ఇటాలియన్ గ్రాండ్ టూర్ లో.. భారత జెండాను రెపరెపలాడించిన రేసర్ మన మహావీర్!

భారతదేశంలో ఏ క్రీడకు ఆదరణెక్కువ అంటే.. ఠక్కుమని అందరూ చెప్పేదీ.. మనందరితో సహా ఎక్కువగా చూసేదీ క్రికెటేననీ మనందరికీ తెలిసిందే. కానీ, అదే భారత్ నుంచి క్రీడలంటే క్రికెట్ మాత్రమే కాదని… ఇతర రంగాల్లోనూ నిరూపిస్తున్నవారెందరో. కానీ, వారికి దక్కాల్సినంత ఆదరణ మాత్రం ఇప్పటికీ దక్కలేదు. అయితే, ఇష్టంతో చేసే వారు ప్రారంభంలోనే ఆదరణ కోరుకోరు. ప్రతిభావంతులైతే మెల్లిగా ఆ తర్వాత ఆ ఆదరణే దరి వచ్చి చేరుతుంది. అలాంటి క్రీడాకారుడే మనం చెప్పుకుంటున్న మహావీర్ రఘునాథన్.

అవును, ఇటాలియన్ గ్రాండ్ టూర్ ఛాంపియన్ షిప్ లో ఫెరారీ కోసం పోటీ పడ్డ ఏకైక భారతీయుడు.. చెన్నైకి చెందిన 26 ఏళ్ల మహావీర్.

చెన్నైలో పుట్టిన మహావీర్ కు ఎలాంటి కోచింగ్ లేదు. అకాడమీల శిక్షణ అంతకన్నా లేదు. ఉన్నదల్లా కార్ రేసింగ్ పై ఉన్న మోజు, పట్టుదల వంటివి మాత్రమే. కానీ, అవే మహావీర్ ను ప్రొఫెషనల్ గా మార్చాయి. 13 ఏళ్ల అతగాడి కష్టం తర్వాత మహావీర్ ను ఏకంగా ఇటాలియన్ జీటీ ఛాంపియన్షిప్ కు ఎంపికయ్యేలా అవకాశం కల్పించాయి.

చిన్నప్పట్నుంచే కార్లంటే ఉన్న పిచ్చి కాస్తా మహావీర్ ను ఏకంగా వరల్డ్ లెవల్ కార్ స్పోర్ట్స్ ట్రాక్ ఎక్కించింది. ఫెరారీ 296 జీటీ3లో.. 1995లో వెటరన్ ఇటాలియన్ కార్ రేసింగ్ డ్రైవర్ అమాటో ఫెరారీ స్థాపించిన ఏఎఫ్ కోర్స్ తరపున మన చెన్నై యువకుడు ప్రాతినిథ్యం వహించాడు. 2025 ఇటాలియన్ జీటీ ఛాంపియన్ షిప్ కోసం బరిలో దూకి వార్తల్లో నిల్చాడు.

ఉడుకు రక్తంలోనే వేగాన్ని కల్గియున్న యువకుడు మహావీర్!

చిన్నప్పట్నుంచీ కార్లంటే అమితాసక్తిని చూపించే రఘునాథన్.. 2011లో గో కార్ట్ ట్రాక్ చుట్టూ మొట్టమొదటి రైడ్ లో పాల్గొన్నాడు. కానీ, రేసింగ్ ను మహావీర్ ఎప్పుడూ కెరీర్ లో ఓ ఫన్ గా మాత్రమే చూడలేదు. ఆ స్పార్క్ అతణ్ని ఏకంగా ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్ గా నిలబెట్టింది. ఆ తర్వాత అమరాన్ కార్టింగ్ ఛాలెంజెస్ వంటి ఈవెంట్లలో పాల్గొన్నాడు. చెన్నై, కొల్హాపూర్ వంటి చోట్ల టైటిల్స్ గెల్చుకున్నాడు. అప్పుడతడికి అదేదో సరదా ఆట కాదని.. అతణ్ని స్పోర్ట్స్ కార్స్, ఆ ట్రాక్స్ రారమ్మని పిలుస్తున్నాయనే ఒక భావన లోపల బలంగా పడింది.

ఇప్పటికే చెప్పుకున్నాం. ఇండియాలో క్రికెట్ తప్ప టీవీల్లో ఇతర స్పోర్ట్స్, అండ్ గేమ్స్ చూసేవారే కరువు. కానీ, ఎక్కడో ఎందరో కొందరు ఇతర క్రీడాభిమానులు కూడా ఉంటారు. అలాంటివాడిలో రఘునాథన్ ఒకడు. ఫార్మూలా వన్ వైపు మహావీర్ మనస్సు మళ్లింది. టీవీలకే అతుక్కుపోయాడు. 2011-13 మధ్య సెబాస్టియన్ వెటెల్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ లో ఆధిపత్యం చెలాయించిన సమయంలో… అమితంగా ఇన్స్పైర్ అయ్యాడు. తానూ, సెబాస్టియన్ లా కావాలని కలలు కన్నాడు. అదే విషయాన్ని కుటుంబీకులకు చెబితే వారినుంచి అతగాడు కోరుకున్న ప్రోత్సాహం అంతకంతకూ లభించింది. ఇంకేం తనను అడ్డుకునే అడ్డంకులేమీ లేవు.. మహావీర్ ముందున్నదల్లా ఒకటే లక్ష్యం ఫార్మూలా వన్!

మలేషియాలో మాక్స్ కార్టింగ్ ఛాంపియన్షిప్ లో రేసింగ్ లో పాల్గొన్నప్పుడు తన పోరాటం చూసిన చార్టెడ్ అకౌంటెటైన తండ్రి రఘునాథన్ కూడా కొడుకును తాము ప్రోత్సహించినందుకు ముచ్చటపడ్డాడు.

కల వైపు పయనం!

సుమారు 13 ఏళ్లుగా మహావీర్ ఫార్మూలా బీఎండబ్ల్యూ ఇండియా పోటీలతో పాటు.. గ్రాండ్ ప్రిక్స్ పోటీలు, చివరకు 2019లో ఫార్మూలా పోటీల్లోనూ తన సత్తా చాటి ర్యాంకుల్లో ఎగబాకాడు. కానీ, రేసింగ్ జర్నీ ఏమంత సజావుగా సాగేది కాదు.. గ్రాండ్ ప్రిక్స్ నుంచి ఎఫ్2కి వెళ్లాలంటే తను శారీరకంగా, మానసికంగా పడిన కష్టం.. తన పట్టుదలే తనను వరుస మెట్లెక్కేలా ఉత్తేజాన్నిచ్చింది.

2021లో ఆల్ఫా రోమియోతో ఫైట్ లో ఫార్మూలా వన్ లో కారు నడిపిన మూడో భారతీయుడిగా మహావీర్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఇక గత 2025 మేలో జరిగిన ఫార్మూలా వన్ లో భాగస్వామయ్యే అవకాశం దక్కడం తన జీవితంలో ఒకానొక మధురక్షణమంటాడు మహావీర్.

అలా 2025 మేలో జరిగిన ఏఎఫ్ కోర్స్ సహచరుడితో కలిసి ఇటాలియన్ జీటీ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న మహావీర్ రఘునాథన్ బృందం.. పీ6 రౌండ్ ను పూర్తి చేసింది. కానీ, పీ4లో మాత్రం ప్రోయామ్ క్లాస్ లో కేవలం వన్ మినిట్ టూ సెకన్స్ తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఆ పోటీల్లో నాల్గవస్థానానికి పరిమితమైంది ఏఎఫ్ కోర్స్ టీం. అయితే, ఆ అంతరం ఎక్కువ ఉంటే బాధపడేవాళ్లం కాదుగానీ.. కేవలం వన్ మినిట్ టూ సెకన్స్ లో మూడోస్థానం చేజారడంపై కాస్త నిరాశ చెందామంటాడు మహావీర్ రఘునాథన్. అదే సమయంలో మొదట టాప్ 15లో మాత్రమే ఉన్న తాము.. తిరిగి మూడోస్థానానికి పోటీపడిన తీరు ఊరటనిచ్చిందనీ తానే చెబుతాడు.

స్టిమ్యులేటర్స్ పై ప్రాక్టీస్!

రేసు పందాల్లో పరిమితమైన ట్రాక్ టైం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో మహావీర్ తన నైపుణ్యానికి పదును పెట్టేందుకు స్టిమ్యులేటర్స్ పైనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. ఇతర పోటీ డ్రైవర్లతో ఆన్ లైన్ లో కూడా స్టిమ్యులేటర్స్ పై రేసింగ్ చేస్తూ తనను తాను ట్రాక్ లోపల కూడా మెరుగుపెట్టుకున్నాడు మహావీర్.

మోటార్ స్పోర్ట్స్ లో ఒత్తడి ఉండటమే కాదు.. స్పాన్సర్స్ దొరకడం కూడా అంత సులభం కాదు. మహావీర్ మాత్రం ఆ విషయంలో తాను లక్కీఫెల్లోనని చెబుతాడు. తాను పని చేసిన జట్లు కూడా తనకు అన్నివిధాలా సహకరించాయంటాడు. 2016 నుంచి 2018 వరకూ కొలోని మోటార్ స్పోర్ట్స్ కు సేవలిందించగా వారి నుంచి మహావీర్ కు పూర్తి సహకారమందింది. దానికి కృతజ్ఞతగా తాను 2017లో వారితో కలిసి పనిచేసి ఛాంపియన్షిప్ సాధించాడు. మోటార్ స్పోర్ట్స్ కచ్చితంగా ప్రమాదకరం. తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన తప్పకుండా ఉంటుంది. అయితే అవన్నీ ఆలోచించే సమయం కూడా తన వద్ద లేదంటాడు.

జీటీ రేసింగ్ లో ముద్ర కోసం యత్నం!

ఈమధ్యకాలంలో మహావీర్ జీటీ రేసింగ్ పై దృష్టి పెట్టాడు. ఈ ఫార్మాట్ లో తను ఏకంగా ఏఎఫ్ కోర్స్ వంటి టీమ్ తరపున ఫెరారీ 296 జీటీ3 వంటి రేసింగ్ కార్ల రైడింగ్ లో ట్రాకులోకి అడుగుపెట్టడమే పెద్ద విశేషం. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమైబైల్స్.. ప్రపంచంలోని ఆటోమోబైల్ కంపెనీల సమాఖ్య నిర్వహణలోని వరల్డ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్షిప్.. అలాగే, గ్రాండ్ ప్రీ వరల్డ్ ఛాలెంజ్ కు సంబంధించిన 36 ఫెరారీ కార్ల బందాలతో పడ్డ పోటీ మహవీర్ కెరీర్ లోనే ఓ మైలురాయి.

కార్ రేసింగ్ లో మరో భారత ధృవతార మహావీర్!

ఏఎప్ కోర్స్ జట్టు ప్రిన్సిపల్ అమాటో ఫెరారో ఏమంటాడంటే.. మహవీర్ నైపుణ్యమున్న కార్ రైడర్. ఫెరారీ 296కు అనుగుణంగా తనను తాను చాలా మెరుగుపర్చుుకున్నాడు. తాను ఈ రైడింగ్ లో కొత్తైనప్పటికీ.. అతడి ప్రదర్శన పట్ల జట్టులోని ఇంజనీర్స్, ఇతర బృంద సభ్యులంతా సంతృప్తిగా ఉన్నట్టు అమాటో ఫెరారో మహావీర్ నైపుణ్యం గురించి చెప్పుకొచ్చారు.

2025 ఇటాలియన్ జీటీ ఛాంపియన్షిప్ లో ఏకైక భారతీయ డ్రైవర్ గా మహావీర్ రఘునాథన్ భాగస్వామ్యం భారత్ గర్వించే విషయం. రేసింగ్ లో సర్వసాధారణమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆ ఒత్తిని జయించడం, బాగా ప్రదర్శించే విషయంలో మహావీర్ కృతకృత్యుడైనాడన్న ప్రశంసలందుకున్నాడు.

2011 తరహాలో ఇండియాలో ఫార్మూలా వన్ వంటి కారు రేసింగ్ పోటీలు జరగాలన్న అభిలాష మహావీర్ ది. ఇప్పటికే ఇలాంటి క్రీడలవైపు భారతీయ యువత కూడా ఆసక్తి చూపుతోందని.. ఒకవేళ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే చాలామంది ఇటువైపు చూసే అవకాశముంటుదన్నది మహావీర్ చెప్పే మాట.

మహావీర్ ముందున్న లక్ష్యమల్లా ఇటాలియన్ జీటీ ప్రో యామ్ ఛాంపియన్షిప్ ను గెలవడం మాత్రమే. ఇక దీర్ఘకాలికంగా తాను సాధించాలనుకుంటున్నది ఫార్మూలా వన్ కారు రేసింగ్ లో సింగిల్ సీటర్ గా దిగి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం.. టైటిల్ సాధించడం. ఫార్మూలా వన్ లక్ష్యంగా అడుగులేసే ప్రతీ ఆటగాడి లక్ష్యమూ దాదాపూ అదే ఉంటుంది.. కాబట్టి, దాన్ని సాధించడమూ అంత సులువేం కాదు.. కానీ, పట్టుదల ఉంటే సాధించొచ్చన్న నమ్మకమే మహావీర్ రఘునాథన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles