జెడల దయ్యం.. మనకు దయిబం
✍🏻 డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి (అసోసియేట్ ప్రొఫెసర్ కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల)

ఈతచెట్టు ఇల్లుగాదు తాటిచెట్టు తల్లిగాదు అని సామెత.
చెరువుకట్టకు జెడలదయ్యం అని ఈతపొదకు పొడుపుకథ.
ఈతచెట్టు ఇల్లుగాకున్నా సరే, ఈదు సాయంలేని ఇల్లు ఉండది.
పొద్దుగాలలేస్తే, పండ్లు తోముకుంటానికి ఈ ఈతపుల్ల పనికొస్తది.
వెన్కట పరిగడుపున్నే పనిపాటుకు చేనుజెల్కల్లకు పోయ్యేదాయె.
ఈతపుల్లేసుకోని పనికిదిగుతే అంబటాళ్లదాక ఆకలిరోకే తెలువది.
ఎండకాలపు ఎర్రటెండకు నీళ్లుదొరకని యాళ్ల ఈతపుల్లే చల్లకుండ.
బగ్గదూపైనప్పుడు ఈతపుల్ల సప్పరిస్తేజాలు శరీరం దాహం తీరుద్ది.
ఎడ్లుగొడ్లు కాయవేనోళ్లు,గట్టుకు కట్టెలకు పేనోళ్లకు ఈతపుల్లే తల్లి.
నోరు పెచ్చిందంటే, రెండుసార్ల ఈతపుల్ల నములుతె మంచిగయిద్ది.
ఈతాకు చేసేపనులు, ఇంకో ఆకుకు అందేవిగాదు – పొందేవిగాదు.
ఆకులుజీరి నారజేసి, ఆక్కూర కట్టలుగట్టిన ఇంట్లనే నేను పుట్టింది.
ఈతాకులు పందిరికి పనికొస్తయి. గుడిసెకప్పుకుసుత పనిజేస్తయి.
పిల్లమొద్దులు చుట్టుగుంజలు,పెద్దమొద్దులు నిట్టాళ్లకు నిలవడుతై.
మా వైపున ఇల్లువాకిలి ఊడ్చే చీపుర్లంటే ఈ ఈతచీపుర్లు మాత్రమే.
సన్నగజీరిన వన్నెచీపుర్లు ఇంట్లకు,దొడ్డుగజీరినయేమొ పెద్దాకిట్లకు.
దీకొండ మైసయ్య కట్టినచీపుర్లుజూసి చుట్టపోళ్లపానం కొట్టుకునేది.
ఇగ మా ఎరుకలి పోచమ్మ పనితనానికేం తక్కువ. ఈత బరిగెజీరి
పెండతట్టలు, దినుసుమోసే పెద్దగుల్లలు, కోళ్లకు దాగెర్లు అల్లుకచ్చి
వాకిలినిండ ఇరువైగాల పరిచి, నీకు ఇష్టమైనయి ఏరుకో లచ్చవ్వా
అని పానసరం బడేది. పోయిన తాపకిచ్చినై అట్లనేవున్నయి గాదే,
ఇవ్వేం జేసుకునుడే అంటే, మీరు తీసుకోకపోతే మేమెట్ల బతుకాలె
అవ్వే పనికస్తయి, ఇసిరెవుంటే చెడిపోతదా ఇయ్యాలగాపోతె రేపు
అనుకుంట, పోచమ్మ అనుకున్నన్ని అరుగంచుమీద పెట్టిపొయ్యేది.
పంటమీద తప్పకుంట వచ్చే పిచ్చుకుంట్లోళ్లు ఇల్లిల్లుతిరుక్కుంటనే
బువ్వడుక్కుంట ఈతపట్టెలు అల్లుదురు. అసలు ఎంత తొందరగ
అల్లుదురో, చూసినోళ్లకు ఆ చేతివేళ్ల పనితనం మరుపురాదు మరి.
ఇగురం కొద్ది, ఇంటికి రెండుమూడు సాపలన్నా అంటగట్టి పోదురు.
ఎండుగులకు,ఇసురుటానికి,చెరుగుటానికి ఈతసాపలేంది ఎల్తదా,
పురుడుకు, సముర్తకు, పెండ్లికి, పేరంటానికి, సావుకు, దెవుసాలకు
అన్నీటికి చాపతోనే పని. కొత్తసాప పాతవడకముందే ఎల్కరాజులు
కోపంజేత్తే, ఇగ మల్ల పిచ్చుకుంట్లోళ్లు వచ్చేదనుక ఎదురుచూసుడే.
అటుకులమీద, అడ్డదూలాలమీద చుట్టజుట్టి పెట్టిన ఈతసాపలల్ల
పిల్లులు కూనలను దాచి పెట్టేటియి. కొత్తచుట్టాల చంటిపిల్లల లెక్క అవి ఎప్పుడోసారి తొంగిచూస్తే, ఇంట్లున్న అందరికి ఎంత సంబురం.
మా చేండ్లల్ల బండలకు గుండ్లకు ఆడాడ ఈతవనం పెరుగుతుండే.
ఉయ్యాల భూమగౌడు కొత్తకుండల యాలకులేసి తీసిపోసిన నీరా
తాగుకుంట, పల్లిచేను తవుటంబెట్టిన యాదులు ఎంతో మధురం.
ఎండకాలం సెలవులు వచ్చినయా,వొర్రెగడ్డలకున్న ఈదులేయిండ్లు.
వందురుకున్న ఈతచెట్లకు పెద్దపెద్దగ గొలలు. గువ్వం పట్టిన పండ్లు.
గెలలు కోసుకచ్చి, గఢ్డికుప్పల మాగవెడితే రోజంతా తిన్నన్ని పండ్లు.
ఖాళిగెలను, కొట్టంల గడ్డిగాదం ఊడ్చుటానికి దాచిపెట్టుకునే వాళ్లు.
అన్నిముచ్చట్లు ముద్దేగని, ఈతముల్లు ముచ్చట చెప్పుకోపోతెట్లా,
ఎండిన ఈతకంపతోటి రామగోస. కాలుకొ చెయికొ ముల్లుగొట్టిందా
ఇగ అంతే సంగతి. లోపలికి చిన్నగ కూసం ఇడిచినా చాలు. ముల్లు
పెట్టేబాధ ఇంతాంతనా,కలుక్కుమంటది.చూస్తె దొరుకది తీస్తే రాదు.
ఒక కాడ ఇరిగిన ముల్లు ఆడనే ఉండదని, పెయ్యంత తిరుగుతదని
భయపెట్టిచ్చేటోళ్లు.ఆరునెళ్లకైనా సరే ముల్లుమాత్రం బైటకువచ్చేది.
అలువాటు తప్పిన అవపోసన అన్నట్టుగ ముప్పయేండ్ల తరువాత
మొన్న ఈతచెట్లళ్ల తిరుగవలిసి వచ్చింది. కొత్తముండ్లు కుచ్ఛినయి.
మూడునాలుగు పాతముండ్లు చేతులకు కొట్టినయి గుడ. రమ్మంటే
అవి వెనుకకు వచ్చేరకమా. వశపడక ఒకటి దానికదే బయటవడ్డది.
ఇంకోరెండు లోపలనే మల్లగుల్లాలు వడుతున్నయి. తాపకోమలుక కలుక్కుమంటన్నయి గన్కనే, వాటిపుణ్యాన ఈ నాలుగుమాటలు !
ఇది.. మన వృక్షావరణం – మన జీవనసంస్కృతి.



