవి. సరస కథలకు ఆయన వేసిన బొమ్మలు అమలిన శృంగారానికి అద్దంలా మెరిసేవి. అనేకుల పుస్తకాలకు ఆయన ముఖచిత్ర రూపశిల్పి.
మధుబాబు, సూర్యదేవర రామమోహనరావు, మేర్లపాక మురళి, సింహప్రసాద్, చల్లా సుబ్రహ్మణ్యం, వసుంధర.. వీక్లీ సీరియల్స్ ద్వారా ప్రఖ్యాతి పొందిన తెలుగు రచయితల్లో అనేకులకు ఆయన చిత్రదానం చేశారు. స్వాతిలో మధుబాబు గారి సీరియల్‌ని కరుణాకర్ గారి బొమ్మలు చూస్తూ చదవడం పాఠకులకు గొప్ప కిక్కు. ‘చక్రతీర్థం’, ‘పులిమడుగు’, ‘పాము’ ‘అతను’, ‘శిక్ష’, ‘రహస్యం’ ‘స్వర్ణఖడ్గం’.. ఇవన్నీ వారి హిట్ కాంబినేషన్‌లో వచ్చినవే. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి లాంటి వారు స్వాతిలో ‘పాలెగత్తె’ సీరియల్ రాసినప్పుడూ ఆయనే బొమ్మలు వేశారు. కథ ఏ ప్రాంతంలో జరిగినా అందుకు తగ్గట్లే ఉండేవి బొమ్మలు. దొంగ, రాజు, గూండా, రైతు, గిరిజనుడు, భిక్షగాడు.. ఎవరైనా కానీ ఆ బొమ్మల్లో ఒదిగిపోయేవారు. ఆయన బొమ్మలకు నవరసాలు తెలుసు.

గణపతి సచ్చిదానంద స్వామీజీ చరిత్రను ‘గురుబ్రహ్మ’ పేరిట టీవీ సింగిల్ ఎపిసోడ్ తీస్తే కేవలం స్వామీజీ ఫోటో చూసి తన సొంత ఊహతో 60 దాకా చిత్రాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పనితనాన్ని మెచ్చి నంది అవార్డు అందించింది. చిత్రకారుడిగా నంది అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనేనేమో!
కరుణాకర్ గారు పుట్టింది విశాఖపట్నం, పెరిగింది హైదరాబాద్. 1980 ప్రాంతంలో చిత్రకారుడిగా వృత్తి జీవితంలో అడుగుపెట్టారు. జీవితకాలంలో దాదాపు 40 వేల బొమ్మలు గీశారు. తన జీవితంలో ఒకరిద్దర్ని మినహా తక్కిన ఏ పత్రిక ఎడిటర్లనూ ఆయన కలవలేదు. ఎక్కడా తనని తాను గొప్పగా చెప్పుకోలేదు. తను, సోమాజిగూడలోని తన ఆఫీసు. అదే లోకం! నిరంతరం బొమ్మలు.. బొమ్మలు. 2013 సెప్టెంబర్ 12న గుండెపోటుతో మరణించే దాకా అదే పని. అత్యంత సుందరంగా తయారయ్యే ఆ బొమ్మల్ని వారపత్రిక పేజీ నిండా చూడటం ఒక అబ్బురం. ఇవాళ మనకు కరువైన అదృష్టం.



