Ramu Suravajjula… ✍🏻 Senior journalist
మావోయిస్టుల కుటుంబాలు పడే బాధ వర్ణనాతీతం. అదొక గుండెలు పగిలే ఘోష. పెద్ద నరకం. చేతికి అందివచ్చిన పిల్లలు అడవి బాట పట్టారన్న పుట్టెడు దుఃఖం, వెలి వేసే చుట్టాలూ పక్కాలూ, చుట్టుపక్క జనాలు, అధికార పోలీసుల సతాయింపు, ప్రైవేట్ పోలీసుల వేధింపులు. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనన్న భయం. ఎక్కడ ఎన్కౌంటర్ వార్త విన్నా… మృతుల వివరాలు తెలిసే దాకా గుండె దడ.

నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో గుడిసెలో ఉండే… ఒక వృద్ధ జంటని 2004 లో అనుకుంటా నేను ఇంటర్వ్యూ చేశాను… ది హిందూ రిపోర్టర్ గా. వారి కథనం పూర్తిగా తెలుసుకుని ఒక వారం పాటు నిద్ర పోలేకపోయాను. కాలేజీ కి పోయి నౌకరిలో చేరతారనుకున్న ఇద్దరు కొడుకులు – కోనపురి సాంబశివుడు, కోనపురి రాములు – అన్నల్లో కలిసి కనిపించకుండా అటునుంచటు అడవిలోకి పోయారు. పెద్ద యాక్షన్స్ లో పాల్గొని క్రమంగా నేతలుగా ఎదిగారు. ఆ సమయంలో ఆ వృద్ధ జంట మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి కంటతడి పెట్టించాయి. వారు జీవచ్ఛవాలుగా ఉన్నారు. జనం మేలు కోసమని అడవి బాట పట్టిన ఇద్దరు కొడుకుల గురించి వారు ప్రతి క్షణం ఏళ్ల తరబడి బెంగతోనే ఉండేవారు. బిక్కు బిక్కున బతుకుతున్న ఆ తల్లిని చూస్తే గుండె బరువెక్కింది. ఆ అమ్మకు మావో తెలియదు, సమ సమాజ సిద్ధాంతం తెలవదు. పిల్లలు తిన్నారో, లేదో… ఎట్లున్నారో, ఏమో…అన్నదే క్షణ క్షణం పీడించి పిప్పిచేసే మనోవ్యధ.
“ఏడ్వ బోకమ్మ…
నువు తుడ్వబోకమ్మ…
సల్లంగ దీవించి నను సాగనంపమ్మా…
నిజాన్ని నింగికెత్తి… భయాన్ని పారదోలి…
పదిమంది కొరకు నిలచి…ప్రాణాలనైన ఇచ్చి…”
అనే విప్లవ గీతం ఆ తల్లిని చూస్తే గుర్తుకు వచ్చింది. ఆ తల్లిదండ్రుల త్యాగం మామూలుది కాదు. ఆ తర్వాత పరిణామక్రమంలో… పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు అన్నదమ్ములూ దారుణ హత్యకు గురయ్యారనేది వేరే విషాద విషయం.
మావోయిస్టు అగ్రనేత, గిరిజన బిడ్డ హిడ్మా ఆంధ్ర ప్రదేశ్ లో విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న జిల్లాలో అటవీ ప్రాంతంలో భార్య సహా ఎన్కౌంటర్ లో మరణించాడంటే… ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో గుడిసె లో ఉన్న ఆయన వయోధిక తల్లి మాద్వి పుంజే గుర్తుకు వచ్చింది. ఇప్పటికే కూతురిని, కొడుకుని పోరాటంలో కోల్పోయిన ఆమె కళ్లలో నీళ్ళు ఇంకిపోయాయి. కన్న బిడ్డలు ముగ్గురిని కోల్పోయిన ఆ వృద్ధురాలు ఏకాకి అయ్యింది. “ఏడ్వ బోకమ్మ…నువు తూడ్వబోకమ్మ…” గుర్తుకు వస్తుంది. హిడ్మా గురించి ఆలోచనాపరులు, విప్లవ ప్రేమికులు ఏమనుకుంటేనేం…ఆమె కడుపుకోత తీరుతుందా? క్షణమొక యుగంగా పిల్లల కోసం ఎదురుచూసి అలసి సొలసింది ఆ పిచ్చితల్లి. పరుల హితం కోసం తూటాలు ఛిద్రం చేసిన విగత శరీరాలే ఆమెకు మిగిలాయి. జన్ జీ పిల్లలు ఎక్కువలో ఎక్కువ ఒక పది నిమిషాల్లో, కులాసా జీవులు రెండు రోజుల్లో, విప్లవం వర్ధిల్లుతూనే ఉండాలని…పొట్ట కదలకుండా ఇంట్లో ఉండి గట్టిగా భావించే వారు మహా అయితే ఐదారు రోజుల్లో ఈ ఘటన మరిచిపోతారు. శారీరకంగా, మానసికంగా అలసి సొలసి చివరి రోజుల్లో ఉన్న ఆ అమ్మ పుంజే ను ఎవరు ఆదుకుంటారు? అవసాన దశలోనైనా ఆ అమ్మకు గంజైనా దొరుకుతుందా? ఈ కడుపుకోత తీరడం ఎట్లా?
ఇది పెద్ద సంక్లిష్టమైన కాలం. మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చి లోపు ఖతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్రం వెంటాడి వేటాడి చంపుతోంది. చాలా పెద్ద వ్యూహంతో సాగుతోంది. కొన్ని మాట్లాడుకోగలం. అన్నీ మాట్లాడుకోలేం. మనకున్న లౌక్యం హిడ్మా లాంటి వాళ్లకు లేదు కదా! మనం స్మార్ట్, కాలిక్యులేటేడ్. ఆ తల్లికి మాత్రం ఒక పెద్ద చేదు నిజం. ఆమె కోసం రెండు కన్నీళ్ళు కారిస్తే పెద్దాయన చూస్తారేమోనన్న భయం! తప్పులేదు.
లొంగుబాటు బాటలో ఉన్న హిడ్మా పోలీసు తూటాలకు నేలకొరిగినట్లు చెబుతున్నారు. అది ప్రైజ్ క్యాచ్. అత్యంత ప్రభావశీలురైన హిడ్మా లాంటి మావోయిస్టు నేతలను రాజ్యం తేలిగ్గా లొంగనిచ్చి సేఫ్ ప్యాసేజ్ ఇస్తుందనుకోవడం అమాయకత్వం. అది అవగాహనా రాహిత్యం. ఎవరి లాజిక్ వారిది. విప్లవంలో భాగంగా హిడ్మా ప్లాన్ చేసి చంపిన వారి తల్లులూ ఇంతే గుండెకోతకు గురై ఉండరా? అంటే… కాదని ఎవరనగలరు?
అయినా…ఇది యుద్ధం. ఇక్కడ కనికరం, జాలి, మానవత్వం ఉండవు. ఎవరికి అనువుగా ఉంటే వారు ముందుగా బుల్లెట్ దింపుతారు. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? అనేది ఎడతెగని డిబేట్.
ఏదేమైనా, దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడి నేలకొరిగిన ముగ్గురు పిల్లల మాతృమూర్తి దుఃఖం ఎవరూ తీర్చలేరు. ఎర్రెర్రని ఎన్ని దండాలైనా సరిపోవు. బస్తర్ చెట్ల నుంచి, పువ్వర్తి పువ్వుల నించి ఆ తల్లికి ఇంత అన్నం, కొంత ఊరట దొరికితే బాగు.
దొంగ కమ్యూనిస్టులను, గ్లిజరిన్ కన్నీళ్లను,
సమాజపు రెండు నాల్కల ధోరణిని, జనాల స్వార్థాన్ని దగ్గరి నుంచి చూసి…విప్లవం అనే వీరోచిత భావన పట్ల నమ్మకం సడలిన వారు ప్రస్తుతానికి కోరుకుంటున్నది… ఈ రక్తపాతం ఇంతటితో ఆగితే బాగని.



