కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాలిచ్చేముందు చేసే ఇంటర్వ్యూలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. లండన్ కు చెందిన ఓ మార్కెటింద్ స్పెషలిస్ట్ ఈ విషయాన్ని తన X ఖాతాలో పోస్ట్ చేయడంతో పెద్దఎత్తున అలాంటి ఇంటర్వ్యూస్ ఎదుర్కొన్న పలువురు వారి అనుభవాలను కూడా పంచుకోవడంతో పాటు… సదరు కంపెనీ పేరు కూడా వెల్లడిస్తే పోయేదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రశ్న… ఆమెతో పాటు, నెటిజన్స్ ఎందుకు ఆ ప్రశ్నపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు…?

జాహ్నవి జైన్ అనే భారత్ కు చెందిన యువతి ప్రస్తుతం లండన్ లో రీబాక్స్డ్ కంపెనీలో మార్కెటింగ్ స్పెషలిస్టుగా పనిచేస్తోంది. అయితే, అంతకుముందు ఆమె భారత్ కు చెందిన ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. మొదట ఇంటర్వ్యూయర్స్.. మీ వయస్సెంత అని అడిగారట. దానికి జైన్ 25 ఏళ్లని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ క్వొశ్చన్.. మీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగారట.
అసలు ఇలాంటి ప్రశ్నలను ఒక ప్రొఫెషన్ లో కార్పోరేట్ కంపెనీల్లో అడగటంతో తానవాక్కయ్యానని అంటోంది జాహ్నవి జైన్. అయితే, ఈ కల్చర్ కార్పోరేట్ కంపెనీల్లో దశాబ్దాల నుంచే వేళ్లూనుకుందని… వయస్సు, పెళ్లి, ప్రెగ్నెన్సీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, లెక్కలు వేసుకుని మరీ సెలక్షన్ చేసే పద్ధతి ఎప్పటినుంచో వేళ్లూనుకుందంటోందామె.

ఈ విషయాని ఆమె తన X ఖాతాలో పోస్ట్ చేయడంతో అనూహ్యమైన స్పందన వచ్చింది. జాహ్నవిలాగే ఇబ్బందిపడ్డవారెందరో.. తమ అభిప్రాయాలనూ రిప్లైస్ రూపంలో పోస్ట్ చేశారు. కొందరైతే అలాంటి కంపెనీల గురించి మరో నల్గురికి తెలిసేలా అసలు పేరు కూడా మెన్షన్ చేయాలనీ జాహ్నవిని కోరారు.
దానికి ఆమె, ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన సంప్రదాయంగా కూడా చూడలేమని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్పోరేట్ కంపెనీల అన్నింట్లో ఉన్నదేనన్నారు. మీరు కొత్తగా పెళ్లి కాబోతున్నవారో.. లేక, పెళ్లైనవారో అయితే.. మీ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ ను కూడా ఆ కంపెనీలకు రివీల్ చేయాల్సి ఉంటోందంటున్నారు జైన్.
మరికొందరు మాత్రం కంపెనీలు కచ్చితంగా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాయనీ పోస్ట్ చేశారు. ఎందుకంటే, అవేం ధర్మసత్రాలు నడపడం లేదు కాబట్టి… ప్రతీ పైసాకు ఎంత లాభం పొందుతున్నామనే యాక్యురేట్ లెక్కలుంటాయనీ… దాంతో వ్యక్తులు వ్యక్తిగత కారణాల వల్ల ముఖ్యమైన ప్రాజెక్టులు చేసేటప్పుడు మధ్యలో సెలవులు తీసుకోకూడదనేది వారి ఆలోచనగా చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ప్రసూతి సెలవులు ఇవ్వడానికి కూడా యాజమాన్యాలు ఇష్టపడవు. కాబట్టి స్టార్టప్స్, సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో ప్రాజెక్టులు పూర్తయ్యేవరకూ వివాహాలకు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ కు పర్మిట్ చేయొద్దనే నిబంధనలను కంపెనీలు ఏర్పాటు చేసుకున్నట్టు భిన్నరకాల అభిప్రాయాలు, స్పందనలతో.. మొత్తంగా కార్పోరేట్ కంపెనీల హెచ్ఆర్ పాలసీలపై చర్చకు పెట్టింది జాహ్నవీ జైన్.



