కూర్గ్…. ఓ భూతల స్వర్గం!
సమ్మర్ ట్రిప్పుకు అనువైన క్షేత్రం!
స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా!
ప్రకృతితో మమేకమయ్యే ఏ అవకాశం దక్కినా అదో అద్భుతమే. జీరో పర్సెంట్ పొల్యూషన్ తో.. కొండవాలు ప్రాంతాల్లో తల పైకి ఎత్తి చూస్తే ఆకాశం కనిపించనంత ఎత్తుకు ఎదిగిన చెట్లు, వన మూలికలు, వివిధ రకాల మొక్కలు, కాఫీ ప్లాంటేషన్స్ చూపు తిప్పుకోనివ్వని సీనిక్ బ్యూటీ.. వెరసి కూర్గ్ మేం పొందిన రసానుభూతి.
కరీంనగర్ నుంచి ఆరంభమైన జర్నీ.. సాఫీగా సాగి ఉంటే మా టూర్ లో మజా ఎంత ఉండేదో తెలీదుగానీ… మమ్మల్ని ఓ బ్రేక్ కుదుపు కుదిపింది. సరిగ్గా రాత్రి పదకొండవుతున్న సమయంలో… కర్నూల్ కు దగ్గర్లో మేం ప్రయాణిస్తున్న క్రెటా ఆగిపోయింది. అప్పటికే అది సర్వీసింగ్ కూడా పూర్తి చేసి మాకోసం సిద్ధం చేసిందే. కానీ, ఏ నిమిషానికేమి జరుగునో ఎవరూహించగలరు. గేర్ బాక్స్ తో పాటు.. మల్టీపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలిసింది. కారు రిపేర్ అవ్వాలంటే ఇక తెల్లవారే దిక్కు. ఆ రాత్రి టోల్ గేట్ పరిసర ప్రాంతాల నుంచి కర్నూల్ కు వెళ్లే వాహనాలను పట్టుకోవాలి. అక్కడికెళ్లాక లాడ్జ్ వెతుక్కోవాలి. వెరసి.. ఈ టూర్ మనకు అచ్చీరాలేదేమో.. ఇక వెనక్కే మళ్లాలని నిర్ణయించుకున్నాం.
కానీ, మళ్లీ టోల్ గేట్ దాకా వెళ్లితేనేగానీ ఏదైనా వెహికిల్ దొరికే అవకాశముంటుందని అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర, హోటల్స్ దగ్గర చెప్పడంతో.. ఫ్యామిలీ మొత్తం నడుస్తూ ఆ రాత్రి సుమారు ఓ రెండు కిలోమీటర్లు నడవక గత్యంతరం లేని స్థితి. ఉసూరుమంటూనే బయల్దేరాం. గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుందంటారు కదా.. అలాగే, హైదరాబాద్ బ్యాక్ వెళ్లిపోవాలనుకున్న మాకు ఓ ఇన్నోవా దొరికింది. ఎలాగోలా గచ్చీబౌలీ వరకూ వెళ్లి.. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని మా డెస్టినేషన్ తాడ్ బండ్ రీచ్ అయ్యాం.
డ్రైవర్ కు కొంత డబ్బిచ్చి అక్కడే రెస్ట్ తీసుకుని రేపు ఉదయమే కారు బాగు చేయించుకోమ్మని చెప్పాం. కానీ, కారు ఖర్చు తడిసి మోపెడయ్యేంత రిపేర్ తప్పలేదు. దాంతో ఓనర్ అయిన నా మిత్రుడే ఆ ఖర్చు భరించాడు. అప్పటికే తాడ్ బండ్ లో ఉదయం కాస్సేపు రెస్ట్ తీసుకున్నామేగానీ.. సూర్యుడుదయించాక నిద్ర పట్టదు కాబట్టి మళ్లీ మెలకువయ్యింది. కానీ, లోపల అనుకోక అనుకోక ఒక్క మంచి టూర్ ప్లాన్ చేస్తే.. కొడుకు ఇంటర్మీడియట్ కు కాలేజ్, హాస్టల్ కు వెళ్లిపోతున్నాడు చూపిద్దామనుకుంటే ఇలా జరిగిందేంటబ్బా అనే ఓ చిన్న బాధ వెంటాడుతూనే ఉంది. దాంతో ఆలోచనలు పరిపరివిధాలా తిరుగుతున్నాయి. కారు బాగా అయ్యాక వెంటనే బ్యాక్ రమ్మని.. వీలైతే వైజాగ్.. లేదంటే ఇంకా దగ్గరదగ్గరలో విజయవాడ తిరిగొద్దామనుకుని డ్రైవర్ కు ఫోన్ చేసి చెప్పాను. సార్ కారు పని సాయంత్రానికి అయిపోతుంది. మీరు అలా వెళ్లిపోవడం నాకూ బాధగానే ఉంది మీరు ఎక్కడికంటే అక్కడికెళ్దామంటూ మాలాగే కాస్త డిజప్పాయింట్ అయిన డ్రైవర్ రాజు మమ్మల్ని ఉత్సాహపర్చాడు.
మరి ఎటువైపు వెళ్లడం..?
రోజూవారీ రొటీన్ జీవితం, ఉద్యోగం వీటికి ఓ బ్రేక్ ఇద్దామనే మా టూర్ ప్లాన్. కానీ, ఎవ్వరితోని వెళ్లినా తీర్థయాత్రలు, గుళ్లే తప్ప.. ప్రకృతితో మమేకమయ్యే సిమిలర్ భావాలున్నవాళ్లు, వేవ్ లెంత్ కలిసేవాళ్లు తక్కువ కావడంతో.. ఆల్రెడీ కూర్గ్ అందాలను ఎక్స్ప్లోర్ చేసిన నా ఫ్రెండ్ సలహాలు, సూచనలతో కూర్గ్ ఎంచుకున్నాం. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టు కర్నూల్ దగ్గర వెహికిల్ ఫెయిల్ అవ్వడంతో డిజప్పాయింట్మెంట్ తప్పలేదు. అయితే, తాడ్ బండ్ లో వైజాగా, విజయవాడా, ఇంకెక్కడికైనానా అనే ఆలోచనలు చేస్తున్న క్రమంలోనే… ఇక ఎటైతే అటైంది మళ్లీ కర్నూల్ కే వెళ్లిపోదాం.. అక్కడి నుంచి కూర్గ్ కే వెళ్దాం. ఈ ఎండ వేడిమి నుంచి సేద తీరడానికి.. ఇరిటేట్ అవుతున్న మనస్సును స్థిమితపర్చడానికి అదొక్కటే మార్గమని భావించి మా రాజుకు మళ్లీ ఫోన్ చేసి చెప్పాం. ఓకే సార్ వచ్చేయండన్నాడు. మళ్లీ మిట్టమధ్యాహ్నం కర్నూల్ ప్రయాణం. అసలు కర్నూల్ లోనే ఆగితే బాగుండునేమో అన్న ఆలోచనలు, చర్చలు. కానీ, కారు ఆగిపోయినప్పుడున్న ఫీలింగ్.. ఒక పన్నెండు, పదమూడు గంటలు గడిచాక మారిపోయిన ఫీలింగ్స్ లో తేడా ఎలాగూ ఉండేదే. దాంతో మళ్లీ మా బామ్మర్ది చొరవతో ఆరాంఘర్ దాకా వెళ్లి.. అక్కడినుంచి ఓ ప్రైవేట్ కారులో ఆరున్నరకల్లా మళ్లీ కారు ఆగిపోయిన చోటు టోల్ గేట్ వద్దకే చేరుకున్నాం. అప్పటికే కారు బాగు చేయించుకున్న రాజు.. తిరిగి వచ్చి ఛాయ్ తాగి అక్కడే వెయిట్ చేస్తున్నానని కాల్ చేశాడు.

మళ్లీ మొదలైన జర్నీ!
రాజు అర్జంటుగా కారు తీయ్. ఇక్కడే మనం చిక్కుకున్నది అని చెప్పాను. కానీ, వెళ్లిపోదామన్నా.. ఛాయలు, స్నాక్స్, అన్నీ ముగించుకుని బయల్దేరేసరికి అరగంట తప్పలేదు. అయితే, కారు ఆగిపోయి మేమెంత ఫీల్ అయ్యామో.. మాకు కారు ఇచ్చిన నా మిత్రుడు, డ్రైవర్ రాజులోనూ అదే భావన. అందుకే, రాజు ఇక వెనక్కి తిరక్కుండా మొదలెట్టాడు. అనంతపురం వరకూ అలుపెరుగలేదు. అక్కడ ఓ హోటల్ వద్ద ఆగి డిన్నర్ ముగించుకుని మళ్లీ మొదలైంది మా ప్రయాణం. పుట్టపర్తి, హిందూపురం అన్నీ దాటుకుని.. చికమగళూర్ వద్ద ఓ లాడ్డ్ లో నైట్ స్టే చేశాం. తెల్లవారే లేచి కర్నాటక కాఫీ ల్యాండ్ గా పేరుబడ్డ చికమగళూర్ లో చక్కని సినిమా లాంటి కాఫీని ఆస్వాదించి ఆ హిల్ స్టేషన్ లో మా ప్రయాణం మొదలైంది. చికమగళూర్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కు పెట్టింది పేరు. అక్కడ సముద్ర మట్టానికి 1 వెయ్యి 930 అడుగుల ఎత్తులో ఉన్న ముల్లాయన గిరి కొండలు ట్రెక్కింగ్ కు వచ్చే యువతను రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. 1670ల కాలంలోనే బూదాన్ అనే ఓ సూఫీ యోగి.. యెమన్ నుంచి తన గడ్డంలో పెట్టుకుని స్మగుల్డ్ చేసిన ఏడు కాఫీ మొక్కలే ఆ తర్వాత భారతదేశంలోనే అతి పెద్ద కాఫీ ల్యాండ్ గా చికమగళూర్ అవతరించేందుకు కారణమైందనే కథలూ చెప్పుకుంటారిక్కడ. అలాంటి చోటు నుంచి మళ్లీ మా ప్రయాణం ఆరంభమైంది. బెంగళూర్ హైవే పైనుంచి కట్ అయిపోయి.. కర్నాటక పశ్చిమ కనుమల్లోని రూరల్ ఏరియాస్ గూండా మైసూర్, కూర్గ్ కు వెళ్లే హైవేకు కనెక్టయ్యాం.
కూర్గ్ జర్నీ సాగిందిలా!
ఓవైపు ప్రపంచమంతా ఎండలతో మండిపోతుంటే… కూర్గ్ చల్లగా ఉంటుందంటారు ఏంటబ్బా అనే ఒక సందేహం మనసులో నాటుకోవడంతో చూడాలన్న ఆత్రుత ఆగడం లేదు. ముఖ్యంగా ఆ వాతావరణాన్ని అనుభవించాలన్న సగటు జీవి క్యూరియాసిటి మాది. మధ్యలో ఓచోట ఆపుకుని మంచి మసాలా దోశలు లాగించేశాం. మళ్లీ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని బయల్దేరితే.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మా డెస్టినీ చేరుకున్నాం. అప్పటికే నన్ను కూర్గ్ వెళ్లమని ఎంకరేజ్ చేసిన నా స్నేహితుడే… అక్కడ కాటేజ్ కూడా బుక్ చేశాడు. అక్కడికెళ్లితే లిటరల్లీ అదో భూతల స్వర్గం. దక్షిణాదిలో అలాంటి ప్లేస్.. ఇంకా పొల్యూటెడ్ కాని ప్రాంతం ఉంటుందా అనే సందేహం వచ్చేలా కళ్లు మిరుమిట్లు గొలిపింది. ఆ ప్రకృతి ఇచ్చే చల్లదనానికి మనసు సేద తీరుతోంది. చుట్టూ కొండలు.. దట్టమైన అడవి.. పైకి చూస్తే ఆకాశం కనిపించనంత ఎత్తులో చెట్లు.. థిక్ గా కాఫీ తోటలతో ఆ ఫారెస్ట్ విజిటింగ్ ఓ మురిపెం. ఇంకేం ముందు కాటేజ్ లో మా బ్యాగ్స్ అవీ పెట్టుకుని… మెల్లిగా భోజనానికి బయల్దేరాం. మడికెరిలో శ్రీ కృష్ణ ఉడిపి హోటల్ లో భోజనం ముగించుకున్నాం. బజ్జుంటే పనులు జరుగవు కాబట్టి.. మళ్లీ అక్కడి నుంచి కూర్గ్ అందాలను ఎక్స్ప్లోర్ చేసేందుకు బయల్దేరాం.
ఏంటీ కూర్గ్ స్పెషల్..?
కుశాల్ నగర్.. ఇది మరీ ఎత్తైన కొండ ప్రాంతమేం కాదు. కానీ, అద్భుతమైన విజిటింగ్ ప్లేస్. ఆ తర్వాత మడికెరి. ఇది థిక్ ఫారెస్ట్ అండ్ ఘాట్ సెక్షన్. మా కాటేజుకు చేరుకోవడానికే దాదాపు రెండున్నర గంటలు ఓవైపు లోయలు, ఇంకోవైపు కొండల మధ్య.. అలరించే అటవీలో మా ప్రయాణం రక్తి కట్టించింది. ఇక ఆ తర్వాత విరాజ్ పేట. ఇది హీరోయిన్ రష్మిక మంథాన ఊరు. అంటే, మన తెలంగాణా హీరో విజయ్ దేవరకొండ అత్తగారిల్లు. ఈ మూడు ఊళ్ల సంధానమే.. కూర్గ్.
కూర్గ్ లో ఏమేం చూడొచ్చు..?
వెళ్లినరోజు శనివారం నాడు మొదట భోజనం అనంతరం మడికెరిలోని ఫోర్ట్ కు వెళ్లాం. కర్నాటక పశ్చిమ కనుముల్లో కొడగు జిల్లాలో ఉన్న ఈ కూర్గ్ లో కొడగు సామాజిక సంస్కృతులే ప్రత్యేకతలు. అందుకే వారి కాలంలో నిర్మించిన ఫోర్ట్.. వారి చరిత్రను తెలిపే ఫోటోలు, కత్తులు, కటార్లు, తుపాకులు, ఫిరంగులు, కరియప్ప అనే సంస్థానాధీశుడి చరిత్ర, వారితో పాటు, ఆ తర్వాత ఏలిన బ్రిటీషర్స్ కు సంబంధించిన విశేషాలతో పాటు… భారత దేశ హెరిటేజ్ ప్లేసెస్.. మరీ ముఖ్యంగా కర్నాటక దర్శనీయ స్థలాల గురించి తెలుపుతూ అలరించింది ఫోర్ట్ లోని మ్యూజియం. ఓవైపు ఫోర్ట్… ఆ కోటలో కొన్ని సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాల విశేషాలు.. మరోవైపు, ఓ ఓల్డ్ చర్చ్, అందులో మరిన్ని విశేషాలను ఎక్స్ల్పోర్ చేసేలా పురా జ్ఞాపకాలు మనకు కనిపిస్తాయి. పక్కనే కర్నాటక కొడగు జిల్లాలో బయటపడ్డ పలు పురా విగ్రహాలను కూడా ఉంచారు.
రాజా సీట్ కథేంటి..?
కూర్గ్ లో చూడదగ్గ ప్రాంతాల్లో రాజా సీట్ ఒకటి. ఇక్కడ మేఘాలు మనల్ని ఊరిస్తూ మన ముందు నుంచే వెళ్లిపోతుంటాయి. హన్మంతుడు సూర్యుడిని ముద్దాడినంత దగ్గరగా సూర్యోదయాన్నీ, అస్తమయాన్ని చూసేందుకు ఓ అద్భుతమైన స్పాట్ ఇది. కొడుగ సామాజిక వర్గ సంస్థానాధీశులతో పాటు.. ఆ తర్వాత పాలించిన బ్రిటీషర్స్ కూడా ఇక్కడ నుంచి సూర్యోదయాన్నీ, సూర్యస్తమయాన్ని వీక్షించేవారని అందుకే రాజా సీట్ అనే పేరు పెట్టారు. ఇక్కడ రాజు కూర్చునే సీట్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే, ఇదో పార్క్ లా డెవలప్ చేయడంతో పాటే… యువత, పిల్లల్ని అలరించేలా జిప్ రైడింగ్ వంటి కొన్ని అడ్వెంచరస్ క్రీడలను నిర్వహిస్తున్నారు. అది ముగిశాక ఓంకారేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని.. సాయంత్రం వేళ సౌత్ ఇండియన్ డిషెస్ అందుబాటులో లేకపోవడంతో నార్త్ ఇండియన్ డిషెస్ తో ఆరగింపు ముగించి మళ్లీ ఒక అద్భుతమైన ఎగ్జైట్మెంట్ తో మా హోంస్టే వద్దకు చేరుకున్నాం. ఎందుకంటే, రాత్రి వేళ దొంగలు కూడా చొరబడటానికి భయపడే అటవీ ప్రాంతం… కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి.. కేవలం కీచురాళ్లు, ఎక్కడినుంచో వినిపించే జంతువులు, పక్షుల కొన్ని కూతలు మినహా.. అసలు నిశ్శబ్ద సంగీతం.. మేం బస చేసిన హోం స్టే కాటేజ్. అందుకే, ఆ రాత్రి నిద్ర ఎలా ఉంటుందోనన్న ఆ ఎగ్జైట్మెంట్ కు కారణం. అనకున్నట్టే హాయిగా నిద్ర పట్టింది. మేమనుకున్న ఆస్వాదన లభించింది
మరి ఆ తర్వాత తెల్లారి కథేంటి..?
తెల్లవారే ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా తలకావేరీ మా నెక్స్ట్ డెస్టినేషన్. ఉదయాన్నే వెళ్దామనుకున్నా.. లేచి రెడీ అయ్యేసరికి కాస్త టైం పట్టింది. దాంతో పాటే ఉదయం వేళ ఆ ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు అక్కడే కాఫీలు, టీలు తాగి కాస్సేపు గడిపి.. తలకావేరీకి బయల్దేరాం. అదింకా మరీ డీప్ ఫారెస్ట్. తలకావేరీ ప్రయాణంతో కూర్గ్ అంటే కుశాల్ నగర్, మడికెరి, విరాజిపేట అని చెప్పుకున్న మూడు చుట్టేసినట్టైపోయింది. ఆ ఫారెస్ట్ లో మా క్రెటాలో ప్రయాణమే ఓ అద్భుతమైన అనుభూతి. జీవితమంటేనే ప్రయాణం కదా.. అందుకు మెటాఫర్ మా జర్నీ.
మాటలకందని అనుభూతి తలకావేరి!
బ్రహ్మగిరి హిల్స్ అని పిలుస్తారట. మనం నాసిక్ దగ్గర కూడా ఈ పేరు విని ఉంటాం. అలాంటి చోట సముద్ర మట్టానికి సుమారు రెండు వేల అడుగుల ఎత్తులో కావేరీ నది పుట్టింది. ఆ బ్రహ్మగిరి హిల్స్ ను సప్తరుషులు తపస్సు చేసిన చోటుగా కూడా చెబుతుంటారు. అగస్త్యుడితో పాటు.. కావేరీ పుట్టుక గురించీ కొన్ని కథలు అక్కడి పూజార్లనడిగితే వారికి తెలిసింది చెప్పారు. అదంతా పక్కనబెడితే.. మేం ఏ వాతావరణాన్నైతే కోరుకున్నామో.. ఆ వెదర్ మాకు తలకావేరీ అందించింది. దేశమంతా మండుటెండల్లో.. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పచ్చభాస్వరమై భగ్గుమంటుంటే.. పక్కనున్న మా అబ్బాయి నేనే ఒకరికొకరం కనిపించనంత మంచు మమ్మల్ని కమ్మేస్తే.. ఇంకోవైపు, పైనుంచి సన్నని వాన జల్లులు కురుస్తుంటే.. మేఘావృతమైన ఆ ప్రకృతి వర్ణన మాటలకు ఏ మాత్రం అందనిది. జస్ట్ చూడాల్సిన సీనిక్ బ్యూటీ అంతే. మేం పెట్టిన ఖర్చుకు సంపూర్ణమైన ఆస్వాదన. మా భావనకు తగ్గ పిక్చర్. అలా తల కావేరీ ఎపిసోడ్ ముగించుకుని… త్రివేణి సంగమానికి చేరుకున్నాం.

తుల సంక్రమణ పండుగకు కేరాఫ్ గా త్రివేణి సంగమం!
కావేరీ నదితో కన్నికె, అంతర్వాహినిగా సుజ్యోతి నదులు కలిసే స్థానమే ఈ త్రివేణి సంగమం. మడికెరి నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంగమం.. తలకావేరీ కింది భాగంలో ఉంటుంది. పురాతన భగేందేశ్వర ఆలయం ఈ నదీ ఒడ్డున ఉంది. పితృకార్యాలు, శ్రాద్ధ కర్మలకు చిరునామాగా ఈ త్రివేణి సంగమానికి పేరు. ఇక్కడ తుల సంక్రమణ అనే పండుగ బ్రహ్మండంగా జరుగుతుందట.. ఆ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చే ఓ ఆధ్యాత్మిక కేంద్రం ఈ త్రివేణి సంగమం.
మార్గమధ్యంలో కాఫీ తోటల సందర్శన!
నిసర్గధామాకు బయల్దేరాక మధ్యలో కాఫీ తోటలు.. ముఖ్యంగా స్పైసీస్ కు పెట్టింది పేరైన కూర్గ్ లో ఆ తోటల విశేషాలూ మస్ట్ అనిపించింది. అలా ఓ వ్యూ పాయింట్ లోకి ఎంటరయ్యాం. తలకో రెండొందలు చొప్పున టిక్కెట్. ఆ తర్వాత గైడ్ వచ్చి మాకు పూర్తి వివరించడం. కాఫీలో ఎన్ని రకాల పంటలు.. వాటిలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏంటీ.. ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడే కాఫీ ఏంటీ.. కాఫీని అడిక్ట్ అయ్యేలా ఎలా చేస్తారు.. అసలు ఒర్జినల్ కాఫీ ఎలా ఉంటుందనే విశేషాలతో పాటు.. దాల్చిన చెక్క.. ఇలాయిచీలో క్వాలిటీస్.. రుద్రాక్ష చెట్లు, వాటికి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఇవన్నీ వివరించాడు. అలా కాఫీ తోటలు చూడాలనుకున్న మా కోరికా నెరవేరింది. తలా రెండొందలు సమర్పించుకున్నందుకు గైడ్ వివరణతో పాటు.. మనిషికో కప్పు కాఫీ ఫ్రీ ఇక్కడ.
నిసర్గధామా!
నెక్స్ట్ కావేరీ నిసర్గధామాకు చేరుకున్నాం. కూర్గ్ ఆరంభంలోనే ఉండే కుశాల్ నగర్ ఎంచుకోక.. మధ్యలో ఉండే మడికెరి అయితే బెటర్ ఆప్షన్ అని మా స్నేహితుడి సలహా మేరకే ఫాలో అయిన మేం.. అప్పుడుగానీ తిరిగి వెనక్కి వెళ్లి కూర్గ్ ఆరంభంలోనే ఉండే కుశాల్ నగర్ లోని విసర్గధామాను సందర్శించాం. అక్కడ కావేరీ నది ఫోటోలకు అనువైన ప్రదేశంలా కనిపించగా.. బర్డ్స్ సాంక్చురి, డీర్ పార్క్ వంటివి కొంత అలరిస్తాయి.
గోల్డెన్ టెంపుల్ కథేంటి..?
నిసర్గధామా తర్వాత గోల్డెన్ టెంపుల్ మా నెక్స్ట్ విజిట్ ప్లేస్. 1959లో చైనా టిబెట్ ను దురాక్రమణ చేసిన క్రమంలో చాలామంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. వారందరికీ కర్నాటకలోని బైలకుప్ప వద్ద ఆ తర్వాత ఇందిరాగాంధీ పీరియడ్ లో భూములు కేటాయించారు. బైలకుప్పకు ఓ ఐదు కిలోమీటర్ల దూరంలోనే కుశాల్ నగర్ లో బుద్ధుడి గోల్డెన్ టెంపుల్ ఆకట్టుకునే ప్రదేశం. పద్మసంభవ బుద్ధుడి విహార ప్రాంతంగా చెబుతారు. బుద్ధ శాక్యముని, గురు పద్మసంభవ, బుద్ధ అమిత్యాయుస్ ఇలా ముగ్గురి విగ్రహాలు ఈ గోల్డెన్ టెంపుల్ ఉంటాయి. మధ్యలో బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. దీన్ని టిబెట్ లోని బౌద్ధుల మఠానికి ట్రిప్లికాగా పేర్కొంటూ ఆ నమూనాను కూడా ఇక్కడ డిస్ ప్లే చేస్తారు. మొత్తంగా సుమారు 5 వేల మంది బౌద్ధ భిక్షువులతో ఓ కొత్త అనుభూతినిచ్చే ప్రదేశం గోల్డెన్ టెంపుల్. 80 చదరపు అడుగుల్లో వెలసిన ఓ ఆధ్యాత్మిక కేంద్రం. నామ్ డ్రోలింగ్ మోనాస్టరీగా పిలుస్తారు. అంటే శాశ్వత విముక్తి కేంద్రమని పేరు. దలైలామా ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ పేరు పెట్టారు. పెమా నోర్బు రింపోచే అనే బౌద్ధ సన్యాసి ఈ మఠాన్ని నిర్మించారు.
మళ్లీ కథ కంచికి!
అప్పటికే చీకటి పడటంతో కథ కంచికి.. మేం ఇంటికి బయల్దేరాం. మధ్యలో మళ్లీ డిన్నర్ ముగించుకున్నాం. హోటల్స్ విషయానికొస్తే పెద్ద గొప్పగా ఏం లేవు. అలాగని మరీ నాసిరకమూ కాదూ. మార్గమధ్యంలో కర్నాటక స్పెషల్ అయిన బాదాం మ్యాంగోస్, చక్కెర కేళీలు కొనుక్కుని మళ్లీ మా హోం స్టే మార్గం పట్టాం. తెల్లవారి దుబారే ఎలిఫెంట్ క్యాంపుకెళ్లి వందలాంది ఏనుగుల మందను ఆ కావేరీ నదీ తీరంలో చూడాలన్నది మా నెక్స్ట్ ప్లాన్.
మరేమైంది..?
యథావిధిగా గోల్డెన్ టెంపుల్ విజిట్ తర్వాత డిన్నర్ ముగించుకుని మళ్లీ మా కాటేజ్ కు ప్రయాణం.. ఆ చిమ్మచీకట్లో ఆ వాతావరణంలో ఓ అద్భుతమైన అనుభూతి.. ఎప్పుడూ పడుకోనంత తొందరగా అంటే పది గంటలకే మంచమెక్కి గురక పెట్టేశాను నైనైతే. మబ్బున్నే లేచి మళ్లీ బయల్దేరాలన్నది ప్లాన్. కానీ, యథావిధిగా ఆ ప్రకృతి మనల్ని ముందుకు కదలనిస్తేగా..? అప్పుడే పరిచయమయ్యారు అశోక్ లేల్యాండ్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మరో వ్యక్తి. తానూ.. సేమ్ టూ సేమ్ మాలాగే ఫ్యామిలీతో ఓవారం రోజుల ట్రిప్పుకు కూర్గ్ ను ఎంచుకున్నారు. వేవ్ లెంత్ తో పాటే.. మాటలూ కలిశాయి. అలా చాయి తాగుతూ మాట్లాడుకుంటూ మెల్లిగా రెడీ అయ్యి బయల్దేరేసరికి ఉదయం ఎనిమిదైంది. కానీ, ఆ రోజు ఒకింత బాధతో బయటకు అడుగు పెట్టాం. ఎందుకంటే, మమ్మల్ని మా సొంత ఇంటిలా ఆకట్టుకున్న ఆ స్టే హోం నుంచి బయటకు వెళ్లుతున్నాం. అప్పటికే మేం బుక్ చేసుకున్న మూడు రోజులైపోయింది. ఇక మా ప్రయాణం.. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ చూసుకుని.. మైసూర్ వెళ్లిపోవడం. కానీ, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ మమ్మల్ని నిరాశపర్చింది. అంతకుముందు రోజే అక్కడే ఓ వార్త విన్నాం. దుబారే ఎలిఫెంట్ క్యాంపులో రెండు ఏనుగులు కొట్లాడుకుని ఓ ఏనుగు వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారని. దాని పర్యవసానం మేం వెళ్లినరోజు దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ను మూసేశారు. ఇక ఊసురుమనుకుంటూ మైసూర్ కు మా ప్రయాణం మొదలైంది.
మైసూర్ ఎందుకు ప్రత్యేకం..?
ప్రపంచంలోనే ఎలాంటి హడావిడి, పెద్ద రద్దీ కనిపించకుండా ప్రశాంతంగా కనిపించే సిటీల్లో మైసూరుదీ పదో స్థానమని ఎవరో చెబితే విన్నట్టు గుర్తు. అనుకున్నట్టే మధ్యాహ్నానికి మైసూర్ చేరుకున్నాం. వెళ్లగానే ఆక్వేరియం చుట్టేశాం. చిన్ని చిన్ని చేపల్నుంచి… రకరకాల ఫిషెస్ తో ఆ నీలిరంగు అండర్ వాటర్ జోన్ ఆహ్లాదపర్చింది. పక్కనే ఆనంద్ భవన్. మళ్లీ సౌత్ ఇండియన్ తాళీ దంచేసి.. కాస్సేపు అలా మైసూర్ సిటీలో చక్కర్లు వేశాం. మైసూర్ ను చూడకపోయినా.. మైసూర్ బజ్జీ, మైసూర్ శాండల్, మైసూర్ పాక్ వంటివాటితో పేరైతే బాగా విన్నదే. అందుకే, మైసూర్ పాక్ కు స్పెషల్ స్వీట్ హౌజ్ గా గుర్తింపు పొందిన ఓల్డెస్ట్ గురు స్వీట్ హౌజ్ కు వెళ్లి కాస్త మైసూర్ పాక్ కొనుక్కుని.. అక్కడి నుంచి మైసూరంటే పర్యాటకంగా అంతా పెద్దగా చెప్పుకునే మైసూర్ ప్యాలెస్ బాట పట్టాం. కళ్లు చెదిరేలా ప్యాలెస్.. అందులో నాటి రాజుల ఫోటోలు.. షాండ్లియర్స్.. వాటన్నింటినీ చూసేందుకు వచ్చిన రద్దీ.. మొత్తంగా అలా సాగిపోయింది. అక్కడ ముగించుకుని ధర్మదర్శనంలో చాముండీ హిల్డ్ పైనున్న అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక బృందావన్ గార్డెన్ కూడా కానిచ్చేస్తే అయిపోతుంది కదా అని ఆబరాగా వెళ్లాం. గార్డెన్ అయితే చూడగల్గాం గానీ.. అనుకున్న స్థాయిలో అక్కడ గడపలేకపోయాం. ఏదైతేనేం మైసూర్ కన్నా నాకు వ్యక్తిగతంగానే కాకుండా.. మా ఫ్యామిలీ మొత్తానికీ, మా డ్రైవర్ రాజుకు కూర్గే నచ్చేసింది. అలా కూర్గ్ మెమరీస్ తో ఆ రాత్రే మళ్లీ తిరుగు ప్రయాణం మొదలైంది.
విజయవంతమైన జర్నీకి కారణాలు!
కర్నూల్ దగ్గర బ్రేక్ పడి ఎంత నిరాశకు గురయ్యామో… ఆ తర్వాత అంతా సజావుగా సాగిపోయింది. అందుకు డ్రైవర్ రాజు.. మాకు కారు ఇచ్చి పంపిన మా నాగరాజు… మాకెక్కడా ఇంకా ఆటంకాల్లేకుండా మా ప్రయాణాన్ని సజావు చేసిన ప్రకృతి కరుణ.. వెరసి, మా కూర్గ్ ప్రయాణం ఎవర్ మెమరబుల్ జర్నీగా మిగిలిపోయింది.
ఓట్ ఆఫ్ థ్యాంక్స్!
మీడియాలో పనిచేస్తున్నప్పుడు, అందులోనూ, ఓ ముఖ్యమైన సెంటర్ లో ఉన్నప్పుడు లీవ్ దొరకడమే గగనగండం. అలాంటిది అడగ్గానే నాకు పర్మిషన్ ఇచ్చిన మా ఎడిటర్స్ కు, కారిచ్చిన నా మిత్రుడు, వాళ్ల అన్నయ్యకు… ఎలా వెళ్లామో అలా తీసుకొచ్చి కూర్గ్ మొత్తం దగ్గరుండి అణువణువూ తన డ్రైవింగ్ తో వడబోసి చూపెట్టిన రాజుకు.. వీళ్లందరితో పాటు, ఈ ప్రయాణం సక్సెస్ వెనుక నన్ను వెళ్లమని ఎంకరేజ్ చేసి, తన ఎక్స్పీరియెన్స్ నాతో పంచుకుంటూ, స్టే హోమ్స్ బుక్ చేసి, అవాంతరాలెదురైనా విసుక్కోకుండా సహకరించిన నా మిత్రుడు.. వీళ్లంతా ఇందులో పాత్రధారులు. కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే ఈ టూర్ పూర్తే కాదు.
కూర్గ్ అంటే ఇంతేనా..?
కూర్గ్ అంటే మాకు తెలిసిన, మేం చూసిన ప్రధాన క్షేత్రాల గురించి మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశానే తప్ప.. అంతకుమించి. హెబ్బా వాటర్ ఫాల్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇలా ఎన్నో ఉన్నాయి. అదే దారిలో శ్రావణ బెళగోళ వంటి టూరిస్ట్ స్పాట్సూ ఉన్నాయి. కాబట్టి, ఇది మేం చూసింది.. మాకు తెలిసింది మాత్రమేనని గమనించగలరు.
కూర్గ్ ఇచ్చిన అనుభూతి ఏంటి..?
కూర్గ్ ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటారు. కూర్గ్ మాకు ఓ పర్యాటక ప్రదేశ ప్రయాణం కాదు.. స్వచ్ఛమైన గాలితో కొత్త శ్వాసనందించిన సరికొత్త అనుభవం.



