ఉత్థానం నుంచి పతనం వరకు: ఆమె.. తెలుసుకోవాల్సిన సమకాలీన కథ!

చందా కొచ్చర్.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల గురించి అంతో ఇంతో తెలిసినవారందరికీ ఈ పేరు సుపరిచతమైందే. ఒక యంగ్ మేనేజ్మెంట్ ట్రైనీగా బ్యాంకింగ్ రంగంలో జీవితాన్ని ఆరంభించి.. ఎలా ఎదిగిందో.. అదే స్థాయిలో లొసుగులతో చట్టాలనూ ఉల్లంఘించి వార్తల్లోకెక్కింది.

వాస్తవానికి బ్యాంకింగ్ రంగంలో చందా కొచ్చర్ జర్నీ అసాధారణమైంది. పురుషాధిక్య సామ్రాజ్యంలో ఆ లింగ వివక్షను, అడ్డంకులను ఛేదించి బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరారామె. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత అవార్డులనూ స్వీకరించింది. కానీ, చివరకు తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి దారి ఎంచుకున్నారన్న ఆరోపణలు.. దశాబ్దాల కాలం కష్టపడి సంపాదించుకున్న ఆమె గౌరవాన్ని మంటగల్పాయి.

వీడియోకాన్ గ్రూపుకు 300 కోట్ల రూపాయల రుణమిచ్చినందుకుగాను.. 64 కోట్ల రూపాయల లంచం తీసుకున్న కేసులో ఆమె దోషిగా తేలింది. ఈ జూలై 3వ తేదీన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో కొచ్చర్ బ్యాంకింగ్ రంగ జీవితంలో ఓ మాయని మచ్చను మూటగట్టుకుంది.

ఐసీఐసీఐ బ్యాంకులో ఆరోహణ క్రమంలో ఆమె ఎదిగిన తీరు.. వాస్తవానికి ఆమెను ఓ రోల్ మాడల్ గా నిలబెట్టాయి. అలాంటి రోల్ మాడల్ గా ఎదిగాక ఒక్కసారిగా మోరల్స్ ను పక్కనబెట్టి లంచాలకెగబడ్డ ఆమె తీరు ఉత్థానాన్ని చూడ్డానికి ఎంత సమయం వేచి చూడాల్సి వచ్చిందో.. పతనం మాత్రం వడివడిగా ఆమెను దేశం ముందు ఓ దోషిగా నిలబెట్టింది.

ఓ మధ్యతరగతి అమ్మాయి.. బ్యాంకింగ్ రాణిగా!

1961లో జ్యోథ్ పూర్ లో జన్మించిన చందా కొచ్చర్.. ముంబైలో పెరిగింది. తండ్రి అకాల మరణం తర్వాత తల్లే ఆమెకు తల్లీదండ్రీ అయింది. జైహింద్ కళాశాలలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలైన కొచ్చర్.. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మకమైన జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె విశ్లేషణాత్మక సామర్థ్యం ఆమెను కళాశాల రోజుల్లోనే ప్రత్యేకంగా నిలిపింది. 1984లో ఆమె ఐసీఐసీఐలో మేనేజ్మెంట్ ట్రైనీగా జాయినైంది. అయితే అంచెలంచెలుగా అదే ఐసీఐసీఐలో ఆమె మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సీఈవో స్థాయికెదిగిన తీరు.. తనలాంటి ఎందరో యువతులకు మేనేజ్మెంట్ రంగంలో మార్గదర్శకంగానూ మారింది.

ఐసీఐసీఐలో కొచ్చర్ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో.. ఆమె అత్యున్నత సీఈవో స్థానానికెదిగేంతవరకూ అంతే స్థిరంగానూ సాగింది. అవిశ్రాంతంగా పని చేసే తీరు.. క్రెడిట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వంటివాటిపై ఆమెకున్న లోతైన అవగాహన ఆమెను మిగిలిన ఉద్యోగులతో ప్రత్యేకంగా నిలిపింది. అందుకే, 1990ల కాలంలోనే అప్పటి ఐసీఐసీఐ సీఈవోగా ఉన్న కె.వి. కామత్ ఆమె సామర్థ్యాన్ని గుర్తించి.. సంస్థను ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి పూర్తి స్థాయి బ్యాంకుగా మార్చే క్రమంలో తన కోర్ టీంలోకి తీసుకున్నారు. అదే చందా కొచ్చర్ ఉద్యోగ జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ అయింది.

ఐసీఐసీఐ పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకుగా రూపాంతరం చెందడంతో.. ఆమెకు రిటైల్ వ్యాపార బాధ్యతలనూ అప్పగించింది యాజమాన్యం. ఆమె నాయకత్వంలో ఐసీఐసీఐ రిటైల్ బ్యాంకింగ్ విభాగం ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుండటంతో సంస్థకు చందా కొచ్చర్ పై అపారమైన నమ్మకమేర్పడింది. గృహరుణాలు, వాహనాల రుణాలు, పర్సనల్ లోన్స్ వంటి రిటైల్ లెండింగ్ పోర్ట్ ఫోలియోను బలంగా తయారుచేయగల్గింది కొచ్చర్. భారత్ లో విస్తరిస్తున్న మధ్యతరగతిలో ఐసీఐసీఐని తమ బ్యాంక్ అనుకునేవిధంగా మార్చగల్గింది. ప్రొడక్టివిటీ, క్రెడిట్ ఇన్నోవేషన్స్ వంటివి డెవలప్ చేయడమే కాదు.. రిటైల్ లెండింగ్ ను క్రమబద్ధీకరించే రిస్క్ మాడల్స్ నూ అభివృద్ధి చేసి ఐసీఐసీఐని బ్యాంకింగ్ సెక్టార్ లో నంబర్ వన్ గా నిలబెట్టింది.

కామత్ పదవీ విరమణనంతరం 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కమ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన కొచ్చర్.. భారతీయ ఫైనాన్స్ రంగంలో గుర్తింపు పొందిన అత్యున్నతస్థాయి అధికారిగా దేశం చూపును తనవైపు తిప్పుకుంది. ఒక ప్రైవేట్ బ్యాంక్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన మొట్టమొదటి మహిళా సీఈవోగా చందా కొచ్చర్ ఉద్యోగ ప్రస్థానం విలక్షణమైంది.

2008-09 మధ్య ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభమెదుర్కొంటున్న కాలంలో.. ఐసీఐసీఐ పనైపోయిందనుకుంటున్న తరుణంలో చందా కొచ్చర్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించింది. అప్పటికే ఐసీఐసీఐ దివాళా తీసిందనే పుకార్లు మిన్నంటుతున్న సమయమది. కానీ, చాలా కూల్ గా.. నిర్ణయాత్మకమైన నాయకత్వమంటే ఎలా ఉంటుందో పట్టిచూపేలా ఆమె ఐసీఐసీఐని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగల్గింది. వృత్తిపరంగా ఆమె సంక్షోభాలను ఓర్పుగా, అంతే నేర్పుగా గట్టెక్కించే తీరు బ్యాంకింగ్ రంగంలోని ప్రముఖుల నుంచి అప్లాజ్ అందించింది.

2003లో బ్యాంక్ రిటైల్ హెడ్ గా పనిచేస్తున్న సమయంలో.. గుజరాత్ లిక్విడిటీ క్రైసిస్ పుకార్లతో బ్యాంక్ ఇక పతనమైపోయిందనకున్న తరుణంలో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ టీంలో కొచ్చర్ కూడా ఓ సభ్యురాలు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభమెదుర్కొంటున్న సమయంలో ఐసీఐసీఐలో కొచ్చర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో 48 ఏళ్లకే సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలైన సీఈవోగా కూడా అవతరించింది. అప్పటికే మేనేజ్మెంట్ విభాగంలో సీనియర్స్ ఒక్కొక్కరుగా పదవీ విరమణలు చేసి వెళ్లిపోతున్న కాలంలో భారమంతా తనపై పడుతున్నా చందర్ నిరాశ చెందలేదు. ఆమె నాల్గు సీలపై దృష్టి సారించింది. కాస్ట్, క్రెడిట్, కరెంట్ అండ్, సేవింగ్ అకౌంట్స్, క్యాపిటల్ పై ఫోకస్ చేసి ఐసీఐసీఐ బ్యాంకును మళ్లీ గాడిన పడేసింది కొచ్చర్.

నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను తగ్గించడం, టెక్నాలజీలో భారీగా పెట్టుబడి పెట్టడం, ఐసీఐసీఐ డిజిటల్ బ్యాంకింగ్ పరిణామానికి పునాది వేయడంతో బ్యాలెన్స్ షీట్ ను బలోపేతం చేయడం వంటి సంస్కరణలతో ఆమె ఐసీఐసీఐ వృద్ధిలో కీలకపాత్రధారురాలైంది. 2013లో రూపాయి సంక్షోభం, రుణాలు తీసుకున్నవారి నుంచి పేరుకుపోతున్న మొండి బకాయిలు, కఠినతరంగా మారుతున్న ఆర్బీఐ నిబంధనలు ఇలాంటి ఎన్నో సవాళ్లను తన వ్యూహాత్మక నాయకత్వ శైలితో జయించింది.

చందా కొచ్చరు సాధించిన విజయాలు ఆమెపై ప్రశంసల వర్షాన్ని కురిపించాయి. 2011లో భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ఆమెను వరించింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వందమంది మహిళల్లో ఒకరిగా.. పలుమార్లు ఫోర్బ్స్ పత్రికలో చోటు దక్కించుకుంది. 2015లో టైమ్ మ్యాగజీన్ లోనూ వందమంది అత్యంత ప్రభావితమైన మహిళల జాబితాలోనూ కొచ్చర్ కు స్థానం దక్కింది. మొత్తంగా ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన బ్యాకింగ్ రంగ నాయకురాలిగా చందా కొచ్చర్ పేరు మార్మోగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక దశాబ్దకాలం ఐసీఐసీఐ అంటే కొచ్చర్… కొచ్చర్ అంటేనే ఐసీఐసీఐ అన్నట్టుగా ఆమే ఆ బ్యాంక్ ముఖచిత్రమైపోయింది. భారతీయ బ్యాంకిగ్ రంగానికీ, మహిళా నాయకత్వానికి ఆమె ప్రపంచ రాయబారిగా కూడా ఆమె నేతృత్వం వహించారు.

ఆమె సమయపాలనతో టైమే పోటీ పడాల్సివచ్చేది. టైట్ షెడ్యూల్స్ ను నిర్వహించడంలోనూ.. ఒత్తిడిని జయించి, ఫలితాలను సాధించడంలోనూ చందా కొచ్చర్ వెరీ కాన్ఫిడెంట్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా భర్తతో కలిసి భోజనం చేసేది. సాయంత్రం ఆరుగంటలైతే ఇంటికి వెళ్లిపోయేది. అటు ఐసీఐసీఐ సీఈవోగాను. ఇటు గృహిణిగానూ ఆమె ద్విపాత్రాభినయం చేయడంలోనూ ఎప్పుడూ మాట తెచ్చుకోలేదు.

విజయాలకు భిన్నంగా విమర్శలు!

2016 నాటికి కొచ్చర్ గురించి కొన్ని గుసగుసలు బయటకు వచ్చాయి. 2018లో ఓ విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో వీడియోకాన్ గ్రూప్ కు 300 కోట్ల రుణమివ్వడానికి ఆమె లంచం తీసుకుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ తన NuPOWERS రెన్యూవబుల్స్ కోసం.. ఐసీఐసీఐ నుంచి 300 కోట్ల రుణాన్ని పొందిన వీడియోకాన్ కన్సార్షియం నుంచి తెల్లవారే 64 కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని పొందాడనేది ప్రధానమైన ఆరోపణ. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ను NuPowersకు యజమానిగా చూపడమూ ఈడీ అనుమానాల్ని మరింత బలపర్చింది. అంతేకాదు, తన భర్త సారధ్యంలో నడుస్తున్న NuPOWERS కు అంతకుముందు నుంచే వీడియోకాన్ నడుస్తున్న సంబంధ, బాంధవ్యాలను ఆమె దాచిందనే ఆరోపణనూ ఎదుర్కొన్నారు చందా కొచ్చర్.

అది కాస్తా వివాదాస్పదంగా మారింది. అంతర్గత దర్యాప్తు ప్రారంభమైంది. చందా కొచ్చర్ మాత్రం తానెలాంటి తప్పు చేయలేదని వాదించింది. కొంతకాలం సెలవుపై వెళ్లిపోయిన చందా కొచ్చర్.. ఆ తర్వాత 2018 అక్టోబర్ లో ఐసీఐసీఐ బ్యాంకుకు రాజీనామా చేసింది. తన 33 ఏళ్ల కెరీర్ కు అదో విషాదమైన ముగింపుగా మిగిలిపోయింది.

ఆ తర్వాత సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ దర్యాప్తులో షెల్ కంపెనీలు.. వాటి ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన స్కామ్ బయటకొచ్చింది. 2023లో చందాకొచ్చర్ తో పాటు, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పై అభియోగాలు నమోదయ్యాయి. జాతీయస్థాయిలో చందా కొచ్చర్ కేసు సంచలనంగా మారింది. ఒకనాడు బ్యాంకింగ్ రంగాన్నే అబ్బురపర్చిన ఓ మహిళ తీవ్ర నేరారోపణలను ఎదుర్కోవడం దేశమంతా చర్చనీయాంశమైంది. 2025, ఈ జూలై 3వ తేదీన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమెపై నేరాలను ధృవీకరించింది. క్విడ్ ప్రోకో కేసుగా తేల్చిచెప్పింది. ఐసీఐసీఐ నుంచి రుణాన్ని పొందేందుకు ఆమె భర్త కంపెనీకి ఆర్థికమేలు చేసే, వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందే దురాశతో వ్యవహరించిన తీరు బట్టబయలైంది.

పితృస్వామ్య వ్యవస్థలోని సవాళ్లను ఎదిరించి ఆమె ఎదిగిన తీరు.. భారతీయ బ్యాంకింగ్ రంగాన్నే ఆమె నాయకత్వంలో ఆధునీకరించిన విధానం.. లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్న శైలి.. ఆమెను విజయతీరాలకు చేర్చిన ఉత్థానాన్ని పట్టి చూపిస్తే… వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీపడితే ఎలా పతనావస్థను చూస్తారో కూడా అదే చందా కొచ్చర్ కథ మనకు చెబుతోంది.

భారతీయ మహిళ ఏదైనా సాధించగలదనేదానికి చందా కొచ్చర్ జీవితం ఒక ఉదాహరణ. ఒకవైపు ఎదుగుదల, మరోవైపు ప్రమాదం రెండింటినీ ప్రతిబింబించిన ఓ భిన్న కథైంది చందా కొచ్చర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles