ఎప్పటికప్పుడు ట్రెండ్ ను బట్టి అడ్వర్టైజ్ మెంట్స్ కూడా మారిపోతాయి కానీ, కొన్ని యాడ్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనివీ ఉంటాయి. అందులో భారతదేశం మొత్తాన్ని ఐ లవ్యూ అనిపించిన యాడ్స్ లో… రస్నా యాడ్ కూడా ఒకటి. టీవీ యాడ్ ద్వారా పరిచయమైన రస్నా.. ఆ తర్వాత మన ఇంటికొచ్చింది. ఏ ఫంక్షనైనా, సాయంకాలపు పెళ్లిళ్లైనా, వరపూజైనా కనిపించింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లోని తీవ్రమైన ఎండల్లోంచి ఇంటికొచ్చినవారికి ఇంత రస్నా ఇవ్వాల్సిందేనన్నట్టుగా పీపాలకు పీపాలు కనిపిస్తే.. కనీసం రెండైనా లాగించేవాళ్లమేమో. అభిరుచులు మారిన మనకు ఇప్పుడంతగా నచ్చొచ్చు నచ్చకపోవచ్చునేమోగానీ.. రస్నా కూడా మన జీవితాల్లో ఓ జ్ఞాపకం.
అయితే, ఆ రస్నాను మనకు పరిచయం చేసిందెవరు.. ఆయనకెందుకా ఐడియా తట్టిందో.. ఈ సమ్మర్ సమయాన ఓసారి ఆ మధ్యతరగతి సాఫ్ట్ డ్రింక్ గురించి కాస్త తెలుసుకుందాం.
రస్నా విజయగాధలో అరీజ్ పిరోజ్ షా ఖంబట్టా పేరు చెప్పుకుంటే… అరీజ్ పిరోజ్ షా జయకేతనంలో రస్నా పేరూ అలాగే విడదీయరానిది. ఎందుకంటే భారత్ లోని శీతలపానీయాల పరిశ్రమలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు రస్నా ఒక సంకేతం.

మిగిలిన శీతల పానీయాలు కనీసం పది రూపాయలు పెడితేనేగానీ ఒక్కరు తాగలేని రోజుల్లో.. జస్ట్ ఓ 5 రూపాయల ప్యాకెట్ కొంటే కనీసం 30 మంది తాగే ఓ సాఫ్ట్ డ్రింక్ రావడమంటే అది కచ్చితంగా మధ్య తరగతి ఇళ్లల్లోకి చేరకుండా ఎలా ఉంటుంది..? ఆ ఐడియా నుంచి పుట్టిందే రస్నా.
అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా కుటుంబం, వారసత్వం!
అరీజ్ పిరోజ్ షా ఖంబట్టాకు భార్య పెర్సిస్ తో పాటు, ముగ్గురు పిల్లలు పైరుజ్, డెల్నా, రుజాన్ ఉన్నారు. వారి మనవలు, మనవరాళ్లతో కలిపి ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం అరీజ్ ఖంబట్టాది. అరీజ్ ఖంబట్టా 2022, నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పట్నుంచీ రస్నా సాఫ్ట్ డ్రింక్ బాధ్యతలను ఆయన కుమారుడు పైరుజ్ ఖంబట్టా స్వీకరించి ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.
వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక తండ్రే అరీజ్ కు స్ఫూర్తి!
సుమారు 90ల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందిన రస్నా సాఫ్ట్ డ్రింక్ ను అంతలా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన అరీజ్ పిరోజ్ షాకు తన తండ్రి నిరాడంబర వ్యాపారశైలే ఆదర్శం. తండ్రి స్ఫూర్తితో వ్యాపారంలోకి అడుగిడిన అరీజ్ ఖంబట్టా.. రస్నా సాఫ్ట్ డ్రింక్ ను భారత విపణితో పాటు, ప్రపంచానికి పరిచయం చేసి తండ్రిని మించిన కొడుకుగా ఎదిగాడు. తన మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో అంతర్జాతీయ బ్రాండ్ గా విస్తరించాడు. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలు పోటీపడి మరీ రస్నా అనే శీతలపానీయాన్ని దిగుమతి చేసుకున్నాయంటే రస్నా భారత్ లోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో ఇంటింటికీ ఎలా చేరిందో అర్థం చేసుకోవచ్చు
ఈ సాఫ్ట్ డ్రింక్ కు అరీజ్ పిరోజ్ షా ఖంబట్టా 1970ల కాలంలోనే ఊపిరిలూదాడు. మార్కెట్ లో ఖరీదైన సాఫ్ట్ డ్రింక్స్ ను ఎప్పుడంటే అప్పుడు మధ్యతరగతి కొనుక్కోలేని పరిస్థితులను.. కొనగల్గినా ఒకరో, ఇద్దరికంటే ఎక్కువో తాగలేని పరిస్థితులను గమనించిన అరీజ్… చవకలో దొరికే ఒక్క రస్నా ప్యాకెట్ తో ఎక్కువమంది శీతలపానీయాన్ని సేవించేలా ప్లాన్ చేశాడు. అలా మార్కెట్ లో జస్ట్ 5 రూపాయల ప్యాకెట్ ఒకటి తెస్తే ఏకంగా 32 గ్లాసుల రస్నా చేసుకోవచ్చు. ఈ ఫార్మూలానే రస్నాను ప్రతీ మధ్యతరగతి ఇంటికీ తీసుకెళ్లింది. ప్రతీ ఫంక్షన్ లోనూ వచ్చిన అతిథులకు సాఫ్ట్ డ్రింకై పలకరించింది.
అదిరిపోయిన అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్!
1980 నుంచి 1990ల కాలం వరకూ రస్నా బ్రాండ్ ఒక సంచలనం. అందుకు, ఆ బ్రాండ్ ను జనంలోకి తీసుకెళ్లిన అడ్వర్టైజ్ మెంట్ కూడా ఓ ముఖ్య కారణం. అప్పుడప్పుడే పెరిగి పెద్దదవుతున్న ఓ చిన్నారి పాప ఐ లవ్యూ రస్నా అంటూ కనిపిస్తూ చేసిన ఆ అడ్వర్టైజ్ మెంట్ ప్రచారం రస్నాకు మరింత కలిసివచ్చింది. వాస్తవంగా ఇప్పటికీ భారతీయులెందరికో నోస్టాల్జియాగా గుర్తుండిపోయే కొన్ని యాడ్స్ లో రస్నా కూడా ఒకటి.
అరీజ్ పిరోజ్ షా ఖంబట్టా రస్నా వ్యాపారం ఇంతింతై.. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీగా ఎదిగింది. ఆ తర్వాత 9 ప్లాంట్లు, 26 డిపోల విస్తరణతో పాటు.. బలమైన నెట్ వర్క్ తో భారతదేశంలోని శీతలపానీయాల రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వ్యాపారం ప్రారంభమైందీ.. చాలామంది మధ్యతరగతి ఇళ్లకు చేరిందీ భారత్ లోనే అయినా… రస్నా వ్యాపారం భారత్ తో పోటీ పడేలా బంగ్లాదేశ్, దుబాయ్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ లో కూడా సాగడంతో అక్కడా తయారీ సంస్థలను నెలకొల్పారు అరీజ్ పిరోజ్ షా.
రస్నా ఇచ్చిన ఊపుతో ఏకంగా టీపొడి, ఊరగాయలు, పండ్లతో చేసే జామ్స్, రెడీ టూ ఈట్ కర్రీస్, స్నాక్స్ ఇలా పలు ఆహారపదార్థాల ఉత్పత్తిలోకి ప్రవేశారు అరీజ్. వాటి ఎగుమతులూ ఊపందుకోవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో అరీజ్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.
2000 సంవత్సరంలో ఓరంజోల్ట్ అనే సోడా తరహా ఓ ఎరేటెడ్ ఫ్రూట్ డ్రింక్ తీసుకొచ్చినప్పుడు మాత్రం అరీజ్ కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, 2002లో జ్యూస్ ఆధారిత ఉత్పత్తులు మళ్లీ పుంజుకోవడంతో తిరిగి ఆరోగ్య పానీయాల విభాగంలోకీ అడుగుపెట్టాడు అరీజ్.
అరీజ్ పిరోజ్ షా ఖంబట్టా మరణించేనాటికే ఆయన ఆస్తుల నికర విలువ 300 కోట్ల వరకూ ఉన్నట్టు ఓ అంచనా. భారతదేశ శీతలపానీయాల వ్యవస్థలో అరీజ్ ఎందరికో ఓ ప్రేరణ. ఆయన మరణం తర్వాత అరీజ్ ఖంబట్టా రస్నా పరిశ్రమ.. ఆయన కుమారుడు పైరుజ్ నాయకత్వంలో తండ్రి స్ఫూర్తితో ముందుకెళ్తోంది.



