ధాతుమాతువుల కలయికే సంగీతం! ఆ మాత్రం తెలియకపోవడమేంటి.. కృష్ణ కృష్ణా!!

తెలుగు భాషా మనదే, సంగీతమూ మనదే

వాఙ్మాతు రుచ్యతే గేయం ధాతు రిత్యభి ధీయతే
వాచం గేయం చ కురుతేయః స: వాగ్గేయ కారకః

గేయంలోని మాటల కూర్పుయే ‘వాక్కు’. దీనినే ‘మాతువు’ అని పిలుస్తారు. అలాగే , సంగీతపు కూర్పు ‘ధాతువు’.

మాతు, ధాతువులను రెండింటినీ సమర్ధతతో రచించి పాడగలిగినవాడే ‘వాగ్గేయ కారుడు’. అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసు మున్నగు వారు ‘వాగ్గేయకారులు’ గా యశోధనులైనారు. ఇటువంటి దక్షిణ భారతీయ వాగ్గేయకారులవలన భక్తి సామ్రాజ్యము వందల ఏళ్ళయినా ఈ నాటికీ వర్ధిల్లుతూనే ఉంది.

‘సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం; ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం’ సంగీతం ఆపాత మధురమైతే సాహిత్యం ఆలోచనామృతం.

మన వాగ్గేయకారులలో ‘పదకవితాపితామహుడు’ అన్నమాచార్యులు, తెలుగు భాషకు స్వర భిక్ష పెట్టిన త్యాగరాజు ప్రాత: స్మరణీయులు. అనేక చారిత్రక కారణాలవల్ల త్యాగరాజ స్వామిని తమిళులు సొంతం చేసుకున్నారు. తిరువయ్యూరులో జరిగే వార్షిక త్యాగరాజ ఉత్సవాల్లో కూడా వారికే ముందు వరుస. జాతి, మత, కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా అందరికీ కర్ణాటక సంగీతం అందుబాటులోకి రావాలని, అట్టడుగు బడుగు వర్గాలు, దళితులకు కూడా కర్ణాటక సంగీతం చేరువ కావాలని ఒక వినూత్న, విప్లవాత్మక ఆలోచనతో, శతాబ్దాలుగా ఛాందసవాదుల బంధనాల్లో ఉన్న దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రచారం తన బాణీలో కొన్నేళ్ళుగా చేసుకుంటూ పోవడం వల్ల టి.ఎం.కృష్ణ వంటి విద్వాంసుడు అందరికీ ఇప్పుడు కానివాడయ్యాడు. ‘ఫ్లాష్ మాబ్ డ్యాన్సు’ ల్లాగా హఠాత్తుగా సముద్ర తీరంలో ప్రత్యక్షమై అక్కడికక్కడ కచేరీ చేయడం, పూరిగుడిసెల్లోకి, మురికివాడల్లోకి వెళ్ళి అక్కడ కచేరీలు చేయడం ఎన్నో ఏళ్ళుగా టి.ఎం.కె. పద్ధతిగా నడుస్తోంది. ఆయన స్వర విన్యాసాలకు వాళ్ళు కూడా నృత్యాలు చేయడం, వారితో పాటు ఈయన నృత్యాలు చేయడం చెన్నైవాసులకు సుపరిచితమే. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేకపోయినా, సాహిత్యానికి సంగీతంలో పెద్దగా ప్రాధాన్యతనివ్వక్కరలేదని, స్వరాలు పాడుకుంటేనే అద్భుతంగా ఆనందించవచ్చని, టి.ఎం.కె. తనదైన దేహ భాషతో కాళ్ళూపుతూ పాఠం చెబుతున్న విడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణీ అవడంతో అసలు మొత్తం వివాదానికి బీజం పడింది. ఇది తెలుగు భాష మీద పట్టున్న త్యాగరాజ శిష్య పరంపరలోనివారికే కాక, మొత్తం తెలుగు సంగీత విద్వాంసులందరికీ చిర్రెత్తుకొచ్చేలా చేసింది. టి.ఎం.కె. త్యాగరాజ సాహిత్యాన్ని ఖండ ఖండాలు చేసి పాడటం మృతప్రాయమైపోతున్న తెలుగు భాషకు మరో చావుదెబ్బ. అది భాష మీద ఏ మాత్రం గౌరవం లేని తమిళ విద్వాంసుడి చేతుల్లో కావడం దురదృష్టం. త్యాగరాజ స్వామిని వారికి వదలిపెట్టి, మౌనంగా మన పాటలు మనం పాడుకుంటూ బతికేస్తున్నపుడే తమిళులకు మన మీద గౌరవం పోయింది. త్యాగరాజ సంగీతాన్ని, తెలుగు భాషని బతికించుకోవడం మన తక్షణ కర్తవ్యం. దానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం కావడం ఎలాగో పెద్దలు ఆలోచించాలి. మన తెలుగు భాష ఇంకా కొన ఊపిరితో బతుకుతోంది మన అన్నమయ్య పదంలోను, త్యాగరాజ సంకీర్తనల్లోనే. వీటిని ఆ స్థాయి విలువలతోనే బతికించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత.

ఇక ఈ వివాదానికి తమిళ విద్వాంసుల పార్శ్వం మరో విధంగా ఉంది. సంగీతం మీద ఏ మాత్రం గౌరవం లేకుండా అహంకారంతో ప్రవర్తిస్తాడని, పవిత్రమైన కర్ణాటక సంగీతాన్ని వీధుల్లోకి లాగాడని, సంప్రదాయాన్ని మంట కలుపుతున్నాడని తమిళ విద్వాంసులు ఎప్పటినుంచో టి.ఎం.కె. మీద కినుకగా ఉన్నారు. ఆయన నోటి దురుసు ప్రవర్తన వల్ల తమిళ విద్వాంసులు టి.ఎం.కె. మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత నాలుగేళ్ళుగా మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో టి.ఎం.కె. కచేరీ చేసిందే లేదు. ఈ నేపథ్యంలో ఆయనకి ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని మ్యూజిక్ అకాడెమీ ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. ‘భారతరత్న’ ఎం.ఎస్.అమ్మ సైతం తొలిసారి అన్నమయ్య సంకీర్తనలు పాడేటప్పుడు, తెలుగు భాషలోని ఉచ్చారణ మెళకువలు నేర్చుకుని మరీ పాడారని విద్వాంసులందరికీ తెలుసు. ఎం.ఎస్.అమ్మ తెలుగు భాషలో దోషాలెంచగలమా? అదీ ఆ స్థాయి కళాకారుల చిత్తశుద్ధి! ధాతు మాతువులను జోడు గుర్రాల్లా నడిపించడంలో నిష్ణాతులైన ఎం.ఎస్.అమ్మ, బాలమురళి వంటి దిగ్గజాల నుండి కూడా తమిళ విద్వాంసులు కొందరు సంగీతంలో భాషకు ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం శోచనీయం. మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సైతం భాష మీద పట్టు సాధించాకే వేల పాటలు వివిధ భాషల్లో పాడారు. విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సమూహాల జేజేలు అందుకున్నారు. బాలు భాషా జ్ఞానాన్ని ఎవ్వరూ వంక పెట్టలేదు. వంక పెట్టలేరు. యాభై ఏళ్ళకు పైగా ఆయన మచ్చ లేని భాషాజ్ఞానిగా దేశ, విదేశాల్లోని ప్రజలందరితోనూ తమ భాషా గాయకుడే అన్నంతగా మన్ననలు పొందారు. స్వరార్ణవాన్ని అవుపోసన పట్టిన జ్ఞానుల్లా ప్రవర్తించేవారు భాషను చిన్న చూపు చూడటం శోభస్కరం కాదు. స్వరాలొక్కటీ పాడుకుంటూ పోతే అది కచేరీ ఎలా అవుతుంది? ధాతు మాతువులు కలిస్తేనే అది చక్కటి సంగీతమై రసిక జన మనోరంజకంగా ఉంటుంది. అలా కచేరీ చేయలేనప్పుడు అది అరసికంగా ఉంటుంది. విలువలు పతనమయ్యేలా ప్రవర్తించే ఇటువంటి విద్వాంసుడు సంగీత కళానిధియా అని తమిళ విద్వాంసులు ఒంటి కాలిమీద లేస్తున్నారు. తమకు ఇచ్చిన ‘సంగీత కళానిధి’ బిరుదాన్ని తృణప్రాయంగా తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రముఖ విద్వాంసులైన త్రిచూర్ సోదరులు, టి.ఎం.కె. అధ్యక్షత వహించే సమావేశంలో పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాబోయే డిసెంబరులో కచేరీలు చేసే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. సాటి సీనియర్ కళాకారుణ్ణి అవమానించడమే మీ ధ్యేయం కానీ, మీ నిరసన ఏదైనా మాకు తెలియచేయకుండా సామాజిక మాధ్యమాలకెక్కడమేమిటని మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ అధ్యక్షులు ఎన్.మురళి, విదుషీమణులు, విద్వాంసులు రంజని, గాయత్రి గార్లకు సమాధానమివ్వడం గమనార్హం. ఇది అకాడెమి అహంకారానికి అద్దం పడుతున్నదని, మొత్తంగా అకాడెమీనే బాయ్ కాట్ చెయ్యాలని, విలువల్లేని విద్వాంసుణ్ణి, కర్ణాటక సంగీతాన్ని భ్రష్టుపట్టించే విధంగా ప్రవర్తించే అహంకారిని మీరు ‘సంగీత కళానిధి’ పురస్కారానికి ఎలా ఎన్నుకున్నారని అధ్యక్షుడు ఎన్.మురళిని సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.

అసమాన మృదంగ విద్వాంసులు కీ.శే. పాల్ఘాట్ మణి అయ్యర్ కుటుంబం కూడా వారికిచ్చిన ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. ‘సంగీత కళానిధి’ పురస్కారాన్ని అందుకున్న తొలి మృదంగ విద్వాంసుడిగా మణి అయ్యర్ సుప్రసిద్ధులు. కర్ణాటక సంగీతానికి సంబంధించి టి.ఎం.కె.రాసిన అయిదు పుస్తకాలు కూడా ఆయన పట్ల నిరసన పెరగడానికి కారణమయ్యాయని ప్రముఖులంటారు. మణి అయ్యర్ కుటుంబానికి టి.ఎం.కె.పట్ల కోపం ఉండటానికి మరో కారణం ఉంది. మృదంగం తయారీలో ప్రముఖులైన ‘సెబాస్టియన్ అండ్ సన్స్’ మీద ఒక పుస్తకం రాయాలని సంకల్పించిన టి.ఎం.కె. సాధికారిక సమాచారం కోసం, స్వర్గీయ మణి అయ్యర్ ని సంప్రదించారని, తన అనుభవ సారంతో తనకు తెలిసిన సమాచారాన్నంతటినీ మణి అయ్యర్ టి.ఎం.కె.తో పంచుకున్నారని, దానిని కేవలం సమాచరంగా కాకుండా, కుల దృక్పథంతో, రాజకీయ ప్రేరేపణ దృష్టితో పుస్తకంలో ప్రచురించారని మదురై మణి అయ్యర్ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ నేపథ్యంలో వారు కూడా తమ తండ్రిగారికిచ్చిన పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. మన వాగ్గేయకారుల సాహిత్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా, తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగువారందరికీ తమిళులపట్ల తరతరాలుగా కోపంగానే ఉంది. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెచ్చుమీరడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ, సాహిత్యమే అక్కరలేదని ప్రచారం చేస్తున్న టి.ఎం.కె. పట్ల తెలుగువారి అభ్యంతరం భాషవరకు మాత్రమే. ఆయనకిచ్చిన ‘సంగీత కళానిధి’ పురస్కారం పట్ల తెలుగు విద్వాంసులకు ఏ మాత్రం అభ్యంతరం లేనట్టే అనిపిస్తోంది. భాష తెలుసుకుని, నేర్చుకుని పాడండని తమిళ విద్వాంసుల్ని మన విద్వాంసులెందరో తరతరాలుగా అభ్యర్థిస్తూనే ఉన్నారు. అపర త్యాగరాజుగా తమిళులే కీర్తించిన సాక్షాత్తు బాలమురళి అంతటి విద్వాంసులు తెలుగు భాషను తమిళులకు నేర్పించడానికా అన్నట్టు, తన జీవితాన్ని తమిళనాట గడిపారు. తమిళ భాషలో సైతం కీర్తనలు రచించి, తమిళ విద్వాంసులతోనే జేజేలందుకున్నారు. ఇంత చేసినా తెలుగు భాష పట్ల తమిళ విద్వాంసులకు ఏ మాత్రం శ్రద్ధ లేకపోగా, అది నానాటికి తీసికట్టుగా తయారైంది. ఇటువంటి విద్వాంసుల సమూహంలో ఎదుగుతున్న ఈ తరం యువ విద్వాంసులకు భాష పట్ల ఎందుకు గౌరవం ఉంటుంది? తెలుగు వారికి సంబంధించినంతవరకు ఇది మన భాష సమస్య. తెలుగు భాషను ఖండ ఖండాలు చేసి, తమిళులు పాడే సంకీర్తనలను ఇక ఏ మాత్రం సహించేది లేదు. మ్యూజిక్ అకాడెమీకి నిరసన తెలపాల్సిన అవసరం మనకు లేదు. నిలువెత్తు ధాతు మాతు స్వరూపమైన బాలమురళి మనవారే. తెలుగు భాష మనది, సంగీతం వారిది అనే మంచితనం ఇక చాలు. తెలుగు భాషా మనదే, సంగీతమూ మనదే. తమిళ సంగీతం నుంచి తెలుగు భాషను కాపాడుకుందాం. ధాతు మాతువులకు సమాన గౌరవమిచ్చి సంప్రదాయ కర్ణాటక సంగీత గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేసే హక్కు, జ్ఞానం తెలుగువారికే ఉన్నాయి. ఆ దిశగా చిత్తశుద్ధితో ఇప్పటికైనా ప్రయత్నాలు ప్రారంభిద్దాం. తెలుగు భాషకు తమిళ వడ దెబ్బ తగలకుండా కాపాడుకుందాం. చివరిగా చిన్న మాట. ‘శీలేన శోభతే విద్యా’ అంటారు పెద్దలు. శీలనిర్మాణంతోపాటు ఎదిగి, ఒదిగిన విద్యకే గౌరవం దక్కుతుంది. ఏ రంగంలోనైనా అటువంటి విద్వాంసులకే అగ్రతాంబూలం లభిస్తుంది.

ఎన్నాచ్చి? ఎదుకు అప్పిడి గలాట పండ్రే!

చల్లా రామఫణి✍🏻 9247431892.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles