ఈర్ష్య, ద్వేషంతో కన్నకూతురిపాలిట కాలయముడైన తండ్రి!

కుమారులో, కుమార్తెలో తల్లి, దండ్రులను మించినవారైతే తలెత్తుకుని గర్వపడతారు. మన తెలంగాణా రాష్ట్రంలోనే అలాంటి ఓ ఘటన మనం ముందు చెప్పుకుందాం. సింధూశర్మ అనే మహిళ ఐపీఎస్ సాధించి ఎస్పీగా వస్తే.. డ్యూటీలో ఉన్న తన తండ్రి ఉద్యోగరీత్యా సెల్యూట్ చేసిన ఒక ఫోటో అప్పట్లో చాలామందిలో ఒక పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసింది. అయితే, అందుకు భిన్నంగా తాను వృద్ధిలోకి రావడమే కాదు… మరో నల్గురిని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్న బిడ్డను ఓ తండ్రి కాల్చి చంపిన ఘటన ఇదే సమాజం చూడాల్సి రావడం విషాదం.

హర్యానా వజీరాబాద్ కు చెందిన 54 ఏళ్ల దీపక్ యాదవ్ అనే వ్యక్తి ఆత్మన్యూనతతో బాధపడుతూ.. కన్న బిడ్డనే తుపాకీ గుండ్లతో కాల్చి చంపిన ఘటన ఇప్పుడు ఓ పెను విషాదం, అంతకుమించిన సంచలనం.

25 ఏళ్ల రాధికాయాదవ్ ఓ సక్సెస్ ఫుల్ టెన్నిస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంటోంది. అండర్-18 లో 75వ ర్యాంక్ తో కెరీర్ బెస్ట్ చూస్తున్న దశలో ఉంది. అలాగే, ఉమెన్స్ డబుల్స్ లో 53వ ర్యాంకుతోనూ, ఉమెన్స్ సింగిల్స్ లో 35వ ర్యాంకుతోనూ టెన్నిస్ అసోసియేషన్ లో రికార్డ్స్ సాధించింది.

అయితే, రాధిక కేవలం పైపైకి ఎగబాకుతూ తన ర్యాంకులను మెరుగుపర్చుకుంటున్న టెన్నిస్ ప్లేయర్ మాత్రమే కాదు.. ఆమె ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ కూడా ఇస్తోంది. ఆమె టెన్నిస్ శిక్షణనందించే వారంతా కూడా హైప్రొఫైల్ కుటుంబీకులు.

అలా సూర్యతేజమై వెలుగులీనుతున్న రాధికా యాదవ్ పై వెనుకనుంచి తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపి చంపేశాడు.

కన్నకూతురినే ఎందుకు దీపక్ మట్టుబెట్టాడు..?

నిత్యం పాలు, కూరగాయలు వంటివి తీసుకురావడానికి వెళ్లినప్పుడు తానుండే ప్రాంతంలో ప్రజలు అతణ్ని చిన్నచూపు చూడటంతో దీపక్ యాదవ్ లో కన్నకూతురిపైనే కన్నుకుట్టింది. అదే సమయంలో తన ఊళ్లో వజీరాబాద్ లోనూ అలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాడు దీపక్. కూతురి సంపాదనతో బతుకీడుస్తున్నాడంటూ సమాజం చేసిన ఎగతాళి, అవహేళన దీపక్ లో కన్నకూతురిపైనే ద్వేషానికి కారణమైంది.

కానీ, గుర్ గ్రావ్ లో ఉండే దీపక్ కు మల్టీపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సుమారు ప్రతీనెలా 15 నుంచి 17 లక్షల రూపాయల వరకు కిరాయిలే వస్తుంటాయి. దీపక్ కు ఓ కొడుకు కూడా ఉండగా అతను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు.

దాంతో చాలాసార్లు టెన్నిస్ అకాడమీలో తాను పనిచేయడం ఆపేయాలని రాధికను పలుమార్లు అడిగి చూశాడు దీపక్. కానీ, రాధిక ససేమిరా అంది. అదే తన జీవితమని చెప్పింది.

దాంతోపాటే రాధికాయాదవ్ ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానూ రాణిస్తోంది. కానీ, అది కూడా దీపక్ కు నచ్చలేదు. రీల్స్ వద్దని వారించాడు.

అలాగే, ఓ యువకుడితో బయటపడ్డ వీడియో కూడా దీపక్ యాదవ్ లో కూతురు పట్ల మరింత ద్వేషం రగలడానికి కారణంగా తెలుస్తోంది. ఇవన్నింటితో గత కొద్దికాలంగా తండ్రీకూతుళ్ల మధ్య గొడవలు ముదరగా.. మూడురోజుల నుంచి అవి తారాస్థాయికి చేరి.. ఏకంగా కన్న కూతురినే చంపిన పాపాత్ముడిగా దీపక్ మిగిలిపోయాడు.

కూతురిపై ద్వేషం- వెనుకనుంచి దొంగదెబ్బ!

రాధికా యాదవ్ స్వతంత్ర భావాలతో స్వేచ్ఛగా టెన్నిస్ ఆటే లక్ష్యంగా దూసుకుపోతోంది. కానీ, పితృస్వామ్యవాదానికి అలవాటైన ఓ నియంతలా తండ్రి దీపక్.. రాధికను మానసికంగా వేధించడం మొదలెట్టాడు. అయినా, ఆమె తండ్రిని బాగానే చూసుకుంది. కానీ, దీపక్ మాత్రం ద్వేషం పెంచుకుంటూ పోయాడు. ఎదుగుతున్న బిడ్డను చూసి గర్వించాల్సిన తండ్రి.. బిడ్డపై విపరీతమైన ద్వేషం పెంచుకుని.. కిచెన్ లో ఉన్న రాధికపై వెనుకనుంచి ఓ పిరికివాడిలా తుపాకీతో కాల్చి దొంగదెబ్బ తీశాడు.

దీపక్ తన కూతురు రాధికపై కాల్పులు జరిపే సమయంలో తల్లి కూడా ఇంట్లోనే ఉంది. అప్పటికే మూడురోజుల నుంచి దీపక్, రాధిక మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దీపక్ ఇక కూతురును లేపేయాలని డిసైడయ్యాడు. అనుకున్నంత పనీ చేశాడు.

తన కన్న కూతురే కష్టపడి పైకి వచ్చి.. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకుంటే… కన్నతండ్రై మురిసిపోవాల్సిన దీపక్.. ఓ పురుషాహంకారిలా ఆమెపై విపరీతమైన ఈర్ష్య, కుళ్లు పెంచుకునే విపరీతమైన మనస్తత్వాన్ని కల్గి ఉండటం మనుషులెలా మారిపోతున్నారు రానురాను అనేందుకో ఉదాహరణ.

దీపక్ ఏం సాధించినట్టు..?

విచక్షణ కోల్పోయి కన్నకూతురినే కాల్చి చంపిన కేసులో సమాజం దృష్టిలో ఛీత్కారానికి గురవ్వడం… మర్డర్ కేసులో జైలుకెళ్లి అక్కడా తోటీ ఖైదీలూ ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసే నేరగాడవ్వడం… జైల్లో చంపుకున్న బిడ్డను తల్చుకుని.. తానేం చేయకున్నా తనను సాకిన కూతురుని చంపాననే బాధతో కుళ్లి కుళ్లి ఏడ్వడం మినహా.. దీపక్ సాధించిందేంటి..?

తన బిడ్డ ఎదిగి తనను సాకడం పరువు పోవడమనుకోవడం దీపక్ మూర్ఖత్వం. లోకులు పలుకాకులనుకోకుండా.. ఆ లోకం మాటలను పట్టించుకుని తనలోని పురుషాధిక్యాన్ని తట్టిలేపి.. కన్నకూతురని కూడా ఆలోచించకుండా పక్కా స్కెచ్ తో వెనుకనుంచి దొంగదెబ్బ తీసి చంపడం దారుణమైన శాడిజం.

మంటగలుస్తున్న మానవబంధాల విషయంలో తండ్రీకూతుళ్లు రాధికా యాదవ్, దీపక్ యాదవ్ కథ ఒక ఉదాహరణైతే.. ఈమధ్యే జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన కథా ఇలాంటిదే. తోటికోడలుపైనున్న ద్వేషం, ఈర్ష్యతో ఓ పిన్నమ్మ అభం శుభమెరుగని ఓ ఐదేళ్ల పసిపాపాయిని గొంతుకోసి మట్టుబెట్టిన ఘటనా ఇలాంటిదే. వెనువెంటనే మానవ సమాజం చూసిన మనుషుల విపరీత మనస్తత్వాలను పట్టిచూపే రెండు ఘటనలివి.

ఇలా ఒక భార్యా, భర్త.. అన్నా, చెల్లీ… అక్కా తమ్ముడు.. తండ్రీ కూతురు వంటివారి మధ్య ఒకవేళ మహిళలు కాస్తా పైచేయిగా ఉన్న చాలా కుటుంబాల్లో తమ అస్తిత్వానికి సంబంధించి. తమ ఐడెంటిటీకి సంబంధించి ఈర్ష్యా, ద్వేషాలతో రగిలిపోయేవారి పురుషుల సంఖ్యా ఈ మధ్య పెరిగిపోతోందనేందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తూనే, పునరావృతం అవుతూనే ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles