చాలా ఊళ్లు, పట్టణాలు, నగరాలు, అంతెందుకు, మన సికింద్రాబాద్ లో ఉన్నట్టే… ముంబైలో ఉన్న ఓ ఐకానిక్ క్లాక్ టవర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దాని కళాత్మక శైలి దానికి యునెస్కో గుర్తింపు తెచ్చి పెట్టింది. అదే రాజాబాయి క్లాక్ టవర్. అయితే, శరవేగంగా ఉరుకులు పరుగులు పెట్టే ఆ మెకానికల్ లైఫ్ సిటీని సమయానుకూలంగా నడిపించేందుకు రోజూ ఓ వ్యక్తి 236 మెట్లెక్కి దిగుతాడు.
ఎవరతను..?
మహేంద్ర ప్రసాద్ గుప్తా. ఇతనో ఎలక్ట్రీషియన్. ప్రతీ రోజూ టవర్ పైకి 236 మెట్లెక్కి.. ముంబై నగరం టైం తప్పకుండా చూస్తాడు. పదేళ్లుగా గుప్తా ఈ పని చేస్తూనే ఉన్నాడు.

పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా రేయింబవళ్లూ వేగంగా పరిభ్రమించే నగరం ముంబై. అలాంటి నగరం ఉదయం తన దినచర్యను ప్రారంభించే సమయానికి.. మహేంద్ర ప్రసాద్ గుప్తా 280 అడుగుల ఎత్తైన టవర్ పైకి సన్నని మెట్లపై నుంచి ఎక్కుతాడు. రోజంతా గడియారం సరిగ్గా తిరిగేందుకు ఆయిల్, ఎక్కడైనా సమస్య ఉంటే సరి చేసేందుకు కావల్సిన టూల్స్ తో ముంబై కాలమానం ఎక్కడా ఆగిపోకుండా చూస్తాడు. రాజాబాయి టవర్ పర్యాటకులకు ఓ చారిత్రక చిహ్నం. కానీ, గుప్తా దృష్టిలో మంబై నగరాన్ని సజీవంగా ఉంచే యంత్రం. అందుకే, అంత శ్రద్ధగా తన టైం తప్పకుండా రోజూ మబ్బున్నే తను క్లాక్ టవర్ పైకెక్కి అది సరిగ్గా తిరిగేలా చూడటం ప్రసాద్ గుప్తా దినచర్య.
రాజాబాయి క్లాక్ టవర్ విద్యుత్ తో నడిచేదైతే ఏ ఇబ్బందీ ఉండకపోయేది. కానీ, బరువు సాయంతో మ్యానువల్ గా నడవడంతో.. దీని నిర్వహణ తప్పనిసరి. ఆ పనే మహేంద్ర ప్రసాద్ గుప్తా చిత్తశుద్ధితో చేస్తున్నాడు.
146 ఏళ్ల ఐకానిక్ రాజాబాయి టవర్ లో ఫిక్స్ చేసిన గడియారం బరువు 250 కిలోల నుంచి 300 కిలోల మధ్య ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రికల్ సప్లై అవసరం లేకుండా… కేవలం బరువుమీదే ఆధారపడి నడుస్తోంది ఈ క్లాక్. గడియారం వెనుకవైపు బరువుతో నడిచేలా ఏర్పాటు చేసిన మెకానిజాన్ని రోజూ పరిశీలించి, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించి, గడియారం నడిచేలా చేయడం మహేంద్ర ప్రసాద్ గుప్తా రోజూ కర్తవ్యం.

అసలు రాజాబాయి టవర్ కథేంటి..?
విక్టోరియన్ కళాత్మక శైలిలో ముంబైలోనే ఎత్తైన ఐకానిక్ టవర్ గా గుర్తింపు పొందిన రాజాబాయి టవర్ వెనుకా ఆసక్తికరమైన కథ ఉంది.
రాజాబాయి టవర్ ను 1878లో నిర్మించారు. లండన్ బిగ్ బెన్ ఈ టవర్ నిర్మాణానికి ప్రేరణ. గతంలో ఇదే ముంబైలోని అత్యంత ఎత్తైన స్మారక చిహ్నంగా కూడా పేరు పొందింది. బ్రిటీష్ ఆర్కిటెక్ట్ అయిన సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ ఈ టవర్ నిర్మాణానికి డిజైన్ చేశారు. స్టాక్ బ్రోకర్ ప్రేమ్ చంద్ రాయ్ చంద్ తన తల్లి రాజాబాయి గౌరవార్థం ఈ ఐకానికి టవర్ ను నిర్మించాడు.
రాజాబాయి టవర్ నిర్మాణానికి కారణమేంటి..?
ప్రేమ్ చంద్ రాయ్ చంద్ తల్లైన రాజాబాయి కంటిచూపు కోల్పోయింది. ఆమె సమయాన్ని గుర్తించేందుకు నాటి ఐకానిక్ బెల్ మోగించే గడియారాలపై ఆధారపడేది. ఆమెకు అలా సమయం తెలిసేందుకు రాయ్ చంద్ ఏకంగా ఈ గడియార గోపురాన్నే నిర్మించాడు. అప్పట్నుంచి ముంబై నగరంలో అద్భుతమైన విక్టోరియన్ గోతిక్ స్టైల్ నిర్మాణంగానే కాకుండా… తల్లి పట్ల కుమారుడు రాయిచంద్ ప్రేమకు ప్రతీకగా ఈ ఐకానిక్ టవర్ ప్రత్యేక చిహ్నమై నిల్చింది.

280 అడుగుల ఎత్తులో చర్చ్ గేట్ రైల్వేస్టేషన్ సమీపంలో కనిపించే ఈ టవర్.. బ్రిటీష్ కలోనియల్ బాంబే కాస్తా… మాడ్రన్ ముంబైగా మారిన కాలానికి ఓ నిలువెత్తు సాక్ష్యమై నిల్చింది.
2018లో యునెస్కో ముంబైలోని విక్టోరియన్ కళాత్మక శైలిలో నిర్మించిన కళారూపాలకు గుర్తింపునివ్వగా.. అందులో ఈ టవర్ కూడా స్థానం సంపాదించుకుంది. యూరోపియన్ స్టైల్ కు.. అధునాతన భారత శిల్పశైలిని జోడించి కళ్లు చెదిరేలా నిర్మించారు. ఒకప్పుడు ఈ గడియారానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన 14 గంటలు ఒక కోఆర్డినేషన్ తో ఒకేసారి మోగితే ముంబై అంతా మార్మోగేది. కానీ, ఇప్పుడు ఈ క్లాక్ టవర్ లో కేవలం ఐదు మాత్రమే పనిచేస్తున్నాయి.
అద్దాల కిటికీలు, గోపురాకారపు శైలి, నాల్గు పక్కలా కనిపించే క్లాక్ తో.. నాటి విక్టోరియన్ బాంబేకు సజీవ సాక్ష్యంగా నేటి మాడ్రన్ ముంబైలోనూ పర్యాటకులను ఆకర్షించే ఎత్తైన గోపురం రాజాబాయి క్లాక్ టవర్.
దీని సాంస్కృతిక విలువకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కినా… ప్రతీరోజూ మెట్లెక్కి మహేంద్ర ప్రసాద్ గనుక తన చేతితో గడియారం తిప్పకపోతే.. ఉరుకులు, పరుగుల ముంబై సమయం సరిగా ముందుకు సాగనట్టే. అందుకే, తల్లిపై ప్రేమతో టవర్ నిర్మించిన ప్రేమ్ చంద్ రాయ్ చంద్ కథే కాదు.. ఆయన నిర్మించిన ఆశయాన్ని ఎక్కడా బ్రేక్ చేయకుండా ముంబై సమయాన్నిసమయానుకూలంగా నడిపిస్తూ ఈ క్లాక్ టవర్ బాధ్యతలు చూస్తున్న మహేంద్ర ప్రసాద్ గుప్తా గురించీ మనం చెప్పుకుంటున్నాం.



