భావుకతకు నెలవైన నేల… కవితాత్మక హృదయాలకు కొత్త సృజననందించే భూమి… మసాలా దినుసుల ఉత్పత్తులకు అనువైన పుడమి.. మొత్తంగా దైవభూమి. తొలి సూర్యకిరణాల నులివెచ్చని స్పర్శ తాకే.. ఆ సరిహద్దు రాష్ట్రమేది..?
అరుణాచల్ ప్రదేశ్ ఈ ఈశాన్య రాష్ట్రం ప్రత్యేకతలే వేరు. చైనా కన్నేసి ఇండియాతో గిల్లికజ్జాలు పెట్టుకునేందుకు వేదికవుతున్న ఈ రాష్ట్రాన్ని ఉదయించే సూర్యుూడి నేలగా అభివర్ణిస్తుంటారు.

మహత్తరమైన హిమాలయ సానువులనుస పచ్చని లోయలను ముద్దాడుతూ కంటి కెమెరాకు చిక్కే అద్భుత దృశ్యాలకు కేరాఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఆ ల్యాండ్ స్కేప్స్ తో ఆ భానుడు మొట్టమొదట తన వెలుగులు ప్రసరించే ప్రదేశం కాబట్టే.. ప్రతీకగా అరుణాచల్ ప్రదేశ్ అన్న పేరు వచ్చిందంటారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం, స్వభావమే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. చాలా భిన్నంగా, గొప్పగా కనిపిస్తుంది.
మొట్టమొదటి సూర్యుడి కిరణాలు అరుణాచల్ ప్రదేశ్ నేలనే తాకేందుకు కారణాలేంటి..?
భౌగోళిక రూపమే అరుణాచల్ ప్రదేశ్ లో ఆ సూర్యుడి కిరణాలు మొట్టమొదట ప్రసరించేందుకు కారణం. భూటాన్, మయన్మార్, చైనా వంటి ఇతర దేశాలతో సరిహద్దులను కల్గి ఉన్న రాష్ట్రమిది. అయితే, ఈ రాష్ట్రంలో కూడా సూర్యుడు మొట్టమొదట కనిపించేది డోంగ్ అనే ప్రాంతంలో.
అలాగే, గిరిజన వారసత్వాలకు కేరాఫ్ లా కనిపిస్తుంది అరుణాచల్ ప్రదేశ్. విభిన్న తెగలతో కూడిన గిరిజనులు, వారి సాంస్కృతిక వారసత్వం, ఆచార, వ్యవహారాలు, వారి దేవతారాధనలు, సూర్యుణ్నే దైవంగా ఆరాధించే వారి సంప్రదాయాలు వంటివెన్నో అరుణాచల్ ప్రదేశ్ ను మరింత ప్రత్యేకంగా నిలిపేవి.

అద్భుతమైన సహజ సౌందర్యానికి చిరునామా అరుణాచల్ ప్రదేశ్. మంచుతో కప్పుకున్న కొండలు, అరణ్యాలు, సియాంగ్, లోహిత్ వంటి నదులు, ప్రశాంతమైన లోయలు.. ఇలా ఇవన్నీ కలిపి అరుణాచల్ ప్రదేశ్ ను భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.
రాజధాని కూడా మరింత ప్రత్యేకం!
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ కూడా చాలా ప్రత్యేకంగా కనువిందు చేస్తుంది. పచ్చని చెట్లు, కొండల నడుమ ఈ రాజధాని పర్యాటకులను అలరిస్తుంది. పురాతన ఈటా కోటా ఇక్కడ చూడాల్సిన ప్రదేశం. మఠాలు, స్థానికుల జీవనశైలి ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల కంటే కూడా భిన్నంగా ఉంటూ.. పరిపాలనా , సాంస్కృతిక కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్ ను నిలబెడుతున్నాయి. మారుతున్న కాలానికనగుణంగా పాలనా పద్ధతులు మారుతూనే… పురాతన వైభవానికి, ప్రాచీన సంప్రదాయ రీతులకు పెట్టింది పేరన్నట్టుగా కనిపిస్తుంది అరుణాచల్ ప్రదేశ్.
అందుకే అరుణాచల్ ప్రదేశ్ ను సూర్యుణ్ని ముందుగా స్వాగతించే నేలగా మాత్రమే కాకుండా.. కొత్త ఆశలకు, సరికొత్త భవిష్యత్తుకు, మరింత నూతన ఆరంభాలకు వెలుగులను ప్రతిబింబించే రాష్ట్రంగా కూడా చెప్పుకుంటారు.



