Mercy Margaret…. ✍🏻
ఇన్ని రోజులైనా Zubeen da గురించి ఆలోచనలు పోవటం లేదు. ఒక్కోసారి అల్గోరిథం వల్ల నడిచే ఈ సోషియల్ మీడియా ప్లాట్ఫారంల మీద కోపం ఉన్నా, ఇదొక మంచి పని చేసింది. జుబిన్ దా గురించి తెలుసుకునే వీలు కల్పించింది.
ZubeenGarg మరణ వార్త నుంచి ఫాలో అవటం మొదలుపెడితే ఎంత మంది ఎన్ని వీడియోలు.
హృదయం ద్రవించి పోయింది. కొన్ని ట్రిబ్యూట్ వీడియోలు చూసి నాకు కూడా దుఃఖం వచ్చేసింది. చిన్న పిల్లలా ఏడ్చేసాను.

ఒక Artist కి, అందునా సింగర్ చనిపోతే ఇంత దుఃఖం ఎందుకు ఈ అస్సాం ప్రజలకి అని అతని గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. అతడు కేవలం “యా అలీ” పాట పాడిన సింగర్ కాదు ..అస్సాం ప్రజల రాజు, దేవుడు.అతడు వారి ఊపిరి, వారి శ్వాస, వారి జానపద గీతాల వసంతం.
Zubeen da పాటలు వారి వ్యక్తిగత జీవితానికి, సామూహిక స్మృతులకు సన్నిహితంగా మిళితమై ఉన్నాయి. చిన్నపిల్లలు పాడుకుంటూ ఆడుకోవటం నుంచి, ఒక వృద్ధుడు తన కళ్లలో కన్నీళ్లతో విన్న గీతం వరకు ఆయన స్వరం ప్రతి గుండెల్లో నిలిచి పోయింది. అస్సాం సంస్కృతిని, భాషను, భావోద్వేగాలను సజీవంగా ఉంచిన స్వరమూర్తి ఆయన.
ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి పండుగలో ఆయన స్వరం ప్రతిధ్వనించింది. అందుకే Zubeen da వాళ్ళకి పెద్దన్న, ఇంట్లో మనిషి, వారి హృదయంలో దేవుడు.
ఎంత చిన్నపిల్లల మనస్తత్వం అంటే పిల్లల్లో పిల్లాడై పోతాడు. ఆయన కొన్ని ఫోటోలు వీడియోలు చూస్తే ఆయన ఎవరైనా పిల్లలని ఎత్తుకుంటే వాళ్ళు ఆయన దగ్గరనుంచి తిరిగి తమ తల్లి దండ్రుల దగ్గరకి వెళ్లేందుకు ఇష్టపడరు.
బాలీవుడ్‌ను ధిక్కరించిన ధైర్యం!
“మీకు కావాలంటే నేనే పాడాలంటే మీరే నా దగ్గరకి రండి, అస్సాంకి పాడుతాను. నేను మాత్రం ముంబై రాను.” అని బాలీవుడ్ నే ధిక్కరించి వెళ్ళిన వ్యక్తి. ఎవరైనా టాలెంట్ ఉంటే పేరు, ప్రతిష్టలు కోరుకుంటారు. సొంత ప్రాంతాన్ని వదిలి ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్తారు. కానీ Zubeen da తన స్కిల్స్, టాలెంట్ అన్నీ అస్సాం ప్రజల కోసం అర్పించారు. అస్సాం సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక కళాకారుడు తన కళను ఎవరికోసం వాడాలో, ఎందుకోసం వాడాలో స్పష్టంగా చూపించారు.
మత, కులాల గోడలను కూల్చిన వ్యక్తి!
Zubeen da బ్రాహ్మణుడు. కానీ ఆయన “నాకు మతం లేదు, కులం లేదు, ధర్మం లేదు” అని జంధ్యాన్ని తెంపి ఈ దేశంలోని జాడ్యాన్ని ప్రశ్నించారు. అస్సాం ప్రజలందరూ జాతి, మత భేదాలు లేకుండా కలిసి ఉండాలని కోరుకున్నారు.
దానికి సాక్ష్యం, ఆయన మరణవార్త విన్న రోజున హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కాకుండా ప్రతి ఒక్కరూ గుండె పగిలేలా ఏడ్చారు.
ప్రజల ప్రేమకు నిదర్శనం!
ఆయన మరణ వార్తతో వెంటనే అస్సాం ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు.అస్సాం అంత బంద్ ప్రకటించబడింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే తమ మరణం పట్ల అత్యంత భారీగా సంఘీభావం పొందిన వాళ్ళు 4గురుకాగా.. ఆ వ్యక్తుల్లో, మైకేల్ జాక్సన్ తర్వాత ఆ గుర్తింపు పొందిన నాలుగో వ్యక్తి కేవలం జుబిన్ దానే.15 లక్షల మందికి పైగా జనం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అనేక రంగాలలో ప్రతిభావంతుడు!
జుబిన్ దా కేవలం గాయకుడు మాత్రమే కాదు.
పాటల రచయిత
Screenplay రైటర్
సినిమా దర్శకుడు
ప్రొడ్యూసర్
సంగీత దర్శకుడు
కవి
నటుడు
వాయిద్యకారుడు
ఆయన 40 భాషల్లో 38,000కు పైగా పాటలు పాడారు. ఒకరోజు ఏ ప్రాక్టీస్ లేకుండానే 13 పాటలు రికార్డ్ చేసిన ప్రతిభ ఆయనది. ప్రతి భాషలోనూ ఆయన స్వరం అక్కడి జనాన్ని తమ మనిషి అనిపించేలా చేసింది.
మానవత్వం ఆయన ధర్మం!
ఆయన సంపాదించిన దాంట్లో సగానికి పైగా అస్సాం ప్రజల కోసం ఖర్చు పెట్టారు. పిల్లలు లేనప్పటికీ 15 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకున్నారు. కరోనా సమయంలో తన ఇంటినే క్వారంటైన్ విడిది చేసి ఊరి ప్రజలకు ఇచ్చారు.
“నేను రాక్ స్టార్‌ను, నాకు మర్యాదలు కావాలి” అని ఎప్పుడూ కోరుకోలేదు.
సాదాసీదా ప్రజల్లో ఒకడిగా, సింపుల్ లైఫ్ గడిపారు.
అందరూ సమానం అని, మానవత్వమే ముందు అని నమ్మారు.
అందుకే CAA-NRC ఉద్యమంలో ముందు నిలబడి తన ధైర్యాన్ని చూపించారు.
ప్రశ్నించే గళం!
ఆయన పాటలు కేవలం వినోదం కోసం కాదు. మన జీవితం, మన సమాజం, మన సత్యాల గురించి ప్రశ్నించే గీతాలుగా నిలిచాయి. ఆయన స్వరంలో అస్సాం ప్రజల ఆత్మ ఉంది. అందుకే అస్సాం కన్నీరు పెట్టుకుంది.
ప్రజల తరపున నిలిచిన స్వరం!
ప్రధాన మంత్రితోనో ముఖ్యమంత్రితోనో భోజనం కోసం పరుగెత్తే తారల్లా కాకుండా, ఆయన ప్రజా గొంతుకై నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దేశం కోల్పోయిన కోహినూర్!
“అస్సాం ఒక కోహినూర్ వజ్రాన్ని కోల్పోయింది” అన్నారు ప్రధాని. రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఒక ముఖ్యమంత్రి సామాన్యుడిలా ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఎవరినైనా తమ దగ్గరకి రప్పించుకునే గౌతం అదానీ జుబీన్ దా ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ అస్సాం వెళ్ళి మరీ జుబీన్ దా భార్య Garima కి సంఘీభావం తెలిపారు.
తెలుసా ఆయన మరణ వార్తతో ఉలిక్కిపడ్డ ప్రపంచం ఆయనను గురించి తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేసింది. ప్రపంచంలో గూగుల్ ఉన్న 195 దేశాల్లో 114 దేశాల వాళ్ళు zubeen da గురించి search చేశారు. ఇప్పటి వరకు అలా ఏ వ్యక్తి గురించి వెతికిన వాళ్ళు లేరని రికార్డు. ఈ భారత దేశంలోనే ఇప్పటి వరకు పాటలు పాడిన రికార్డ్ మాత్రమే కాదు ఏ వ్యక్తి మరణం కోసం ఇంతలా జనం వెదకలేదనే రికార్డ్ నమోదు చేసుకున్నారు జుబీన్ దా ఆయన మరణం తర్వాత కూడా.
ప్రజల కన్నీటి నది!
చిన్నపిల్లల దగ్గరనుంచి ముసలి వాళ్ల వరకు,ఇంతవరకూ రక్షణ కోసం ఉన్న పోలీసులు కూడా కన్నీళ్లు కార్చారు. ఆయన అంబులెన్స్ వెనక పరిగెత్తుతూ ఏడ్చిన యువకుల వీడియోలు ఎవరికైనా గుండె ద్రవింపజేస్తాయి.
నిజంగా అలాంటి వ్యక్తి గురించి ఆయన చనిపోయాక తెలుసుకోవడం బాధగా ఉంది. కానీ ఆయన ఇప్పుడు నాకు ప్రేరణ అయ్యారు.
చనిపోయాక మనతో ఏమీ వెళ్లవు.
కానీ మనం లేని లోటును గుర్తుంచుకుని ఏడ్చే ప్రేమికులను సంపాదించుకోవటం మాత్రమే నిజమైన విజయం.
ఇన్ని రోజులైనా Zubeen da గురించిన ఏ వీడియో కనబడ్డా వదిలిపెట్టకుండా చూస్తున్నాను. “Maayabini” అనే పాట మళ్ళీ మళ్ళీ వింటున్నాను. అస్సాం ప్రజల దుఃఖాన్ని పంచుకుంటున్నాను.
Zubeen Garg lives on
గతంలోనే మెర్సీ మార్గరెట్ గారు రాసిన ఈ ట్రిబ్యూట్.. జుబిన్ గార్గ్ జయంతి సందర్భంగా మరోసారి!



