తండ్రి సినిమా కలల్ని… తానో నటిగా ఎదిగి నిజం చేసింది ఆ కూతురు.
అవునూ.. వారం వారం సినిమా చూడందే నిద్రపట్టని ఓ ట్రక్ డ్రైవర్ కూతురు తన తండ్రి సినిమా కలల్ని తను నటిగా మారి నిజం చేయడంతో పాటు.. ఏకంగా కేన్స్ ఫెస్టివల్ లో మెరిసింది.
ఆమే సునీతా రాజ్వార్. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ అనే ఓ చిన్న పట్టణానికి చెందిన సునీత.. తన తండ్రికి సినిమాపైనున్న ప్రేమను చూస్తూ చిన్ననాట్నుంచీ పెరిగింది. సినిమాపై తండ్రికున్న ప్రేమే ఆమె నటనవైపు అడుగులు వేసేందుకు దోహదపడింది. సినిమాలు, సినిమా నటుల పట్ల తన తండ్రికున్న ఆ అభిమానం తానే సాధించాలంటే.. తానే నటినైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి.. అలా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. ఆ తర్వాత తిరుగులేని నటిగా ఎదిగిన సునీతా రాజ్వార్.. సోనీలీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుల్లక్, అమెజాన్ ప్రైమ్ లో ఉన్న పంచాయత్ వంటి వెబ్ సీరీస్ లతో పాటు, స్త్రీ వంటి సినిమాల్లో తన నటనతో దూసుకుపోతోంది.

అయితే, సునీతా రాజ్వార్ తండ్రి ఓ ట్రక్ డ్రైవరైనప్పటికీ తన పిల్లలకు ఉన్నత విద్యనందించేందుకు మాత్రం వెనుకాడకుండా కష్టించి పనిచేసేవాడంటోది సునీత. అలాగే, తన అభిరుచికి తగ్గట్టు.. ప్రతీ శుక్రవారం రిలీజైన కొత్త సినిమాకు ఇంటిల్లిపాదినీ తీసుకెళ్లేవాడంటోంది. అలా నాన్నకిష్టమైన సినిమాపై సునీతకూ ఇష్టమేర్పడింది. అదే ఆమెను నటనా రంగం వైపు ఆకర్షించింది.
మొదట్లో తాను ఎదుగుతున్న క్రమంలో మీ తండ్రి ఏం చేస్తారని ఎవరైనా అడిగితే.. ట్రక్ డ్రైవర్ అని చెప్పడానికి కాస్త సంకోచించేదాన్నని.. సిగ్గుపడేదాన్నని.. కానీ, తర్వాత తన తండ్రి ఆ స్థాయిలో పనిచేస్తూ నేనింత ఎదిగేందుకు కారణమైనందుకు గర్వపడుతున్నానంటోంది సునీతా రాజ్వార్.

చిన్నప్పట్నుంచే నటించాలనే కోరిక బలంగా ఏర్పడటంతో స్కూల్, కళాశాల స్థాయిలోనే నటన మొదలెట్టిన సునీత.. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకుంది. ఆ ఇంటెన్సివ్ కోర్స్ ఆమెను నటిగా తీర్చిదిద్దడంతో పాటు.. టీవీ, చిత్ర పరిశ్రమలో సవాళ్లనెదుర్కొనేలా రాటుదేల్చింది.
ఎలాగైనా నటిని కావాలన్న గట్టి ఉక్కుసంకల్పంతో తండ్రి కూడబెట్టి ఇచ్చిన కేవలం 30 వేల రూపాయలతో సునీత ముంబై చేరింది. 90ల ప్రాంతంలో ముంబై బాట పట్టిన సునీతకు.. ముంబై నగర జీవితమంటే ఏంటో అక్కడికెళ్లితేగానీ ప్రాక్టికల్ గా అర్థం కాలేదు. ముందు జూనియర్ ఆర్టిస్ట్ గా తన నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇతర చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులతో కలిసి ముంబై మురికివాడల్లో గదుల్లో ఉంటూనే ప్రయతాల్ని మాత్రం ఆపలేదు. అయితే, చాలాసార్లు చిన్న చిన్న పాత్రల కోసం గంటలు, రోజుల తరబడి ఎదురుచూడటం.. ఆ పాత్రలు కూడా కొన్నిసార్లు దక్కకపోవడంతో ఒకానొక దశలో విసుగు చెంది తన నట జీవితానికి స్వస్తి చెప్పింది. అలా రెండేళ్లపాటు నటనకు దూరమైపోయింది.
తన నటజీవితం ప్రశ్నార్థకమై తన ఉక్కు సంకల్పానికి సవాళ్లు బీటలు కొడుతున్న సమయంలో… సునీతకు ఆడిషన్ కోసం వచ్చిన ఓ పిలుపు మళ్లీ ఆమె కలల్ని నిజం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అలా సోనీలీవ్ లో స్ట్రీమింగ్ లో ఉన్న గుల్లక్ వెబ్ సీరీస్ కోసం బిట్టు కీ మమ్మీ పాత్ర కోసం సునీతకు ఆఫర్ వచ్చింది. గుల్లక్ సీరీస్ కు మంచి పేరు రావడంతో పాటు… ముక్కుసూటి క్యారెక్టర్ తో మెప్పించిన సునీత దశ కూడా మారిపోయింది. అయితే, ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల కోసం చూస్తున్న తనకు అవే దక్కని సమయంలో.. అదృష్టం తలుపు తట్టి గుల్లక్ లో ఓ మంచి పాత్ర దక్కడాన్ని తానే ఒక దశలో నమ్మలేకపోయానంటోంది సునీత.
ఈమధ్య రిలీజైన స్త్రీ2 సినిమాలో క్యారెక్టర్ తో పాటు.. పంచాయత్ లో ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ లా కనిపించే క్రాంతిదేవి వంటి పాత్రల్లో మెప్పించింది సునీత. సాధారణంగా ముంబై నగరంలో.. అదీ బాలీవుడ్ లో నటీనటులు కావాలంటే ఈరోజుల్లో కచ్చితంగా పెట్టి పుట్టాల్సిందే. లేకపోతే, సునీత లాంటివాళ్లు ఎందరో.. ముంబై అరేబియా మహా సముద్రంలోని నీటిబిందువుల్లా ఆ సముద్రపు హోరులో కలిసిపోతూనే ఉంటారు. కానీ, సునీత పట్టుదల, స్పిరిట్ ఆమెను నటిగా నిలబెట్టింది. అంతెత్తు బాలీవుడ్ లోనూ ఎక్కడో ఉత్తరాఖండ్ లోని ఓ చిన్న పట్టణం నుంచి వెళ్లి ఉక్కు సంకల్పంతో నిల్చుంది.
ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకున్న సునీత.. సంజయ్ ఖండూరి దర్శకత్వంలో అభయ్ డియోల్, నేహాధూపియా ప్రధాన పాత్రల్లో నటించిన ఏక్ ఛాలీస్ కి లాస్ట్ లోకల్, స్త్రీ, కేదార్నాథ్, శుభ్ మంగళ్ సావధాన్ వంటి విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది. ఇప్పుడు పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న కొత్త కొత్త వెబ్ సీరీస్ ల్లో వరుస పాత్రలతో దూసుకుపోతున్న సునీత.. తన కొత్త సినిమా సంతోష్ నటిగా ప్రాతినిథ్యం వహిస్తూ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ రెడ్ కార్పెట్ పై నడవడంతో ఆమె తన కలల్ని సాకారం చేసుకుంది. ముఖ్యంగా సినిమాపై తన తండ్రికున్న ప్రేమతో.. నటనా రంగాన్నెంచుకున్నందుకు ఆమె తన కలల్ని ఒకదాని తర్వాత ఒకటి నిజం చేసుకుంటూ ఎందరో తనలాంటి నటనా రంగంవైపు రావాలనుకునేవారికి ఓ రోల్ మాడల్ గా నిల్చింది.



