ఇరాన్- ఇజ్రాయెల్… యుద్ధంలో ఎవరి బలాబలాలెంత..?

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లైన్స్ పేరిట ఇజ్రాయెల్ తెరతీసిన యుద్ధం వెనుక అమెరికా సామ్రాజ్యవాదం కనిపిస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చ. అమెరికాకు అలాంటి అవకాశం ఇవ్వకుండా… ఇరాన్ ను ముందు పెట్టి అమెరికా పీచ మణచాలన్నది ప్రధానంగా చైనా, రష్యా ఆరాటం. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై ఇరాన్ డ్రోన్స్, క్షిపణుల దాడులతో.. ఇప్పుడు ఎవరి బలాబలాలెంత అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇరువైపులా మద్దతిస్తూ, సాయమందిస్తున్న అమెరికా, చైనా, రష్యా దేశాల బలాబలాలను కాస్సేపు పక్కనబెడితే.. అసలు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ బలాలాలేంటో ఓసారి చూద్దాం.

ఇజ్రాయెల్ సైన్యం వర్సెస్ ఇరాన్ సైన్యం!

గగన, భూ, సముద్ర దళాల్లో అసలు ఎవరు బలమైన వారు? విమానాలు, ట్యాంకులు, నౌకలు, సైనికుల తులనాత్మక విశ్లేషణను ఓసారి పరిశీలిస్తే.. సైనిక బలంలో ఇరాన్ దే పైచేయి. అలాగే ఎక్కువ యుద్ధ ట్యాంకులు, అతి పెద్ద నౌకాదళం కూడా ఇరాన్ కు ఎస్సెటే. అయితే, మరోవైపు ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక సాంకేతికత, అభివృద్ధి చెందిన యుద్ధవిమానాలు, శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ బలాన్ని ఇనుముడింపజేసేవి. రెండు దేశాలూ శక్తివంతమైన సాయుధ దళాలను కలిగి ఉన్నప్పటికీ.. పరిమాణంలోనూ, యుద్ధ సామాగ్రిలోనూ, సాంకేతికతలోనూ, వ్యూహరచనల్లోనూ తేడాలున్నాయి. తాజాగా లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా వారి సామర్థ్యాలపై స్పష్టమైన తులనాత్మక విశ్లేషణ ఇది.

మానవ వనరులు.. సైనికుల సంఖ్య!

సైనిక పరంగా ఇరాన్ బలం పెద్దది. దాదాపు 6 లక్షల 10 వేల మంది డ్యూటీలో ప్రోయాక్టివ్ గా పనిచేసే సైనికులుండగా.. సుమారు మరో 3 లక్షల 50 వేల మంది రిజర్వ్ సైనికులు.. అలాగే, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి పారా మిలిటరీ దళాలు ఇరాన్ అదనపు బలాలు.

ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే సైన్యం చిన్నది. కేవలం సుమారు 1 లక్షా 78 వేల మంది ప్రోయాక్టివ్ సైనికులున్నారు. కానీ సుమారు 4 లక్షల 65 వేల మంది రిజర్వు సైనికుల బలమైన వ్యవస్థను కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే సంసిద్ధం చేసుకుంది. యుద్ధ సమయాల్లో రిజర్వ్ సైనిక సంపదను కూడా త్వరగా మోహరించగల్గే అలర్ట్ నెస్ ఇజ్రాయెల్ ప్రత్యేకత. సంఖ్యాపరంగా ఇరాన్‌కు ఆధిక్యం ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్‌లో తప్పనిసరైతే.. సైనిక సేవలను వినియోగించుకునే బలమైన రిజర్వ్ వ్యవస్థ ఉంది. వారంతా సుశిక్షితులైన సైనిక దళాలు.

గగనతలంలో ఎవరి శక్తి ఎంత..?

ఇక్కడ సాంకేతికత వర్సెస్ సంఖ్య చర్చించాల్సిన విషయం. ఆధునిక యుద్ధకాలంలో గగనతల వ్యూహాత్మక ఆధిపత్యమే కీలకం. ఇజ్రాయెల్ వద్ద సుమారు 550 సైనిక విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 284 యుద్ధవిమానాలే. F-15, F-16లతో పాటు.. అత్యాధునిక F-35 స్టెల్త్ యుద్ధవిమానాలు ఇజ్రాయెల్ కు సాంకేతిక బలం. ఇంకా ఇరాన్ వద్ద సుమారు 627 విమానాలున్నాయి. వీటిలో దాదాపు 286 యుద్ధవిమానాలే అయితే ఇరాన్ వద్ద ఉన్న చాలా విమానాలు గతంలో సోవియట్ యూనియన్ నుంచి, అమెరికన్ పాత తయారీ మాడల్సే ఎక్కువ. ఇస్లామిక్ ఉగ్రవాదం, ఇరాన్ వంటి పశ్చిమాసియా దేశాలపై అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో.. సరఫరా సమస్యల కారణంగా ఇరాన్ దగ్గరున్న విమానాలు ఆధునీకరించబడలేదు. సంఖ్యాపరంగా ఇరాన్ వద్ద విమానాల సంఖ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. సాంకేతికత, ఆయుధాలు, శిక్షణ పరంగా ఇజ్రాయెల్ వైమానిక దళం మరింత ఆధునికంగా, అంతకుమించిన సమర్దవంతంగా కనిపిస్తొంది.

భూ దళాలు, ట్యాంకులు..?

భూఉపరితలంపై యుద్ధమే నేరుగా జరిగితే ఇరాన్ వద్దే ఎక్కువ ట్యాంకులున్నాయి. కవచాల్లాంటి వాహనాలున్నాయి. ఇరాన్ వద్ద 17 వందలకు పైగా ప్రధాన యుద్ధ ట్యాంకులతో పాటు, వేలాది ప్రొటెక్టెడ్ వెహికిల్స్ ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ వద్ద 13 వందల యుద్ధ ట్యాంకులుంటే.. వాటిలో మెర్కావా యుద్ధ ట్యాంకులు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవి, శక్తివంతమైనవి.

నౌకదళ శక్తిలో ఎవరెంత..?

ఇరాన్ వద్ద 90 యుద్ధ నౌకలుంటే.. వాటిలో సబ్ మెరైన్స్ తో పాటు, పర్షియన్ గల్ఫ్, హోర్మూజ్ జలసంధిలో అవసరమైతే యుద్ధ కార్యకలాపాల కోసం పెట్రోల్ బోట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ నౌకాదళం చాలా చిన్నది. సుమారు 49 నౌకలు మాత్రమే ఈ దేశం దగ్గర ఉన్నప్పటికీ.. అత్యాధునికమైన సబ్ మెరైన్స్, ఇంటర్ కనెక్టివ్ సముద్ర జలాల్లో మెడిటరేనియన్ సముద్ర పరిధికి అనువైన తీరరక్షణ నౌకలు ఇజ్రాయెల్ సొంతం.

ఇక క్షిపణులు, డ్రోన్స్, అణు సామర్థ్యంలో ఎవరెంత..?

ఇరాన్ బలమంతా క్షిపణులు, డ్రోన్స్ పైనే ఆధారపడి ఉంది. మధ్య ప్రాచ్యంలోని సుదూర లక్ష్యాలను చేరగల్గే వేలాది బాలిస్టిక్, అలాగే క్రూయిజ్ క్షిపణలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద అణు ఆయుధాలున్నాయన్నది పెద్ద ఎత్తున ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం. అది ఇరాన్ వద్ద లేకపోవడం దాని బలహీనత. అదనంగా ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్, ఏరో వంటి ఆధునిక క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

మరి ఎవరిది పైచేయి..?

యుద్ధమంటే మారణహోమం. దాని పరిధి ఎంతకైనా పెరుగొచ్చు. ఇరువైపులా ప్రాణనష్టం తప్పదు. దాని ప్రభావం పక్కనున్న ఇరుగుపొరుగు దేశాలనూ అతలాకుతలం చేస్తుంది. చమరుకు పెట్టింది పేరైన దేశాల్లో యుద్ధాల వల్ల నెలకొనే సంక్షోభంతో.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతాయి. నిత్యవసరాలూ పెరుగుతాయి. ద్రవ్యోల్బణం నశాళానికెక్కుతుంది. ఈ క్రమంలో ఎవరిది పైచేయైనా కూడా ఇవన్నీ భరించాల్సిందే.

అయితే, ఇరాన్ వద్ద సంఖ్యాపరంగా సైనిక బలగం ఎక్కువగా ఉంది. అలాగే, యుద్ధ ట్యాంకులు, భారీ నౌకాదళం ఇరాన్ ప్రత్యేకతలు. ఇక ఇజ్రాయెల్ వద్ద అత్యుత్తమమైన సాంకేతికత, ఆధునిక యుద్ధ విమానాలు, శక్తివంతమైన రక్షణ వ్యవస్థలున్నాయి. అమెరికా మద్దతు ఇజ్రాయెల్ కు అదనపు బలం. ఇరాన్ కు చైనా, రష్యా పరోక్షంగా మద్దతిస్తున్నా.. అమెరికా తరహాలో దుందుడుకుడుగా ఇజ్రాయెల్ పై అవి విరుచుకుపడటం లేదు. వారికి ఇజ్రాయెల్ కంటే కూడా ప్రధాన శత్రువు అమెరికానే కాబట్టి.. వ్యూహాత్మకంగా పావులు కదపడం సహజం. దీంతో ఇప్పుడు ఇజ్రాయెలే ఆధునిక సాధనా సంపత్తితో ఆధిక్యాన్ని కనబర్చే అవకాశాలే ఎక్కువ.

ఇరాన్ తో చైనా దోస్తీ కట్టిందా..?

జరుగుతోంది ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధమే అయినా… కనిపించకున్నా వినిపించే పేర్లు అమెరికా- చైనాలవే. అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతిస్తుంటే.. యుద్ధ ఆరంభంలోనే చైనా మధ్య ప్రాచ్యానికి ప్రాణాంతక దాడులకు తెగబడే డ్రోన్స్ పంపించింది. అమెరికా టెహ్రాన్ పై దాడుల కోసం తన సైనిక సమీకరణను పెంచుతుంటే… చైనా ఇరాన్ కు మద్దతు పలుకుతోంది. ఆధునిక క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలకు సంబంధించిన సామాగ్రిని అందిస్తోంది. ఇది మధ్య ప్రాచ్యం కేంద్రంగా మరింత భీకర యుద్ధానికి కూడా తెర తీయొచ్చు.

2025 జూన్ లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ యుద్ధంలో ఇరాన్ కు సంబంధించిన గగనతల రక్షణ వ్యవస్థలు, అణు మౌలిక వసతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు తన సైనిక సామర్థ్యాలను పునర్నిర్మించేందుకు టెహ్రాన్ వడివడిగా చర్యలు చేపడుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకు ఇరాన్ కు చైనా సాయమందిస్తోంది.

అందులో భాగంగా బీజింగ్ ఇప్పటికే కచ్చితమైన దాడులకుపయోగించే లోయిటరింగ్ మ్యూనిషన్స్ అని కూడా పిల్చే కామికాజే డ్రోన్స్ ను ఇరాన్ కు పంపించింది. అదే సమయంలో HQ-16, HQ-17AE వంటి గగనతల రక్షణ వ్యవస్థలనూ సరఫరా చేసింది. అదనంగా సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్షిపణులు, హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికిల్స్ వంటివాటికి సంబంధించిన ఒప్పందాలపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అవే గనుక చైనా నుంచి ఇరాన్ కు అందితే అరేబియా సముద్రంపైనా.. అలాగే, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, స్టెల్త్ జెట్స్, నౌకాదళ కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లడం ఖాయమన్న చర్చా జరిగింది.

మిస్సైల్స్ వర్సెస్ డ్రోన్స్!

ఇరానియన్ డ్రోన్స్ దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా ప్రాంతంలో కలకలం రేపడంతో పాటు.. మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరానియన్ డ్రోన్స్ ను ఎదుర్కొనే విషయంలో మధ్యప్రాచ్యం ఎందుకు విఫలమవుతోందనేదీ మరో చర్చ. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రాంతీయ ఘర్షణంగా మారిపోయింది. దీంతో ఇరాన్ చుట్టూ ఉండే ప్రధానమైన గల్ఫ్ దేశాలపైనా ఇప్పుడు జరుగుతున్న యుద్ధ ప్రభావం పడుతోంది.

అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన జాయింట్ ప్రోగ్రాం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట జరిగిన ప్రీ ఎంప్టివ్ అటాక్స్ తర్వాత శనివారం నుంచి ఇరాన్ యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వ్యూహాత్మక స్థావరాలపై డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడన్న వార్తల నేపథ్యంలో ప్రతీకార దాడుల తీవ్రతా పెరిగింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్ లోని అమెరికా 5వ ఫ్లీట్ మెయిన్ ఆఫీస్ తో సహా.. ఖతార్, యూఏఈ, ఆల్ దాఫ్రా, జెబెల్ అలీ, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్, డ్రోన్స్ తో విరుచుకుపడుతోంది. మనామా, దుబాయ్, దోహా నగరాల్లో ఈ దాడులు ఇప్పుడు భీతవహ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. చాలావరకు మిస్సైల్స్ ను, డ్రోన్స్ నూ అడ్డుకున్నప్పటికీ.. ఖతార్ వంటి చోట్ల సామాన్యులు గాయాలపాలయ్యారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో సైరన్ మోతలు బెంబేలెత్తిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు తమ సార్వభౌమిధికారంపై దాడిగా అభివర్ణిస్తున్నప్పటికీ.. ఇప్పట్లో ఈ తీవ్రత తగ్గేలా కనిపించడం లేదు.

యుఏఈ ఒక్కటే 137 బాలిస్టిక్ మిసైళ్లలో సుమారు 132ని అడ్డుకుంది. 209 డ్రోన్లలో 195 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. అయినప్పటికీ 14 డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని యుఏఈ భూభాగంపైనాస జలాల్లో పడిపోయాయి. దీనివల్ల అపార నష్టం వాటిల్లింది.ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉన్న ఎతిహాద్ టవర్స్ సమీపంలో కూడా డ్రోన్ అవశేషాలు కనిపించాయి.

ఖతార్ 18 మిసైళ్లను అడ్డుకున్నప్పటికీ 16 మందికి గాయాలపాలయ్యారు. బహ్రెయిన్ 45 మిసైళ్లు, 9 డ్రోన్లను కూల్చివేసినా.. మనామా నివాస ప్రాంతాల్లో దాడులు జరిగి నలుగురు ఆసుపత్రిపాలయ్యారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో భారీ స్థాయిలో జరిగిన ఈ దాడుల్లో డ్రోన్ గుంపులు.. రక్షణ వ్యవస్థల్లోని బహుళ స్థాయిలోని లోపాలనుపయోగించుకుని విరుచుకుపడ్డాయి.

ఈ దాడులు చెబుతోందేంటంటే.. మిస్సైల్స్ ను అడ్డుకోవచ్చునేమోగానీ.. తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న డ్రోన్లతో చేసే వ్యూహాత్మక దాడులతో కూడా.. ఇలాంటి హైబ్రీడ్ యుద్ధాల్లో గణనీయమైన నష్టం కల్గించవచ్చని ఇప్పటివరకూ ఇరాన్ నిరూపించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles