జే. సురేందర్… ✍️
బాంచన్ దొరను పక్కనబెట్టి… పిడికిలెత్తిన విప్లవం! బహుజనుల ఐక్యతారాగానికి నిలువెత్తు సాక్ష్యం! తాడిత, పీడితవర్గాల అణిచివేతపై ప్రతిఘటన! బలహీనవర్గాల స్వేచ్ఛావాయువుల కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం! నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకున్న జైత్రయాత్ర!
జగిత్యాల జైత్రయాత్ర ఉత్తర తెలంగాణాలో బహుజనుల మూకుమ్మడి పోరాటాలకు బీజం వేసిన ఓ మహోద్యమం. బడుగు, బలహీన వర్గాలకు ప్రశ్నించే తత్వాన్ని, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని నేర్పిన ఉద్యమాల్లో ఇదీ ఒకటి.
అగ్నిపర్వతం విస్ఫోటనమైతే ఏవిధంగా ఉంటుందో.. దశాబ్దాల వెట్టి, బానిసత్వ పోకడలను నిలదీస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటం జగిత్యాల జైత్రయాత్ర. బాంచన్ అంటూ భయం భయంగా బతుకీడే రోజుల్లో బహుజనుల్లో ధైర్యాన్ని నింపింది. కొందరైతే ఏకంగా అటవీ బాట పట్టి ఆయుధాలే చేతబూనారు.అలా జగిత్యాల సభకు హాజరైన ఒక్కొక్కరూ ఒక్కో నిప్పు కణికలా మారారు. అందుకే ఈ జైత్రయాత్రకు చరిత్రలో ఓ విశిష్ఠ స్థానం దక్కింది.

2025 సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల జైత్రయాత్ర చరిత్రకు 47 ఏళ్ళు!
1975 నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొందరు దొరలు, భూస్వాములు, అటవీశాఖ, పోలీస్ పటేల్, పట్వారీల దౌర్జన్యాలు, దాష్టీకాలు మాటలకందని వర్ణనాతీతం. వారి ఆగడాలను ప్రశ్నించినా, తమ వాడలు, కుల సంఘాల్లో కనీసం గుసగుసలాడినా, నడి బజారైన గ్రామ చావడిలో ప్రజల ముందే వారిని కఠినంగా శిక్షించే వారు. అది మరొకరికి గుణపాఠంలా ఉండాలనేలా ఆ శిక్షలు నేటి సినిమాల్లో విలన్లను తలపించేవి.
పటేల్, పట్వారీలు, భూస్వాములు, దొరలే గ్రామపెద్దలు. ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగితే డిపాజిట్ డబ్బు పేరిట వసూళ్లు చేసేవారు. ఇష్టానుసారం తీర్పులు చెప్పేవారు. అలా అణగారినవర్గాలను బానిసత్వం, వెట్టితో పాటు.. వారు రెక్కలు కూడగట్టుకుని సంపాదించుకున్న కాస్తోకూస్తో కూడా వారి నుంచి లాక్కునే కఠినమైన పద్ధతులు నాడు కనిపించేవంటారు. పెద్దలు చెప్పిందే తీర్పు. ఎదురు ప్రశ్నిస్తే అంతే సంగతి. ప్రశ్న ఉద్భవిస్తే వెలే వారికి శిక్ష. అలా తమ సామాజికవర్గంతోనే కుల బహిష్కరణలు చేయించేవారు. సంవత్సరాల తరబడి కుటుంబాలు దొరల ఇళ్లల్లో ఊడిగం చేయాల్సిందే. వెట్టిచాకిరీ చేస్తూ చేదబావుల్లో నీళ్లు తోడాల్సిందే. బట్టలుతకాల్సిందే. ఇల్లూ, వాకిలీ శుభ్రపర్చడం నుంచి వంటపాత్రలు కడగడం, స్నానాలకు నీళ్లు కాయడం వంటి పనులతో కట్టుబానిసలుగా బహుజనుల బతుకుచిత్రం కనిపించేది.
పటేల్, పట్వారీ, దొరలకు మాత్రమే ఎకరాలకెకరాలు వ్యవసాయ భూములుండేవి. మామిడి తోటలుండేవి. బహుజనులకు చెందాల్సిన పరంబోగు, బంజరాయి, ప్రభుత్వ భూముల్లోనూ వారిదే ఆధిపత్యం. దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం, ఇళ్లకు ఆ ధాన్యాన్ని, పంటను చేర్చడం.. వీటికి మాత్రమే బహుజనులు అర్హులు.
సారాయి, కల్లు, తునికాకు సేకరణ ఇదిగో ఇవే బహుజనుల ముందు కనిపించే పనులు. విద్యా, వైద్యం, విద్యుత్ వంటివన్నీ వారి జీవితాల్లో ఎండమావులే.
పల్లెల్లో మోతమోగిన క్యాంపెనింగ్!
అప్పుడే తన బీఈడీ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలోకి వెళ్తాడనుకున్న ఓ ఇంటలిజెంట్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయనే జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. అదిగో ఆయనే నాడు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి చలించిపోయాడు. తనలాంటి భావజాలం కల్గిన మేధావులు, మరికొందరు విద్యార్థులు, యువకులను కలుపుకుని పల్లెలకు తరలండి అంటూ నినదించాడు. అలా పల్లె పల్లెన నాటి జగిత్యాల జైత్రయాత్ర కోసం ప్రచారం చేపట్టాడు.
ఇదిగో ఫలానావాళ్లు రజకులు వస్తున్నారు. ఇస్త్రీ చేస్తారు, బట్టలుతుకుతారు. ఆయిల్ ఇంజన్స్ రిపేర్ చేస్తారు. వారందరినీ మన గ్రామాలకు పంపుతున్నా.. పనులిప్పించండంటూ ప్రాధేయపడ్డాడు. నర్సింహులపల్లి, దొంతాపూర్, బీర్పూర్ గ్రామాల్లో అలాంటివారెందరికో పనులు కల్పించాడు. అయితే వారంతా పనుల కోసం వెళ్లినవాళ్లు మాత్రమే కాదు.. అక్కడి జనాన్ని చైతన్యపర్చేందుకు వెళ్లినవారు. అలా బహుజనుల సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వెళ్లి రెండు నెలల పాటు గడిపి రైతు కూలీ సంఘాలకు బీజం వేసినవారు.
అలా గణపతిలాంటివారి కొందరి చొరవతో గ్రామగ్రామాన రైతుకూలీ సంఘాల ఏర్పాటుకు బీజం పడింది. కులవృత్తులవారు, వ్యవసాయదారులు, పాలేర్లు, కూలీలు ఇలా వీరంతా రైతు కూలీ సంఘాల్లో కీలకపాత్రధారులయ్యారు. అలా విప్లవం మొదలైంది. జీతాలు పెంచకపోతే పాలేర్లు పశువులను మేతకు తీసుకుపోవడం ఆగిపోయింది. వ్యవసాయ కూలీ రేట్లు పెంచకుంటే కలుపు తీయడం, నాట్లు వేయడం, వరికోతలు చేయడం, బంతి కొట్టడం ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయి.. ఉన్నత వర్గాలనుకునేవారి పరమార్థం బోధపడింది. అలా రజక, దళిత, నాయిని, కమ్మరి, కంచరి, కుమ్మరి, వడ్రంగి, గౌడ తదితర కులాలన్నీ తమ డిమాండ్ల సాధనకై ఐకమత్యంతో ఏకతాటిపైకొచ్చాయి. అలా బీర్పూర్ ప్రాంతంలో మొదలైన రైతు కూలీ సంఘం ఏర్పాటు విస్తరించి ఉత్తర తెలంగాణా జిల్లాల్లో గ్రామగ్రామాన రైతు కూలీ సంఘాలు ఆవిర్భవించాయి.
రైతుకూలీ సభ పేరిట మొదలైన జైత్రయాత్ర!
దున్నేవాడిదే భూమి.. పాలేర్లకు జీతాల పెంపు.. వెట్టి నిర్మూలన వంటి డిమాండ్లతో రైతు కూలీ సభ పేరిట జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటుకు సమాలోచనలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణాలోని అన్ని రైతు కూలీ సంఘాలకు సందేశాన్ని చేరవేశారు. జగిత్యాల సభకు సన్నద్ధం చేశారు.
సైకిళ్లపై మావోయిస్ట్ అగ్రనేతలు!
నాడు ఇప్పుడున్నంతగా రవాణా సౌకర్యాల్లేవు. టీవీలు, పత్రికలు, టెలిఫోన్ వంటి సదుపాయాలూ లేవు. అలాంటి సమయంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పడమటి ప్రాంతాల్ల గణపతి, మల్లోజుల కోటేశ్వర్ రావు, నల్లా ఆదిరెడ్డి, సాయిని ప్రభాకర్, ముంజల రత్నయ్య, ఇట్టె లక్ష్మీనారాయణ, పొరకల దొర, శంకర్ రెడ్డి, అర్జయ్య వంటివారంతా సైకిళ్లపై గ్రామగ్రామాన తిరిగారు. జగిత్యాల రైతుకూలీ సభకు తరలిరావాల్సిందిగా ఆయా గ్రామాల్లో ఏర్పాటైన రైతుకూలీ సంఘాలను కోరారు.
1978, సెప్టెబర్ 9న సభకు ఏర్పాటు!
జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ కళాశాల మైదానం రైతు కూలీ సంఘం నిర్వహించే భారీ బహిరంగకు వేదికైంది. ఆ సభే ఆ తర్వాత జైత్రయాత్రగా చరిత్రకెక్కింది. ఎందుకంటే, ఎలాంటి సౌకర్యాల్లేని ఆ రోజుల్లోనే వేలాదిమంది బహుజనులు గొంగడి నెత్తిపైన కప్పుకుని, చేతుల్లో గుత్ప కర్రలు పట్టుకుని.. కొత్త బస్టాండ్ వైపు నుంచి, టవర్ సర్కిల్ మీదుగా.. నాటి జవహర్ టాకీస్ గూండా కాగడాలతో ఊరేగింపుగా కాగడాలతో వస్తున్న ఆ దృశ్యం ఉద్యమాల చరిత్రలోనే ఒక కొత్త ముఖచిత్రాన్ని కళ్లకుగట్టింది.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గోదావరీ తీర ప్రాంతాల నుంచి వేలాది మంది ఎడ్లబండ్లు, కాలిబాటన కొన్ని రోజులపాటు ప్రయాణించి.. దారిపొంట వంటలు చేసుకుంటూ సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాలకు చేరుకున్నారు. ఆ సభకు ప్రజాయుద్ధ నౌక గద్దర్ హాజరై ఆడిపాడాడు. రైతుకూలీలను ఉత్తేజపర్చాడు. సుబ్బారెడ్డి ఆ సభకు అధ్యక్షత వహించాడు. అలా గద్దర్ ఆటాపాట, వక్తల భావోద్వేగపు మాటలు వెరసి.. బహుజనులకు ప్రశ్నించే దమ్ము, ధైర్యాన్ని నూరిపోసింది జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభ. ప్రముఖ సాహితీవేత్త, రచయిత, తెలంగాణా రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు వంటివారు ప్రభుత్వ సంక్షేమశాఖలో ఉద్యోగాన్ని కూడా వదిలేసి సాయుధపోరు బాట పట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లి దళిత సాహిత్య సృష్టికి కృషి చేశారు.
సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పురుడుకు వేదికైన జైత్రయాత్ర!
జైత్రయాత్ర తర్వాత రెండేళ్లకు 1980, ఏప్రిల్ లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో నాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. ప్రస్తుత మంచిర్యాల జిల్లా జన్నారంలో పీపుల్స్ వార్ నక్సలైట్ సంస్థ పురుడు పోసుకుంది. అదే సమయంలో ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పౌరహక్కుల సంఘాలు, సింగరేణి కార్మిక సమాఖ్య, మానవ హక్కుల సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, విప్లవ, దళిత సాహిత్య సమ్మేళనాలు, జననాట్యమండలి, విప్లవ రచయిత సంఘాలు తదితర వామపక్ష భావజాల సంస్థలూ పురుడుపోసుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో కల్లోలిత ప్రాంతంగా జగిత్యాల!
జగిత్యాల జైత్రయాత్ర అనంతరం కొన్ని రోజులకే లొతునూర్ లో కాల్పులు జరిగాయి. ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పుడే ప్రశ్నించే తత్వం పెరిగిపోతోంది. తిరుగుబాటు మొదలైంది. దాన్ని గుర్తించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం 1978-79 మధ్య జగిత్యాల ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. పారామిలటరీ, ఇండో టిబెటన్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ బలగాలను దింపింది. పాఠశాలలు, పంచాయితీ భవనాలు, భూస్వాముల గడీల్లో పోలీస్ క్యాంపులేర్పాటు చేశారు. రైతు కూలీ సంఘం నాయకుల వివరాలను సేకరిస్తూ వివరాలు చెప్పనివారిని చితకబాదేవారు. రైతు కూలీ సంఘం నాయకులెవరు.. అందులో సభ్యులెవరు.. వారికెందుకు భోజనాలు పెడుతున్నారు.. వారినెందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిస్తూ ఇళ్లపై దాడులకు తెగబడేవారు. ఇళ్లల్లో వంటగదుల్లోకి చొరబడి వంటసామాగ్రిలో కిరోసిన్ కలపడం, చిందరవందర చేయడం, చిన్నా, పెద్దా, ముసలి ముతక, మహిళలన్న తేడా కూడా లేకుండా గ్రామచావడిలో వరుసగా కూర్చోబెట్టి స్పెషల్ పార్టీ పోలీసులు దారుణంగా హింసించిన ఘటనలకు నాటి జగిత్యాల ప్రాంతం సాక్షీభూతంగా నిల్చింది.
అప్పటివరకూ ఊళ్లో భూస్వాములు, దొరలు, పటేల్, పట్వారీలకు వ్యతిరేకంగా నడుం బిగించిన వారికి.. ఆ తర్వాత ప్రత్యేక పోలీస్ దళాల బెడద తయారైంది. అలా వారికీ ఊడిగం చేయాల్సి వచ్చింది. బట్టలుతకడం, వంటలు చేయడం, వారి కోళ్లు, మేకలను తెచ్చి పెట్టి వండిపెట్టడం వంటివన్నీ తప్పేవి కావు. మంచాలు, పీఠలు, కలప వస్తువులు వారికి చేసిస్తే అవన్నీ ఆంధ్ర ప్రాంతంలోని మంగళగిరి నుంచి వచ్చిన ప్రత్యేక బెటాలియన్ పోలీసులు పట్టుకెళ్లేవారు
యువకులు, పై నక్సల్స్ సానుభూతిపరులు గా ముద్రలు వేసి వందలమంది పై పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసే వారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ. యువకులు ఆయా పోలీస్ స్టేషన్లకు, పోలింగ్ కేంద్రాలకు, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు, వీరిని రక్షణ కవచం గా పోలీసులు వాడుకునేవారు. పోలీసు దెబ్బలు, వేధింపులు, కేసులు భరించలేక అనేకమంది యువకులు బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఉన్న ఊరును, చేతి వృత్తులను, తమ వ్యవసాయ భూములను, భార్య పిల్లల్ని, వదిలి భీమండి, షోలాపూర్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లి అజ్ఞాత జీవితం గడిపేవారు.
అలా జగిత్యాలన కల్లోలిత ప్రాంతంగా ముద్ర వేసి వారిపై నిర్భంధం పెంచడం పెరిగినకొద్దీ.. తిరుగుబాటూ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. గెరిల్లా దళాలు ఏర్పాటయ్యాయి. కొందరు యువత అడవుల బాట పట్టి నక్సలైట్లుగా మారిపోయారు. గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థలేర్పాటయ్యాయి. టార్గెట్లనుకున్నవారిని ఏకంగా గ్రామ బహిష్కరణలే చేశారు. ఆధిపత్యం ప్రదర్శించే భూములను దున్నడం మానేషారు. పాలేర్లు ఇళ్లకు వెళ్లడం బంద్ చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
జగిత్యాల జైత్రయాత్ర తెచ్చిన మార్పేంటంటే.. బడుగు, బలహీనవర్గాలవారు కూడా ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశం కల్పించింది ఈ జైత్రయాత్ర. అనేకమంది నాయకులు వివిధ సందర్భాల్లో ఈ మాటను చెప్పుకొచ్చేవారు. జైత్రయాత్ర తర్వాత ఉత్తర తెలంగాణా జిల్లాల్లో నిర్భంధాలు పెరిగిపోయాయి. తుపాకుల నీడలో జీవనం సాగించాల్సిన పరిస్థితి కొన్ని పల్లెల్లో కనిపించింది. అందులో అమాయక పోలీసులు, ప్రజలూ అసువులు బాసారు. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివి. అలాగే, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలొకవైపు.. పీపుల్స్ వార్ ఉద్యమం మరొకవైపు.. వీరి మధ్య ప్రశాంతత కొరవడింది. ఒక రెండు దశాబ్దాలపాటు కల్లోలం కొనసాగినా.. జగిత్యాల జైత్రయాత్ర ప్రశ్నించే తత్వాన్ని నూరిపోసింది. చైతన్యాన్ని రాజేసింది. ఇవాళ ప్రజలకు కావల్సిన కనీస మౌలిక సదుపాయల కల్పన జరుగుతోందంటే.. నాడు జరిగిన ఎన్నో ఘటనల ఫలితంగానే చూడాల్సి ఉంటుంది. అందుకే జగిత్యాల జైత్రయాత్ర.. చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.



