Shanthi Ishaan… ✍🏼
Yeh nayan dare dare
Yeh jam bhare bhare
Zara peene do
Kal ki kisko khabar ik raat hoke nidar
Mujhe jeene do
బెదిరిపోతూ నీ కళ్ళు
తొణికిసలాడుతూ నా మధుపాత్ర
నన్ను కాస్త తాగనీ
రేపటి సంగతి ఎవరికి ఎరుక
ఈ ఒక్క రాతిరీ జంకు గొంకు లేకుండా
నన్ను బతికేయనీ
కొహ్రా సినిమా కోసం కైఫీ అజ్మీ రాసిన పాట ఇది. అందమైన ఆ పదాలను హేమంత్ కుమార్ ఎంత హృద్యంగా పలికారో! ఈ పాటను, ఈ సినిమాలోని అన్ని పాటలనూ ఆయనే స్వరపరిచారు. హేమంత్ దా గొంతులో ఇదీ అని తెలియని మత్తేదో గమ్మత్తుగా పలుకుతుంది. ఈ పాటలోనూ అంతే. మన తెలుగులో పి.బి. శ్రీనివాస్ గొంతుక లాగా ముక్కుతో పాడుతున్నట్లుగా ఉంటుందాయన స్వరం. నాకైతే ఆ గొంతు వింటున్నంతసేపూ తెలియని తన్మయత్వం. ఈ పాటైతే మరీ ఇష్టం. ఎన్నిసార్లు లూప్ లో వింటానో!
Raat haseen ye chand haseen
Tu sabse haseen mere dilbar
Aur tujhse haseen tera pyaar
Tu jaane na
రాత్రి సొగసైనది, చందమామా సొగసైనదే!
నీ అందం ముందు అవి బలాదూర్
కానీ నీ కంటే నీ ప్రేమే అందమైనది
నీకు తెలియదు కాబోలు!
నిజమే! రాత్రి అందమైనది. ఆ రాత్రి కంటే అందమైనది ప్రియురాలు. ఆమె కంటే ఆమె ప్రేమే అందమైనదట! ఆ ప్రియురాలు మరెవరో కాదు అందానికే నిర్వచనమైన వహీదా రెహ్మాన్! ఆ అందానికి దాసోహమైపోతూ బిశ్వజీత్ పాడే పాట ఇది.

1964లో వచ్చిన “కొహ్రా” హేమంత్ కుమార్ నిర్మించిన హారర్ థ్రిల్లర్. ఒక థ్రిల్లర్ మూవీలో ఇలాంటి మనసైన పాట ఉండడం అందునా దాన్ని హేమంత్ దా ఇంతలా మనసు పెట్టి పాడ్డం వల్లనేమో ఈ పాట మనసును మీటిపోతుంది.
వారణాసిలో పుట్టి కలకత్తాలో పెరిగిన హేమంత్ కుమార్ మొదట రబీంద్ర సంగీత్ నేర్చుకున్నారు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నారు. ఎన్నో పాటలకు రబీంద్ర సంగీత్ ఆధారంగానే బాణీలు కూర్చారు. రబీంద్ర సంగీత్ తో జానపద రీతులను మేళవించి ప్రయోగాలు కూడా చేశారు.
మొదట బెంగాలీ సినిమాలకు పాటలు కంపోజ్ చేసిన హేమంత్ కుమార్ 1952లో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. హిందీలో ఆయన తొలి సినిమా “ఆనంద్ మఠ్”. ఇందులో లతా మంగేష్కర్ పాడిన వందేమాతర గీతం ఇప్పటి తరానికి కూడా తెలుసు. మృదువైన మెలొడీలా సాగిపోయే జాతీయ గేయాన్ని యుద్ధానికి సన్నద్ధమయ్యే రీతిలో కంపోజ్ చేస్తూ ఆయన చేసిన ప్రయోగం ఆ పాటను ఎవర్ గ్రీన్ గా మార్చింది.
మధ్యమ స్థాయిలో పలికే హేమంత్ కుమార్ గొంతు లోతుగా, మెత్తగా సాగిపోతుంది. రొమాంటిక్ మెలోడీలకు, విషాద గీతాలకు చక్కగా అమరిపోతుంది. ఆ తరహా పాటల్లో మూడు పాటలు నాకు బాగా నచ్చుతాయి. వాటిలో ఒకటి పైన చెప్పుకున్న Ye Nayan Dare Dare పాట అయితే, ఇంకొకటి Baat Ek Raati Ki అనే సినిమాలోని Na tum hume jaano na hum tumhe jaane అనే పాట. ఈ పాటలో హేమంత్ దా గొంతు హాయిగా గుచ్చేస్తుంటే సుమన్ కల్యాణ్‌పూర్ హమ్మింగ్ తీయగా సేదదీరుస్తుంది.
ఇక “ప్యాసా” సినిమా కోసం హేమంత్ కుమార్ పాడిన “Jaane Who Kaise Log The” పాట గురించి ఏం చెప్పను? గొప్ప melancholy పలుకుతుందీ పాటలో. SD బర్మన్ స్వరపరిచిన మాస్టర్ పీస్ ఇది.
Beqarar Karke Humein, Hai Apna Dil To Awara, Yeh Raat Yeh Chandini – ఇలా చాలా పాటలే ఆయన గళం నుంచి జాలువారాయి!
(జూన్ 16 హేమంత్ కుమార్ జయంతి)



