తమ నిరసనను తీవ్రంగా చెప్పడానికి.. నేరుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరమేం లేదు. విద్వేషపూరిత వాఖ్యలతోనో, సెటైర్స్ తోనో.. తమకు నచ్చనివాటిపై కామెంట్స్ చేయడం, మీమ్స్ చేయడం, దానిపై రెండు వర్గాలు విడిపోవడం.. ఇవాల్టి సోషల్ మీడియా వార్ లో సర్వసాధారణం. కానీ, అందుకు భిన్నంగా ఆలోచించింది అక్కడి యువత… ఏకంగా సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత వ్యాఖ్యలకు దీటైన సమాధానం ఇప్పుడా యువత తీసుకున్న మిషన్.
నేటి నిరుద్యోగ యువతను ఉద్ధేశించి జస్టిస్ సూర్యకాంత.. బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చ. ఈ క్రమంలో న్యాయమూర్తుల తీరుపైనా నేరుగా ఆక్షేపించేవారు కనిపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఒక బయాలోజికల్ డిజిటల్ పొల్టికల్ వార్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

అలాంటి యుద్ధానికి వేదికైన ఢిల్లీ!
ఢిల్లీ యువత కాక్రోచ్ జనతా పార్టీగా మారి యమునా నదిని శుభ్రం చేస్తుండటమే జస్టిస్ సూర్యకాంత వ్యాఖ్యలకు ప్రభావవంతమైన పరోక్ష నిరసన. ఢిల్లీకి చెందిన కొందరు యువత కలిసి స్వచ్ఛందంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మిషన్ లో పాల్గొంటున్నారు. అంటే పాలకులు, అధికారులు, న్యాయమూర్తులు, మీడియా, రాజకీయ నాయకులు దృష్టి పెట్టాల్సిన అత్యంత ప్రాధాన్యతాంశాలింకా ఎన్నో ఉన్నాయనే ఒక మెసేజ్ ను స్వచ్ఛ యుమునా నది పేరిట చేపట్టిన మిషన్ తో పంపించడం ఇప్పుడు యావత్ దేశాన్నీ ఆకట్టుకుంటోంది. కాలుష్యంపై ఫోర్ ఎస్టేట్స్ పోషిస్తున్న పాత్రేంటో తెలియజెబుతూనే.. నిరుద్యోగ యువత తల్చుకుంటే ఏం చేయగలదో చూపిస్తోంది. అదే సమయంలో బొద్దింకల్లా, పరాన్నజీవులుగా తమను పోల్చడంపై తమ భిన్నమైన కార్యాచరణతో తమ నిరసనను వ్యక్తం చేస్తోంది.
కాక్రోచ్ ఫేస్ మాస్కులు, కాక్రోచ్ బొమ్మలతో ఉన్న టీషర్ట్స్ వేసుకుని యుమనా తీరంలో పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అక్కడి యువత ప్లాస్టిక్ నుంచి మొదలు నదిని కలుషితం చేసిన చెత్తనంతా సేకరిస్తోంది. కాక్రోచులన్నీ కలిసి చేతులకు గ్లౌజులు ధరించి.. చెత్త సంచులు, చెత్త తీసే రేకులు పట్టుకుని చెత్తనంతా కూడబెడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గంట క్రితం వచ్చిన మీమ్స్ కు గంట తర్వాత పట్టించుకోని స్పీడ్ యుగంలో… ఢిల్లీకి చెందిన కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం లేవనెత్తిన యమునా కాలుష్యం అనే సామాజిక సమస్య ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడని విధంగా స్పందించినప్పుడు.. దానికి అంతే దీటుగా ఎలా సమాధానం చెప్పవచ్చో.. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత వ్యాఖ్యలనంతరం ఈ యువత చేపట్టిన కార్యాచరణ చెబుతోంది.
కేవలం మాటలతో దాడో.. లేక, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో వైరల్ చేయడమో కాకుండా.. ఇంకో స్టెప్ ముందుకేసి, ఇంకాస్త క్రియేటివ్ గా కాక్రోచ్ వేషాల్లో చేపట్టిన ఈ యమునా క్లీనింగ్ కార్యక్రమం ఇప్పుడు వ్యంగ్యంతో ఎలా సమాధానం చెప్పొచ్చో చర్చకు తెరలేపింది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై ఎలా చైతన్యం తీసుకురావచ్చో కూడా కళ్లముందుంచింది.
అసలు వివాదానికి కారణమేంటి..?
సుప్రీంకోర్టులో ఓ విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత నేటి నిరుద్యోగ యువతను కాక్రోచులుగా అభివర్ణించాడన్న వార్తలు దేశవ్యాప్తంగా నిరుద్యోగితలో మంటలు రేపాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులు, ముఖ్యంగా ఆర్టీఐ దరఖాస్తులు వేసేవారు, అత్యున్నత స్థానాల్లో జవాబుదారీగా ఉన్నవారిని విమర్శించడం వంటివాటిపై.. సూర్యకాంత కాస్త భిన్నంగా స్పందించారన్న వార్తలు.. నేటి యువత ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారాయి.
జస్టిస్ సూర్యకాంత వ్యాఖ్యలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దావానంలా వ్యాపించి.. జర్నలిస్టులు, కవులు, రచయితలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, పౌరసమాజంలోని విభిన్నవర్గాల వారు పెద్దఎత్తున స్పందించారు. ఈ చర్చల మధ్యలోనే ఢిల్లీకి చెందిన జెన్ జీ యువత మరింత సృజనాత్మకంగా ఆలోచించి ఈ విధంగా స్పందించి దృష్టిని ఆకర్షిస్తోంది.

యమునా నదినే ఎందుకు ఎంచుకున్నారు..?
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యమునా నది కాలుష్యయంతో దశాబ్దాలుగా కన్నీరు పెడుతోంది. 2025 జూలైలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారమే.. ఢిల్లీలో రోజుకు సుమారు 3 వేల 596 మిలియన్ లీటర్ల మలినజలం ఉత్పత్తవుతోంది. ఇందులో 641 మిలియన్ లీటర్లు శుద్ధి కాకుండానే యమునలోకి చేరుతున్నాయి.
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రకారం యుమున మొత్తం ప్రవాహంలో కేవలం 2 శాతం మాత్రమే ఢిల్లీ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పటికీ.. కాలుష్యం మాత్రం 80 శాతంగా ఉన్నట్టు ఓ అంచనా.
ఈ క్రమంలోనే ఉన్నత స్థానాల్లో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నవారందరికీ ఓ సందేశాన్ని పంపేలా… ఏ కాక్రోచ్ అనే వ్యాఖ్యలైతే జస్టిస్ సూర్యకాంత చేశారనే వార్తలొచ్చాయో అదే బొద్దింకల వేషాలు కట్టి చెత్తను ఏరే పని పెట్టుకున్నారు. యుమునను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు.
జస్టిస్ సూర్యకాంత వైరల్ వ్యాఖ్యలను… ఒక పర్యావరణ సమస్యపై చర్చకు దారితీసేలా కొత్త స్కెచ్ వేసింది ఢిల్లీ జెన్ జీ యూత్. ఒకవైపు, నిరననను వ్యక్తపరుస్తూ బొద్దింకల రూపాల్లో కనిపిస్తూనే.. మరోవైపు, అసలు యువత చెప్పాలనుకున్న సందేశాన్ని టన్నులకొద్దీ నింపుతున్న చెత్త బ్యాగుల ద్వారా చూపించింది.
సోషల్ మీడియాలోనూ అప్లాజ్ అందుకున్న ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. శాంతియుత చర్యగా ఉంటూనే.. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించేవారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసే యువతగా ఇప్పుడు ఢిల్లీ జెన్ జీ పేరు మారుమ్రోగిపోతోంది.
ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువత అందరిపైన ఏమాత్రం కాదని.. కేవలం నకిలీ డిగ్రీలు, ఫేక్ సర్టిఫికెట్స్ తో వృత్తి ప్రమాణాలను పలుచన చేస్తున్నవారిపైనేనని సమర్థించుకున్నారు.
కానీ,అప్పటికే ఢిల్లీ జెన్ జీ యుమునా క్లీనింగ్ మూవ్మెంట్ పెద్ద చర్చగా మారిపోయింది. సమస్యను పూర్తిగా ఈ యువత పరిష్కరించలేకపోయినప్పటికీ.. కాక్రోచుల వేషాల్లో నిరననగా తమ చేతలతో చెత్త సేకరించే పనితో ఒక సామాజిక సమస్యపై ప్రశ్నను లేవనెత్తారు. పౌరులిలా స్పందిస్తే ఎలా ఉంటుందో కళ్లకు గట్టారు. ఏళ్లుగా చర్చలకు మాత్రమే పరిమితమై.. ఆచరణకు నోచుకోని యమునను మరోసారి వార్తల్లో నిలిపారు.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం!
ఇవాళ రేపు వైఫై లేని ప్రాంతాలే ఉండవేమో. అందుకే, వైఫై ఎక్కడుంటే అదే మా ఆఫీస్ అంటూ అభిజిత్ దీప్కే అనే యువకుడు మే 16వ తేదీన జస్ట్ నాల్గురోజుల క్రితమే కాక్రోచ్ జనతా పార్టీని ఆరంభించాడు. గతంలో ఆప్ సోషల్ మీడియా వాలంటీరుగా పనిచేశాడు ఈ అభిజిత్. కేవలం నాల్గు రోజుల్లోనే పది లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా రిటైర్మెంట్ అయిన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లివ్వడం చేయకూడదని, తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్స్ కల్పించాలనే పలు డిమాండ్లతో ఈ కాక్రోచ్ జనతాపార్టీ ఏర్పడగా.. దీనికి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపడంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు వార్తల్లో హైలెట్స్ అయింది.
కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్!
నేటి నిరుద్యోగితను ఉద్ధేశించి జస్టిస్ సూర్యకాంత చేసిన వ్యాఖ్యల్లో కాక్రోచ్ తో పాటు.. పరాన్నజీవులు అనే పదం కూడా వైరల్ గా మారడంతో.. అందుకు నిరసనగా నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు.. విరిగిన వ్యవస్థను అతుకుపెట్టేందుకు మేం రంగంలోకి దిగుతున్నామని ఏన్పీఎఫ్ తన సైట్ లో కూడా పేర్కొంది. అసలైన పరాన్నజీవులెవరో చెప్పాలంటూ.. ఆ వ్యాఖ్యలు చేసేవారినీ, పాలకులనే ప్రశ్నిస్తూ ఉద్యమిస్తోంది.
ఆకట్టుకున్న వేషాలు.. సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు..?
ఢిల్లీ యువత ఏర్పాటు చేసిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ.. అలాగే, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ అనేవి.. మాడ్రన్ యాక్టివిజం ఎలా ఉండబోతోందో చెబుతున్నాయి. సోషల్ మీడియా తరంలో వివాదాలకు ఎంత వ్యంగ్యంగా, హాస్యస్ఫూరతతో, సింబాలిక్ గా ఉండేలా ఎలా స్పందించొచ్చో లోకం ముందుంచాయి.
కాక్రోచే వేషాలు చూసేందుకు ఆకట్టుకోవచ్చు. నిరసనకు ఓ రూపం కావచ్చు. కానీ, తమ నిరసనలోనూ ఓ సోషల్ గోల్ ఉండటం.. ఆ గోల్ కాస్తా మళ్లీ యమునా నది పరిశుభ్రతపైకి మళ్లించడం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్.
అలాగే. నేటి యువత సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా.. అంశాలవారీగా సామాజిక సమస్యలపై చర్చను ఎలా రేకెత్తించవచ్చో కూడా ఈ మొత్తం ఎపిసోడ్ చూపింది. అంతిమంగా ఢిల్లీ జెన్ జీ యాత్.. ప్రజల కోపం కార్యాచరణగా మారితే సమాజంలో ఎంత మార్పు తీసుకురావచ్చో చూపింది. పార్టిసిపేటరీ సెటైర్ పవర్ ఏంటో చాటిచెప్పింది.



