మోదుమూడి సుధాకర్… ✍🏻
—————————————————-
నా సంగీతానుభవాలు..
అది ఒక ప్రళయరాత్రి…కృష్ణాజిల్లా దివిసీమను ముంచిన ఉప్పెన, తుఫాను రేగిన రాత్రి…సముద్రగర్భాన బడబాగ్ని ప్రజ్వరిల్లి, అలలను మూడు తాటిచెట్ల ఎత్తుకు ఎగసిపడేలా చేసిన కాళరాత్రి…వేలాది ప్రాణాలను, కోట్లాది రూపాయల ఆస్తులను హరించిన విషపురాత్రి…గ్రామాలకు గ్రామాలనే తనలో కలుపేసుకొని, బంగాళాఖాతం వికటాట్టహాసంచేసిన భీకర రాత్రి…
1977 నవంబరు 19 వతేదీ..ఆరాత్రంతా కంటకునుకు లేదు మాఇంట్లో ఎవ్వరికీ…బెజవాడ గాంధీనగర్ లోని మాఇంటి వంటగదిలో అరుగుపైన కూర్చొని, తలుపు సందులోనుంచి బయటికి చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపాము. పెనుగాలికి ఇంటికప్పులే లేచిపోయేట్లున్నాయి….తలుపులు, గడియలు దబదబా కొట్టుకుంటున్నాయి…క్షణానికొకసారి దిక్కులు మారుస్తూ ఎడాపెడా విసిరికొడుతున్న కుంభవృష్టి..
ఆకాశమంతా కుంకుమ వెదజల్లినట్టు ఎర్రగా తయారయింది…ఊరంతా చిమ్మచీకటి..మధ్యమధ్యలో మెరపువస్తే గానీ బయటి ఇళ్లు కనబడట్లేదు..వర్షపునీరు ఇంట్లొకి చొరబడుతోంది .. నిస్సహాయంగా అందరం అలా చూస్తూఉండిపోయాం..రాత్రంతా అలా గాలీవాన కొనసాగింది..తెల్లవారుఝామున నిద్రపట్టేసింది…
లేచిచూసేసరికి వర్షం తగ్గుముఖం పట్టింది. బాగాతెల్లారాక, రోడ్డుమీదకి వచ్చిచూస్తే..అంతటా…కూలిన చెట్లు,మోకాలిలోతు నిలిచిన నీరు,గట్లుతెగిన కాలువలు..కుప్పకూలిన పాకలముందు కట్టుబట్టలతో నిల్చొని,దీనంగా చూసే బడుగుజీవులు దర్శనమిచ్చారు.
ఆరోజు 20వతేదీ..ఆదివారం..రేడియోలో ‘బాలల సంగీతసభ’ లో నేను పాడవలసింది ఆరోజే..పదిహేను రోజులక్రితమే కాంట్రాక్టు ఫారం అందుకున్నాను..ఆలశ్యం చేయకుండా స్నానంచేసి తయారై, ఏడున్నరకి రేడియోస్టేషన్కి చేరుకున్నాను. ‘ఎలాగూ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని’ నా గట్టి నమ్మకం.
అప్పటి రేడియోస్టేషన్,పున్నమ్మతోటలో ఇప్పుడున్న దూరదర్శన్ కేంద్రం స్థలంలో ఉండేది. అక్కడికి చేరుకోగానే, ఆవీధి అంతా కూలిపోయిన మహావృక్షాలతో నిండిపోయి కనిపించింది. పడిపోయిన చెట్లకొమ్మల మధ్యనుండి రేడియోస్టేషన్ దర్శనమిచ్చింది.. పాకుకుంటూ ఎలాగో స్టేషన్ ముఖద్వారాన్ని సమీపించాను. భవంతి మేడపై పెంకులు లెచిపోయి, గోడలు కొన్ని కూలిపోయి ఉన్నాయి…అప్పటికే అక్కడికి చేరుకొన్నారు- నాకు వైలిన్,మృదంగ సహకారాలు అందించేందుకు తోటి బాల కళాకారులైన ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మురమళ్ల విజయకుమార్.
సెక్యూరిటీ గార్డులు కొమ్మలను నరికి,ముందు హాలులోకి వెళ్ళేందుకు దారిచేశారు. సాధారణంగా ప్రతి ఆదివారం, బొమ్మరిల్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకువస్తారు. అయితే తుఫానుకారణంగా ఆరోజు ఎవరూ రాలేదు. ప్రసారాలు మాత్రం యధావిధిగా జనరేటర్ సహాయంతో కొనసాగుతున్నాయి.
సెక్యూరిటీ గార్డులు కొమ్మలను నరికి,ముందు హాలులోకి వెళ్ళేందుకు దారిచేశారు. సాధారణంగా ప్రతి ఆదివారం, బొమ్మరిల్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకువస్తారు. అయితే తుఫానుకారణంగా ఆరోజు ఎవరూ రాలేదు. ప్రసారాలు మాత్రం యధావిధిగా జనరేటర్ సహాయంతో కొనసాగుతున్నాయి.
మాగురువుగారు శ్రీఅన్నవరపు రామస్వామిగారు అక్కడ వయొలిన్ నిలయవిద్వాంసులు. నన్ను పాడించటం కోసం ఆయన వచ్చారు. ఆరోజుల్లో ఎలక్టానిక్ తంబురాలు ఉండేవికావు కనుక, చేతితో మీటే తంబురాలే అందరికీ ఆధారం. తంబురావేసే నిలయ కళాకారులు రాకపోవటంతో, మాగురువుగారే స్వయంగా తంబుర శ్రుతిచేసి, మీటుతూ సహకరించారు. నాకు అసలు కేటాయించిన సమయం పావుగంట అయినా, ఆరోజు బొమ్మరిల్లు కార్యక్రమం మొత్తం నాతోనే పాడించమని అధికారులు గురువుగారిని కోరారు. నాకు వచ్చిన కృతులన్నీ వరుసగా ఏకరువుపెట్టాను..ప్రధానాంశంగా కళ్యాణి రాగంపాడి, ‘హిమాద్రిసుతే’ శ్యామశాస్త్రిగారి కృతిలో స్వరకల్పన చేశాను. వైలిన్, మృదంగ అనుసరణ ఎంతో రమ్యంగా సాగాయి. దీనబాంధవియైన లోకమాత కరుణించి, ప్రకృతిని శాంతపరచింది.
ఆనాటి నాకచేరీని జీవితంలో మరువలేను..ఎంతో వాత్సల్యంతో నాకు తంబురవేసి, పాడించిన మాగురువుగారికి కోటి దండాలు పెట్టుకున్నాను..
77 వత్సరాలు పూర్తిచేసుకొన్న బెజవాడ ఆకాశవాణితో నాకున్న విడరాని బంధానికి ఆనాటి సంఘటన ఒక మచ్చుతునక..ఆ కేంద్రంలో 32 సంవత్సరాలు పనిచేసి, సంగీత ప్రయోక్తగా 2023 లో పదవీవిరమణ చేయటం నా సుకృతం..



