ఎప్పటిలాగే ఉత్కంఠ రేపుతున్న సర్వే రిపోర్ట్స్… అలాగే, ఆ సర్వే రిపోర్ట్స్ విశ్వసనీయతపై చర్చలు… వెరసి మరోసారి 2024 లోక్ సభ ఎన్నికలపై ఒక విస్తృతమైన చర్చైతే జరుగుతోంది. 400కు పైగా అంటూ బీజేపీ… ఈసారి ఎన్డీఏకు ఎదురుదెబ్బ తప్పదని అటు ఇండియా కూటమి ఇలా పెద్ద ఫైట్ నడుస్తున్న తరుణంలో… ఫలితాలు వెల్లడయ్యే కౌంట్ డౌన్ కూడా దగ్గర పడుతోంది. జూన్ 4న ఎవరిది మళ్లీ అధికారం కాబోతోందో కూడా తేటతెల్లం కాబోతోంది. అయితే, ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమైన్నాట్నుంచి… గత 2019 ఎన్నికల వరకు అత్యల్ప మెజార్టీలతో ఎంత మంది ఎంపీలు గెల్చి బయటపడ్డారో ఓసారి చెప్పుకుందాం.
భారతదేశం ఇప్పటివరకూ 17 లోక్ సభ ఎన్నికలను చూసింది. ప్రతి ఎన్నికల్లో అనేక ఆసక్తికరమైన గణాంకాలు వెలువడటం వాటిపై చర్చలు జరగడం చూస్తుంటాం. ఈ క్రమంలో దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యల్ప ఓట్లతో గండం గట్టెక్కినవారితో పాటు… భారీ మెజార్టీ సాధించి గెల్చినవారి గురించీ ఓసారి చూద్దాం.
బీజేపీకి చెందిన సీఆర్ పాటిల్ పేరు మీద ఇప్పటివరకూ అతి పెద్ద పార్లమెంట్ ఎన్నికల విజయం నమోదైంది. 2019 గుజరాత్ లోని నవసారి లోక్ సభ నుంచి పోటీ చేసిన సీ.ఆర్. పాటిల్ ఇప్పటివరకూ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెల్చాడు. ఆయన సాధించిన మెజార్టీ 6 లక్షల 89 వేల 668 ఓట్లు. తన ప్రత్యర్థి.. కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేష్ భాయ్ భీమా భాయ్ పటేల్ కు కేవలం 2 లక్షల 83 వేల 71 ఓట్లు మాత్రమే లభించగా.. 74. 37 శాతం ఓట్లతో రికార్డ్ విజయాన్ని నమోదు చేశాడు. ఇలాంటి పెద్ద విజయాల రికార్డ్స్ ఇంకొందరి పేరు మీద కూడా ఉన్నాయి. అయితే, మనం చెప్పుకోబోతున్న అత్యల్ప ఓట్లతో విజయంతో బయటపడ్డవారి గురించి. కాబట్టి ఓసారి ఆ రికార్డ్స్ చూద్దాం.
1962 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే 15 మంది అభ్యర్థులు 500 కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇద్దరు అభ్యర్థులు కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఆసక్తికరమైన గణాంకాలను ఓ పరిశీలిద్దాం.
అతి తక్కువ ఓట్లతో గెలిచిన నాయకులెవరు..?
కొణతాల రామకృష్ణ, దివంగత బీజేపీ నేత సోమ్ మరాండి అతి తక్కువ ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు. 1989లో కాంగ్రెస్ నుంచి కొణతాల రామకృష్ణ… ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి.. కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు. 1998లో సోమ్ మరాండీ కూడా కేవలం తొమ్మిది ఓట్లతో జార్ఖండ్ లోని రాజమహల్ సీటును గెలుచుకున్నారు. 1996లో గుజరాత్‌లోని బరోడా నుంచి సత్యజిత్ సింగ్ గైక్వాడ్ 17 ఓట్ల తేడాతో… 1971 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 26 ఓట్ల ఆధిక్యంతో తమిళనాడులోని డీఎంకే దివంగత నేత ఎం.ఎస్. శివస్వామి పేరు కూడా ఈ జాబితాలో కనిపిస్తుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ లోని లడాఖ్ లోక్ సభ స్థానం నుంచి… బీజేపీ అభ్యర్థి తుప్‌స్తాన్ ఛెవాంగ్ కూడా కేవలం అత్యల్పంగా 36 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించాడు.
పూర్తి జాబితాను పరిశీలిద్దాం:
1962 రిషాంగ్ కేషింగ్ సోషలిస్ట్ ఔటర్ మణిపూర్ 42
1967 ఎం రామ్ కాంగ్రెస్ కర్నాల్ 203
1971 శివస్వామి డీఎంకె తిరుచందూర్ 26
1977 దాజీబా బల్వంతరావ్ దేశాయ్ రైతు మరియు కార్మిక పార్టీ కొల్హాపూర్ 165
1980 రామయన్ రాయ్ కాంగ్రెస్ (ఐ) దేవరియా 77
1984 మేవా సింగ్ శిరోమణి అకల్ దళ్ లూథియానా 140
1989 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ అనకాపల్లి 09
1991 రామ్ అవధ్ జనతా దళ్ అక్బర్‌పూర్ 156
1996 సత్యజిత్ సింగ్ గైక్వాడ్ కాంగ్రెస్ బరోడా 17
1998 సోమ్ మరాండి బీజేపీ రాజమహల్ 09
1999 ప్యారేలాల్ సంక్వార్ బీఎస్పీ ఘటంపూర్ 09
2004 పి పూకున్హి కోయా జేడీయు లక్షద్వీప్ 71
2009 నమో నారాయణ కాంగ్రెస్ టోంక్ సవాయి మాధోపూర్ 317
2014 తుప్‌స్తాన్ చెవాంగ్ బీజేపీ లడఖ్ 36
2019 భోలానాథ్ (బిపి సరోజ్) బీజేపీ ఫిష్ టౌన్ 181



