రీల్ హీరోస్ కు ఇన్స్పిరేషన్.. ఆ రియల్ హీరో!

చదివి తీరాల్సిన ఓ భారతీయ గూఢచారి కథ… దురంధర్ సినిమాతో ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి!

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న దురంధర్ తో.. మళ్లీ గూఢచారి కథల వైపు దర్శకుల మనసు మళ్లినట్టు కనిపిస్తోంది. కరాచీ చీకటి లోకాల్లో సంచరించే ఏజెంట్‌గా దర్శనమిచ్చాడు రణవీర్ సింగ్. ఆ పాత్ర చూశాక. భారత్ కోసం తన ప్రాణాల్నే త్యాగం చేసిన రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్ పేరు ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వస్తోంది. భారత్ అండర్ కవర్ ఆపరేషన్స్ లో రవీంద్ర కౌశిక్ ఓ ధృవతార. దురంధర్ వంటి ఎన్నో సినిమాలకు ఆయనో ఇన్స్పిరేషన్. మరి ఆ రవీంద్ర కౌశిక్ గురించి మళ్లీ ఓసారి చెప్పుకుందాం రండి.

రవీంద్ర రా ఏజెంట్ గా ఎలా మారాడు..?

21 ఏళ్ల వయస్సులో లక్నోలోని ఓ జాతీయ థియేటర్ ఫెస్టివల్ లో అతనిచ్చిన మిమిక్రీ ప్రదర్శన.. రవీంద్రను రా ఏజెంట్ ను చేసింది. దాన్ని ఎదుగుదల అనేకంటే… దేశ ప్రజలను కాపాడే సైనికులకు రక్షణగా అతడు ఛాలెంజింగ్ గా స్వీకరించిన ఓ మహత్తర బాధ్యత. ఆ బాధ్యతను అంతే సమర్థవంతంగా 16 ఏళ్ల పాటు నిర్వర్తించిన రవీంద్ర కౌశిక్ ఒక చిన్న తప్పుతో దొరికిపోయాడు. దేశం కాని దేశంలో, అదీ భారత్ అనగానే కసికసిగా కదిలే దాయాది శత్రు దేశంలో ఆ త్యాగమూర్తి రహస్యం బహిరంగమైపోయింది. జైలు మార్షల్ విధించి, మరణి శిక్ష విధించిన రవీంద్ర కౌశిక్ ది వీరమరణం.

గూఢచారుల బతుకు దైవాధీనం!

ఏ దేశమైనా గూఢచారుల్ని వివిధ దేశాల్లో పనిచేయడానికి పంపిస్తాయే తప్ప.. వారి ప్రాణాలు దైవాధీనాలు. కర్తవ్యనిర్వహణలో ఆ బాణం మధ్యలోనే విరిగిపడినా, పట్టుబడినా.. అంతర్జాతీయ వేదిక మీద మావాడే అని అంగీకరించలేని అనివార్యత తప్పదు.

బ్లాక్ టైగర్!

బ్లాక్ టైగర్… ఇదీ రవీంద్ర కౌశిక్ కు ఇందిరాగాంధీ పెట్టిన పేరు. రా ఉత్తమ ఏజెంట్లలో ఒకడిగా భారత్ కు ఆయన అందించిన సేవలకుగాను.. ఇందిర వంటి ఓ సాహస ప్రధాని నుంచి ఆయనకు దక్కిన గుర్తింపు. విషాదమేంటంటే, ఆయన్ను రా ఏజెంట్ గా పాక్ కు పంపి, ఆయన సేవలను పొందిన భారత ప్రభుత్వం మాత్రం ఆ తర్వాత ఆయన గురించి అంతగా పట్టించుకోలేదన్నది ఆ కుటుంబీకులు, స్వయానా జైలు నుంచి రవీంద్ర కౌశిక్ రాసిన లేఖల్లోని సారాంశం. క్యా భారత్ జైసే బడే దేశ్ కే లియే ఖుర్బానీ దేనే వాలోన్ కో యహీ మిల్తా హై? అంటూ.. జైలులో అనారోగ్యం పాలైన తన చివరాఖరి రోజుల్లో రవీంద్ర కౌశిక్ వాళ్ల కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో అత్యంత ఎక్కువ కాలం 16 ఏళ్లు గడిపిన పాకిస్థాన్ పంజాబ్ లోని సెంట్రల్ మియాన్ వలీ జైల్ నుంచి రవీంద్ర నుంచి కన్నీరు పెట్టించే ఈ లేఖ ఆయన కుటుంబ సభ్యులకు అందింది.

RAWతో అనుబంధం ఎలా ఏర్పడింది..?

రవీంద్ర కేవలం తన 23 ఏళ్ల వయస్సులోనే.. భారతదేశ విదేశీ గూఢచార సంస్థైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)తో అనుబంధాన్ని ప్రారంభించాడు. మెల్లిగా పాకిస్థాన్ సైన్యంలో చేరి.. మేజర్‌ స్థాయికి ఎదిగారు. సరిహద్దులకటువైపు నుంచి రవీంద్ర అందించిన సున్నితమైన సమాచారం.. నాడు దేశానికెంతో ఉపయోగపడింది. 1971 ఇండో-పాక్ యుద్ధం తరువాత అతను దేశానికి చేసిన విలువైన సేవలకు గుర్తింపుగానే రవీంద్రను ప్రధాని ఇందిరా గాంధీ బ్లాక్ టైగర్ అని సంబోధించారు.

భారతదేశ గొప్ప రహస్య గూఢచారిగా ఎంత గుర్తింపైతే పొందాడో… అంతకంటే అత్యంత విషాదకరంగా రవీంద్ర కౌశిక్ జీవిత ముగింపు రావడం మరింత విషాదం.

రవీంద్ర నేపథ్యం!

1952, ఏప్రిల్ 11న భారత్-పాక్ సరిహద్దులో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో పుట్టిన రవీంద్ర… 1965 నుంచి 1971 వరకూ జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో పెరిగాడు. ఎస్.డీ. బిహానీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో.. నాటకాలు, మిమిక్రీ వంటి కళల్లో రవీంద్ర చురుకైన ఆర్టిస్ట్. 21 ఏళ్ల వయస్సులో లక్నోలో ఆయన ఇచ్చిన మిమిక్రీ ప్రదర్శనే అక్కడికొచ్చిన ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ దృష్టినాకర్షించింది. చైనాకు సమాచారమివ్వడానికి నిరాకరించిన ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను ఇమిటేట్ చేస్తూ.. రవీంద్ర ఆ మిమిక్రీ ప్రదర్శన చేశాడు. 1973లో బీకామ్‌ డిగ్రీ పూర్తైననంతరం.. రవీంద్ర ఉద్యోగం కోసం ఢిల్లీ బాట పట్టాడు.

రెెండేళ్లపాటు కఠిన శిక్షణ!

అప్పటికే ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా RAWకు అతణి గురించి తెలవడంతో.. వారతణ్ని రా ఏజెంట్ గా పనిచేయడానికి మాట్లాడి ఒప్పించారు. అలా రెండేళ్లు కఠినమైన శిక్షణ పొందాడు. పూర్తిగా ముస్లిం సంప్రదాయాలు ఒంటబట్టించుకున్నాడు. అప్పటివరకూ ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇమిటేషన్ మాత్రమే చేసే రవీంద్ర… ఏకంగా ఓ పాకిస్థానీగానే మారిపోయేంతగా శిక్షణ పొందాడు. పంజాబీలో అనర్గళంగా మాట్లాడే రవీంద్ర.. ఉర్దూ కూడా నేర్చుకున్నాడు. ఇస్లామిక్ గ్రంథాలు, వారి ఆచార, వ్యవహారాలనూ ఔపోసన పట్టాడు. రెసిడెంట్ ఏజెంట్ గా ఎలా నిగూఢంగా బతకాలో నేర్చుకున్నాడు. ఇస్లామిక్ మత సిద్ధాంతాల ప్రకారం రవీంద్ర సున్తీ చేయించుకున్నాడు.1975 నాటికి రవీంద్ర భారతీయ రికార్డులన్నీ మాయమయ్యాయి. ఇస్లామాబాద్ నివాసిగా నబీ అహ్మద్ షకీర్ అనే మారుపేరుతో.. రవీంద్ర పూర్తిగా రూపాంతరం చెందాడు. అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. RAW అధికారులు అనుకున్నదనుకున్నట్టుగా అంతా చకచకా జరిగిపోయింది. కరాచీ యూనివర్సిటీ నుంచే రవీంద్ర.. ఉరఫ్ నబీ అహ్మద్ షాకీర్ గా తన లా ప్రాక్టీస్ పూర్తి చేశాడు. మెల్లిగా పాకిస్థాన్ ఆర్మీలో మొదట మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో.. కమీషన్డ్ ఆఫీసర్ పోస్టులో చేరాడు. ఆ తర్వాత మేజర్ స్థాయికి ఎదిగాడు.

పాక్ లో పైపెకెదుగుతూనే.. పుట్టిన గడ్డకు సేవ!

ఓవైపు పాకిస్థాన్‌లో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంటూనే.. మరోవైపు, మాతృదేశానికి 1979-1983 మధ్యకాలంలో భారత రక్షణ అధికారులకు రహస్య సమాచారాన్ని అందించాడు. అలాంటి గూఢచర్యం చేయడమంటే కత్తిమీద సామే! అప్పటికే దాయాది దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ వైఖరి నేపథ్యంలో.. దేశానికి కీలకమైన సమాచారంతో పలు ప్రయోజాలను చేకూర్చాడు రవీంద్ర. అక్కడే ఆర్మీ యూనిట్‌లోని ఓ టైలర్ కుమార్తె అయిన అమానత్ అనే స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రవీంద్రకు ఒక కొడుకు ఉన్నట్టు కొందరు చెబితే.. కొన్ని నివేదికలు మాత్రం కూతురున్నట్టుగా వెల్లడించాయి. కానీ 1983లో రవీంద్ర ఎనిమిదేళ్ల పాటు రహస్య ఏజెంట్ గా ఉన్న విషయం తేటతెల్లమైపోయింది. రవీంద్రకు సహకారమందించేందుకు RAW అధికారులు పంపిన మరో రహస్య ఏజెంటైన ఇన్యత్ మసిహా పాక్ దళాలకు పట్టుబడ్డాడు. పాక్ దళాల విచారణలో ఇన్యత్ మసిహా.. రవీంద్ర రా ఏజెంటని వెల్లడించాడు. దాంతో రవీంద్ర కౌశిక్ రహస్య గూఢచర్యం బట్టబయలైపోయింది.

రవీంద్ర ఎలా పట్టుబడ్డాడు..?

అసలే భారత్ అంటేనే రుసరుసలాడే పాక్ చేతికి ఓ రహస్య గూఢచారి చిక్కితే ఎలా ఉంటుంది..? పాక్ సైనిక అధికారులు పెట్టే చిత్రహింసలను రెండేళ్లపాటు భరించాడు. రవీంద్రను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి.. మసీహతో కబురు పంపి, ఓ పార్క్ లో మసీహతో కలిసే క్రమంలో రవీంద్రను పట్టుకున్నారు పాక్ అధికారులు. 1985లో పాకిస్తాన్ సుప్రీం కోర్ట్.. రవీంద్రకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాతది జీవిత ఖైదుగా మార్చేశారు. అతను సియాల్‌కోట్, కోట్ లఖ్‌పత్, మియాన్‌వాలితో సహా.. పలు జైళ్లలో మగ్గాడు. అయినప్పటికీ ఓ రహస్య ఏజెంట్ గా పనిచేసిన అనుభవంతో… రవీంద్ర తన కుటుంబానికి కనీసం అరడజను లేఖలను రహస్యంగా రాశాడు.

చివరి రోజుల్లో ఆవేదననుభవించిన రవీంద్ర!

2001లో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడేందుకు మూడు రోజుల ముందు.. తాను ఓ అమెరికన్ అయ్యుంటే కేవలం మూడురోజుల్లో బయటపడేవాణ్నంటూ రాసిన లేఖ అక్కడ తాను పడ్డ బాధలకు ప్రతీక. తను చూపిన కృతజ్ఞతకు.. తన దేశం నుంచి ఎదురైన నిస్సహాయతపై తన చివరి రోజుల్లో ఆవేదనకు గురయ్యాడు రవీంద్ర. అదో త్యాగంగా మిగిలిపోవడమే తప్ప.. ఏ దేశమైనా తమ గూఢచర్యాన్ని ఒప్పుకోదు. అంతర్జాతీయ వేదికలపైనా వచ్చే చిక్కులూ, తలనొప్పులు.. అలా ఎన్నో గూఢచారుల విషయంలో చూసీచూనట్టుగానే ఉండటానికి ప్రధాన కారణం.

రవీంద్ర మరణంతో విషాదం!

చివరకు ముల్తాన్ జైలులో ఖననం చేయబడ్డ రవీంద్ర మరణవార్త వినగానే.. రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారైన ఆయని తండ్రి కూడా గుండె పగిలి చనిపోయిన ఘటన ఆ కుటుంబానికి తీరని దుఖాన్ని మిగిల్చింది. అప్పటికే రవీంద్ర తల్లి అమలాదేవితో పాటు, సోదరుడు రాజేశ్వరనాథ్.. రవీంద్ర విడుదలకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాసినా.. ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. దాంతో వారాశించిన స్పందన లేకపోవడం ఆ కుటుంబాన్ని నిరాశకు గురిచేసింది. నిశ్ఛేష్ఠులను చేసింది.

రవీంద్ర రా ఏజెంట్ అనే విషయం బహిర్గతం కాకుండా ఉంటే.. పాకిస్తాన్ ప్రభుత్వంలో సీనియర్ ఆర్మీ అధికారిగా ఉండేవాడని.. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ కి రవీంద్ర తల్లి అమలాదేవి రాసిన లేఖలో పేర్కొంది. తన రహస్య గూఢచార సేవలతో దేశంలో సుమారు 20 వేల మంది సైనికులను కాపాడిన ఓ త్యాగమూర్తి రవీంద్ర కౌశిక్. సల్మాన్ నటించిన ఏక్ థా టైగర్, సీతారామం, ప్రస్తుతం వచ్చిన దురంధర్ వంటి ఎన్నో రీల్ స్టోరీస్ కు… రవీంద్ర కౌశిక్ రియల్ స్టోరీయే ఇన్స్పిరేషన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles