ఐఐఎస్సీలో నిరాకరిస్తే.. సీవీ రామన్ నే కడిగేసింది! ఎవరీ కమలా సొహోనీ..?

సి.వి.రామన్‌నే ఎదిరించింది — తన వాదనతో గెలిచి చూపించింది!

పురుషాధిక్య సమాజంలో స్త్రీలు వంటింటి కుందేళ్లుగా చిత్రీకరించబడుతున్న పితృస్వామ్యం వేళ్లూనుకున్న రోజుల్లో.. కమలా సొహోనీ కథ స్టీరియోటైపిక్ ఆలోచల సరళిని బ్రేక్ చేసింది. స్త్రీలు విజ్ఞానశాస్త్రానికి పనికిరారంటూ ఆమెకు సీటు తిరస్కరించిన బెంగళూర్ ఐఐఎస్సీలోనే రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసి ప్రముఖ మహిళా శాస్త్రజ్ఞురాలిగా ఎదిగారు కమలా సోహోనీ. ఐఐఎస్సీలో విజ్ఞానశాస్త్రంలో మొట్టమొదటి పీహెచ్డీ చేసిన షీరో.. ఈ అన్ సంగ్ ఐకానిక్ మహిళ.

1911లో ఇండోర్ లోని ఓ మారుమూల పల్లెలో సైన్సై ఆశ, శ్వాస అన్నట్టుగా భావించి జీవించే ఓ కుటుంబంలో జన్మించింది కమలా సొహోనీ. తండ్రి నారాయణరావు భగవత్, మామ మాధవరావు భగవత్ ఇద్దరూ కూడా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూర్ లో శిక్షణ పొందినవారు. కానీ, ముందే చెప్పుకున్నట్టు పితృస్వామ్య సమాజంలో ఆమెకు అంతగా ప్రోత్సాహం దక్కలేదు.

అయితే, తండ్రి ల్యాబ్ లోనే కమల ఎక్కువ సమయం గడిపేది. అక్కడుండే బీకర్లు, వాటిల్లో పొంగిపొర్లే ద్రావణాలు, అవి కాస్తా రంగు మారుతుండటం అవన్నీ ఆమెను ఆకట్టుకునేవి. అలా ఉత్సుకతతో తండ్రిని, మామను ఒప్పించి ఆమె రసాయన శాస్త్రం వైపు అడుగులేసింది.

స్త్రీ కాబట్టి ఐఐఎస్సీలో నిరాకరణ!

1933లో బాంబే విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో పీజీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిల్చింది. ఆ తర్వాత బెంగళూర్ లోని ఐఐఎస్సీలో చదవాలన్నది కమల కల. కానీ, ఆమె దరఖాస్తు మాత్రం తిరస్కరణకు గురైంది. ఆ తిరస్కరించింది ఎవరో కాదు.. ది గ్రేట్ నోబెల్ బహుమతి గ్రహీత, అప్పటి ఐఐఎస్సీ డైరెక్టర్ గా ఉన్న సర్ సీ.వీ. రామన్.

ఆడజన్మ రావడమే పాపమా..?

సీ.వీ. రామన్ తిరస్కరణతో కమల మిన్నకుండి పోలేదు. ఆయనకు లేఖలు రాసింది. ఆ లేఖల్లో ప్రశ్నల వర్షం కురిపించింది. చివరకు ఆయన కార్యాలయానికి తానే వెళ్లి వాదనకు దిగింది. ఓ 22 ఏళ్ల యువతి లక్షణంగా భారతీయ సంప్రదాంలో చీర కట్టుకుని వచ్చి.. ది గ్రేట్ నోబెల్ లారెట్ తో ఆ రోజుల్లో ధైర్యంగా వాదించడమంటే మాటలేం కాదు. కానీ, కమలతో వాదన తర్వాత ఇష్టం లేకపోయినా, నో చెప్పలేక సీ.వీ. రామన్ ఆమె ఎంట్రీకి ఒప్పుకున్నాడు. అదీ కొన్ని కఠినమైన పరీక్షలకు తట్టుకుని, నిబంధనల ప్రకారమైతేనే అనుమతించాడు.

అందులో చాలా అవమానకరమైన నిబంధనలను చేర్చడం కమలను బాధించింది. ప్రయోగశాలల్లో పురుషులతో కలిసి మధ్యాహ్న సమయంలో పనిచేయరాదు. రాత్రి వేళల్లో అదీ తాను నియమించినవారి పర్యవేక్షణలో పని చేసుకోవచ్చు. ఇదిగో ఇలాంటి నిబంధనలన్నీ పెట్టినా కమల లోలోపల బాధ పడ్డా తన కల నెరవేరేందుకు మారుమాట్లాడలేదు. ఎందుకంటే, తన పని మాట్లాడాలని ఆమె కోరుకుంది.

ఏడాది తిరిగే సరికి కమల ప్రతిభేంటో మొత్తం ఐఐఎస్సీ గుర్తించింది. తన అసాధారణ ప్రతిభలతో పరిశోధన పూర్తి చేసింది. కమల సాధించిన విజయంతో ఐఐఎస్సీలో అప్పటివరకూ మహిళలపై ఉన్న ఆంక్షలు, నిషాధాజ్ఞల్నే ఎత్తివేయాల్సి వచ్చింది. అదిగో కమల చొరవతో తాను సాధించి చూపించడమే కాకుండా.. ఇతర మహిళలూ ఐఐఎస్సీలో చదివేలా ఆ విజ్ఞానసంస్థ తలుపులు తెరిపించింది. అందులో పురుషాధిక్య భావతో ఉండే విజ్ఞులైనవారి కళ్లూ తెరిపించింది.

తిరస్కారాన్ని విప్లవంగా మల్చిన ప్రయాణం కమల!

1937లో కమల సొహోనీకి క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నోబెల్ బహుమతి గ్రహీతైన డెరిక్ రిచర్డ్ వద్ద స్కాలర్షిప్ తో చదువుకునే అవకాశం దక్కింది. అక్కడ ఆమె శరీర కణాల్లో శ్వాస, శక్తి ఉత్పత్తికి అవసరమైన ఎంజైములైన సైటోక్రోమ్ C పై పరిశోధనలు చేసి.. 1939లో పీహెచ్డీ పట్టా సాధించింది. అలా విజ్ఞానశాస్త్రంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా డాక్టరేట్ సంపాదించిన సైంటిస్ట్ గా గుర్తింపు పొందింది.

అయితే, వ్యక్తిగత కీర్తి కోసం మాత్రం ఏనాడూ ఆమె తన విద్యను ఉపయోగించుకోలేని నిరాడంబరురాలు. భారత్ కు తిరిగివచ్చింది. సైన్స్ ను ప్రజలకు చేరవేయాలనే తపనతో పరిశోధనలు కొనసాగించింది. తమిళనాడులోని కూనూరులోని పోషణ పరిశోధన ప్రయోగశాలలోనూ, ఆ తర్వాత ముంబైలోని రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోనూ తాటిచెట్టు నుంచి వచ్చే నీరాపై పరిశోధనలు చేసింది. నీరాలో విటమిన్ సీతో పాటు, ఐరన్, ఇతర పోషకాలుంటాచయని నిరూపించింది. అలా ఆమె ఆవిష్కరణలు స్వతంత్ర భారత్ లో పోషణ విధానాల్లో తొలి అడుగులయ్యాయి. ఇవాల్టి మధ్యాహ్న భోజన పథకానికీ పునాదులు వేశాయి. సైన్స్ అంటే అహంకారం కాదని… ఆకలికి ఆహరమందించే శాస్త్రమని నిరూపించి మహామహులకే చెంపపెట్టైంది కమల సొహోనీ.

అన్ సంగ్ లేడీ కమల!

కీర్తినాశించని లేడీ కమల. అందుకే, మన పాఠ్యపుస్తకాల్లో ఇలాంటివారు చాలా ఎక్కడో అరుదుగా కనిపిస్తుంటారు. చదలు పట్టిన చరిత్రలో వీరు ఎప్పుడో అరుదుగా వినిపిస్తుంటారు. పురుషాధిక్య సమాజంలో ఎక్కడో ఓ మూలకు పరిమితమైపోతారు. కానీ, కమల తిరుగుబాటు భారతీయ మహిళలకు విజ్ఞానశాస్త్రం వైపు అడుగులు పడటానికి ఓ తొలి మెట్టైంది. యువ మహిళా పరిశోధకులకు మార్గనిర్దేశం చేసింది. మహిళల చదువుల కోసం, వారికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోసం పోరాటమే చేసింది. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా ఉన్న కాలాన.. విద్యలో సమానత్వం కోసం కృషి చేసింది.

1998లో మరణించిన కమలా సొహోనీ… మహిళల డామినేషన్ ఉండాలనీ కోరుకోలేదు. అలా అని చివరివారిగా మిగిలిపోయేందుకూ ఇష్టపడలేదు. ఆమె మన సో కాల్డ్ నేతల్లా విగ్రహాల్లో కనిపించకపోవచ్చు. కానీ, విజ్ఞానశాస్త్రంలో బలమైన పునాదులు వేసిన ఆమె మహిళా వారసత్వం ఎన్ని తరాలైన మహిళాలోకం మర్చిపోలేనిది. ఏ భారతీయ మహిళైనా విజ్ఞానశాస్త్రం తలుపు తీస్తే.. ఆ ద్వారం గుండా బయటకొచ్చే రూపమే కమలా సొహోనీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles