జంబూర్.. ఓ మినీ ఆఫ్రికా!

ఆఫ్రికన్ సంస్కృతి, సంప్రదాయాలు, అలంకరణలు… ఇవన్నీ మిగిలిన ప్రపంచం నుంచి కొంచెం భిన్నంగానే కనిపిస్తాయి. అలాంటి ట్రైబ్స్ కు కేంద్రమైన ఆఫ్రికన్ కల్చర్ ను.. ఆఫ్రికా వరకు వెళ్లకుండా ఇండియాలోనే చూడాలనుకునేవారికి జంబూర్ ఓ మంచి కేరాఫ్. గుజరాత్ లోని జంబూర్ ను ఎందుకు మినీ ఆఫ్రికాగా పిలుస్తుంటారో ఓసారి తెలుసుకుందాం రండి.

ఇతర గ్రామాల్లానే ఉంటుందేమోనని బయట నుంచి వెళ్లినవారికి మొదటిచూపులోనే అక్కడ స్కూల్ యూనిఫామ్ లో కనిపించే పిల్లలు, బావుల్లోంచి నీళ్లు తోడుతున్న మహిళలు, పనికోసం వెళ్లుతూ సైకిల్ తొక్కుతూ కనిపించే పురుషులు, వివాహాల్లో వినిపించే భిన్నమైన డ్రమ్ బీట్స్, పూసలతో అల్లిన కేశాలంకరణ కల్గిన మనుషులు ఇవన్నీ కాస్త ఆలోచింపజేస్తాయి. కాస్తా అప్పుడా గ్రామం భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా శతాబ్దాల క్రితమే భారతదేశ పశ్చిమ తీరానికి వచ్చి స్థిరపడ్డ సిద్ధి ఆఫ్రికన్ తెగలవారు. అందుకే జంబూర్ ను మినీ ఆఫ్రికా అని పిలుస్తుంటారు. గుజరాతీ భాషతో పాటే.. ఇక్కడ ఆఫ్రికన్ సంప్రదాయాలు, వంటకాలతో ఇదో వైవిధ్యమైన గ్రామంగా గుర్తింపు పొందింది.

అసలు సిద్ధీలెవరు..?

సిద్ధీలను సిదీ, షీదీ, లేదా హబ్షీ అని కూడా పిలుస్తుంటారు. వీరి పూర్వీకులంతా తూర్పు ఆఫ్రికాలోని బాంటు భాషలో మాట్లాడే తెగ. కొందరు నావికులుగా, వ్యాపారులుగా, కిరాయి సైనికులుగా నాడు వలస వచ్చారు. మరికొందరు 13వ శతాబ్దాం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలంలో అరబ్, పోర్చుగీస్ వ్యాపార, వర్తకులచే బలవంతంగా పనికోసం తీసుకురాబడ్డారు. ఆ తర్వాత కాలక్రమేణా వీరు నాటి రాజుల సంస్థానాలలోనూ పనిచేశారు. సైన్యాల్లో చేరారు. స్థావరాలను స్థాపించారు. స్థానికులను వివాహమాడారు. అలా తమ ఆఫ్రికన్ సంస్కృతిని కాపాడుకుంటూనే భారతీయ సమాజంలో అంతర్భాగమయ్యారు.

జంబూర్ మాత్రమే ఎందుకు ఆఫ్రికన్స్ కు అడ్డాగా మారింది..?

గుజరాత్ గిర్ సోమనాథ్ తీర ప్రాంతంలోని జంబూర్ శతాబ్దాలుగా సిద్ధీల స్థావరంగా ఉంది. వేల జనాభా ఇక్కడికి వలస వచ్చినట్టు ఓ అంచనా. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా ఓ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసే క్రమంలో ఈ గ్రామం మళ్లీ జాతీయస్థాయిలో దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ గిరిజన పరిశోధన మరియు శిక్షణా సంస్థ సిద్ధులను రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ తెగగా గుర్తించింది. వారి ఆఫ్రికన్ మూలాలు, అలాగే సౌరాష్ట్రాలోని దీర్ఘకాలిక ఉనికిని కూడా గుర్తించింది. సంగీత శైలి, నృత్యాలు, చేతివృత్తుల వంటి సంప్రదాయాల్లో వీరి శైలి ప్రత్యేకంగా ఉండటాన్ని ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ గమనించింది. రోజువారీ కార్యక్రమాల్లో వీరుపయోగించే గుజరాతీ వాడుక భాష, స్థానిక పండుగల్లో పాల్గొనే క్రమంలో వీరి వేషాధారణ ఇవన్నీ మిగిలిన సమాజంతో వీరిని కాస్త ప్రత్యేకంగా నిలిపుతున్నాయి.

అసలు మినీ ఆఫ్రికాగా ఎలా ఖ్యాతి చెందింది..?

7 నుంచి 12వ శతాబ్దం కాలంలోనే హిందూ మహాసముద్ర వాణిజ్యం తూర్పు ఆఫ్రికాను, పశ్చిమ భారతంతో అనుసంధానించింది. ఆఫ్రికన్ వ్యాపారులతో పాటు, బావా గోర్ వంటి సెయింట్స్ ఇక్కడికి వచ్చి ఆఫ్రికన్ ప్రాబల్యానికి తొలి బీజం వేశారని పేర్కొంటుంటారు.

13-16వ శతాబ్దాల్లో సైనిక సేవల కోసం వలసలు రావడంతో ఇక ఆఫ్రికన్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. హబ్షీ అని పిలిచే తెగవారంతా అరబ్బులతో కలిసి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ప్రాంతీయంగా పాలించే సుల్తాన్ ల రాజస్థానాల్లో సైనికులుగా, కాపలాదారులుగా, అధికారులుగా నియామకమయ్యారు. అలాగే గుజరాత్ తీరప్రాంతం వెంబడి వీరి సంఘాలు కూడా కొన్ని స్థాపించుకుని స్థిరపడ్డారు.

ఇక 16 నుంచి 19వ శతాబ్దాల కాలంలో పోర్చుగీస్ యుగంలో కట్టుబానిసలుగా వచ్చి స్థిరపడ్డవారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. మొజాంబిక్ నుంచి పశ్చిమ భారత ఓడరేవులకు రవాణాను ముమ్మురం చేసిన కాలంలో వీరంతా పోర్చుగీస్ వారికి బానిసలుగా పనులకోసం వచ్చి స్థిరపడ్డారు. అలా తరతరాలుగా మానవ అక్రమ రవాణాలో భాగమై కొందరు, పనుల కోసం వలసలు వచ్చి మరికొందరు ఇలా గుజరాత్ తో ఆఫ్రికన్ కుటుంబాలు పాతుకుపోయాయి. ఆధునిక జన్యు అధ్యయనాలు కూడా ఇక్కడ నిర్వహించారు. దక్షిణాసియా డీఎన్ఏతో పాటు, ఆఫ్రికన్ వంశాలు కలిసిపోయినట్టుగా ఆ పరీక్షలు వెల్లడించాయి.

వలస రాజ్యాల కాలం నుంచి వలస రాజ్యాలనంతరం వరకూ కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడిన ఆఫ్రికన్ సమాజం సౌరాష్ట్రా అంతటా కనిపిస్తుంది. అలా సిద్ధీలుగా పిల్చే ఆఫ్రికన్ గిరిజన తెగలు గుజరాత్ లోని కుగ్రామాల్లో స్థిరమైన నివాసాలనేర్పర్చుకున్నాయి. ఇక్కడి సామాజిక సవాళ్లనెదుర్కొంటూనే.. తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ అస్తిత్వాన్ని చాటుతున్నాయి. ఇక్కడి మ్యూజియాల్లో సేకరణలను గమనించినప్పుడు వీరి కళాత్మక వారసత్వంతో పాటు, వీరు ఎదుర్కొన్న చారిత్రక పోరాటాలు కూడా కనిపించేవిధంగా భద్రపర్చారు.

ఇక 20 నుంచి 21 శతాబ్దకాలంలో వీరికి సరైన గుర్తింపు లభించింది. వీరి హక్కులకు ఓ భరోసా లభించింది. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో సిద్ధి గిరిజన సమూహాలు అధికారిక గుర్తింపును పొందాయి. పద్మశ్రీ హీరాబాయి లోబీ వంటి ట్రైబల్ మహిళా లీడర్స్ వీరి విద్య, జీవనోపాధి వంటివాటికోసం ఫైట్ చేశారు. అప్పుడు మీడియా దృష్టి సిద్ధిలుండే ఈ గ్రామాలపై పడింది. అలాంటి సందర్భంలోనే జంబూర్ మినీ ఆఫ్రికాగా వెలుగులోకొచ్చి ప్రాచుర్యం పొందింది. ఎన్నికల సమయంలో ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో మరింత దృష్టిని ఆకర్షించింది.

జంబూర్ ప్రత్యేకత ఏంటి..?

జంబూర్ లో నడుస్తుంటే ఆఫ్రికన్, గుజరాతీ జీవితాల మిశ్రమ అనుభవాలు కళ్లకు కడతాయి. పండుగల సమయాల్లో ఇక్కడి ఆఫ్రికన్ శైలి డోల్ డ్రమ్స్, పాటల లయబద్ధమైన బీట్, వీరి వస్త్రాధరణ, సల్వార్ కమీజ్ లలో కనిపించే మహిళల వేషధారణ వంటివి ఒకవైపు ఆఫ్రికన్ పద్ధతులను కళ్లకు కడితే.. గుజరాతీ థాలీల వంటి ఆహారపలవాట్లతో ఆఫ్రికన్, గుజరాతీ మిక్స్డ్ కల్చర్ కు కేరాఫ్ లా జంబూర్ కనిపిస్తుంటుంది. ఇక్కడి జనాభా చాలా మంది కూడా వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తుంటారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటారు. గిర్ అడవుల చుట్టూ పర్యాటక రంగంలో పనిచేస్తున్నారు. సముద్రం ద్వారా ఇక్కడికి తమ పూర్వీకుల వల్ల ఎలా వచ్చారో ఇక్కడి పెద్దలు వివరిస్తుంటారు. వీరి కథలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్ లోనూ కనిపిస్తున్నాయి. గత జ్ఞాపకాలు, నేటి ఆధునికత మధ్య జంబూర్ ఇప్పుడు ఇంకొంత కొత్తగా కనిపిస్తుందంటున్నారు కొందరు సోషల్ మీడియాలో జంబూర్ గురించి పోస్టింగ్స్ చేస్తున్నవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles