ఓసారి తల్చుకోవాల్సిన అమరవీరుడతను!

కొందరి త్యాగాలు చిరకీర్తై నిలబడతాయి. హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ లో 1974, సెప్టెంబర్ 9వ తేదీన.. అంటే నేటి రోజున పుట్టిన ఓ బుడతడు దేశభక్తికి కేరాఫ్ గా నిలుస్తాడని ఎవరూ ఊహించకపోవచ్చు. కానీ, 1999 కార్గిల్ యుద్ధంలో తాను చూపిన ధైర్యసాహసాలు అతడిని హీరోను చేశాయి. అతడే విక్రమ్ బాత్రా. అమరవీరుడైన విక్రమ్ బాత్రా జయంతి సందర్భంగా ఓసారి తల్చుకోవాల్సిన, తెలుసుకోనివారు తెలుసుకోవాల్సిన లైఫ్ స్టోరీ ఇది.

విక్రమ్ చిన్నప్పట్నుంచే ఎనర్జిటిక్. ఉల్లాసవంతంగా కనిపించేవాడు. ఆటల పట్ల తనకున్న ఆసక్తి తనలో ఉన్న కసిని చూపించేది. పాలంపూర్ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేసిన బాత్రా.. ఆ తర్వాత చండీగర్ లోని డీఏవీ కాలేజ్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తల్లి అతణ్ని లవ్ అని పిల్చుకునేది. ఎందుకంటే అతనంటే అందరికీ ప్రేమే. తల్లిని అమితంగా ప్రేమించే కొడుకుగా, తన సోదరీమణులకు రక్షకుడిగా నిల్చే సోదరుడిగా, దోస్తులతో ఉత్సాహభరితం చేసే స్నేహితుడిగా బాల్యం నుంచే విక్రమ్ బాత్రా సమ్థింగ్ స్పెషల్.

గ్రాడ్యుయేషన్ వరకే దేశభక్తి అమితంగా కనిపించిన విక్రమ్ బాత్రా.. ఆ తర్వాత తను పయనించే మార్గం ఇక ఆర్మీ వైపే అని నిర్ణయించుకున్నాడు. డెహ్రూడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. ఆర్మీ సెలక్షన్స్ లోనూ విజయం సాధించాడు. 1997, డిసెంబర్ లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కు సంబంధించిన 13వ బెటాలియన్ లో విధుల్లో చేరాడు. ఇక అక్కడి నుంచి తన సాహసోపేతమైన ప్రయాణం ప్రారంభమైంది. అలా కార్గిల్ మంచు శిఖరాల వరకూ సాగిన ఆయన ప్రయాణం తనను ఓ హీరోగా నిలబెట్టింది. అమరవీరుడిగా భారత ప్రజల గుండెల్లో తనకో స్థానం కల్పించింది.

కార్గిల్ యుద్ధంలో పాక్ చొరబాటుదారులు భారత్ లోకి చొచ్చుకొచ్చి భారత్ కు రక్షణగా నిల్చే పర్వతసానువులను ఆక్రమించినప్పుడు.. అక్కడి యుద్ధశ్రేణులకు బాత్రా నాయకత్వం వహించాడు. 1999, జూన్ 20వ తేదీన ఆయన తన సైనికులతో కలిసి పాక్ మూకలపై ముప్పేట దాడి చేసి.. కార్గిల్ లోని ద్రాస్ ప్రాంతంలో ఉన్న పాయింట్ 5140 ను ధైర్యంగా స్వాధీనపర్చుకున్నాడు. ఓవైపు బుల్లెట్ల వర్షం కురుస్తుంటే.. బాత్రా నినాదం యే దిల్ మాంగే మోర్ అయింది. ఆ తర్వాత భారత యుద్ధదళాలకే కాదు.. యావత్ భారతానికే అదో యుద్ధ పిలుపుగా మారింది.

1999, జూన్ 21వ తేదీన తనకు తన కుమారుడు విక్రమ్ బాత్రా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను ఆయన తండ్రి గిరిధారి లాల్ బాత్రా ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఫోన్ కాల్ మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. కానీ క్యాప్చర్డ్ అనే పదం మాత్రం వినబడింది. బాత్రా తమతో నాన్నా మేం పాయింట్ 5140 హిల్ స్టేషన్ ను స్వాధీనపర్చుకున్నామనేది బాత్రా చెప్పదల్చుకున్న మాట అది. అప్పుడు కాస్తా రిలాక్స్ అయ్యాం. కానీ, ఇంకా ఛేదించాల్సిన పరీక్షలున్నాయని తెలిసి ఒకింత ఆందోళన పడ్డామంటారు గిరిధారి లాల్ బాత్రా.

కొన్ని వారాలు గడిచాయి. 1999, జూలై 7వ తేదీన పాయింట్ 4875 వద్ద బాత్రా అసమాన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ముందుండి దళపతై నడిపిస్తున్నాడు. అలాగే, తోటి అధికారిని శత్రుమూకల కాల్పుల నుంచి రక్షించాడు. కానీ, ఆ యుద్ధ ప్రక్రియలో తానే అమరుడయ్యాడు. ఆ వీరుడి మరణం తల్లిదండ్రులు గిరిధారి లాల్ బాత్రా, కమల్ కాంతా బాత్రాతో పాటు.. యావత్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. యావత్ భారతం ఆ వీరుడి త్యాగాన్ని స్మరించుకుంది. అతడి త్యాగానికి చిహ్నంగా 4875 హిల్స్ కు బాత్రా టాప్ అనే పేరు పెట్టి ఆయన స్మారకార్థం గౌరవించుకుంది ఇండియన్ ఆర్మీ.

విక్రమ్ బాత్రా అత్యున్నత ధైర్యసాహసాలకుగాను 1999, ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున అత్యున్నత శౌర్య పురస్కారమైన పరమవీర చక్రను ఆయన మరణానంతరం ఆయనకు ప్రకటించారు. బాత్రా తండ్రి గిరిధర్ లాల్ బాత్రా ఆ తర్వాత ఏడాది 2000, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున భారత రాష్ట్రపతి చేతుల మీదుగా దాన్ని స్వీకరించారు. ఆయన సొంతూరు హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లో జరిగిన అంత్యక్రియలకు నాయకులు, ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి మొదలకుంటే.. వేలాది మంది సామాన్యులు కూడా తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. సైనికుడంటే బాత్రా అనుకుంటూ అదే దుఖంలోనూ ఒకింత గర్వపడ్డారు.

బ్రిటీష్ పత్రికైన ది గార్డియన్ ఏం రాసిందంటే… భారతదేశ సైనిక చరిత్రలో కొన్ని పేర్లు చాలా ప్రకాశవంతంగా మిణుకుమిణుకుమంటూనే ఉంటాయి. అందులో విక్రమ్ బాత్రా ఒకరు. ధైర్యం, నాయకత్వం, నిస్వార్థ ఆలోచన, దేశభక్తితో.. బాత్రా తరతరాలకూ స్ఫూర్తినిచ్చే ఓ మార్గదర్శిగా కొనియాడింది ది గార్డియన్.

ఆమధ్య వచ్చిన విక్రమ్ మల్హోత్రా నటించిన షెహన్షా నుంచి ఎన్నో సినిమాలకు ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతూనే ఉన్నాడు విక్రమ్ బాత్రా. పతకాలు, బిరుదులు, గుర్తింపుకు అతీతంగా దేశభక్తిని చాటిన అమరవీరుడిగా బాత్రా పేరు ధర్మమార్గంలో నడిచేవారికి ఎప్పుడూ ఆదర్శమే.

నేడు 51వ జయంతిని జరుపుకుంటున్న విక్రమ్ బాత్రా… చిన్న వయస్సులోనే పెద్ద పేరు తెచ్చుకుని అమరవీరుడై వెళ్లిపోవడం యావత్ భారతజాతికే బాధాకరం. కానీ, భారత పరాక్రమానికి పరాకాష్ఠలా… హిమాలయ పర్వత సానువులపై త్రివర్ణ పతాకపు రెపరెపలా బాత్రా పేరు ఎప్పటికీ జనం గుండెల్లో ఓ ప్రేరణై మార్మోగుతూనే ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles