అది 2002, లండన్ లార్డ్స్ లో నాట్ వెస్ట్ సీరిస్..
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్! మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ పెట్టిన టార్గెట్.. 325 భారీ లక్ష్యం!!
ఆ రోజుల్లో ఓ టీమ్ 300 రీచవ్వడమే గగనగండం!
బ్యాటింగ్ కు ముందే భారత్ గెలుపుపై సగటు ప్రేక్షకుడు, క్రికెట్ అభిమాని ఆశలు విడుచుకున్నారు!
ఇంకోవైపు, అది కరెంట్ కటింగ్స్ అధికంగా ఉన్న కాలం!
మా ఊరు ధర్మపురి అందుకు కేరాఫ్! పెద్దగా టీవీలు కూడా అప్పటికి అందరిళ్లల్లో లేవు. ఎక్కడో తెలిసినోళ్ల ఇళ్లల్లో వెళ్లి చూసే కాలం!
ఇక టీవీ వచ్చిందని మురిసిపోయిన మాకు… మళ్లీ రేడియోనే దిక్కైంది. తానెంత విలువైందో ఆ సాయంసంధ్య వేళలో ఆ ట్రాన్సిస్టర్ మాకు చెప్పింది!
ఇవాళ హాట్ స్టార్ లోనో, జియోలోనో చెబుతున్నట్టు తెలుగు కామెంట్రీ కాలం కాదాయె!
హిందీ, ఇంగ్లీష్ ల్లో కామెంట్రీ వినాల్సిందే! మనకేమో ఆ యాసెంట్ అంత స్పీడుగా అర్థం చేసుకునే స్థాయి లేకపాయె!
మా దోస్త్ వంశీ వాళ్ల నాన్న విశ్వనాథం సారే అప్పుడు మాకు దిక్కు. చిమ్మచీకటి… కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మామూలు రోజైతే కరెంట్ కోసం నిరీక్షణ ఉండేది. ఆరోజూ ఎదురుచూస్తున్నా.. మ్యాచ్ మీదున్న చిత్తంతో కరెంట్ పైనుంచి దృష్టి ఎలాగైనా మ్యాచ్ ఫాలో చేయాలన్న తలంపుతోనే సాగింది.
ఇంకేం మా విశ్శన్న సార్ పక్కన అరుగుమీద కూర్చుంటే… ఆయన మాకు చెప్పడం… యువరాజ్, కైఫ్ రన్స్ కొడుతున్నకొద్దీ విశ్శన్న సార్ ఇంటికెదురుగా ఉన్న ద్యావళ్ల కిషోర్ (చిన్న వయస్సులోనే దివికేగిన) సంతోషపడటం… ఆ మ్యాచుతో తానెందుకు భారత క్రికెట్ లో యువరాజో.. యువరాజ్ తెలియజెప్పడం… మహ్మద్ కైఫ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ వెరసి… 325 రన్స్ ను భారత్ ఛేదించిన తీరు అమోఘం.

భారత క్రికెట్ జట్టు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన మ్యాచుల్లో లండన్ లార్డ్స్ మైదానపు నాట్ వెస్ట్ సీరిస్ ది ప్రత్యేక స్థానం.
భారత బౌలర్లను ఇంగ్లాండ్ కెప్టెన్ నాజిర్ హుస్సేన్, మార్కస్ ట్రెస్కోథిక్ ఉతికి ఆరేస్తుంటే… ఆ మ్యాచ్ ఇక అంతే సంగతులని ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ సమయంలోనే సగటు భారత వీరాభిమానులు చేతులెత్తేసిన విచారకర సందర్భమది.
కానీ, యువరాజ్, కైఫ్ మార్చేశారు. చరిత్రను తిరగారాశారు. అప్పటివరకూ భారత్ ఛేదించని అతి పెద్ద టార్గెట్ 325 రన్స్ ను ఛేదించి.. కొత్త చరిత్రను సృష్టించారు.
అయితే, ఆమ్యాచ్ కేవలం పరుగులు, వికెట్లు, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో మాత్రమే ముడిపడిందైతే కూడా ఇంతగా చెప్పుకోవాల్సిన పన్లేదు.. కానీ, అది భారత భావోద్వేగాలను ప్రపంచానికి తెలియజెప్పిన ఓ ఉద్విగ్న క్షణం.
ఆనాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ కు భావోద్వేగాన్ని నేర్పిన కెప్టెన్. విజయాలకు భారత్ ను కేరాఫ్ చేసిన కెప్టెన్. ఆస్ట్రేలియాపై అప్పటివరకూ గెలవని టెస్ట్ సీరీస్ ను గెల్చిన కెప్టెన్. పాక్ పై టెస్ట్ సీరీస్ గెలుపు.. ఐసీసీ క్రికెట్ ట్రోఫీలో ఒక కెప్టెన్ స్థానంలో ఇప్పటివరకూ తన రికార్డును ఇంకా ఎవ్వరూ చెరపలేని విధంగా ఆరు సెంచరీలు చేసిన కెప్టెన్.
అలాంటి గంగూలీ.. మ్యాచ్ విన్నింగ్ తర్వాత తన జెర్సీ విప్పి ఎగిరి గంతేసిన తీరు… మాకే సవాల్ విసురుతారా.. భారత్ అంటే ఇదీ అన్నట్టుగా ఆ బెంగాల్ టైగర్ భావోద్వేగాలను ప్రదర్శించిన తీరు ప్రపంచ క్రికెట్ అంతా చూసి నివ్వెరపోయింది. అదే సమయంలో ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, గంగూలీ మినహా.. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోతే… ఆ తర్వాత వచ్చిన యువరాజ్, కైఫ్ చూపిన స్పిరిట్ ప్రపంచం మొత్తం అప్లాజ్ అందుకునే విధంగా చేసింది.
ఆరోజు ఊళ్లో కరెంట్ లేకున్నా… భారత విజయంతో మా కళ్లల్లోని కాంతులతో ఊళ్లో వెలుగు నిండింది. సుమారు పాతిక సంవత్సరాల వయస్సులో క్రికెట్ పైనున్న పిచ్చితో.. రసవత్తరంగా సాగుతున్న మ్యాచులో విజయం ఇండియానే వరించాలన్న తాపత్రయంతో…. మా స్వర్గీయ విశ్శన్న సార్ చేతిలో ఉన్న ఆ ట్రాన్సిస్టర్ కథ ఈరోజు మళ్లీ గుర్తుకొచ్చింది. సందర్భమేంటంటే… భారత క్రికెట్ కు వేగాన్ని నేర్పిన నేటి గంగూలీ పుట్టినరోజుకు ఐదురోజుల తర్వాత.. అంటే జూలై 13న అందిన విజయపతాక కానుక కనుక!
హ్యాపీ బర్త్ డే దాదా!!



