ఇన్ టూ ద వైల్డ్ సినిమాను తలపించే టామ్ స్టోరీ!

ఏకాంతంలోనే ఆనందం.. అదే ఈ టామ్ ఫిలాసఫి!

సమాజం నుంచి ఒంటరిపోయి బతకడం వేరు… సమాజానికి దూరంగా ఉండి ఏకాంతంగా జీవించడం వేరు. అలాంటి ఏకాంత జీవనమే మనం చెప్పుకుంటున్న టామ్ లెప్పర్డ్ ది. నాగరిక ప్రపంచానికి ఆమడ దూరంలో గడిపిన ఇతగాడి ఏకాంత జీవితంలో.. ఒక జీవితంలో ఉండే ఆటుపోట్లను మించే కష్టాలున్నా.. తనకవి జీవితంలో భాగమే తప్ప కష్టాలుగా కనిపించలేదు. అందుకే టామ్ లెప్పర్డ్ కథ.. మిగిలిన ప్రపంచంతో పోలిస్తే మరింత ప్రత్యేకత.

రెండు దశాబ్దాలుగా విద్యుత్ లేకుండా… కనీస తాగునీటి సౌకర్యాల్లేకుండా స్కాట్లాండ్ లోని ఓ మారుమూల గుడిసెలో ఒంటరిగా జీవించిన టామ్ లెప్పర్డ్ జీవితం ఇన్ టూ ద వైల్డ్ సినిమాను తలపించేది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక టాటూలు మెయిమీద ఉన్న ఒకే ఒక్క వ్యక్తిగా కూడా టామ్ పేరిటే చాలాకాలం రికార్డ్ కొనసాగింది.

సామాన్య జనమెవ్వరూ ఊహించని ఓ జీవితం టామ్ ది. స్కాట్లాండ్ ఐల్ ఆఫ్ స్కై లో ఉన్న ఓ చిన్న రాతి గుడిసే అతడి ఆవాసం. కుటుంబీకులు, బంధువులెవ్వరూ లేరు. ఎలాంటి ఆధునిక సౌకర్యాల్లేవు. దాహమైతే సమీపంలోని వాగుకు వెళ్లి నీరు తాగాల్సిందే. వారానికోసారి చిన్న నాటు పడవ వేసుకుని బయటకెళ్లి అవసరమైన సరకులు తెచ్చుకోవాల్సిందే. ఈ ఏకాంత జీవనమే టామ్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది. దీంతోపాటే… ప్రపంచంలోనే శరీరంపై అత్యధిక టాటూలు వేయించుకున్న వ్యక్తిగా టామ్ కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. మెయి నిండా ఎక్కడ చూసినా లియోపర్డ్ ను పోలిన మచ్చలను పొడిపించుకున్నాడు లెప్పర్డ్.

అయితే ఇదంతా అతడికి ఏమీ లేకనో.. నవ నాగరిక ప్రపంచం తెలీకనో కాదు. చిరుతను పోలిన టాటూస్ తో తన విభిన్న రూపం వెనుక… తన వైవిధ్యమైన జీవన విధానం వెనుక.. తన వ్యక్తిగత తీర్మానముంది. అందుకే బ్రిటన్ లోని మారుమూల ప్రశాంతమైన ప్రాంతాల్లో ఒకచోటును ఎంచుకుని నవ నాగరిక లోకం ఊహించలేని జీవితాన్ని గడిపాడు ఈ మాజీ సైనికుడు.

టామ్ లెప్పర్డ్

లెప్పర్డ్ అత్యధిక టాటూలున్న వ్యక్తిగా ఎలా గుర్తింపు పొందాడు..?

1935, అక్టోబర్ 14వ తేదీన జన్మించిన టామ్ అసలు పేరు థామస్ వూల్ డ్రిడ్జ్. మొత్తం 28 ఏళ్లపాటు సైన్యంలో సేవలందించిన ఇతడు.. రాయల్ నేవీ, బ్రిటీష్ ఆర్మీ, రోడేషియన్ స్పెషల్ ఫోర్సెస్ లో కలర్ సార్జెంట్ గా పనిచేశాడు. కలర్ సార్జెంట్ అంటే సైనికులకు శిక్షణనివ్వడం, క్రమశిక్షణ పర్యవేక్షణ, అధికారులు, సైనికులకు మధ్య సమన్వయం చేసే నాన్ కమిషన్డ్ ఆఫీసర్ హోదా అన్నమాట. సైనిక జీవితం ముగిశాక సమాజానికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు టామ్. స్కాట్లాండ్ లోని ఐల్ ఆఫ్ స్కైలోని మారుమూల ప్రాంతంలో స్థిరపడ్డాడు.

టామ్ జీవనశైలి తెలిసిన ఎవ్వరైనా… ఎవరితోనూ కలవలేని ఏకాంత జీవిగా అనుకోవడం సర్వసాధారణం. కానీ, టామ్ తో మాట్లాడినవారు మాత్రం ఆయన స్నేహశీలత గురించి కథకథలుగా చెబుతారు. కేవలం ఒంటరిగా జీవించడానికి ఆయన తీసుకున్న సంకల్పం మాత్రమే ఆయన్ను సమాజం నుంచి దూరంగా ఉంచిందే తప్ప.. ఆయన సమాజంతో కలవరనుకోవడం ముమ్మాటికీ తప్పంటారు వారు.

లెప్పర్డ్ శరీరమంతా కాషాయ – పసుపు రంగులో చిరుతపులి మచ్చలను పోలిన టాటూలు దర్శనమిచ్చేవి. ఒక దశలో ఆయన చర్మంలో సుమారు 99 శాతం టాటూలతో కప్పబడి ఉండటంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కాడు. ప్రపంచంలోనే అత్యధిక టాటూలున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత మరికొందరు కూడా టామ్ బాటలో టాటూలు వేయించుకునేసరికి.. టామ్ అత్యధిక టాటూలున్న వృద్ధుడిగా ఆ గుర్తింపును కొనసాగించాడు.

టాటూస్ తన శరీరాన్ని మార్చేశాయేగానీ.. వ్యక్తిత్వాన్ని కాదనే లెప్పర్డ్… ఇతరులు మాత్రం తనను చూసే విధానం మారిపోయిందనేవాడు.

స్కాట్లాండ్ లోని మారుమూల గుడిసే ఆవాసం!

1987లో లెప్పర్డ్ ఐల్ ఆఫ్ స్కైలోని సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న చిన్న రాతి గుడిసెలో నివశించడం ప్రారంభించాడు. గుడిసెలో విద్యుత్ సౌకర్యం లేదు. నీరు లేదు. అవసరమైన కొద్దిపాటి సామాగ్రి తప్ప మరే ఫర్నీచర్ కూడా కనిపించదు. ఫోమ్ పరుపుపైనే నిద్ర. సమీపంలోని వాగు నుంచి తాగునీరు తెచ్చుకుని దాహం తీర్చుకోవడమే గతి. అక్కడే బట్టలుతుక్కోవడమూ చేసేవాడు. అలాంటి సౌకర్యాలేవీ లేని ఆ గుడిసెనే లెప్పర్డ్ స్వర్గంగా అభివర్ణించేవాడు. అక్కడి సరళమైన జీవితం తనకు అపారమైన ప్రశాంతతను ఇచ్చిందనేవాడు.

పూర్తి ఏకాంత జీవితం గడుపుతున్నప్పటికీ.. వారంకోసారి మాత్రం బయట ప్రపంచానికి కనిపించేవాడు. తానూ వెళ్లి బయట ప్రపంచాన్ని చూసేవాడు. మూడు మైళ్ల దూరం ఓ నాటు పడవలో సముద్రాన్ని దాటి సమీప పట్టణానికి చేరుకుని తన పెన్షన్ తెచ్చుకోవడం.. కిరాణా సరకులు కొనుక్కోవడం, ఇతర అవసరాలు తీర్చుకోవడం చేయడం తన జీవన విధానం. మిగిలిన ప్రజలకు మాత్రం టాటూలతో వచ్చే లెప్పర్డ్ లైఫ్ స్టైల్ భిన్నంగా అనిపించేది. ఆకట్టుకునేది. అలా కయాక్ లో వచ్చి తిరిగి గుడిసెకు వెళ్లిపోయే తన జీవితం.. స్వయం సమృద్ధ జీవనశైలికి ఓ ప్రతీకలా భావించేవారు చుట్టుపక్కల జనం.

టామ్ ఎందుకు ఒంటరి జీవనశైలిని ఎంచుకున్నాడు..?

ప్రజల్ని ద్వేషించడం వల్ల కాదని.. ఏకాంతాన్ని ప్రేమించడం వల్లే ఆ జీవనశైలిని ఎంచుకున్నానని తరచూ చెప్పేవాడు. దాదాపు మూడు దశాబ్దాల సైనిక సేవ తర్వాత.. ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవితం గడపాలనే కోరికతో అడవుల బాట పట్టాడు టామ్. అడవులు, పచ్చని ప్రకృతి మధ్య లభించే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలే జీవితానికి నిజమైన ఆనందాన్నిస్తాయన్నది టామ్ నిశ్ఛితాభిప్రాయం.

చివరకు అడవిని ఎందుకు వీడాడు..?

వయస్సు పెరిగేకొద్దీ ఒంటరిగా జీవించడం శారీరకంగా కష్టమైంది. 2008లో 73 ఏళ్ల వయస్సులో లెప్పర్డ్ తన గుడిసెను వదిలిపెట్టాడు. ఇన్వర్నెస్ సమీపంలోని ఓ కేర్ హోమ్ లో చేరాడు. 2016, జూన్ 12న 80 ఏళ్ల వయస్సులో టామ్ మరణించాడు.

టామ్ లెప్పర్డ్ ను మిగిలినవారితో పోలిస్తే అత్యధిక టాటూలు కల్గిన ప్రత్యేక వ్యక్తిగానే కాకుండా… ఆనందాన్ని ప్రతీ ఒక్కరూ ఒకే రూపంలో కోరుకోరని.. టామ్ తరహాలో భిన్నంగా ఆలోచించేవారూ ఉంటారనే విషయాన్ని మనకు తన స్టోరీ చెబుతుంది. ఆధునిక సమాజానికి దూరంగా.. తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకున్న టామ్ కథ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంటూనే ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles