ఇప్పటికీ చెరగని మన్కడ్, రాయ్ రికార్డ్: న్యూజిలాండ్ పై ఓ చిరస్మరణీయ ఇన్నింగ్స్!

క్రికెట్ లో ఆ ఇద్దరి భాగస్వామ్యం ఇప్పటికీ చెరిగిపోనిది. ఎవరు వారు..? 413 పరుగుల రికార్డుతో స్టిల్ దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్!

సెహ్వాగ్, గంభీర్ జోడీ కూడా బీట్ చేయలేని ఆ రికార్డ్ గురించి.. ఆ ఇద్దరు ఓపెనర్స్ గురించి కాస్త చెప్పుకుందాం.

సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. ఇద్దరు క్రికెటర్స్ ఏకంగా రెండు రోజులపాటు అలుపూ సొలుపూ లేకుండా బ్యాటింగ్ చేశారు. ఒక వికెట్ కోల్పోయే సమయానికి వారిద్దరి భాగస్వామ్యం ఏకంగా 413 పరుగులు. ఆ మ్యాచ్ 1956లో మద్రాస్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగింది. అదే ఇప్పటివరకూ కూడా ఏ భారత ఓపెనర్స్ జోడీ కూడా ఛేదించలేని అత్యుత్తమ రికార్డుగా నిల్చింది.

పోనీ వారేం ఫ్లాట్ పిచ్చులు, పవర్ హిట్టింగ్ ఉన్న నేటి ఆధునిక రోజుల్లో ఆడినవాళ్లూ కాదు. కానీ, వారి జీవితకాలాన్ని మించి ఇప్పటికీ చెరగని రికార్డుగా అది నిల్చిపోవడమే విశేషం. అంతెందుకూ ఆ రికార్డ్ నమోదైన స్టేడియం కట్టిన కాలం కన్నా ఎక్కువ రోజులు అలాగే ఉండటం మరో విశేషం. వాస్తవానికి రికార్డులనేవి చెరిగిపోవడానికే అనే భావనకు భిన్నమైన రికార్డ్ సృష్టించింది ఆ భారత ఓపెనర్స్ జోడీ.

అంతులేని బ్యాటింగ్ తో ఆకట్టుకున్న జోడీ!

వినూ మన్కడ్, పంకజ్ రాయ్… నాటి ఇంగ్లాండ్ క్రికెటర్స్ జాక్ హోబ్స్, సట్ క్లిఫ్ తో పోల్చలేనివాళ్లు… పోనీ, డెస్మండ్ హేన్స్, గార్డెన్ గ్రీనిడ్జ్ సరసనా వారి పేర్లకు అవకాశం లేదు. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్ జోడీగా వచ్చింది కేవలం 9 టెస్టుల్లో మాత్రమే.

కానీ, 1956, జనవరి 6,7 తేదీల్లో మాత్రం వారు టెస్ట్ చరిత్రలోనే మొత్తం ఒక రోజంతా ఔట్ కాకుండా బ్యాటింగ్ చేసిన మూడో జోడీగా నిల్చారు. న్యూజిలాండ్ బౌలర్లు మార్చి మార్చి బంతులు వేసినా… వినూ మన్కడ్, పంకజ్ రాయ్ మాత్రం ఔట్ కాలేదు. బంతి పాతబడిపోయింది. బౌలర్లు అలసిపోయారు. ఫీల్డర్స్ భోజన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, వారు మాత్రం క్రీజు వీడటం లేదు.

అది ఐదు టెస్టులో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి మ్యాచ్. భారత్ అప్పటికే ఓ టెస్ట్ గెల్చింది. మిగిలిన మూడు డ్రా అయ్యాయి. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ అంత బలంగా ఏమీ లేదు. పిచ్ కూడా ఆనాడు పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా బ్యాటర్స్ దే అధిపత్యమన్నట్టుగా సాగింది. సీరిస్ అంతా కూడా భారత బ్యాటర్స్ పరుగుల వరద సృష్టించారు. పాలీ ఉమ్రిగర్, వినూ మన్కడ్ ఇద్దరూ అప్పటికే డబుల్ సెంచరీలు చేశారు. మరో ఐదుగు బ్యాట్స్ మెన్ శతకాలు సాధించారు. ఇక చివరి మ్యాచులోనూ నాటి కెప్టెన్ ఉమ్రిగర్ టాస్ గెల్చాడు. ఇంకేం మళ్లీ పరుగుల వరద పారుతుందని అంతా ఊహించారేగానీ… మొదటి వికెట్ కే ఏకంగా 413 పరుగులు మన్కడ్, రాయ్ జంట సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.

పంకజ్ రాయ్ కి సైట్ ప్రాబ్లం!

పంకజ్ రాయ్ కి చూపు సమస్య ఉందని సీరిస్ మొదలయ్యే కొద్ది వారాలముందే తెలిసింది. మైనస్ వన్ పవన్. ఆప్టోమెట్రిస్ట్ అయిన ఓ స్నేహితుడు కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించాడు. రాయ్ ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే, తానే ఓపెనర్ కాబట్టి. ఒకవేళ ఫాస్ట బౌలింగ్ లో బంతి తగిలితే అద్దాలు పగిలి కళ్లల్లో పడతాయి. ఆటా ముగుస్తుంది. జీవితానికీ ప్రమాదమన్నది రాయ్ భావన. కానీ, డాక్టర్ ఒకే ఒక్క ప్రశ్నడిగాడు.. ఇప్పటివరకూ ఎన్నిసార్లు ముఖానికి బంతి తగిలిందని..? అలాంటి ఘటనేదీ ఇప్పటివరకూ జరగలేదన్నాడు రాయ్. ఇంకా భయమెందుకని డాక్టర్ భరోసా ఇచ్చాడు.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో రాయ్ కళ్లద్దాలతో బరిలోకి దిగాడు. కళ్లద్దాలతో ఓపెనింగ్ కు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మ్యాచులో రాయ్ డగౌట్ అయ్యాడు. సెలక్టర్స్ ఆ జోడీని మూడు టెస్టుల్లో తప్పించారు. మన్కడ్, రాయ్ బదులు విజయ్ మెహ్రా, నారీ కాంట్రాక్టర్ జోడీని యత్నించారు. కానీ, ఫలితం దక్కలేదు. దాంతో మద్రాస్ లో మళ్లీ చివరి టెస్టుకు మన్కడ్, రాయ్ జోడీనే ఓపెనింగ్ కు దింపారు. అప్పుడూ రాయ్ కళ్లద్దాలతోనే బరిలోకి దిగాడు. బాల్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే రాయ్ కి బలంగా మారింది.

ఎప్పుడవుటవుతారానని ప్రత్యర్థులెదురు చూసిన ఆట!

తొలి రోజు ఆట ప్రారంభమైంది. న్యూజిలాండ్ బౌలర్స్ హేస్, మాక్ గిబ్సన్ కొత్త బంతితో బౌలింగ్ చేశారు. నిప్పులు చెరుగుతూ క్రమశిక్షణగా బాల్స్ వేస్తున్నారు. కానీ, మన్కడ్, రాయ్ జంట మాత్రం బీట్ కాలేదు. భయపడలేదు. మెల్లిగా సింగిల్స్ తో ప్రారంభించారు. అప్పుడప్పుడూ డబుల్స్, సందర్భం దొరికినప్పుడు ఫోర్స్.. ఇలా ఆడుతూ న్యూజిలాండ్ బౌలర్స్ ను అసహనానికి గురిచేశారు. 262 నిమిషాల్లో రాయ్ శతకం బాదాడు. అప్పటికే వినూ మన్కడ్ కూడా వందకు చేరువయ్యాడు.

తొలిరోజు ఆట ముగిసేసరికి స్కోర్ బోర్డ్ 234/0. రాయ్ 114, మన్కడ్ 109 పరుగులతో క్రీజులో ఉన్నారు. మర్చంట్, ముస్తాక్ అలీ జోడీ మాంచెస్టర్ లో చేసిన 203 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. ఒక రోజు పూర్తి బ్యాటింగ్ చేసిన భారత జోడీగా నిల్చారు.

భోజన విరామం తర్వాత రికార్డ్ బద్ధలు కొట్టిన భాగస్వామ్యం!

రెండో రోజూ ఆట మొదలైంది. రాయ్, మన్కడ్ జోడీ భాగస్వామ్యం 300 దాటింది. మన్కడ్, రాయ్ చెరో 150 పరుగులు చేశారు. అసలు లక్ష్యం 359 పరుగులు కావల్సి ఉంది. ఎందుకంటే, అదే అప్పటికి ఓ ఓపెనింగ్ జోడీకి సంబంధించిన భాగస్వామ్యంలోని ప్రపంచ రికార్డ్. ఆ రికార్డును 1949లో జెహెన్నస్ బర్గ్ లో ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడీ హటన్ – వాష్ బ్రుక్ సృష్టించారు. భోజన విరామం తర్వాత ఆ రికార్డును మన్కడ్, రాయ్ జోడీ బద్ధలు కొట్టారు. మద్రాస్ ప్రేక్షక లోకం ఉత్సాహంతో ఉరకలేసింది. 400 స్కోర్ దాటింది. మన్కడ్ కు ఆ సీరిస్ లో అది రెండో డబుల్ సెంచరీ. అప్పటివరకూ రెండు డబుల్ సెంచరీలు చేసిన ఘనత.. డ్రాన్ బ్రాడ్ మన్, వాలీ హామండ్ పేరిట మాత్రమే ఉంది. దాన్ని వినూ మన్కడ్ సమం చేశాడు.

అప్పుడు పెవిలియన్ నుంచి ఓ మెసేజ్ అందింది. కెప్టెన్ పాలీ ఉమ్రిగర్ డిక్లేర్ చేయాలనుకుంటున్నాడన్నది ఆ సందేశం. రాయ్ వేగం పెంచి పరుగులు రాబట్టే క్రమంలో పూర్ బౌలింగ్ లో తన వ్యక్తిగత స్కోర్ 173 వద్ద ఔట్ అయ్యాడు. మన్కడ్, రాయ్ భాగస్వామ్యం అప్పటికే 413 పరుగులకు చేరింది. వీరిద్దరూ కలిసి 472 నిమిషాలు, అంటే ఎనిమిది గంటలపాటు.. ఏకంగా ఆరుగురు బౌలర్లను తుత్తునియలు చేశారు.

మన్కడ్ 231 పరుగులు చేశాడు. అదే అప్పటివరకూ భారత టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. 1983-84లో చెన్నైలో గవాస్కర్ 236 చేసేవరకూ కూడా ఆ రికార్డ్ మన్కడ్ పేరిటే నిల్చి ఉంది. భారత్ ఆ మ్యాచులో 537/3 వద్ద డిక్లేర్ చేసింది. అది టెస్టుల్లో అత్యధిక స్కోర్. ఇన్నింగ్స్ 109 పరుగుల తేడాతో భారత్ ఆ మ్యాచ్ గెల్చింది.

ఎవరూ అందుకోలేని భాగస్వామ్యం మన్కడ్, రాయ్ ది!

1965లో ఆస్ట్రేలియాకు చెందిన బాబీ సింప్సన్, బిల్ లారీ 382 పరుగులు చేశారు. 1972లో న్యూజిలాండ్ కు చెందిన గ్లెన్ టర్నర్, టెర్రీ జార్విస్ 387 పరుగులు చేశారు. దగ్గరిదాకా వచ్చారే తప్ప మన్కడ్, రాయ్ భాగస్వామ్యాన్ని కనీసం టచ్ చేయలేకపోయారు.

2006 జనవరిలో లాహోర్ లో సెహ్వాగ్, ద్రవిడ్ కలిసి 400 స్కోర్ దాటారు. 410 పరుగులదాకా వచ్చాక.. సెహ్వాగ్ ఔట్ అవ్వడంతో అప్పుడు కేవలం మూడు పరుగుల దూరంలో రికార్డ్ బీట్ చేసే అవకాశం మిస్ అయిపోయింది. రెండేళ్ల తర్వాత 2008లో గ్రేమ్ స్మిత్, నీల్ మెకెంజీ బంగ్లాదేశ్ పై 415 పరుగులు చేసి మన్కడ్, రాయ్ రికార్డును బ్రేక్ చేశారు. కానీ, భారత్ కు సంబంధించిన ఓపెనింగ్ జంట మాత్రం ఇప్పటికీ ఆ రికార్డును బీట్ చేయలేకపోయారు.

ఆ ఆట అజరామరం!

భారత్ ఇప్పటివరకూ 500కు పైగా టెస్టులు ఆడి ఉంటుంది. గవాస్కర్, చౌహాన్ జంట ఆ ఫీట్ అందుకోలేకపోయింది. సెహ్వాగ్, గంబీర్ జంటా టచ్ చేయలేకపోయింది. జైస్వాల్, రోహిత్ కూడా దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. సెహ్వాగ్, ద్రవిడ్ మాత్రం ఆ అంచుల్లోకి వెళ్లగల్గారేగానీ.. బ్రేక్ చేయలేకపోయారు.

సులువైన పిచే కావచ్చు, న్యూజిలాండ్ బౌలర్సూ అంత బలంగా లేకపోవచ్చు.. కానీ, రెండురోజులపాటు ఏకాగ్రతతో అంత సమయం బ్యాటింగ్ చేయాలనే తలంపు ఓ గొప్ప విశేషం. ఆధునిక క్రికెట్లో అది అవసరం లేదు. జస్ట్ టీ20లు, స్ట్రైక్ రేట్సే ఇప్పుడు క్రికెటర్స్ కోరుకుంటున్న గొప్ప.

మన్కడ్, రాయ్ ఇద్దరూ లేరు. రాయ్ 2001లో మరణించాడు. మన్కడ్ 1978లో కాలం చేశాడు. కానీ, వారిద్దరి రికార్డ్ మ్యాచ్ మాత్రం ఇప్పటికీ ఇంకా రికార్డుల్లో ఉంది.

సచిన్ టెండూల్కర్ 51 శతకాలో అద్భుతమైన రికార్డే కావచ్చు.. కపిల్ దేవ్ 434 వికెట్లు సాధించడమూ నాడు ప్రపంచ రికార్డే కావచ్చు.. కానీ, ఓ ఓపెనింగ్ జోడీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ 472 నిమిషాల పాటు క్రీజులో నిల్చిన భాగస్వామ్యమే చరిత్రలో మన్కడ్, రాయ్ ఆటకు ఓ పేజీని క్రియేట్ చేసింది.

ఇప్పటికీ ఇండియాలో అంత సమయం బ్యాటింగ్ చేయగలవారెవ్వరన్నదే ఆ రికార్డ్ నేటి యువ క్రికెటర్స్ ను అడుగుతున్న ప్రశ్న..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles