విజయ్ కుమార్ కోడూరి.. ✍🏼
–ముందుగా డిస్క్లైమర్ :
ఇది సినిమా సమీక్ష కాదు. సినిమా చూసిన తరువాత పంచుకోవాలనిపించిన కొన్ని అభిప్రాయాలు మాత్రమే. ఈ సినిమా తప్పకుండా చూడండి
- చాలా రోజుల తరువాత, థియేటర్ కు వెళ్లి చూసిన సినిమా ఇది. అట్లా అనిపించి నన్ను థియేటర్ దాకా తీసుకువెళ్లిన కారణాలు రెండు. ఒకటి – నేను గౌరవంతో చూసే తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ ‘లీడర్’ సినిమా తరువాత తిరిగి ఇన్నాళ్లకు తన స్కూల్ నుండి పక్కకు జరిగి ఈ సినిమా తీయడం. రెండు – మిత్రులు పింగళి చైతన్య, నంద కిషోర్ ఈ సినిమా కోసం పనిచేయడం

డాలర్ డ్రీమ్స్, ఆనంద్, గోదావరి వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల ‘లీడర్’ చూసిన తరువాత, ఆ సినిమా కథా కథనాల విషయంలో అసంతృప్తిగా అనిపించినా, కాస్త శ్రద్ధ పెట్టి అప్పుడప్పుడైనా ఈ శేఖర్ ఇటువంటి సినిమాలు తీస్తే బాగుండునని అనుకున్నాను (ఎంతమంది గమనించారో తెలియదు గానీ, ఈ లీడర్ సినిమా కథను కాస్త పాలిష్ చేసి కొరటాల శివ ‘భరత్ అనే నేను’ తీసి ఉంటాడని నా అభిప్రాయం). మొత్తమ్మీద, లీడర్ తరువాత ఇన్నాళ్లకు శేఖర్ ఈ కుబేర సినిమా తీసాడు
నిజానికి ఈ తరహా సినిమాలు శంకర్ పేటెంట్. కాకపొతే, శంకర్ సినిమాలతో సమస్య ఏమిటంటే – తీసుకున్న రాజకీయ సామాజిక సమస్య లోతుల్లోకి వెళ్లకండా ఉపరితలం మీదే విన్యాసాలు చేస్తాడు. ఉదాహరణకు, భారతీయుడు సినిమాలో లాగా కరప్షన్ కు పరిష్కారం ఒక దేశభక్తుడు ఆ అవినీతి అధికారులను వరుసబెట్టి చంపేయడం. దానికి తోడు, పాటలు, యాక్షన్ సీక్వెన్సెస్ పేరున మితిమీరిన షుగర్ కోటెడ్ సీన్స్.
సమకాలీన సామాజిక రాజకీయ సమస్యల మీద సరైన కథ, కథనం రాసుకుని సినిమా తీస్తే వాటికి కూడా మార్కెట్ ఉంటుంది. డబ్బులు వస్తాయి. ప్రేక్షకులను భావోద్వేగాలకు లోను చేయడంలోనే సినిమా విజయం దాగి ఉంటుంది. కాకపొతే, ఎలివేషన్లు, ముతక హాస్యాలు, మొరటు మాటల ద్వారా సృష్టించే భావోద్వేగాలు చాలా సులభం, పెద్దగా శ్రమ, బుద్ధి వెచ్చించనవసరం లేనివి కాబట్టి, బహుశా, మన మెజారిటీ తెలుగు సినిమా దర్శకులు వాటి వైపే మొగ్గుచూపుతారేమో?కాకతాళీయంగా జరిగిన సంఘటన ఏమిటంటే, నిన్న నేషనల్ మీడియాలో ఒక వార్త వచ్చింది – అండమాన్ దీవుల దగ్గర దేశ అవసరాలు తీర్చేంత ఆయిల్ నిక్షేపాలను కనుగొన్నారని. ఇది కార్యరూపం ధరిస్తే, విదేశీ మారకద్రవ్యం సేవింగ్స్ ద్వారా ఇండియా త్వరలో వరల్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఎదిగడం ఖాయమని అన్నారు. ఆ వార్త చదవగానే వెంటనే వచ్చిన సందేహం – ఆ ఆయిల్ బావులు తవ్వుకునే కాంట్రాక్ట్ ఏ మిత్రులకు ఇస్తారో అని
- మనలో ఎందరికి తెలుసు – కృష్ణా గోదావరి బేసిన్ లో సహజ వాయువు తవ్వకాలలో ఓ ఎన్ జి సి పరిథిలో ఒక పెద్ద కార్పొరేట్ తవ్వకాలు జరిపిందంటూ వచ్చిన వార్తల గురించి. ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచేదాకా ఆ కార్పొరేట్ గ్యాస్ తవ్వకాలను హోల్డ్ లో పెట్టిన సంగతి. ఒక కార్పొరేట్ కు అర్హతకు, నిబంధనలకు మించి ప్రభుత్వ విమానాశ్రయాలను కట్టబెట్టేందుకు మొత్తం టెండర్ల ప్రక్రియనే తారుమారు చేసిన సంగతి.
- ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పన / సంపద సృష్టి అంటూ కార్పొరేట్లకు ఇచ్చే భూమి, నీరు, వనరులు ఎవరి ఆస్తి ? అవి ఎంత విలువైనవి ? కార్పొరేట్ల కు అట్లా ఇచ్చే భూమి, నీరు, వనరుల నుండి ప్రభుత్వాలు /ప్రజలు సరయిన రిటర్న్స్ పొందుతున్నాయో లేదో తనిఖీ చేసే వ్యవస్థలు మనకు ఉన్నాయా అని ఎప్పుడైనా ఆలోచించామా?
- ప్రధాన స్రవంతి మీడియాకు సైతం పట్టని (ఇప్పుడు ప్రధాన స్రవంతులు ఎవరి స్రవంతులు అనేది మరొక సమస్య) ఇటువంటి సమస్యల మీద సినిమా కథ రాసుకోవడం, సినిమా తీయడం, విడుదల చేయడం కష్టం మాత్రమే కాదు – సాహసం కూడా ! శేఖర్ కమ్ముల ఆ సాహసం చేసాడు ఈ సినిమాతో – అందుకే అతనికి, అతని టీమ్ కి అభినందనలు !
- ‘ఇండియాలో ఒకచోట ఆయిల్ నిక్షేపాలు కనుక్కోవడం’ అన్న దృశ్యంతో సినిమా మొదలవుతుంది. ఆ నిక్షేపాలను దక్కించుకోవడం కోసం ఒక పెద్ద కార్పొరేట్ వేసే ఎత్తులు, ఆ క్రమంలో, పెద్ద రాజకీయనాయకులతో లక్ష కోట్ల బ్లాక్ – వైట్ బేరాలు మాట్లాడుకోవడం, ఆ బేరాలు పూర్తి చేయడానికి కుట్రలకు బలై జైలులో వున్న మాజీ సి బి ఐ అధికారిని రంగం లోకి దించడం – ఇట్లా సాగిపోతుంది కథ. ఆ సి బి ఐ అధికారి పాత్రని నాగార్జున వంటి స్టార్ చేసి ఉండకపోతే, ఆ బేరాలు పూర్తి చేసే ప్లాన్ అంతా సిల్లీగా అనిపించి తేలిపోయి ఉండేదేమో ? ఎందుకంటే, అంత పెద్ద కార్పొరేట్ ఇంత పెద్ద పనిని పూర్తి చేయడానికి భారీ ఫీజులు / అవసరమైతే వాటాలు చెల్లించి చార్టర్డ్ అకౌంటెంట్ కంపెనీని పెట్టుకుంటుంది గానీ, ఇట్లా జైలులో వున్న హానెస్ట్ పోలీసు అధికారిని రంగంలోకి దించుతుంది అనుకోను.
- నాగార్జున పాత్ర దీపక్ విషయంలో ఒక లాజిక్ మిస్ అయ్యారా అనిపించింది. అతను అప్పటికే 5 ఏళ్ళు జైలులో ఉంటాడు. కోర్టు 7 ఏళ్ల శిక్ష విదిస్తుంది. అంటే ఇంకో 2 ఏళ్ళు బాలన్స్. 5 ఏళ్ళు వున్నవాడు మిగిలిన 2 ఏళ్ల కోసం తన విలువల విషయంలో కాంప్రమైజ్ కావడం ఎందుకో అర్థం కాలేదు. అదీగాక, ప్రభుత్వం లోని పెద్దలకు లక్షకోట్ల రూపాయల లంచాలను చట్టానికి దొరకకుండా అందించాలనే అసైన్ మెంట్ కోసం ఒక కార్పొరేట్ తనను జైలు నుండి బయటకు తీసుకువచ్చి వాడుకుంటోంది అని తెలిసిన తరువాత, ఈ లక్ష కోట్ల పంపిణీ వెనుక వున్న కార్పొరేట్ లక్ష్యం ఏమిటి అని ఇంటర్వల్ తరువాత తప్ప నిజాయితీపరుడైన ఈ సి బి ఐ అధికారికి తట్టకపోవడం ఏమిటి ?
- సినిమా ప్రధాన బలం ఎమోషన్స్, సంభాషణలు, నేపథ్య సంగీతం, అద్భుతమైన ఫొటోగ్రఫీ, మంచి సాహిత్యం వున్న పాటలు. లల్లబీ/జోలపాటలా సాగే ‘ఓ కొడుకా’ పాట అద్భుతం. మొదట వినిపించే ‘నాది నాది’ థీమ్ సాంగ్ ని చివరలో ‘మాది మాది’ అని వినిపించడం అర్థవంతంగా వుంది. ముఖ్యంగా – సమకాలీన ఆర్ధిక రాజకీయాల గురించి కాస్త లోతైన అవగాహన ఉంటే తప్ప సాధ్యం కాని సంభాషణలు ఈ సినిమాలో వినిపిస్తాయి. ఒక తెలుగు సినిమా ఇట్లా రావడం, తెలుగువాడిగా నాకు సంతోషంగా అనిపించింది.
- ముందే చెప్పినట్టు – ఇటువంటి కథతో సినిమా తీయాలనుకోవడమే ఒక సాహసం. సాహసంతో పాటు, కొంత రీసెర్చ్ చేసి, ఆ సమాచారాన్ని పద్ధతిగా కథనంలో రాసుకోవడం కొంత కష్టమైన పని. బెగ్గర్స్ పాత్రలనీ, మాజీ సి బి ఐ అధికారి పాత్రనీ కథలోకి తీసుకురావడం ద్వారా అవసరమైన డ్రామా పండింది. అయితే, క్లైమాక్స్ కు వెళ్లే క్రమంలో వ్యవస్థల లోతుల్లోకి మరికాస్త వెళ్లి కథ చెబితే బాగుంటుంది కదా అనిపించినా, ఆ లోటుని చాలావరకు ఎమోషనల్ సీన్స్ తీర్చాయి. కథ మొదట్లో వాస్తవ సంఘటనల వంటి వాటి పైనే డ్రామాను అల్లుకున్నా, ప్రీ ఇంటర్వల్ & ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి సినిమాటిక్ డ్రామానే నమ్ముకున్నారా అనిపించింది. అయితే, ఆ లోటుని దేశంలో బాగా ఉన్నవాళ్లు/ అసలేమీ లేనివాళ్లు / ఉండీ లేకా ఉన్నవాళ్ళ నడుమ జరిగే సంఘర్షణల దృశ్యాలు చాలా వరకు పూడ్చాయి. దీపక్ పాత్ర సాయంతోనే క్లైమాక్స్ ని అల్లుకుని ఉంటే బాగుండేది అనిపించింది చివరిలో.
- థియేటర్ నుండి బయటకు వస్తున్నపుడు శేఖర్ కమ్ముల కనిపిస్తే ఒక విషయం అడగాలనిపించింది – ఇప్పుడు రాజకీయాలు ఇంకా ‘నేను నీకీ పని చేసి పెడితే నాకేమిస్తావు’ అన్న దశను దాటిపోయాయి కదా! అసలు మొత్తం కలిపి అంతా ఒక పెద్ద కార్పొరేట్ అనిపించడం లేదా ? ఆ పెద్ద కార్పొరేట్ లో వ్యాపారాలు, మీడియా, ఆటలు, వినోదం వంటి విభాగాలతో పాటు రాజకీయాలు కూడా ఒక విభాగంగా మారిపోయింది అనిపించడం లేదా ?



