90ల్లో కుర్రకారును వెర్రెక్కించి, 30 ఏళ్ల మైలురాయిని చేరుకున్న దిల్ వాలే దుల్హనియా లేజాయింగేలో హీరో షారుక్ ఖాన్ వేసుకున్న జాకెట్ గుర్తుందా..? ఆ హార్లీ డేవిడ్సన్ జాకెట్ కొనుగోలు వెనుక ఓ పెద్ద కథే జరిగింది. దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిసి ఏకంగా యశ్ చోప్రాకే అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఆ జాకెట్ వల్ల ఏర్పడింది.

30 ఏళ్ల క్రితం తీసిన సినిమా అయినా ఇప్పటికీ డీడీఎల్జే చూట్టమంటే ఏదో ఓ తెలియని అనుభూతి. అలా సినీ అభిమానుల జ్ఞాపకాల్లో చెరగని ముద్ర వేసిన సినిమా అది. అందులో షారుక్ వేసిన హార్లీ డేవిడ్సన్ జాకెట్ ఐకాన్ గా మారి.. నేటికీ కుర్రకారు ఫ్యాషన్ ట్రెండ్స్ లో ఒకటిగా ఇష్టపడుతుంటారు.
ఆ చిత్రానికి దర్శకుడు యశ్ చోప్రా కుమారుడైన ఆదిత్య చోప్రా అయితే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేటి బాలీవుడ్ సూపర్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన కరణ్ జోహార్ పనిచేశారు. మాన్యావర్ అనే యూట్యూబ్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఐకానిక్ జాకెట్ కొనుగోలు వెనుక రసహ్యాన్ని పంచుకున్నాడు కరణ్ జోహార్.
ఆదిత్యాచోప్రా, తాను, మరో సహాయ దర్శకుడిగా ఉన్న యశ్ చోప్రా మరో కుమారుడైన ఉదయ్ చోప్రా ముగ్గురూ కలిసి షారుక్ సినిమాలో ధరించిన ఆ ఐకానికి హార్లీ డేవిడ్సన్ జాకెట్ కొనుగోలు చేశారు. కానీ, అది చాలా ఖరీదైన జాకెట్. ఆ ధర తెలిస్తే యశ్ చోప్రా సీరియస్ అవుతారు. కాబట్టి, కొన్న ధరను చెప్పకుండా ముగ్గురూ కలిసి ఓ చిన్న అబద్ధమాడినట్టు చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.
1994లో దాని ధర 300 పౌండ్లు. ఇప్పుడైతే.. ఇండియన్ కరెన్సీలో సుమారు 36 వేల రూపాయలు. కానీ, యశ్ చోప్రాకు మాత్రం దాని ధర కేవలం 50 పౌండ్లు మాత్రమేనని చెప్పాలని కూడబలుక్కున్నారు ఆది, కరణ్, ఉదయ్. అంత ధరైతే యశ్ చోప్రా ఒప్పుకోరు. కానీ, సినిమా మొత్తం షారుక్ ఆ జాకెట్ పై కనిపించాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆ జాకెట్ అయితేనే బాగుంటుందనుకున్నారట. అంతేకాదు, ఆ జాకెట్ తో పాటు, అక్కడే కొనుగోలు చేసిన షారుక్ ధరించిన రెడ్ కలర్ చెక్స్ షర్ట్, జీన్స్ అన్నీ పోతాయేమోనన్న భయంతో తమ పక్కనే పెట్టుకుని నిద్రపోయేవాళ్లట. ఎందుకంటే, ఏ ఒక్క వస్తువు పోయినా మీరు ఇంటికెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మొత్తం ప్రొడక్షన్ సిబ్బందిని అప్పటికే ఆదిత్యా చోప్రా హెచ్చరించాడట.
డీడీఎల్జే 30 ఏళ్ల వేడుకల సందర్భంగా లండన్ లోని ప్రసిద్ధ లీసెస్టర్ స్క్వేర్ లో రాజ్, సిమ్రన్ క్యారెక్టర్ల కాంస్య విగ్రహాలను చిత్ర బృందం ఆవిష్కరించింది. షారుక్, కాజోల్ కూడా ఆ కార్యక్రమం కోసం లండన్ వెళ్లారు. డీడీఎల్జే భారతీయులకు దాల్ ఛావల్ లాంటిదని షారుక్ గతంలో అన్నదాన్ని గుర్తు చేయగా కచ్చితంగా దాల్ ఛావలేనంటూ మరోసారీ చెప్పుకొచ్చారు షారుక్. మొత్తంగా షారుక్ వేసుకున్న ఒక వింటర్ కోట్ వెనుక ఓ చిన్న ఆసక్తికర కథ ఇది



