గంగ కోసం జీవితాన్నే త్యాగం చేశాడు: సీజేపీ నిరసనల నేపథ్యంలో ఓసారి గుర్తు చేసుకోవాల్సిన స్టోరీ!

పరస్పరావసరాల కోసం పెదవి విప్పి అందులో నీతులు చెప్పే పాలకులు… తాము అనవసరమనుకుంటే సామాజిక అవసరాలపై మాత్రం మాటైనా మాట్లాడరు. నిరసనలు తీవ్రరూపం దాల్చినా పెదవి విప్పరు. అదే.. ప్రమాదకరమైన ఇగ్నోరెన్స్.

ఇగ్నోరెన్స్ కు సంబంధించి ఈ సందర్భంగా ఓ రెండు సామెతలూ గుర్తు చేసుకుని.. ఓ సైంటిస్ట్ 111 రోజుల దీక్ష తన కల నిజమవ్వకుండానే ఎలా మట్టిలో కలిసిపోయిందో చెప్పుకుందాం. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ గత నెలకు పైగా తన నిరసనలు తెలుపుతుంటే పాలకులకు పట్టకుండా పోగా.. అలాంటి నిరసన దీక్షలపై బురదజల్లే ప్రయత్నాలు ఆగకపోవడం అంతకంటే విషాదం.

అజ్ఞానం ఎల్లప్పుడూ మార్పును చూసి భయపడుతుందన్నది ఒక సామెతైతే.. జ్ఞానానికి అతిపెద్ద శత్రువు అజ్ఞానం కాదు.. జ్ఞానముందనే భ్రమ అంటారు ఐన్ స్టీన్.

అలా పాలకుల పట్టింపులేనితనానికి బలైన ఓ ప్రొఫెసర్ కథ… ఓ సైంటిస్ట్ సామాజిక వ్యథే ఈ కథనం.

హరిద్వార్ లో గంగానదీ ఒడ్డున 86 ఏళ్ల కురువృద్ధుడు తన పక్కన ఓ గ్లాస్ తేనె కలిపిన నీటితో నిర్మలంగా ప్రశాంతంగా కూర్చున్నాడు. రోజులు గడిచిపోతున్నాయే తప్ప.. ఆయన మాత్రం ఆహరం ముట్టడం లేదు. చివరకు నీరు తాగడం కూడా మానేశాడు. గంగాతీరంలో ఆరంభమైన ఈ పోరాటం ఏకంగా 111 రోజుల పాటు కొనసాగింది.

గంగ ప్రవహిస్తూనే ఉంది. కానీ, గతంలోలా నిర్మలంగా.. సజీవంగా దాని ప్రవాహం కనిపించడం లేదు. ఆనకట్టలు, కాలుష్యం, అక్రమ ఇసుక తవ్వకాలతో గంగ తీవ్రమైన ఒత్తిడితో కనిపిస్తోంది. జీవనది నడక కాస్తా మందగించింది.

ఆ గంగా ప్రక్షాళన కోసమే అపర భగీరథ ప్రయత్నం చేశారు పర్యావరణవేత్త, ఐఐటీ మాజీ ప్రొఫెసర్, జీడీ అగర్వాల్. సన్యాసం స్వీకరించి స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్ గా ప్రసిద్ధి చెందిన ఆయన.. ప్రభుత్వం ఒకరోజు కాకపోతే ఇంకోరోజైనా దిగిరాకపోతుందా, స్పందించకపోతుందానని గాంధేయ మార్గంలో తన నిరశన దీక్ష కొనసాగించాడు.

మరి స్పందన వచ్చిందా..?

ఆ స్పందన వచ్చి ఉంటే పాలకుల దూరదృష్టికి అదో నిదర్శనమయ్యేది. కానీ, పాలకులెప్పుడూ పంతంతోనే ఉంటారు. ఇవాళ అదే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లోనూ చూస్తున్నాం. అదే ఆనాడూ జరిగింది. దాంతో 2018, అక్టోబర్ 11వ తేదీన రిషీకేశ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు జీడీ అగర్వాల్ ఉరఫ్ జ్ఞాన స్వరూప్ సనంద్. భారతదేశ చరిత్రలోనే పర్యావరణ నిరాహార దీక్షల్లో అత్యంత సుదీర్ఘమైన దీక్షగా జీడీ. అగర్వాల్ దీక్ష నిల్చింది. కానీ, ఆయన ప్రాణత్యాగం మాత్రం పాలకులకు సమాధానమివ్వలేని పెద్ద ప్రశ్నాపత్రమైంది.

మరి అగర్వాల్ డిమాండ్స్ ఏమైనాయి..?

శాస్త్రవేత్త నుంచి సన్యాసిగా అగర్వాల్ ప్రయాణం!

సన్యాసం స్వీకరించేకంటే ముందు ఆయన పూర్తి పేరు గురుదాస్ అగర్వాల్. దేశంలోని ప్రముఖ పర్యావరణ ఇంజనీర్లలో జీడీ అగర్వాల్ ఒకరు.

అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్క్లీ నుంచి పర్యావరణ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేశారు. ఐఐటీ కాన్పూర్ లో సివిల్ ఇంజనీరింగ్ బోధించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో తొలి సభ్య కార్యదర్శి. భారతదేశంలోని నదులపై దశాబ్దాల పాటు పరిశోధనలు చేశారు.

తన కెరీర్ ఆరంభంలో టెహ్రీ డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ అనుభవమే తర్వాత హిమాలయ ప్రాంతంలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులను ఆయన వ్యతిరేకించేందుకు ఊతమైంది.

శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికత కలగలిసిన ఉద్యమం!

అగర్వాల్ ఉద్యమానికి శాస్త్రీయ ఆధారాలతో పాటే.. ఆధ్యాత్మిక విశ్వాసం కూడా దన్నుగా నిల్చింది. ఆనకట్టలు అధిక సంఖ్యలో నిర్మించడం, నదుల ప్రవాహాన్ని ఇష్టారీతిన మళ్లించడం, నదులను చెరబట్టి లోతైన ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం, నదుల్లో పెంచిపోషిస్తున్న కాలుష్యం వీటన్నింటి వల్ల నదులు సహజత్వాన్ని కోల్పోతున్నాయని బాధపడ్డారు అగర్వాల్. దేశంలోనే అతి పెద్ద నది అయిన గంగ గురించి తీవ్ర ఆవేదన చెందారు. కేవలం విద్యుత్ ఉత్పత్తికో, సాగు, తాగునీటి కోసమో, రవాణా వనరుగానో మాత్రమే గంగను చూడొద్దనేది అగర్వాల్ అభిప్రాయం.

2011లో శాస్త్రీయ నివేదికలు మాత్రమే ప్రజలను చైతన్య పర్చలేవని భావించిన అగర్వాల్.. వారణాసిలో స్వామి అవిముక్తేశ్వరానంద వద్ద సన్యాసం తీసుకుని స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్ గా మారిపోయారు.

ఒక నది బాగుకోసం దశాబ్దం పాటు నిరాహార దీక్షలు!

2008 నుంచి 2018 వరకు నిరాహార దీక్షలే ఆయన ప్రధాన నిరసన మార్గాలయ్యాయి.

2008లో ఉత్తరకాశీలో గంగా రక్షణ కోసం దీక్ష చేశారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు. హామీలను ఎప్పటికప్పుడు అటకెక్కించే పాలకులున్న దేశంలో పురోగతి కనిపించలేదు. దాంతో మళ్లీ తిరిగి ఉద్యమం ప్రారంభించాడు.

2009లో భగీరథీ నదిపై ప్రతిపాదించిన లోహారినాగ్ పాలా జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మరో దీక్ష చేపట్టారు. 36 రోజులకు ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఆయన దీక్షతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ ప్రాజెక్టునే నిలిపివేసింది. అదే ఆయన ఉద్యమంలో అత్యంత ఘన విజయం. అంతేనా, ఆయన పోరాటం మూలంగానే మనేరి, బైరోన్ ఘాటి వంటి ప్రాజెక్టులపైనా సమీక్షలు జరిగాయి. అలాగే, భగరథీ ఎకో సెన్సిటివ్ జోన్ ప్రకటనకూ ఆయన ఉద్యమమే మూలమైంది.

గంగానది భారతీయులకు సాధారణ నీరు కాదన్నదే అగర్వాల్ అభిమతం!

ఓసారి ది గార్డియన్ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే… హిందువులకు గంగానీరు సాధారణ నీరు కాదు.. అది వారి విశ్వాసానికి జీవన్మరణ సమస్యగా చెప్పుకొచ్చారు.

111 రోజుల నిరాహార దీక్ష కథేంటి..?

2018, జూన్ 22వ తేదీన హరిద్వార్ లోని మాత్రి సదన్ ఆశ్రమంలో మొదలైంది జీడీ అగర్వాల్ చివరి నిరాహర దీక్ష.

గంగా రక్షణ చట్టం, గంగపై తీసుకునే ఏ నిర్ణయమైనా గంగా భక్తి పరిషత్ కు తెలిపే చేసేలా పరిషత్ కు చట్టబద్ధతనివ్వడం, ఎగువ గంగపై ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు నిలిపివేయడం, అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, సహజ ప్రవాహాన్ని అడ్డుకునే ఆనకట్టల నిర్మాణం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లతో స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్ మళ్లీ దీక్షకు కూర్చున్నాడు.

గంగా, భగీరథ సమానులైన అని గౌరవిస్తూ పాలకులకు లేఖలు రాశాడు. గంగను కాపాడాలంటే నీటిని శుభ్రం చేస్తే సరిపోదు.. దాని సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించాలని కోరాడు. కానీ, పాలకులు మాత్రం కరగలేదు. మొదట తేనె, నీటిని తీసుకున్న అగర్వాల్.. తర్వాత్తర్వాత నీరు కూడా తీసుకోవడం మానేశారు. ఇంట్రావీనస్ చికిత్సకు కూడా నిరాకరించారు. చివరకు 111వ రోజు ఆయన కన్నుమూశారు.

అగర్వాల్ త్యాగం ఏదైనా మార్పు తెచ్చిందా..?

లేదు. అధికార పీఠమెక్కే వరకూ ఇంటింటికీ, గడప గడపకూ తిరిగి అయ్యా, అవ్వా అంటూ మొక్కుకుంటూ అధికారపీఠమెక్కే పాలకులు.. ఆ తర్వాత తమకు తామే దైవస్వరూపాలుగా ఊహించుకుంటారు. అంతకుముందు లేని కాఠిన్యం, అధికార మదం ఆవహిస్తాయి. అందుకే అగర్వాల్ పోయినా గంగా రక్షణ చట్టం రూపుదాల్చలేదు. అమలులోకి రాలేదు. కానీ, ఆయన వినిపించిన ఒక ఆలోచన మాత్రం నేటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంది. నది ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని శుభ్రపరిస్తే సరిపోదు.. అది సహజ ప్రవాహంతో జీవనదిలా ఉండాలి. ఈ భావనే ఇప్పటికీ గంగా పరిరక్షణ చర్చల్లో కీలకాంశం.

పాలకులు పట్టించుకోపోతేనేం… సమాజంలో మార్పు తెచ్చారు!

గురుదాస్ అగర్వాల్ ఆశయాలను పాలకులు పట్టించుకోలేదు. కానీ, ఆయన్నెప్పుడూ కలవని.. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నవారెందరో ఆయన ఆలోచనలను తమ ఉద్యమాలకు ప్రేరణగా తీసుకుంటున్నారు.

పాట్నాకు సంబంధించిన ఇంజనీర్ శుభమ్ కుమార్ ప్రతీ ఆదివారం ఒంటరిగా వెళ్లి.. గంగా నది ఒడ్డున క్లీన్ అండ్ గ్రీన్ చేబడతారు. శుభమ్ కుమార్ ఒక వ్యక్తిగా ఆరంభమైన ఆ ఉద్యమం.. ఇప్పుడు బీయింగ్ హెల్పర్ ఫౌండేషన్ గా రూపాంతరం చెంది 11 వందలకు పైగా వాలంటీర్ల నెట్వర్క్ గా ఏర్పాటై గంగా పరిరక్షణకు నడుం బిగించింది.

ఒక లక్షా నలభై వేల కిలోలకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను గంగ నుంచి తొలగించింది. రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసింది. నదీ తీరాల్లో చెత్త వేయడానికి వేలాది బుట్టలను పంపిణీ చేసింది. వారణాసి, రాంచీ వంటి నగరాలకు తమ సేవల్ని విస్తరించింది.

ఉత్తరాఖండ్ లో వెలసిన మరో సంస్థ ప్రాజెక్ట్ అవిరల్!

ఉత్తరాఖండ్ లో వెలసిన ప్రాజెక్ట్ అవిరల్ కు కూడా గురుదాస్ అగర్వాలే ప్రేరణ. హరిద్వార్, రిషీకేశ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది.

చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. స్థానిక మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకు సహకరిస్తోంది. గంగా నదిని పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక ప్రజలు, యాత్రికుల్లో అవగాహన కల్పిస్తోంది.

జీడీ అగర్వాల్ ప్రాణత్యాగం గంగను పూర్తిగా మార్చకపోయినా… శిలల్లా మారిపోయి కరడుగట్టిన పాలకులను కరిగించకపోయినా… నది పరిరక్షణ అంటే పరిశుభ్రత మాత్రమే కాదు.. దాని సహజ ప్రవాహంతో జీవనదిలా ఉంచడమనే మోటోను భారతదేశ వ్యాప్తంగా ప్రచారంలోకి తెచ్చింది.

ఉద్యమంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలు!

కోల్ కత్తాలోని వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ పరిశోధకులు.. గోముఖ్ నుంచి హరిద్వార్ వరకూ సుమారు 310 కిలోమీటర్ల మేర కాలిబాట పట్టారు. తన పాదయాత్రతో హిమాలయాల మారుమూల ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఘాట్స్ ను శుభ్రపర్చారు. నదీ కాలుష్యంపై స్థానిక ప్రజానీకంలో అవగాహన కల్పించారు.

వేల కిలోల కుళ్లిపోని నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను తొలగించేశారు. అదే సమయంలో గంగానది పుట్టుకైన హిమానీనదం సమీపంలోనే కాలుష్యం ప్రారంభమవుతోందనే వాస్తవాన్నీ వెలుగులోకి తెచ్చారు.

ఒక్క జీడీ అగర్వాల్ పదేళ్ల పోరాటం లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చు.. ఆయన ప్రేరణతో చేపట్టినవారి లక్ష్యాలూ వందశాతం ఫలితాలు సాధించకపోవచ్చు.. చట్టపరమైన రక్షణకు ప్రత్యామ్నాయాలు కాకపోవచ్చు… అలాగే, గంగా నది ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యకూ అవే పరిష్కారమూ కాకపోవచ్చు. అయితే, ప్రయత్నాలన్నీ కలగలిసి ఆయన స్ఫూర్తిని మాత్రం ముందుకు తీసుకుపోతుండటం నిజం.

జీడీ అగర్వాల్ చివరి దీక్ష చట్టం కోసం చేసిన పోరాటం మాత్రమే కాదు.. గంగను కాపాడటం కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు.. అది సమిష్ఠి బాధ్యత.. సామాజిక బాధ్యత అనే ఒక సందేశముంది అందులో. అదే ఆయన అసలు లక్ష్యం.

నది అంటే కేవలం నీరు మాత్రమే కాదు.. ఆ ప్రాంత నాగరికతలో ప్రధాన భాగం. లక్షలాది జీవితాలను నిలబెట్టే సజీవ జీవావరణ వ్యవస్థ. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటే.. పౌర సమాజానిది.

మరి 111 రోజుల జీడీ అగర్వాల్ దీక్షనే లైట్ తీసుకున్న ప్రస్తుత పాలకులు.. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను ఎంతమేరకు పట్టించుకుంటారన్నదే ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles