అస్సాంలో 25 ఏళ్ల ప్రాక్టీస్ అనంతరం బట్టబయలైన ఓ మున్నాభాయ్ ఎంబీబీఎస్ కథ!
పాతికేళ్ల ప్రాక్టీస్… వేల మంది రోగులకు చికిత్స… వేల రూపాయల ఫీజులు వసూళ్లు… బహుళ అంతస్థుల భవన నిర్మాణం. ఇదంతా ఏ ఎంబీబీఎస్ ఎండీనో, ఎంఎస్ నో సాధించింది కాదు… గుట్టుచప్పుడు కాకుండా డాక్టర్ వేషం కట్టిన ఓ మున్నాభాయ్ ఎంబీబీఎస్ నకిలీ డాక్టర్ బాగోతం.
పేరు సర్తాజ్ ఉద్దీన్.. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కేటుగాణ్ని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

2001 నుంచీ 2025 వరకూ వైద్య పట్టానే లేకుండా రోగులకు చికిత్స చేస్తున్నాడు. అస్సాం బోంగాయగావ్ లో ఈ పాతికేళ్లల్లో అతని సంపాదన కోట్లకు చేరి బహుళ అంతస్థుల భవనాన్నే నిర్మించుకున్నాడు. ఆ బిల్డింగ్ నే మల్టీస్పెషాల్టీ క్లినిక్ గా మార్చి.. ఎలాంటి అర్హత లేకున్నా, తానో అత్యంత అర్హత ఉన్న వైద్యుడన్నట్టు సభ్య సమాజాన్ని నమ్మించాడు.
అస్సాం కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిజిస్ట్రేషన్ వద్ద అధికారిక ఫిర్యాదు నమోదవ్వడంతో… ఈ కేటుగాడిపైన అక్కడి వైద్యాధికారులు దృష్టి సారించారు. ఫిర్యాదు అందిన వెంటనే బోంగాయగావ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం సర్తాజ్ ఉద్దీన్ మోసానికి సంబంధించిందే కాదు.. ఇలాంటి సర్తాజ్ ఉద్దీన్ లు దేశం మొత్తం జిల్లాలు, తాలూకాలు, గ్రామాల వరకూ విస్తరించారు. మెడికల్ ప్రాక్టీస్ పైనే అనుమా నాలు రేకెత్తించే ఘటన ఇది. నకిలీ డాక్టర్ల ఉచ్చులో పడి రోగులెదుర్కొనే ప్రమాదాలకు సంకేతం.
భారతదేశం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఎదుర్కొంటున్న సమస్యల్లో మెడికల్ ప్రాక్టీస్ ఒకటి. అస్సాం, పూణే వంటి చోట్ల ఇలాంటి మున్నాభాయి ఎంబీబీఎస్ కేసులు అనేకంగా బట్టబయలవుతున్నాయి. ఇదే పరిస్థితి ఇటు తెలంగాణా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కనిపిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో అస్సాంలోని కాచర్ జిల్లా పోలీసులు నకిలీ వైద్యులపై భారీ స్థాయిలో దాడులు చేశారు. పదేళ్లపాటు నకిలీ డిగ్రీతో 50 కంటే ఎక్కువ సిజేరియన్స్ చేసిన మరో నకిలీ డాక్టర్ నూ అరెస్ట్ చేశారు.
పూణేలోనూ సరిగ్గా 32 ఏళ్ల నుంచి రోగులకు ఎలాంటి వైద్య డిగ్రీ లేకుండా చికిత్స అందిస్తున్న ఓ నకిలీ డాక్టర్ నూ ఈ మధ్యే పట్టుకున్నారు. దశాబ్దాలపాటు నకిలీ వైద్యులు.. ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేని హాస్పిటల్స్ ఇష్టారీతిన వైద్యం చేస్తుంటే… అసలు వైద్యశాఖ చేసే పనేంటి.. దానిపై విజిలెన్స్ ఏమీ ఉండదా అనే పలు ప్రశ్నలు ముందుకొస్తాయి.
ఈ రాకెట్ కేవలం నకిలీ వైద్యులు.. అనుమతి, రిజిస్ట్రేషన్స్ లేని క్లినిక్స్ వరకే పరిమితం కాలేదు… పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసినకొద్దీ… వైద్య డిగ్రీలను అంగట్లో నిమ్మకాయల్లా అమ్మేస్తున్న రాకెట్ల గుట్టూ రట్టైంది. కేవలం 70 వేల రూపాయలకే నకిలీ ఎంబీబీఎస్ పట్టా చేతికొస్తుంటే.. ఏ అవకాశం దొరికితే ఎలా దొంగమార్గంలో, అక్రమార్జన చేద్దామానని చూసేవాళ్లు ఎందుకు కాదనుకుంటారు..?



