ఒక్క మోబైల్ క్లిక్ తో ప్రపంచాన్నే చుట్టేసే నాగరికత మన సొంతం. కానీ, స్మార్ట్ మోబైల్ ఎలా పని చేస్తుందో కూడా తెలియని అనాగరికత ఆ గిరిజన గ్రామాల వెనుకబాటుతనం. అలాంటి అనాగరిక స్థాయి నుంచి ఇప్పుడు అదే స్మార్ట్ మోబైల్ తో డిజిటల్ విప్లవాన్ని ఉపయోగించుకుని తమ జీవితాలను, గిరిజన గూడాలనే సుసంపన్నం చేసుకుంటున్న ఆదివాసీల కథ ఇది.
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కర దర్శనం అని మనం ఉదయాన్నే ఆ ముగ్గురమ్మలైన లక్ష్మీ సరస్వతీ గౌరీల అనుగ్రహముండాలని చేయికి మొక్కుకుని మంచంలోంచి లేవడం చిన్నప్పుడు పెద్దలు నేర్పించిన ఓ శ్లోకం. అయితే, ఇప్పటి లోకానికి ఆ శ్లోకం తెలుసో, లేదోగానీ… లేవగానే మొట్టమొదట ప్రభాతే మోబైల్ దర్శనమన్నట్టుగా తయారైంది పరిస్థితి. సోషల్ మీడియా మాయలో పడి ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ప్రభావితమవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఫింగర్ టిప్స్ మీద మనకన్నీ సంపాదించి పెడుతున్న మోబైల్ తో మానవ జీవితమిప్పుడు విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. అయితే, ఏ సాంకేతికతైనా దాని వాడకాన్ని బట్టి మనకు మంచి చేస్తుందా.. చెడు చేస్తుందా అన్నది ఆయా వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అలా మోబైల్ ను తమ తలరాతలు మార్చే టూల్ గా మార్చుకున్నారు ఆ గిరిజనులు.

అవునూ, ఇవాళ మోబైల్ చేతిలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఓ సామాజిక జర్నలిస్టే. కానీ, దాన్ని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం.. ఏ అంశాల పట్ల స్పందిస్తున్నాం.. ఏ విధంగా స్పందిస్తున్నామన్నదాన్ని బట్టి వాటికి ఆదరణ దక్కుతుంది. అలాంటి ఆదరణే ఇప్పుడు కొన్ని గిరిజన పల్లెల కథలను మార్చేస్తోంది.
మహారాష్ట్రలోని నందూర్ బార్ జిల్లాలో పురుడుపోసుకున్న ఆదివాసీ జనజాగృతి అనే సంస్థ గిరిజన సమాజాలను చైతన్యవంతం చేస్తోంది. మోబైల్ జర్నలిజంలో ఆయా గిరిజన గ్రామాల యువతకు తర్ఫీదునిస్తూ.. వారి స్థానిక మాతృభాషలో వారి ఊళ్లల్లోని సమస్యలను వీడియోల రూపంలో నమోదు చేస్తూ మెల్లిమెల్లిగా నిశ్శబ్ద విప్లవాన్నే తీసుకొచ్చింది. వారు రూపొందించిన వీడియోలు వైరల్ గా మారి ప్రభుత్వాలు దిగిరాక తప్పని పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఏకంగా వారిని వాళ్ల గిరిజన గూడాల వైపు కదిలిస్తున్నాయి.
ఆదివాసీ జనజాగృతి ఆవిర్భావం కథేంటి..?
2016లో నితేష్ భరద్వాజ్ అనే వ్యక్తి ఫెలోషిప్ కార్యక్రమంలో భాగంగా ధడ్ గావ్ అనే గ్రామానికి వెళ్లాడు. స్వతహాగా ఫిల్మ్ మేకర్ అయిన నితేష్.. అక్కడి స్థానిక హైస్కూల్ విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ ను ఎలా ఉపయోగించాలి.. వీడియోలను ఎలా షూట్ చేయాలి, ఎడిట్ చేయాలో నేర్పించాడు. అలా వారి మొదటి ప్రాజెక్ట్ జీరో-బడ్జెట్ తో ప్రారంభమైంది. ఆ ఆదివాసీ పిల్లలు షూట్ చేసిన ఓ వీడియో ఊహించని స్థాయిలో వైరలైంది. అదిగో అక్కడి నుంచే ఆదివాసీ జనజాగృతి సంస్థకు అంకురార్పణ జరిగింది.
ఇంతకీ ఏం వీడియో అది..?
బాల కార్మికులను హైలైట్ చేస్తూ రూపొందించిన వీడియోతో ధడ్ గావ్ పాలకులతో పాటు, పౌరసమాజం దృష్టిలో పడింది. దాంతో తమ సమస్యల్ని కథలుగా మల్చి వాటికి దృశ్యరూపం ఇస్తే ఏం జరుగుతుందో ఆ గ్రామప్రజలైన గిరిజనులకు రుచి దొరికింది.
నితేష్ స్థానికంగా ఉండే రాకేష్, అర్జున్ పవార్ లతో జతకట్టాడు. స్థానిక సమస్యలను ముందు గుర్తించారు. వాటిని చర్చించారు. వాటికి ఓ స్క్రిప్ట్ ప్రకారం దృశ్యరూపమిచ్చారు. పవారి, భిలోరి, అహిరాని వంటి స్థానిక గిరిజన భాషల్లో ఆ వీడియోలకు రూపకల్పన చేశారు.
ముఖ్యంగా బాలకార్మిక వ్యవస్థ, పారిశుధ్యం, పరిశుభ్రత, అవినీతి, పాలన, ప్రభుత్వ పథకాలను తెలుసుకోవడం వంటి అంశాల పట్ల ఫోకస్ చేశారు. అలాంటి అంశాలనే తమ షార్ట్ ఫిల్మ్స్ కు, డాక్యుమెంటరీస్ కు కథాంశాలుగా మల్చుకున్నారు. వాటిని గ్రామసభల్లో ప్రదర్శించారు. ఇంకేం అవి చర్చలకు దారితీశాయి. మరింత మంది ముందుకొచ్చారు. ఆ స్ఫూర్తి ధడ్ గావ్ తో పాటు.. చుట్టుపక్కల గిరిజన గ్రామాలకూ పాకింది.
పాలకుల దృష్టికి నోచుకోకుండా విసిరివేయబడ్డట్టున్న గిరిజన గూడాలు, ప్రభుత్వాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆయా గిరిజనులు రూపొందించే వీడియో స్టోరీస్ వారధిగా మారాయి. ఈ మొత్తం గిరిజన చైతన్యంలో జనజాగృతిది ప్రధాన పాత్ర.
ఆంఖేడీ అనే గిరిజన గూడెంలో మహిళలు ప్రతీరోజూ కిలోమీటర్ల మేర నడిచి నీటిని తీసుకువస్తుంటారు. ఆ సమస్యను హైలెట్ చేసే వీడియోతో అధికారగణం కదిలివచ్చింది. ఆ గిరిజన గూడంలో ఏకంగా ఆరు బోర్ వెల్ లను ఏర్పాటు చేసింది. ఇక మౌలిక సదుపాయాలపై చేసిన మరో వీడియోతో ఉమ్రానీ అనే మరో గిరిజన గూడానికి పెండింగ్ ప్రాజెక్ట్ గా నిల్చిపోయిన రోడ్డు పూర్తైంది. ఇక ధవ్ గాడ్ లో పదహారేళ్లుగా సాకారానికి నోచుకోని వంతెనను ఏకంగా 47 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విజయాలన్నీ అసలు ప్రభుత్వాలే పట్టించుకోని.. ప్రభుత్వాలివన్నీ చేస్తాయన్న కనీస అవగాహన లేని ఊళ్లకు సకల సౌకర్యాలనూ కల్పిస్తున్నాయి. మొత్తంగా ఆయా సమాజాలు, ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేస్తున్నాయి.
ఆదివాసీ జనజాగృతి అనే సంస్థ ఇప్పుడు కేవలం మోబైల్ వీడియోస్ షూట్ చేసి, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడమే కాదు.. అక్కడి ఆదివాసీల్లో నాయకత్వాన్ని పెంపొందిస్తోంది. రాజకీయ భాగస్వామ్యముంటేనే ఏదైనా సాధించగలమని.. అంబేద్కర్ చెప్పినట్టు అదే మాస్టర్ కీ అని తెలియజెప్పి.. పద్నాలగు మంది జనజాగృతి సభ్యులను స్థానిక ప్రభుత్వ పదవులకు ఎన్నికయ్యేలా కృషి చేసింది. వారి కాళ్లమీద వారే గట్టిగా నిలబడాలంటే ఇవన్నీ అవసరమనే ఒక సోయిని ఆయా గిరిజన గ్రామాల్లో తీసుకొస్తోంది జనజాగృతి. దాంతోపాటే, మహిళా సాధికారితనూ ప్రోత్సహిస్తూ వారినీ రాజకీయాల్లోకి తీసుకొస్తోంది. వారి సమస్యలనూ గ్రామసభల్లో వినిపించేలా.. వారి వాణిని గట్టిగా చాటేలా అవగాహన కల్పిస్తోంది.
గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపుతున్న జనజాగృతి!
జనజాగృతి ఇప్పుడు 170 గిరిజన గ్రామాల్లో పనిచేస్తోంది. 47 మందికి శిక్షణనిచ్చి వారి నాయకత్వంలో వారి రాతను వారే మార్చుకునే స్వయంసమృద్ధివైపు అడుగులేయిస్తోంది. ఇప్పుడు ఈ గిరిజన గ్రామాల వ్యవహారం కేవలం మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన విషయంగా మిగిలిపోలేదు. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ తో పాటు.. గూగుల్ న్యూస్ ఇన్షియేటివ్, యూట్యూబ్ ఇండియా వంటి సంస్థల నుంచి కూడా వీరికి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఈ విజయాలన్నీ వారిని వారు సమర్థవంతమైన, సుభిక్షమైన జీవితాలను అనుభవించేందుకు దోహదపడుతున్నాయి.
అయితే, తమ గిరిజన గ్రామాలన్నీ ఏవో ప్రపంచ ప్రసిద్ధి చెంది ఏదో సాధించాలన్న తపనేం లేదంటున్నారు అక్కడి జనజాగృతిలో కార్యకర్తలైనవారు. కేవలం తమ ధడ్ గావ్ తో పాటు.. చుట్టుపక్కల గిరిజన పల్లెలన్నీ సుసంపన్నమైతే చాలంటున్నారు.
మొత్తంగా మోబైల్ ఫోన్స్ లో వచ్చే మెస్సేజులను అనుసరించి లోన్ యాప్స్ కు బలవ్వడం, అప్పులబారిన పడటం, ఇతర వీడియో గేమ్స్ తోనూ ప్రాణాలు పోతున్న ఘటనలు చూస్తున్న కాలంలో.. అదే మోబైల్ ను సరిగ్గా సమర్థవంతంగా ఉపయోగించుకోగల్గితే ఏం జరుగుతుందో చెప్పే ఒక నమూనాగా ఇప్పుడు మహారాష్ట్రలోని ధడ్ గావ్ చుట్టుపక్కల పల్లెలు నిరూపిస్తున్నాయి.
చివరగా: మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కథలను బాహ్యప్రపంచానికి తెలియపరుస్తున్న రూరల్ ఇండియా ఛానల్ కు కూడా ఈ సందర్భంగా అభినందనలు.



