మన పింక్ సిటీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ నగరం. ఇటాలియన్ నగరాన్ని వెనక్కి తోసేసి ర్యాంకింగ్స్ లో ముందొక్చిన గులాబీ నగరం.
ట్రావెల్ అండ్ లీజర్స్ అనే సంస్థ 2025లో చేసిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే పర్యాటకులు అత్యుత్తమ 5వ నగరంగా భావించిన సిటీగా జైపూర్ ఇప్పుడు టాప్ లో నిలుస్తోంది. మెక్సికోలోని శాన్ మిగ్యుల్ డి అల్లెండే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
మూడు యునెస్కో వారసత్వ ప్రదేశాలకు నిలయంగా జైపూర్ కు పేరు.

2019, జూలై 6వ తేదీన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ ట్విట్టర్ లో తన అధికారిక ఖాతాలో జైపూర్ ను గొప్ప వారసత్వ పట్టణ ప్రాంతంగా పేర్కొంది. జంతర్ మంతర్, అమెర్ ఫోర్ట్ గా పిల్చుకునే అంబర్ కోట, గులాబీ నిర్మాణాల శైలితో యునెస్కో గుర్తింపు పొందిన నగరం జైపూర్.
జైపూర్ కు ఐదో ర్యాంక్ ఎందుకు దక్కింది..?
ప్రతీ ఏటా ట్రావెల్, లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ సర్వే.. ఆయా నగరాలను వాటి సందర్శనార్థక, సాంస్కృతిక, ఆహార, వాతావరణ అంశాల వంటి కీలక ప్యారామీటర్స్ ఆధారంగా రేటింగ్ ఇస్తూ ఉంటుంది. అలా 2025లో, జైపూర్ నగరం 91.33 స్కోర్ సాధించి.. 90.08 స్కోర్ తోనున్న ఇటాలియన్ నగరమైన ఫ్లోరెన్స్ ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది.
మరి ఇంకా ఏ ఏ నగరాలు.. జైపూర్ కంటే ముందంజలో ఉన్నాయి..?
ప్రపంచంలోని పర్యాటకులు విరివిగా వచ్చే ఉత్తమ నగరంగా మెక్సికోలోని శాన్ మిగ్యుల్ డి అల్లెండే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీని స్కోర్ చూస్తే 93.44గా సర్వే రిపోర్ట్ పేర్కొంటోంది.
ఇక ఇతర నగరాల విషయానికొస్తే!
థాయిలాండ్‌లోని చియాంగ్ మై 91.94 స్కోర్ తో 2వ స్థానాన్నీ… అలాగే, జపాన్ రాజధాని టోక్యో 91.63 స్కోరుతో 3వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో బ్యాంకాక్ 91.48 స్కోర్ తో నాల్గవ స్థానంలో ఉన్నాయి.
జైపూర్ మాజీ యువరాణి, ప్రస్తుత రాజస్థాన్ పర్యాటక మంత్రైన దియా కుమారి జైపూర్ సాధించిన ఘనత రాజస్థాన్ కే పరిమితమైంది కాదు.. భారత్ కే గర్వకారణమంటూ పేర్కొంది.
ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్ లో నిల్చిన ఏకైక నగరంగా కూడా జైపూర్ ఇప్పుడు ఘనత సాధించింది. గతంలో ఇదే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఒకసారి ఈ ర్యాంకింగ్స్ లో స్థానం పొందింది. మొత్తంగా రాజస్థాన్ నుంచి తరచూ ఏదో ఒక నగరం వరల్డ్ క్లాస్ సాంస్కృతిక నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంటుండటం విశేషం.

ఇక జైపూర్ గురించి కాస్త!
భారత్ లోని వాయువ్య రాష్ట్రమైన రాజస్థాన్ లోని గోడల నగరంగా పిల్చుకునే జైపూర్ ను 1727లో రాజ్ పుట్ పాలకుడైన జైసింగ్ 2 ఈ నగరాన్ని స్థాపించాడు. అతడి పేరుమీదనే జై అనే పేరుతో జైపూర్ గా స్థిరపడింది. నాటి రోజుల్లోనే ప్రణాళికాబద్ధమైన నగరంగా జైపూర్ కు పేరు. కొండ ప్రాంతాల్లో ఉన్న నగరాల మాదిరిగా కాకుండా.. మైదానంలో నిర్మించబడ్డ సిటీ జైపూర్. ఇక్కడ ప్రధాన వీధుల వెంట కనిపించే దేవాలయాల నుంచి ఇళ్లు, మార్కెట్లు, దుకాణాలు ఇలా అన్నీ ఒకే రకమైన ముఖభాగాల్ని కల్గి ఉండటం ఒక యూనిఫార్మిటీని కళ్లకుగడుతుంది.
అమెర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఈ జైపూర్ ను స్థాపించాడు నాటి జైసింగ్. ఆర్కిటెక్చర్ కు మంచి ప్రాధాన్యతనిచ్చి, అధ్యయనం చేసి ఈ జైపూర్ నిర్మాణాన్ని చేపట్టారు నాటి రాజు. ఈ నగరానికి తూర్పు, పడమర, ఉత్తరం వైపు మూడు ప్రధాన స్వాగత ద్వారాలు మనకు కనిపిస్తుంటాయి. నాడే ఈ నగరాన్ని తొమ్మిది బ్లాకులగా విభజించారు. రెండింటిలో రాజభవనాలు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యభవనాల నిర్మాణానికి ప్లాన్ చేస్తే.. మిగిలిన ఏడు బ్లాకుల్లో ప్రజలకు సంబంధించిన గృహ, మార్కెట్, వినోద అవసరాల కోసం కేటాయించారు.
ఆధునిక భారతీయ నగరాల్లో ఒక అసాధారణ కట్టడాలతో గులాబీ రంగులో మెరిసిపోతుంది జైపూర్. 19వ శతాబ్దంలో జైపూర్ మరింతగా అభివృద్ధి చెందింది. 2008లోనే కొండే నాస్ట్ ట్రావెల్లర్ రీడర్స్ ఛాయిస్ సర్వేలోనూ ఆసియాలో జైపూర్ కు ఏడో స్థానం దక్కింది.
హవా మహల్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, అమెర్ కోట, జంతర్ మంతర్, సహర్ ఫోర్ట్, జైఘర్ ఫోర్ట్, బిర్లా మందిర్, గోవింద్ దేవ్ జీ ఆలయం, ఘర్ గణేశ్ ఆలయం, మోతీ డుంగ్రీ గణేశ్ ఆలయం, సంఘిజీ జైన దేవాలయం, జైపూర్ జూ వంటివెన్నో సందర్శక స్థలాలు జైపూర్ కు వెళ్లిన పర్యాటకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయి. పిరమిడ్ ఆకారపు స్మారక చిహ్నంగా కనిపించే హవా మహల్ ఐదంతస్థులతో కనువిందు చేస్తుంది. జైపూర్ కు వెళ్లితే రాజ్ మందిర్ వంటి ఒక పురాతన సినిమా హాల్ ను కూడా మనం చూడొచ్చు.
ఉత్తర భారత శాస్త్రీయ నృత్యమైన కథక్ లో భాగంగా జైపూర్ ఘరానా కూడా ప్రత్యేకమైన శైలిలో అలరిస్తుంది. అలాగే, జానపద నృత్యరీతైన ఘూమర్ వంటి తమాషా నృత్యరీతులకూ జైపూర్ పెట్టింది పేరు. సాహిత్యానికీ పెద్దపీట వేసే జైపూర్ లో పండుగలు, వేడుకలన్నీ ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రోస్థెటిక్ లెగ్స్ ఏర్పాటులోనూ జైపూర్ ఎంత గొప్పదో మనం మయూరి సినిమా ద్వారా చూసినవాళ్లమే.
హస్తకళాకారులకూ పెట్టింది పేరైన జైపూర్ ఒక వైవిధ్యమైన ప్రాంతం. అందుకే ఇప్పటికే 165 దేశాల్లోని 1200కు పైగా యునెస్కో వారసత్వ గుర్తింపును పొందిన ప్రదేశాలుంటే.. అందులో మన పింక్ సింటీ జైపూర్ కూడా ఒకటి కావడం గమనార్హం.



