సారీ కుబేరా.. సో సారీ శేఖర్ కమ్ముల!

Vamsy Krishna… ✍🏼

గమ్యం ఉదాత్తంగా ఉంటే చాలదు. గమనం కూడా ఉదాత్తంగా ఉండాలి అంటారు గాంధీజీ. గమనం ఎంత ఉదాత్తంగా వున్నా గమ్యం ఉదాత్తంగా లేకపోతే గమనానికి కూడా అర్ధం లేకుండా పోతుంది. తెలుగు లో సెన్సిటివ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల పదకొండవ సినిమా కుబేర. ఫిదా, లవ్ స్టోరీ, విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న శేఖర్ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న ధనుష్ , సీనియర్ నాగార్జున, తాజా సంచలనం రష్మికా లాంటి భారీ తారాగణం తో తెరకెక్కిన కుబేర కి సోషల్ మీడియా యావత్తు యూనానిమస్ గా పాజిటివ్ రివ్యూలు ఇస్తే, అన్ని రివ్యూలు ధనుష్, నాగార్జున నటన ని ఆకాశానికి ఎత్తేసాయి

నిజమే. కెరీర్ పట్ల, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనే విషయం పట్ల సందిగ్ధం లో పడి నా సామి రంగా లాంటి అర్ధం పర్ధం లేని సినిమాలతో తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్న నాగార్జున కి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రను నాగార్జున తనకున్న అనుభవం తో అలవోకగా రక్తి కట్టించాడు. తన 51 వ సినిమా గా కుబేర ను ఎంచుకున్న ధనుష్ ఆ స్థాయి నటుడు పోషించడానికి తటపటాయించే బిచ్చగాడు పాత్రను పోషించి తన నిబద్ధతను చాటుకున్నాడు. రష్మిక కూడా పక్కింటి అమ్మాయి తరహా పాత్ర పోషించింది.

అంతా బావుంది కానీ శేఖర్ కమ్ముల తనకు అలవాటు లేని భారీ పాన్ ఇండియా సినిమాను తలకు ఎత్తుకుని ఆ భారం మోయలేక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చతికిలపడిపోయాడు. మొదటి సగం అంతా జిమ్ సర్ఫ్, ధనుష్ లను రెండు ప్రపంచాలకు ప్రతీకలుగా తీసుకుని ఆ రెండు ప్రపంచాల లోతును అత్యద్భుతంగా చిత్రించిన శేఖర్ రెండవ సగం లో ఆ రెండు ప్రపంచాల విశ్వ రూపం కింద తనను తాను సమన్వయం చేసుకోలేక పడిపోయాడు.

నిజాయితీ పరుడైన సి బి ఐ అధికారిగా ముక్కుసూటిగా వ్యవహరించి జైలు పాలయి ఏడేళ్ల శిక్ష పడిన దీపక్(నాగార్జున) దేశం లోనే అత్యంత ప్రభావశీలి అయిన నీరజ్ (జిమ్ సర్ఫ్) పన్నిన వ్యూహం లోకి ఉద్దేశ్య పూర్వకంగా వెళ్లి, ఆ తరువాత ఆ వ్యూహం లో ఇమడలేక తన స్వభావ సిద్దమైన నిజాయితీని వదులుకోలేక, సింహం మీద స్వారీ చేయలేక చివరికి తనను తాను త్యాగం చేసుకుంటాడు. నీరజ్ వ్యూహం లో చిక్కుకున్న నలుగురు బిచ్చగాళ్ళలో ఒకడైన దేవా (ధనుష్) నీరజ్ వ్యూహాన్ని మధ్యలోనే పసిగట్టే స్క్రీన్ చివరంతా నిలిచి ఏ ముగింపు కూ ప్రతీక కాలేక తన స్వభావానికి అనుగుణంగా ఒక్కడిగా మిగిలిపోతాడు .

ఇందులో ఎవరినైనా నిందించాలి అంటే శేఖర్ కమ్ములనే నిందించాలి. ఎందుకంటే తాను కథ విషయం లో చాలా స్టబర్న్ అనీ ఎవరి మాటా వినడని దాదాపు సినిమా క్రూ అంతా ఓపెన్ గానే చెప్పింది. నాగార్జున కానీ, ధనుష్ కానీ ఎక్కడా కలగజేసుకోలేదు. కనుక ఏదైనా శేఖర్ నే అనాలి. నాగార్జున తన క్యారెక్టర్ లో మూడు షేడ్స్ ఉన్నాయని చెప్పాడు. నిజమే వున్నాయి కానీ ఆ మూడు షేడ్స్ పాత్రను ఎలివేట్ చేయకుండా శేఖర్ జాగ్రత్త పడ్డాడు.

మొదట కాస్త విలనిష్ గా కన్పించి తరువాత తన సహజమైన రూపం లోకి వచ్చినప్పుడు కార్పొరేట్ ప్రపంచం కుట్రను బద్దలుకొడతాడు అని ప్రేక్షకుడు భ్రమ పడతాడు కానీ ఆ పాత్రను అర్ధాంతరంగా చంపేసి శేఖర్ ప్రేక్షకుడి ఆశల మీద నీళ్లు చల్లేసాడు. కుట్రల రహస్యాల ఆధారాలు దేవా కి ఇచ్చి ఆ భారం దేవా మీద పడేస్తాడు. నిజానికి దేవాకి అంత శక్తి లేదని సృష్టికర్త శేఖర్ కి తెలియాలి కదా. నిజానికి ఏ కథను అయినా రచయిత రాసుకుంటున్నప్పుడు ఆ పాత్రలను వాటి మానాన వాటిని రచయిత నడవనివ్వాలి. ఎక్కడైనా దారి తప్పుతున్నాయి అనుకుంటే దారిలో పెట్టొచ్చు. కానీ శేఖర్ కమ్ముల వాటిని నియంత్రించే పని పెట్టుకున్నాడు. ఒక్క రోజు బిచ్చగాడిగా బతకమని దేవా నీరజ్ కి సవాల్ విసరడం లాంటి అర్ధం లేని టాస్క్ ల లోకి కథను తీసుకెళ్లడం చాలా హాస్యాస్పదంగా వుంది. నాగార్జున మరణించి చేసిన త్యాగానికి విలువ లేదు. ధనుష్ విసిరిన సవాల్ కీ విలువ లేదు. చివరికి రోడ్డకొట్టుడు తెలుగు సినిమా ముగింపు లాగా విలన్ చంపేసి మమ అనిపించేసాడు.

దేవా ట్రక్ లో తెచ్చి నీరజ్ ఇంటి ముందు డబ్బు డంప్ చేసినప్పుడు, ఇనస్పెక్టర్ మరణం అప్పుడూ కథను ఎలా నడిపించాలో తెలియక చేతులెత్తేశాడు. నిజానికి అంత డబ్బు వీధిలో పడేసినప్పుడు ఏ మీడియా, ఏ పోలీస్, ఏ హడావిడీ ఉండదు. ఇనస్పెక్టర్ ను చంపేసినా అంతే. రష్మిక పాత్ర అయితే మరీ దారుణం. పదే, పదే వెంటపడుతున్నాడు అని చెప్పేసి చదువుకున్న అమ్మాయి ఒక చదువురాని బిచ్చగాడి వెంట అలా ప్రయాణం చేస్తుందా? నేను బిచ్చగాడిని అంటే ఈ లోకం లో అందరూ అన్నీ అడుక్కుంటారు అని సమర్ధింపు ఒకటి

అనాథ శవాన్ని కుక్కల బండిలో తీసుకుని వెళుతున్నప్పుడు దేవా అడ్డుపడి ఆ మునిసిపల్ కార్మికులకు డబ్బు ఇచ్చి అతడిని కట్టెలతో దహనం చేయించినప్పుడు వచ్చిన పాట, ఆ తరువాత రామరాజ్ కాటన్ లుంగీ షర్ట్ వేసుకుని గుడి దగ్గరకు వెళ్లినప్పటి సన్నివేశానికి మధ్య లింక్ ఎక్కడో తెగి పోయింది. ఇలా ఒక లింక్ లేకుండా ఒక సన్నివేశం నుండి మరొక సన్నివేశం లోకి వెళ్లిపోవడం అనేది ఇంతకుముందు శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండేది కాదు. అలాంటి సన్నివేశాలు త్రివిక్రమ్ సినిమాలలో సర్వ సాధారణం.

అనాథ శవాలు అయినా సరే, వాటికీ గౌరవం ఇవ్వాలి అన్న శేఖర్ కమ్ముల భావన నాకు బాగా నచ్చింది. శవాన్ని కుక్కల బండిలో తీసుకుని వెళ్ళ వద్దు అని దేవా (ధనుష్) తల్లడిల్లుతున్నప్పుడు ఇటీవల ఆపరేషన్ కగార్ ఎన్ కౌంటర్ అయిన నంబాల కేశవరావు శవం కోసం ఛత్తీస్ ఘడ్ లో బంధువులు తల్లడిల్లడం గుర్తొచ్చి బాధ కలిగింది.

అయినా అంత పెద్ద బిజినెస్ మాన్ కి పదివేల కోట్లు ఒక లెక్కా?నాలుగు షెల్ కంపెనీలు పెట్టడం ఒక పెద్ద పనా? ఏంటో శేఖర్. నాజర్ లాంటి నటుడు కి ఒక్క సన్నివేశమా? శేఖర్ కమ్ముల సినిమా అని నాజర్ ఒప్పుకున్నా మరీ ఒక్క సన్నివేశం

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. రష్మిక ప్రియుడి ప్రేమ లో ఓడిపోయిన అమ్మాయి గా బాగా చేసింది. నీ చావు నువ్వు చావు. నా చావు నేను చస్తా అని చేతులు తిప్పడాన్ని చైతన్య పింగళి చేసి మరీ చూపించిందేమో. శేఖర్ కమ్ముల సినిమాలలో వున్నట్టుగా ఈ సినిమాలో పాటలైతే లేవు.నంద కిషోర్ పాట గురించి సోషల్ మీడియా లో హోరెత్తి పోతున్నది కానీ నాకైతే అంతగా నచ్చలేదు. బహుశా నాకు టేస్ట్ లేకపోవడం వల్లనేమో. సరస్వతీ దేవి తలెత్తుకునే సినిమా తీశాను. ఈ సారి లక్ష్మీ కటాక్షం కూడా కావాలి అన్నాడు శేఖర్ కమ్ముల. ఆ కటాక్షానికేమీ ఢోకా లేదు. మొదటి రోజు 65 కోట్లు వసూలు చేసింది కదా ! ఇంకో యాభయ్ అయితే బ్రేక్ ఈవెన్ . ఆ తరువాత అంతా లాభమే కదా!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles