Muralidhar Devarakonda.. ✍🏻
పేదరికం తప్ప మరేమి తెలియని స్థితిలో కోసింద్రా [ గుజరాత్] లోయలో అతను భార్య ప్రభ తో పాటు ఎద్దులబండి దిగినపుడు అతని వయసు 24 ఏళ్ళు.
చదువుకున్న వారిని నమ్మని అక్కడి కోయలు , గిరిజనులు చేతుల్లో బాణాలతో ఎదురు నిలబడ్డారు.

‘ నా దగ్గర మీ పట్ల ప్రేమ తప్ప ఏమీలేదు, ‘ అన్నాడు అతను.
అప్పులిచ్చి గిరిజనుల , పేదల భూములను లాక్కొనే భూస్వాములు , వ్యాపారులు ‘ వుండేందుకు ఇతనికి ఎవరైనా ఇల్లు ఇచ్చారంటే చంపుతామని ‘ బెదిరించారు.
ఆరు రోజులపాటు ఎండలో , చలిలో ఆ ఇద్దరు ఒక చెట్టు క్రిందే వున్నారు. నెమ్మదిగా వారి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.
వారికి శుభ్రంగా ఎలా వుండాలో నేర్పాడు , సాయంకాలాల్లో కథలు , మహాపురుషుల జీవితాల్లోని త్యాగాలు హత్తుకునేలాగా చెప్పడం మొదలు పెట్టాడు.
‘ మీరు వడ్డీ వ్యాపారులనుండి ఎంత అప్పు తీసుకున్నారో వారిని అడిగి రండి ‘ అని ఆ ప్రజలకు చెప్పాడు.
అలా అడిగిన ఒక హరిజనుడిని , వ్యాపారులు నిప్పంటించి కాల్చేసారు. ఆ కొండ , కోన మూగబోయాయి.
కానీ , అతను వదలిపెట్టలేదు.’ భయ పడొద్దు , పలకలు తీసుకురండి , వాటి మీదే మీరు తీసుకున్న అప్పుల వివరాలను రాయించుకుందాం, ” అని అతను వారితో అన్నాడు.’ కానీ , ఎవ్వరూ తెచ్చుకోలేదు.
‘ ఇతే నేను ఇవాళ భోజనం మానేస్తున్నాను , ‘ అన్నాడు. ఆ చిన్న త్యాగమే ఆ మనసున్న మట్టి మనుషులను కరిగించింది , కదిలించింది.
పలకలు తెచ్చుకున్నారు. వ్యాపారులను లెక్కలడిగారు. 300 శాతం వడ్డి ఎలా న్యాయమో చెప్పండి అన్నారు.
వ్యాపారులు వివరాలు చెప్పడానికి వొప్పుకోలేదు. అతనూ వెనుకడుగు వెయ్యలేదు.
ఆ సాయంత్రమే బరోడ వెళ్ళి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. వుదయాన్నే పోలీసులొచ్చారు. వ్యాపారులు భయపడి పోయారు , లెక్కలు చెప్పారు.
పేదలకు మోసం అర్థమయ్యింది. ధైర్యం పెరిగింది. వ్యాపారులు తప్పు వొప్పుకున్నారు.
బాణాలు పట్టుకున్న ఆ కోయలు , చెంచులు, బలపాలు పట్టుకున్నారు. ఇళ్ళలో దీపాలు వెలిగాయి, వూళ్ళో పాపాలు తగ్గాయి.
ఆ నేలను కాచిన వెన్నెల కోదండ రాముని కోవెలే అయ్యింది.
5000 కి.మీ. నడిచి , 18,000 ఎకరాల భూమిని పేదలకు ఇప్పించాడు. వారికి తోటల పెంపకం, పాడిపరిశ్రమ, పరిశుభ్రత, నేర్పాడు. 27 చెక్ డాములు నిర్మించి , వాన నీటిని పట్టుకున్నాడు. చెట్లు నరకడం మానిపించి గోబర్ గ్యాస్ అలవాటు చేయించాడు. 45 ఏళ్ళలో 3300 గ్రామాలు తిరిగి , 20 లక్షల మంది పేదల జీవితాల్లో గులాబీలు పూయించాడు.
కొన్ని తరాలను వెలిగించి , తాను మాత్రం ప్రపంచానికి తెలియకుండా మౌనంగానే వుండిపోయిన ఆ మహాత్యాగి హరివల్లభ్ మనలో ఎంత మందికి తెలుసు ?



