నైటెంగిల్ ఆఫ్ ఇండియాగా లతా మంగేష్కర్ పాటల ప్రయాణం పరిచయం అక్కర్లేనిది. కానీ, ఆమె కొన్ని సినిమాలకు సంగీతాన్ని కూడా అందించారు. అదే సమయంలో ది గ్రేట్ డైరెక్టర్ హృషీకేశ్ ముఖర్జీ అంతటివాడడిగినా.. తన సినిమాకు సంగీత దర్శకత్వం చేయడానికి నిరాకరించారు. ఏంటా విశేషాలు..?
లతా మంగేష్కర్ స్వరానికి సామాన్యులే కాదు.. చాలామంది ప్రఖ్యాత దర్శకులు కూడా వీరాభిమానులు. వారిలో ప్రముఖ దర్శకుడు వి. శాంతారామ్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ఝనక్ ఝనక్ పాయల్ బాజే, దో ఆంఖే బారా హాథ్, పింజ్రా వంటి సినిమాలకు లత తన కెరీర్ లోనే అద్భుతమైన పాటలు పాడారు. చాలామందికి లత పాటలు పాడే ఓ గాయకురాలిగా మాత్రమే పరిచయం. కానీ, ఆమె సంగీత దర్శకురాలిగా కూడా పనిచేసిన విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

గాయకురాలిగా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పాటల పూదోటలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న లత.. మరెందుకు విరివిగా సంగీత దర్శకత్వం చేయలేదు..? ప్రముఖ దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీకి కూడా సంగీతమందించేందుకు ఎందుకు నిరాకరించారు..?
శాంతారామ్ కు ఇచ్చిన మాటే లతను కట్టిపడేసింది!
హృషీకేశ్ ముఖర్జీ ఆనంద్ సినిమా కోసం లతా మంగేష్కర్ నే మొదట సంగీత దర్శకత్వం వహించాలని అప్రోచ్ అయ్యారు. కానీ, లత ససేమిరా అంది. అందుకు కారణం వి. శాంతారామ్ కు ఆమె ఇచ్చిన హామీనే. లతాజీ మీరెప్పుడైనా హిందీ సినిమాకు సంగీతం అందించాల్సి వస్తే.. అది మొట్టమొదట తన సినిమాకే కావాలని ఒక ప్రమాణాన్ని లత నుంచి వి. శాంతారామ్ తీసుకున్నారట.
సంగీత దర్శకురాలిగా లత ప్రస్థానం!
లత గాయకురాలిగానే కాకుండా.. సంగీత దర్శకురాలిగా కూడా పనిచేసింది. కానీ, మరాఠీ చిత్రాలకే ఆమె సంగీత దర్శకత్వం పరిమితమైంది. 1950లో దీన్కర్ పాటిల్ దర్శకత్వం వహించిన రామ్ రామ్ పాహునాతో లత సంగీత దర్శకత్వం ప్రారంభమైంది. ఆ తరువాత ఆనందఘన్ అనే పేరుతో మోహిత్యాంచి మంజులా, మరాఠా తితుకా మెల్వావా, తాంబడి మట్టి వంటి మరికొన్ని మరాఠీ చిత్రాలకు కూడా లత స్వరరచన చేశారు.

ఎందుకు హిందీ చిత్రాలకు లత సంగీతం చేయలేదు..?
ఎందుకోగానీ.. లత హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించేందుకు ఎప్పుడూ సుముఖత ప్రకటించలేదు. బహుశా దానివల్ల కలిగే మంచి, చెడుల బేరీజు వల్ల ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. లేక, ఇంకేవైనా కారణాలూ ఉండి ఉండొచ్చు. పూర్తిగా అది ఆమె సొంత నిర్ణయం. ఆనంద్ చిత్రానికి లతను సంగీతం అందించాలని హృషికేశ్ ముఖర్జీ ఎంతో ఉత్సుకత చూపాడు. కానీ ఆమె మాత్రం మర్యాదగా నిరాకరించారు. తన హిందీ సినీ సంగీత దర్శకత్వ ప్రస్థానం… మాట ఇచ్చిన ప్రకారం కేవలం శాంతారామ్ చిత్రంతోనే మొదలవ్వాలనే వాగ్దానమే కారణమై ఉండొచ్చన్న అభిప్రాయం దాంతో బలపడింది.
నేటి బాలీవుడ్ దర్శక సంచలనం సంజయ్ లీలా భన్సాలీపై.. శాంతారామ్ – లత కాంబినేషన్ ప్రభావం!
తన సినిమాలను రంగుల రంగులతో సీతాకోకచిలుకల వనాల్లా దృశ్యమానం చేసే నేటి దర్శక సంచలనం సంజయ్ లీలా భన్సాలీకి లత అంటే ఎనలేని అభిమానం. అంతకుమించి భక్తి. భన్సాలీ తీసిన బాజీరావుమస్తానీ సంగీతాన్ని విని లతతో పాటు, ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కూడా అభినందించారు.
అయితే, బాజీరావుమస్తానీ సినిమాలో భన్సాలీ కంపోజ్ చేసిన పింగా అనే పాటలోని లట్ పట్ లట్ పట్ అనే చలాకీగా వినిపించే లైన్స్.. శాంతారాం డైరెక్షన్ చేసి, లత పాడిన పింగా సినిమాలోని పాట స్ఫూర్తితో కంపోజ్ చేశాడు భన్సాలీ. అమర్ భూపాలీ సినిమాలోని ఓ పాటే అందుకు స్ఫూర్తి అని భన్సాలీ కూడా ఓసారి షేర్ చేసుకున్నారు. వి. శాంతారామ్ అన్నా భన్సాలీకి ఆరాధన. ఆయన దర్శకత్వం వహించిన దో ఆంఖే బారా హాథ్, నవరంగ్, ఝనక్ ఝనక్ పాయల్ బాజే వంటి సినిమాలన్నీ తన సినిమాలను శ్యావ్యమైన సంగీతంతోనూ, దృశ్యకావ్యంలానూ నిర్మించేందుకు స్ఫూర్తినిచ్చాయంటాడు భన్సాలీ. తన సృజనాత్మక ప్రయాణంలో శాంతారామ్ ప్రేరణ ఎప్పటికీ తన వెంట ఉంటుందనేది ఆ సంచలన దర్శకుడి మాట.



