కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా విభేదించే ఆర్ఎస్ఎస్ ఆలపించే గీతాన్ని… ఏకంగా ఆ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎంయే అసెంబ్లీ సాక్షిగా పాడితే ఎలా ఉంటుంది..? బీజేపీ వాళ్లు బల్లలు చరుస్తారు…. సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్లు అవాక్కవుతారు. అదే జరిగింది కర్నాటక అసెంబ్లీలో. కర్నాటక డిప్యూటీ సీఎం డే.కే. శివకుమార్ చేసిన ఆ పని ఓ చర్చకు తెరలేపింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండి శివకుమార్ అసెంబ్లీలో ఆ పాట ఎందుకు పాడినట్టనే చర్చతో పాటే.. ఏకంగా అసలు ఆ ఆర్ఎస్ఎస్ పాటేంటి అనే క్యూరియాసిటీని కూడా మళ్లీ తెరపైకి తెచ్చారాయన.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఫైనల్స్ విజయం తర్వాత… జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడటం, మరో 50 మంది గాయాలపాలవ్వడం అక్కడి ప్రభుత్వాన్ని అభాసుపాల్జేసిది. అదే ఇష్యూపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్థనాగీతంలోని లైన్స్ ను కోట్ చేయడంతో చర్చకు తెరలేపారు.

ఏంటీ ఆ ఆర్ఎస్ఎస్ పాట..?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు ప్రార్థనగా పిలిచే సంస్కృతంలోని 13 లైన్ల పాట.. నమస్తే సదా వత్సలే మాతృభూమి… ఓ పవిత్రభూమి ఎల్లప్పుడూ నేను నీకు నమస్కరిస్తుంటాను అనే అర్థంతో మొదలై.. చివరకు యాజ్ యూజ్ వెల్ గా భారత్ మాతాకీ జైతో ముగుస్తుంది.
అయితే, భారత్ మాతాకీ జై ముందు ఓ పంక్తి ఇలా ఉంటుంది. విజేత్రీ చ న: సంహిత కార్యశక్తిర్, విధాయస్య ధర్మస్య సంరక్షణం, పరమ వైభవం నేతమేతత్ స్వరాష్ట్రం, సమర్థ వబత్వాశిష తే భృషం అనే లైన్ ఉంటుంది. అమ్మా మీ ఆశీర్వాదాలతో మత రక్షణ కోసం మేం చేసిన విజయవంతమైన సంస్థాగత పని.. మన దేశాన్ని అత్యున్నత వైభవం వైపు తీసుకెళ్లడంలో విజయవంతం చేయాలనేది ఆ సంకల్పం.
1939 నుంచే ఆర్ఎస్ఎస్ ప్రార్థనగా నమస్తే సదా వత్సలే గీతం!
నమస్తే సదావత్సలే గీతాన్ని ఆర్ఎస్ఎస్ తన ప్రార్థనాగీతంగా 1939 నుంచే ప్రతీ సమావేశంలోనూ ఆలపిస్తోంది. అదొక ఆనవాయితీగా మారింది. ఒక స్వయంసేవక్ ఆ గీతాన్ని ఆలపిస్తాడు. ఇతరులు ఆయన్ను అనుసరిస్తారు. రోజూవారీ సుమారు గంటసేపు సాగే శాఖ కార్యక్రమాలు కూడా చివరకు ఈ పాటతో ముగుస్తాయి. ఇక సమావేశాల్లోనైతే ఆదిలోని ఈ గీతాన్ని ఆలపిస్తారు. గీతాలాపన సమయంలో ప్రతి ఒక్కరూ తమ స్థానాల్లో లేచి నిలబడి, వారి కుడి చేతిని ఛాతీకి పైకెత్తి.. నేలకి సమాంతరంగా మడిచి, అరచేతిని క్రిందికి ఎదురుగా ఉంచి ఈ గీతాలాపన జరుగుతుంది.
అసలా పాట రచయిత ఎవరు..?
నాగపూర్ కు చెందిన ప్రొఫెసర్ నరహరి నారాయణ్ భిడే నమస్తే భక్త వత్సలే గీతాన్ని రాశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన కే.బీ. హెడ్గేవార్ కు నరహరి నారాయణ్ స్నేహితుడు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేశారు. సంస్కృతంలో కూడా ప్రావీణ్యం ఉన్న రచయిత.
1939లో వార్ధా జిల్లాలో వారం రోజుల పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సమావేశాలు నిర్వహించారు. అదిగో అక్కడ ఉద్భవించింది ఈ పాట. దేశవ్యాప్తంగా ఎక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించినా… ఒక ప్రార్థనాగీతం అవసరమన్న హెడ్గేవార్ సూచన మేరకు ఈ ప్రార్థనాగీత రచన జరిగింది


