ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ ఈ రెండూ ఫైనల్స్ కు చేరుకుని ఈ ఐపీఎల్ కు కొత్త క్యూరియాసిటీని బ్యాగ్ చేశాయి. వారాడిన విధానంతో సగటు క్రికెట్ అభిమానులనూ ఆకట్టుకున్నాయి. ఫైనల్స్ లో ఎవరు విజేత అనేది పక్కనబెడితే.. నైతికంగా రెండూ విజయం సాధించేందుకు చేసిన పోరాటాన్ని కచ్చితంగా అభినందిచాల్సిందే.
అయితే, ఎవరి అభిమానులు వారికుంటారు. వారు ఫలానా టీంను అభిమానించేందుకు ఫలానా కారణమంటూ ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఈ క్రమంలో సహజంగానే ఆర్సీబీతో పాటు, పీబీకేఎస్ పైనా ఒత్తిడి కనిపించింది. కానీ, ఆ ఒత్తిడి విషయానికొస్తే ఆర్సీబీపైన, ముఖ్యంగా ఆ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లీపైన మరి కాస్త ఎక్కువనే చెప్పొచ్చు.

ఎందుకు మరి ఆర్సీబీపైనే ఒత్తిడెక్కువ..?
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు భారత కెప్టెన్లుగా చేసిన మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ తమ జట్లను పలుమార్లు ఐపీఎల్ లో గెలిపించి తమ సత్తా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చాటారు. భారత్ కు కెప్టెన్సీ వహించి వారి సమకాలీనుడై.. వ్యక్తిగత రికార్డ్సులోనూ ధోనీకీ, రోహిత్ కు ఏమాత్రం తగ్గకుండా.. కొన్ని విషయాల్లో మరింత ఎక్కువగానే కనిపించే కోహ్లీ మాత్రం తాను ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి ఇప్పటివరకూ విజయాన్నందించలేకపోయాడు. ఇప్పటికే తాను కూడా ఒక్కో ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న వేళ ఇక కోహ్లీకి కెప్టెన్ గా సాధ్యంకానీ విజయం కనీసం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు తరపునైనా అందితే అది తనకు ఒక మంచి గౌరవప్రదమైన నిష్క్రమణయ్యేందుకు అవకాశముంటుంది. ఈ క్రమంలో సగటు ఆర్సీబీ అభిమానుల కన్నా కూడా కోహ్లీ అభిమానుల నుంచే ఆర్సీబీ గెలవాలనే బలమైన కోరిక వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలో ఫైనల్స్ కు చేరిన ఆర్సీబీ గెలవాలని దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్ లో ఆర్సీబీ జెర్సీలు కనబడటం నుంచి మొదలుకుంటే.. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ఆలయాల్లో పూజల వరకూ.. ఏకంగా ఈమధ్య జరిగిన ప్రయాగ కుంభమేళాలో ఎవరో జ్యోతిష్కులు చెప్పారని ఆర్సీబీ జెర్సీని పదకొండుసార్లు నదిలో ముంచడమేదైతే ఉందో.. ఆర్సీబీ గెలుపు కోసం యావత్ భారతావనిలో.. పాక్ పై భారత్ గెలుపంత అనే అతిశయోక్తి వద్దుగానీ.. అదే స్థాయిలో కోరిక మాత్రం కనిపించింది. ఈ క్రమంలో ఆర్సీబీ గెలుపు ఆ టీమ్ కన్నా కూడా కోహ్లీకి దక్కే గౌరవంగా భారత్ లోని కోహ్లీ సగటు అభిమానులంతా ఆశిస్తున్న విషయం.
అయితే, ఇక్కడే మనం ఈ జెంటిల్మెన్ గేమ్ గా పిల్చుకుంటున్న క్రికెట్ లో.. ప్రస్తుత ఐపీఎల్ లో మరో విశేషాన్నీ చెప్పుకోవాలి. ఆర్సీబీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించే మ్యాచులో ఆ నాటకీయ విశేషం కనిపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరపున నాన్ స్ట్రైకర్ గా ఉన్న జితేష్ శర్మను..లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ బౌలర్ దిగ్వేష్ రతీ మాన్కడ్ అవుట్ చేశాడు. అంటే, నాన్ స్ట్రైకర్ గా ఉన్న బ్యాట్స్ మన్ ను హెచ్చరించాక.. బాల్ పడకముందే క్రీజ్ దాటి వెళ్తున్నప్పుడు స్టంప్ అవుట్ చేయడాన్ని మాన్కడ్ అవుట్ అంటారు. అలాంటి పద్ధతిలోనే ఆర్సీబీ బ్యాట్స్ మన్ జితేష్ శర్మను దిగ్వేష్ అవుట్ చేసినప్పుుడ ఆ ఔట్ ను లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ గా పంత్ ఉపసంహరించుకుని జితేష్ ను ఆడనిచ్చి జెంటిల్మన్ గేమ్ అన్న పేరుకు తానో జెంటిల్మన్ లా వ్యవహరించి సార్థకత చేకూర్చాడు. అంపైర్ కూడా నాటౌట్ ప్రకటించాడు. ఈ చర్య క్రికెట్ నిబంధనల ప్రకారం సరైందేకానీ.. జెంటిల్మన్ గేమ్ లో ఎంసీసీ నిబంధనల ప్రకారం నాన్ స్ట్రైకర్ ను మాంకడ్ ఔట్ చేయడం సరైందే. అయితే, అంపైర్ నిర్ణయం తీసుకునే ముందు బౌలింగ్ సైడ్ వాళ్లు అప్పీల్ చేయాలి. కానీ, కెప్టెన్ గా పంత్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. అంపైర్ కూడా జితేష్ ని నాటౌట్ గా ప్రకటించాడు. ఆ తర్వాత ఆర్సీబీ, ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ పైనే గెల్చి ఫైనల్స్ కు చేరుకోవడం కొసమెరుపు.
పంజాబ్ కింగ్స్ కూ మద్దతెందుకు లభిస్తోంది మరి..?
ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ విషయం తీసుకుంటే ఐపీఎల్ లో ఆ టీమ్ కూ ఇప్పుడు గెలుపు తప్పనిసరి. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభం నుంచీ ఆ టీమ్ కు సహ యజమానిగా ప్రీతీజింటా ఒక్క విజయమైనా దక్కకపోతుందానని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా జట్టుకు నేతృత్వం వహించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ సెటిల్డ్ గా ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే తాను కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడి ఆ జట్టుకు కప్ అందించిన ఘనత వహించగా.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కు కూడా ఒకవేళ కప్పు సాధించిపెట్టగల్గితే.. ఒక కెప్టెన్ రెండు టీమ్స్ కు కప్స్ అందించిన ఏకైక ఆటగాడిగా కూడా శ్రేయాస్ అయ్యర్ పేరు నిల్చిపోతుంది.
మరోవైపు తనను ఐరన్ లెగ్ గా అభివర్ణించేవారికి ఈ విజయంతో సమాధానం చెప్పాలన్న తపన కూడా ప్రీతీలో కనిపిస్తుండటం.. ఇంకోవైపు, శ్రేయాస్ పెర్ఫార్మెన్స్.. మొత్తంగా టీంగా పంజాబ్ కింగ్స్ కనబర్చిన ప్రదర్శన.. ఇవన్నీ కూడా ఆ జట్టు గెలవాలనే కోరికను కూడా అటు ఆర్సీబీలో కోహ్లీ కొరకు ఎలాగైతే బలంగా కనిపిస్తుందో.. అలాగే, పంజాబ్ వైపు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈనేపథ్యంలో మరికొద్దిసేపట్లో ముగియనున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్స్ లో విజేత ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం.



