1992 లాలూ- నితీష్ విభజన!
గత 40 ఏళ్లుగా బీహార్ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఇద్దరు నాయకులెవరంటే కాస్త రాజకీయ పరిజ్ఞానమున్నవారెవ్వరైనా తడుముకోకుండా చెప్పే పేర్లు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్. ఈ ఇద్దరిదీ మొదట ఒకటే లైన్. జయప్రకాష్ నారాయణ్ శిష్యులుగా దేశంలో ఎమర్జెన్సీ సమయంలో లైమ్ లైట్ లోకొచ్చారు. ఇద్దరిదీ నాడు జనతాపార్టీ సిద్ధాంతమే. 1977లో మొదటిసారి ఈ ఇద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికలే ఎమర్జెన్సీ పాపానికి ఇందిరాగాంధీకి చెంపపెట్టులా మారి ఆమె ఓటమిపాలైంది.
అలా 1975-77 మధ్య జయప్రకాష్ నారాయణ్ మార్గదర్శకత్వంలో ఒకే సిద్ధాంతంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన లాలూ, నితీష్ దారులు వేరైపోయాయి. ఒకరు గెలిచారు. ఇంకొకరు ఓడిపోయారు. ఒకరు ప్రజల మద్దతుతో అధికారంలోకొచ్చారు. ఇంకొంకరు ఓటములతో పాఠాలు నేర్చుకుంటూ పనిచేసే నాయకుడిగా ఎదిగారు. అలా లాలూ, నితీష్ అనే ఇద్దరి సిగ్నేచర్స్ బీహార్ రాజకీయాలపై బలంగా పడ్డాయి.

అత్యవసర పరిస్థితి – ఉద్యమం!
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా బీహార్ లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. లాలు, నితీష్ ఇద్దరూ కూడా ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కానీ వారు ఆ సమయంలో ఎవరి శైలిలో వారు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజలతో మమేకమయ్యేవాడు. ఎక్కువగా వేదికలపైనే కనిపించేవాడు. స్థానిక భాష, యాసకు ప్రాధాన్యమిచ్చేవాడు. అదే స్లాగ్ లో మాట్లాడి అలరించేవాడు. కాస్త దుందుడుకు వ్యాఖ్యలతో హైలెట్ గా నిల్చేవాడు. కానీ, నితీష్ మాత్రం వ్యూహరచనలు చేసేవాడు. మీడియాతో సత్సంబంధాలు కల్గి ఉండేవాడు. ఉద్యమానికి సంబంధించిన ప్రకటనలను సిద్ధం చేయడం, తమ ఉద్యమానికి కలిసొచ్చేలా మిత్రపక్షాలను ఒప్పించడం వంటివి నితీష్ చేసేవాడు.
అయితే, ఇందిర విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమమే లాలూను పార్లమెంటుకు చేర్చింది. 1977లో చప్రా పార్లమెంట్ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీగా గెల్చారు. 1980లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసి అక్కడా గెల్చారు. కానీ, నితీష్ మాత్రం వరుసగా 1977, 1980 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985వరకూ కూడా నితీష్ ను విజయం వరించలేదు.
1990లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయనకు మార్గం సుగమం చేయడంలో నితీష్ కుమార్ కీలకపాత్రధారి. లాలూ విజయమనేది ఓ వ్యక్తి విజయం కాదు.. అధి కొత్త తరం నాయకుల ఎదుగుదలకు ఓ ఉదాహరణ అంటూ ఆ తర్వాత నితీష్ లాలూ విజయాన్ని గొప్పగా చెప్పుకొచ్చారు.
అయితే, ఎప్పుడూ పరిస్థితులు ఒక్కలా ఉండవు. అందులోనూ రాజకీయాల్లో మిత్రులూ ఉండరు, శత్రువులూ ఉండరు. అలా పాలనా వ్యవహారాల్లో లాలూకు మితిమీరిన నితీష్ సలహాలు ఒక్కోసారి చిరాకు తెప్పించడం మొదలయ్యాయి. నువ్వు నాకు పాలన నేర్పిస్తున్నావా…? పాలన బాగా చేసేస్తే శక్తిమంతులమైపోతామా…? ప్రజల మద్దతు, ఓటు బ్యాంకుతోనే అధికారం వస్తుందని ఓసారి లాలూ.. నితీష్ తో పుసుక్కునే అంత మాటనేశాడు. అలా లాలూ అన్న మాటలు నితీష్ ను హర్ట్ చేశాయి. ఏకంగా వారిద్దరి మధ్యా చీలికకు బీజం వేశాయి.
ఢిల్లీ ఘర్షణ – బీహార్ ఘటన!
అది 1992 శీతాకాలం సమయం. లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని బీహార్ భవన్ లో ఉన్నారు. నితీష్ తన సహచరులతో కలిసి అక్కడికి వెళ్లాడు. రాజకీయాలకు సంబంధించిన జరిగిన చర్చలో లాలూ, నితీష్ మధ్య కొద్ది సేపటికే మాటామాటా పెరిగింది. ఇద్దరి మధ్యా పెద్ద గొడవకు దారితీసింది. లాలూ కోపంతో ఊగిపోయాడు. సెక్యూరిటీ వీరిని బయటకు లాగేయండంటూ ఏకంగా అర్చే స్థాయిలో లాలూ వర్సెస్ నితీష్ మధ్య మాటలయుద్ధానికి తెరలేచింది ఆరోజు.
లాలూ ఆగ్రహానికి మనస్థాపం చెందిన నితీష్ తో పాటు, ఆయన సహచరులు కూడా ఇక బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో నితీష్ ఇక నీతో కలిసి పనిచేయడం అసాధ్యమంటూ వెళ్లిపోవడం కూడా ఆ తర్వాత చర్చగా మారింది. దాంతో లాలు, నితీష్ అనే ఇద్దరు మిత్రుల మధ్య వచ్చిన పొరపచ్చాలను సరిచేయడానికి నాడు అప్పటి జనతాదళ్ అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ రంగంలోకి దిగాడు. లాలూను.. నితీష్ కు క్షమాపణ చెప్పాలని కోరాడు. అయితే, శరద్ యాదవ్ ప్రతిపాదనకు లాలూ అంగీకరించాడుగానీ.. నితీష్ మాత్రం కలవడానికి ససేమిరా అన్నాడు.
చివరి లేఖ కథేంటి..?
ఆ తర్వాత నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ కు ఓ లేఖ సంధించాడు. మీకు ఏ అంశం పట్ల సీరియస్ నెస్ లేదు. ఇక నేను మీతో మాట్లాడటం అసాధ్యం. నేను మీకు అండగా నిలబడ్డాను. మీ ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా కాపాడుతూ వచ్చాను. కానీ, మీ ప్రభుత్వం రాను రాను అంచనాలను వమ్ము చేసింది. మీ చుట్టూ కొందరికి మాత్రమే అధికారాన్ని వినియోగించే శక్తినివ్వడం వల్ల మీ పాలనపై దాని ప్రభావం పడుతోందంటూ లాలూ తప్పిదాలను తన లేఖలో నితీష్ పేర్కొన్నారు.
అలాగే నాడు ఎల్.కే. అద్వానీ అయోధ్య .యాత్ర సంచలనంగా మారిన నేపథ్యంలో.. బీహార్ లో ఉన్న లాలూ ప్రభుత్వం ఆయన్ను సమస్తిపూర్ వద్ద అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ ని కూడా లాలూ ప్రసాద్ యాదవ్ తన వ్యక్తిగత ఖాతాలో క్రెడిట్ చేసుకోవడం నితీష్ కు నచ్చలేదు. ఆ విషయాన్ని కూడా పేర్కొంటూ.. అందరం కలిసి తీసుకున్న నిర్ణయాన్ని.. మీరు మీ క్రెడిట్ లో ఎలా వేసుకున్నారంటూ ఆ లేఖలో ప్రశ్నించారు.
విభజన – కూర్మీ ఉద్యమం!
యాదవులు వర్సెస్ కూర్మలు అన్నట్టుగా బీహార్ లో ఇక వర్గ విభేదాలకూ బీజం పడింది. లాలూ ప్రసాద్ యాదవుడైతే.. నితీష్ కుమారు కూర్మ వర్గీయుడు. లాలూ ప్రసాద్ ప్రభుత్వం యాదవులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తోందనీ.. కూర్మ, కోయరీ వంటి వర్గాల్లో అంసతృప్తి ఆరంభమైంది. దాంతో 1994 ఫిబ్రవరిలో పాట్నాలో కూర్మీ చేతన ర్యాలీ పేరిట భారీ ఆందోళనకు తెరలేచింది. లాలూలో ఆ ర్యాలీ ఆందోళనకు కారణమైంది. నితీష్ కుమార్ వస్తున్నాడా అంటూ అప్పటికే లాలూ ఇంటలిజెన్స్ వర్గాలను ఆరా తీశాడు.
మధ్యాహ్నం మూడు గంటలకు భారీ ర్యాలీ తర్వాత నిర్వహించిన సభా వేదికపైకి లాలూ ఆందోళన చెందినట్టే నితీష్ కుమార్ ఎక్కాడు. అదిగో అక్కడ నితీష్ ప్రసంగం మరింత వేడిని రాజేసింది. మేం భిక్షమడగం.. మా హక్కులు మాకు కావాలి… మా ప్రయోజనాలను లెక్క చేయని ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదంటూ నితీష్ చేసిన కామెంట్స్ లాలూ ప్రభుత్వాన్ని కలవరపెట్టాయి. ఇక అప్పట్నుంచీ ఇద్దరు మిత్రులైన లాలూ వర్సెస్ నితీష్ ఉప్పునిప్పులా మారారు.
మళ్లీ కలసిన ఇద్దరు మిత్రులు!
మనం ముందే చెప్పుకున్నాం.. రాజీకీయాల్లో ప్రతీసారీ చెప్పే ఆ మాటేంటంటే.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరని. అదిగో అదే జరిగింది. ఇరవై ఏళ్ల తర్వాత బద్ధశత్రువుల్లా మారిన ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులైన లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ 2015లో మళ్లీ చేతులు కలిపారు. అది నాటి మోడీ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు ఇద్దరూ కలిసి మహాఘట్ బంధన్ గా ఎన్నికలకు వెళ్లి గెల్చారు. తర్వాత నితీష్ రాజకీయ అడుగులు తెలివిగా వేస్తూ ఇప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు.
బీహార్ పై స్పష్టమైన ముద్ర వేసిన రాజకీయ దురంధరులు!
లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజశ్వీకి బాధ్యతలు అప్పజెప్పినప్పటికీని.. ఇప్పటికీ పార్టీ మాస్ లీడర్ అంటే లాలూ ప్రసాద్ యాదవే. అలాగే, నితీష్ కుమార్ కూడా తరచూ ఆరోగ్య సమస్యలు, అలయెన్స్ మార్పులతో కొన్నిసార్లు నెలకొనే వివాదాలతో సతమతమైనా.. ఆయన సుశాసన్ బాబు గా తన పేరు బీహార్ రాజకీయాల్లో నిలబెట్టుకున్నారు.
ఈ ఇద్దరు సీనియర్ నేతలు బీహార్ రాజకీయ రంగంలో వచ్చే పెనుమార్పులకు అస్తమించే సూర్యుడిలా కనిపించవచ్చేమోగానీ.. వారి నీడలు మాత్రం ఎప్పటికీ బీహార్ పై ఉండేలా నిల్చిపోవడం విశేషం.



