అమరజీవి- డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్!
మనుషులు పుడుతుంటారు, పోతుంటారు!
కానీ, కొందరి పేర్లు మాత్రం శాశ్వతం!
అలాంటి శాశ్వతత్వాన్ని అందుకుని… తన నామవాచకాన్ని సర్వనామం చేసిన అమరజీవి డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్!
ఇప్పుడెందుకు ఆయన ముచ్చట అంటే… ఇప్పటికీ ప్రతీ ఏటా ఆయన జయంతి, వర్ధంతి రోజున మనం ప్రస్తుతం ప్రత్యర్థి దేశంగా చూస్తున్న చైనాలో నివాళులందుకుంటున్నాడు. ఆయన అక్కడ విగ్రహంగా మాత్రమే కాదు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని అమరుడయ్యాడు. అందుకే మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి చైనా వరకు సాగిన డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ జీవనయాత్ర తెలుసుకోవాల్సింది. ఇంతకాలం విగ్రహ రూపానికే నివాళులర్పిస్తూ ఆయన త్యాగాలను తల్చుకున్న చైనా… ఇప్పుడు ద్వారకానాథ్ కోట్నీస్ స్మారక మందిరాన్నే ఏర్పాటు చేయడం భారతీయులుగా గర్వించాల్సిన విషయం.

చైనాలో వీరుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ద్వారకనాథ్ కోట్నిస్ ఎవరసలు..?
అది 1937 నుంచి 1945 మధ్య కాలం. అప్పుడు జపాన్ చైనాను దురాక్రమణ చేస్తున్న రోజులవి. మావో నేతృత్వంలో విప్లవోద్యమం నడుస్తున్న కాలాన.. చైనా జనరల్ ఛూటే నుంచి నాటి కాంగ్రెస్ నాయకుడైన నెహ్రూకు ఓ లేఖ అందింది. ఆ యుద్ధ సమయంలో చైనా సైన్యానికి సరైన వైద్యమందించే వారే కరువైనారు. అదిగో అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తోంది సుభాష్ చంద్రబోస్. ఇంకేం నెహ్రూ, బోస్, ఇతర కాంగ్రెస్ నేతల మంతనాల తర్వాత చైనాకు సాయమందించాలనే పిలుపునిచ్చాడు బోస్. దాంతో కొంత ఫండ్ రైజింగ్ కూడా చేపట్టారు. అలా భారత్ నుంచి ఓ ఆంబులెన్స్, కావల్సిన వైద్య పరికరాలతో పాటే… నాటి జాతీయ కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ చైనా పయనమయ్యాడు. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం చైనా పర్యటనకు బయల్దేరింది.
ఆ బృందం సముద్ర మార్గం, భూమార్గాల్లో యుద్ధభూమికి చేరుకుంది. కోట్నీస్ తో పాటు వెళ్లిన మిగిలిన వైద్యులు కొంతకాలం వైద్య సేవలందించి.. ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ కోట్నీస్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఉత్తర చైనాలోని యానాన్, జిన్-చా-జీ సరిహద్దుల్లో సైనికులతో పాటు, ముందుండి సేవలందించారు.
ఎక్కడి నుంచి ఏ బుల్లెట్ దూసుకొస్తుందో… ఏ ఫిరంగి గుండు వచ్చి తాకుతుందో తెలియని.. పూర్తిగా ప్రాణాలపై ఆశ వదులుకున్న రీతిలో ఆయన కొండగుహల్లో ఉంటూ చైనాలో వైద్య సేవలందించారు. రోజుకు 18 గంటలపాటు, శస్త్ర చికిత్సలు చేశారు. మత్తుమందివ్వడం నుంచి తూటాల గాయాలకు శస్త్రచికిత్సలు చేయడం, మలేరియా, డిసెంటరీ వంటి వ్యాధుల చికిత్సలన్నీ తానొక్కడేనన్నట్టు చూసుకున్నాడు. ఒక అంచనా ప్రకారం జపాన్- చైనా యుద్ధభూమిలో కోట్నీస్ సుమారు 650 నుంచి వెయ్యి మంది వరకు ప్రాణాలను కాపాడిన వైద్యనారాయణుడు.
కేవలం ఒక వైద్యుడిగా తాను సేవలందించడమే కాకుండా.. తాను చైనీస్ నేర్చుకుంటూ, అక్కడి స్థానిక వైద్యులకు మరింత మెరుగైన శిక్షణనిచ్చారు. పరిశుభ్రత ఎంత అవసరమో తన ఉపన్యాసాలతో అవగాహన కల్పించారు. 1941లో తన వద్ద సహాయకురాలిగా పనిచేసిన చైనా నర్స్ గువో చింగ్లాన్ ను వివాహం చేసుకున్నాడు డాక్టర్ కోట్నీస్.

కోట్నీస్ నేపథ్యమేంటి..?
1910 అక్టోబర్ పదో తేదీన, మహారాష్ట్ర షోలాపూర్‌లో జన్మించాడు ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీస్. తండ్రి శాంతారామ్ కోట్నీస్. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన డాక్టర్ కోట్నీస్ కు… ఇద్దరు సోదరులు, అయిదుగురు అక్కచెల్లెళ్ళు. యూనివర్శిటి ఆఫ్ బొంబాయి స్టేట్ జి.ఎస్.మెడికల్ కళాశాలలో ఆయన వైద్యవిద్య చదివాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు సిద్ధమయ్యే సమయంలో ఆయన చైనా వెళ్లాల్సి వచ్చింది. చైనాలోని ఊహాన్ నుంచి కమ్యూనిస్టుల కోట, విప్లవాలకు పుట్టినిల్లులాంటి యుద్ధరంగం యెనాన్ ప్రాంతానికి.. సరిగ్గా 1939లో అలహాబాద్ కు చెందిన అటల్ ఎం. చోల్కర్ నేతృత్వంలోని ఐదుగురు వైద్యులు అడుగుపెట్టారు. అందులో ఒకడు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్.
చిన్న వయస్సులోనే మరణం!
బాల్యం నుంచి ఎపిలెప్పీ అంటే ఫిట్స్ సమస్యతో బాధపడేవాడు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్. చైనాలో జరుగుతున్న భీకర యుద్ధంతో ఆయనపై మరింత ఒత్తిడి తీవ్రమైంది. దాంతో 1942, డిసెంబర్ 9వ తేదీన… హెబీ ప్రావిన్స్ లోని గువోలియాంగ్ లియాంగ్ అనే ఊర్లో తన వృత్తి పనిలో భాగంగా శస్త్రచికిత్స చేస్తూనే కుప్పకూలిపోయాడు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్. పోతూపోతూ కూడా పోరాటాన్ని కొనసాగించండంటూ ఆయన తన సహచరులకు నూరిపోసిన ధైర్యం.. ఆయన నిబద్ధతకు నిదర్శనం.
అందుకే, మన భారతీయ వైద్యుడు ఇప్పుడు చైనా వంటి దేశంలో ఓ లెజెండ్ గా మారిపోయాడు. అక్కడంతా ఆయన్ని కోట్నీస్ ది గుడ్ అని పిల్చుకునేవారట. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేత మావో జెడాంగ్ ఆయన స్మతికి నాడు శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన్ను చైనాకు ఆప్తమిత్రుడని అభివర్ణించాడు. నేడంటే భారత్ – చైనా మధ్య ఢీ అంటే ఢీ అనే కల్లోల పరిస్థితులేర్పడ్డాయిగానీ.. నాడు రెండు దేశాల మధ్య సోదరభావానికి వారధిలా డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ సేవలు నిల్చాయి. 1941లో ది కోట్నీస్ డాక్టర్ ఫ్రమ్ ఇండియా అనే పుస్తకం కూడా అక్కడ వెలువడింది.
1949 తర్వాత చైనా కోట్నీస్ స్మారకార్థం ఆయన పేరుతో ఏకంగా ఓ మెడికల్ కళాశాలనే ఏర్పాటు చేసింది. స్టాంపులను విడుదల చేసింది. జిన్ జియాంగ్ లో ఆయన పేరిట ఓ టౌన్ షిపే ఏర్పాటు చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ ఆయన్ను దేశభక్తుడిగా కొనియాడాడు. వి. శాంతారాం 1946లో కోట్నీస్ కీ అమర్ కహానీ సినిమా తీశాడు.
1962 నుంచి భారత్ – చైనా మధ్య బంధాలు కాస్తా బలహీనపడ్డాయి. చైనా సూపర్ పవర్ గా ఎదగడం.. భారత భూభాగాలపై కన్నేయడంతో ఆ బంధాలు దెబ్బతిని ఏకంగా ఇప్పుడు ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఇలాంటి సమయంలోనూ కోట్నీస్ మాత్రం ఇరు దేశాల మధ్య ఒక వంతెనలా నిలుస్తున్నాడు. ఇరు దేశాలు ఆయన్ను స్మరించుకున్నప్పుడల్లా… నాటి బంధాలను ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు.
యుద్ధభూమిలోనే అసువులుబాసినా పశ్చాత్తాపపడని కోట్నీస్.. మానవ సేవే తన మతంగా బతికిన ఓ దార్శనికుడు!
అందుకే చైనా రాయబారి షు ఫేహోంగ్ ఈ నెల డిసెంబర్ 22, మంగళవారం రోజున తన X ఖాతాలో స్పందిస్తూ.. హెబీ ప్రావిన్స్ లో డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ స్మారక మందిరాన్ని ప్రారంభించాం. ఆయన ధైర్యం, అంకితభావంతో చేసిన సేవలను మేమెప్పటికీ గౌరవిస్తాం, ఆయన స్ఫూర్తి నేటికీ మాకు ప్రేరణగా నిలుస్తోందంటూ పోస్ట్ చేశారు.
ఈ డిసెంబర్ నెల ఆరంభంలో పశ్చిమబెంగాల్ లో డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ స్మారక కమిటీ ఆయన మరణించిన రోజున 83వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తే భారత్ – చైనా స్నేహ ప్రతీకగా కోట్నీస్ సేవలను గౌరవిస్తూ చైనా కాన్సుల్ జనరల్ షు వెయ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. సరిహద్దుల్లో ఓవైపు ఉద్రిక్తతలు చూస్తున్న కాలాన.. ఇంకోవైపు, డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ చేసిన సేవ, త్యాగనిరతి ఇరు దేశాలనూ మరోవైపు ఆలోచింపజేస్తూనే ఉంది. అందుకే డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ ఓ స్పూర్తి శిఖరమయ్యాడు.



