ఇప్పుడెన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సిన స్థలం.. ధర్మస్థల!

కొన్ని వార్తలు ఎంత వద్దనుకున్నా వెంటాడుతూనే ఉంటాయి. ధర్మస్థలలో బట్టబయలైన సామూహిక ఖనానల కథా అలాంటిదే. ఓ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఓ పుర్రెను సంచీలో వేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కి అతడు వెల్లడించిన విషయాలు పోలీసులనే నివ్వెరపర్చాయి. వెంటనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసే స్థాయిలో గగుర్పొడిచిన ఘటన అది.

అది దక్షిణ కన్నడ జిల్లా… నేత్రావతీ నదీ ఒడ్డు.. 1995-2014 మధ్య అంటే సుమారు రెండు దశాబ్దాలు… అత్యాచారాలు, హత్యలకు గురైన అనేక మంది విగతజీవులను ఆ పారిశుధ్య కార్మికుడే ఖననం చేశాడు. అందులో మహిళలు, పాఠశాల విద్యార్థినుల సంఖ్యే ఎక్కువ. పైగా వారి ఖననాన్ని ఎవరి బలవంతంపైనో తాను చేశానని ఆ కార్మికుడు చెప్పిన మాటల వెనుక.. అసలేం జరిగిందా అనే క్యూరియాసిటీని రేకెత్తించిన సంచలనం ధర్మస్థల ఘటన.

11 ఏళ్లుగా సదరు పారిశుధ్య కార్మికుడు రహస్యంగా ఒకింత అపరాధభావంతో.. బాహ్య ప్రపంచానికి చెబితే తననేం చేస్తారోనన్న భయంతోనూ.. పోలీసుల వద్దకు వెళ్లితే ఏమవుతుందోనన్న ఆందోళనతోనూ.. ఓ జీవశ్ఛవంలాగానే బతికాడు. వివిధ ప్రాంతాల్లో తన ఐడెంటింటీ బయటపడకుండా జీవిస్తూ వచ్చాడు. కానీ, ఆ వెంటాడే నెత్తుటి జ్ఞాపకాల కంటే.. దాన్నుంచి విముక్తే మానసిక శాంతినిస్తుందన్న పశ్చాత్తాపంతో పోలీసుల వద్దకు వెళ్లి ఉన్నదున్నట్టు పూసగుచ్చాడు.

ఆ ఖననాల వెనుకుంది శక్తివంతులనీ చెబుతున్నాడు. తాను ఖననం చేసినప్పుడు సదరు మహిళల ముఖాలపై చేసిన యాసిడ్ దాడులు, గొంతులు కోసి చంపడాలు, బట్టలు విప్పి విగతజీవులైన బాలికలు, యూనిఫామ్స్ లోనూ శవాలై వచ్చిన విద్యార్థినులు.. ఇలా వారిని స్కూల్ బ్యాగ్స్ తో సహా పాతిపెట్టాల్సి వచ్చిందని వాపోయాడు. 2010లో కల్లెరిలో ఓ పెట్రోల్ బంక్ వద్ద అర్ధనగ్నంగా ఉన్న12 నుంచి 15 ఏళ్ల మధ్యనున్న ఓ స్కూల్ బాలిక అత్యాచారానికి గురై విగతజీవిగా కనిపించింది. ఆమె ఎక్కడైతో పడిపోయిందో అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టానని చెప్పాడు సదరు కార్మికుడు. అలా నిరాశ్రయులైనవారితో పాటు, బిచ్చగాళ్ల హత్యలను కూడా తాను చూశానని పేర్కొన్నాడు. అలాంటివారి మృతదేహాలను అటవీప్రాంతాల్లో వేయాలనే ఆదేశాలందేవని.. లేకపోతే, తనను చంపేస్తామని బెదిరించేవారనీ చెబుతున్నాడు.

అయితే, పోలీసులకు ఇంతకాలం తర్వాత ఉప్పందించిన ఆ విజిల్ బ్లోయర్ ఎవరనేది అతడి భద్రతాకారణాల దృష్ట్యా, విట్నెస్ ప్రొటెక్ట్ యాక్ట్ కింద రహస్యం. సదరు విజిల్ బ్లోయర్ జూన్ 22వ తారీఖున ముందు న్యాయవాదులైన ఓజస్వీగౌడ, సచిన్ దేశ్ పాండే వంటివారిని ఆశ్రయించాడు. అప్పుడా అడ్వకేట్స్ నుంచి తమ క్లైంట్ దర్యాప్తు అధికారులకు తానెక్కడెక్కడైతే మృతదేహాలను పాతిపెట్టాడో ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అది కాస్తా వైరల్ గా మారి.. కర్నాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితిని ముందుంచింది. జూలై ప్రారంభంలో సదరు ఫిర్యాదుదారుడు దక్షిణ కన్నడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ను కలిశాడు. తన దగ్గర ఉన్న ఎముకలు, పుర్రెల వంటి అవశేషాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ను ఆయనకు సమర్పించాడు. తనకూ, తన కుటుంబానికీ రక్షణ కల్పించాలనీ కోరాడు. జూలై 4వ తేదీన ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 211 (ఏ) కింద కేసు నమోదైంది.

వరుస ఖననాలు, వాటి వెనుక అత్యాచారాలు, హత్యలు… మహిళలు, విద్యార్థినులు.. సుమారు రెండు దశాబ్దాలు అంటే కచ్చితంగా అది దేశం మొత్తం కుదిపేసే పెద్ద నేరం. ఇంతకాలం దాచటమూ నేరమే. కానీ, ఆ ఫిర్యాదుదారుడి భయమో, ఆందోళనో, అయమోయమో.. మొత్తానికి ఇంతకాలానికైనా ఆ భయంకర నిజం బయటకొచ్చింది. సదరు ఫిర్యాదుదారుడి కంప్లైంట్ తో ఇంకొందరు బయటకొచ్చారు. సీబీఐలో రిటైర్డైన స్టెనోగ్రాఫర్, బెంగళూరుకు చెందిన సుజాత భట్.. 2003లో తన బిడ్డ కళాశాల పర్యటనలో భాగంగా ధర్మస్థలకు వెళ్లి కనిపించకుండా పోయిందనే ఆరోపణలు చేశారు. అప్పుడు తాను కంప్లైంట్ చేస్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదనీ… తాను బలవంతం చేస్తే తనను అపహరించి కట్టివేసి కొట్టారనీ ఆమె ఆరోపిస్తోంది. మూడునెలల తర్వాత తాను ఆసుపత్రిలో మేల్కొన్నట్టు చెబుతోంది. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత సదరు పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదుతో.. ఇప్పుడు సుజాత ఆ ఖననం చేసినవారిలో తన బిడ్డ కూడా ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది.

ఆ అపరిచిత ఫిర్యాదుదారుడి కంప్లైంట్ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. రికార్డ్స్ పరిశీలించిన అధికారులకు 1980ల కాలం నుంచి 416 మంది తప్పిపోయిన కేసులు నమోదైనట్టుగా వెల్లడైంది. అలాగే, అవన్నీ అసహజ మరణాలుగా గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. అందులోనూ మహిళలే ఎక్కువ ఉండటంతో సందేహాలు మరింత బలపడ్డాయి.

జూలై 11వ తేదీన సదరు మొదటి ఫిర్యాదుదారుడు బీఎన్ఎస్ సెక్షన్ 183 కింద తన వాంగ్మూలాన్ని బెల్తంగడి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశాడు. తన దగ్గర ఉన్న అస్థిపంజరాలనూ అప్పగించాడు. అయితే, నిరక్షరాస్యుడైన తమ క్లయింట్ సాక్ష్యం చెప్పే సమయంలో ఆయన తరపు లాయర్లను హాజరుకావడానికి కోర్ట్ అనుమతించకపోవడం ఆ న్యాయవాదులు నిరసనలకు దిగారు.

జూలై 14న ఫిర్యాదుదారుడి తరపు న్యాయవాదులు దర్యాప్తుపై నీలినీడలు కమ్ముకున్నట్టు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విజిల్ బ్లోయర్ ఐడెంటిటీ బయటకు రాకుండా కాపాడాల్సి ఉండగా.. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ లో మొత్తం వివరాలతో సోషల్ మీడియాలో వైరలవుతున్నట్టు ఆ లేఖలో అడ్వకేట్స్ పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ వీడియో సాక్షి వాంగ్మూలానికి సంబంధించిన ప్రత్యేకమైన వివరాలు కూడా ఎలా బయటకొస్తాయని ప్రశ్నిస్తూ.. దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఇలాంటి లీక్స్ ఫిర్యాదుదారుడు భయపడ్డంత పనిచేస్తాయని.. అతడి ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని.. పోలీసుల తటస్థతపైనా తమకు అనుమానమున్నట్టు వెల్లడించారు. కేవలం న్యాయవాదులే కాదు.. సదరు ఫిర్యాదుదారుడు కూడా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తికి తన రక్షణపై భయాన్ని వెల్లడిస్తూ లేఖ రాయడంతో.. ధర్మస్థల ఖననాల కేసులో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మరింత పెరిగింది.

అదే విధంగా పౌరసమాజ స్పందన తీవ్రత కూడా ఇంతింతై.. హక్కుల సంఘాలు రోడ్డెక్కే పరిస్థితులకు దారితీసింది. దీంతో కర్నాటక ప్రభుత్వం సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఏర్పడింది. కర్నాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దీంతో జూలై 19వ తేదీన కర్నాటక సర్కార్ డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ ఎం.ఎన్. అనుచేత్, సౌమ్యలత, జితేంద్రకుమర్ దయామా సభ్యులుగా ఉన్న బృందం జూలై 25న దర్యాప్తు ప్రారంభించింది. స్థానిక పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన పైళ్లను స్వాధీనం చేసుకుని.. జూలై 27న ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్నీ నమోదు చేశారు.

ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా నేత్రావతీ నదీ అటవీప్రాంతంలో శ్మశానవాటికల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ, అటవీ, భూసర్వే అధికారుల సమక్షంలో సిట్.. గట్టి బందోబస్తు మధ్య సమాధుల తవ్వకాలను మొదలుపెట్టింది. మొదట ఐదుచోట్ల తవ్వినా ఏ ఆనవాళ్లూ బయటపడలేదు. కానీ, నిన్న జూలై 31న కొన్ని ఎముకలు బయటపడ్డాయి. అదో పురుషుడికి సంబంధించిన ఎముకలుగా గుర్తించారు. విరిగిన పుర్రెముక్కలతో సహా అవశేషాలను స్వాధీనపర్చుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.

ఈ ప్రక్రియ ఎక్కడా లీక్ కాకుండా తననొక్కడినే వ్యక్తిగతంగా తాను చూపించే స్థలాలకు తీసుకెళ్లాలని ఫిర్యాదుదారుడు ముందే పట్టుబట్టాడు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానం ఇంకా కూడా ఫిర్యాదుదారుడితో పాటు, ఆయనవైపు వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్స్ లో ఉంది. తడినేల కావడంతో సవాళ్లతో తవ్వకాలు చేపట్టాల్సిన పరిస్థితులెదురైతున్నాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు రాడార్ సాయంతో అన్వేషణ కొనసాగిస్తున్నారు.

ఈ కేసులో అంతమంది అత్యాచారాలు, హత్యల వెనుక ఎవరున్నారు.. రహస్యంగా అంతమందిని ఖననాలు ఎందుకు చేశారు.. అధికార గర్వంతో చేసిందా.. కులాహంకారంతో జరిగిందా… కామంతో కళ్లు మూసుకుపోయి జరిగిందా.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ధర్మస్థల ఘటనలో సరైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మొదటి ఫిర్యాదుదారుడితో పాటు.. సుజాత భట్ వంటి రిటైర్డ్ మహిళలు కూడా గళం వినిపిస్తుండటంతో ఈ కేసు ఇప్పుడు దేశాన్నే ఊపేస్తోంది. కర్నాటక సర్కారుకు సవాల్ గా మారింది.

మొత్తంగా ఇప్పుడు సమాధులను తవ్వి అవశేషాలను బయటకు తీసి చనిపోయినావారెవరో గుర్తించడమే కాదు… మానవ మృతదేహాలతో పాటు, పాతిపెట్టబడిన సత్యాన్ని బయటకు తీసి దోషులెంతటివారైనా శిక్షలు పడేలా దర్యాప్తు కొనసాగించడడమే ఈ కేసులో సాధించగల్గే విజయం.

ఈమధ్యే మళ్లీ బయటకొచ్చిన ఐర్లాండ్ ఆర్ఫాన్స్ హోంలో జరిగిన శిశువుల రహస్య ఖననాల గురించీ తెలిసిందే. ఈ మధ్యే బిచ్చగాళ్లతో వ్యాపారం చేసే కుబేర వంటి సినిమానూ చూసి ఉంటాం. ఇదిగో ఇప్పుడు మన దేశంలో అలాంటి క్రైం థ్రిల్లర్ ను తలపించే భయంకర ఘటనే తాజాగా తెరపైకొచ్చిన ధర్మస్థల ఉదంతం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles