జపాన్ శ్రీమంతుడు.. ఇప్పుడు ఉత్తరాఖండ్ బాబా!

ఐరనీ ఏంటంటే.. ఓవైపు శాస్త్ర విజ్ఞానం, సైన్స్ వైపు అడుగులేయాలంటూ సోషల్ మీడియా వచ్చాక విపరీతమైన ప్రచారం మొదలైంది. అందుకు తార్కికమైన సమాధానాలను ముందుంచి మరీ ఆ ప్రచారం ఒకవైపు జరుగుతోంది. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరైన భారతదేశంలో ఈ ప్రచారం అంతకంతకూ పెరుగుతుంటే… సైన్స్, శాస్త్రీయ పరిశోధనలకు చిరునామా అయినటువంటి జపాన్ వంటి దేశాల్లోని కొందరు వ్యక్తులు ఏకంగా భారత్ వైపు చూస్తున్నారు. చూడ్డమే కాదు… ఏకంగా ఇక్కడి సంప్రదాయలు, ఆచారాల పట్ల ఆకర్షితులై.. బాబాలుగా అవతరిస్తున్నారు. అలాంటి ఓ జపాన్ బాబా కథే ఇది.

ఉత్తరాఖండ్ లో ఓ శివభక్తుడిప్పుడు తోటి భక్తులను ఆకట్టుకుంటున్నాడు. ఎందుకంటే అతడో సంపన్నుడు. జపాన్ లో ఉన్న తన సంపదనంతా వదిలి భారత్ మార్గం పట్టినవాడు. శివభక్తుడిగా కాషాయవస్త్రాలు ధరించి ఓ బాబా రూపంలో అవతారమెత్తినవాడు.

ఇప్పుడా బాబా పేరు బాల కుంభ గురుముని. 41 ఏళ్ల హోషీ తాకయుకికి జపాన్ రాజధాని టోక్యోలో సౌందర్య సాధనాలకు సంబంధించి గొలుసుకట్టు దుకాణాలున్నాయి. కావల్సినంత ధనరాశులున్న సంపన్నుడు. కానీ, ఇప్పుడు ఉత్తరాఖండ్ లో తీర్థయాత్రల కోసం చెప్పుల్లేకుండా తిరుగుతున్నాడు.

ఉత్తర భారతదేశంలో కన్వర్ యాత్ర ఫేమస్. ఈ సారి ఇది ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. భక్తులు గంగానదిలోని నీటిని కావడి కట్టుకుని.. ఆ కావడికి ఓ బిందెను వేలాడదీసి.. అందులో నీళ్లు నింపుకుని పాదయాత్రగా వెళ్లి తమ ఊళ్ల దగ్గర ఉన్న దర్శనీయస్థలాల్లోనే, లేక వారు మొక్కుకున్న ఏదైనా గుళ్లల్లోనో ఆ గంగానదీ జలంతో ఆ శివుణ్ని అభిషేకించడమే కన్వర్ యాత్ర ముఖ్యోద్ధేశం.

అదిగో ఆ కన్వర్ యాత్రలో మెరిశాడు జపాన్ కు చెందిన బాల కుంభ గురుముని. 20 మంది జపనీస్ అనుచరులను వెంటబెట్టుకుని పవిత్ర గంగా జలాల్ని వెంటబెట్టుకుని మోసుకువెళ్తూ ఆయన మిగిలిన సమాజం దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు, డెహ్రాడూన్ లో తోటి కన్వారియుల కోసం రెండు రోజుల ఆహార శిబిరాన్ని నిర్వహించి వారికి కావల్సిన అల్పాహారం, భోజనాలు వంటివి అందించాడు.

తాకయుకి ఆధ్యాత్మిక ప్రయాణం సుమారు 20 ఏళ్ల క్రితం తమిళనాడు పర్యటనతో ప్రారంభమైంది. నాడీ జ్యోతిష్యానికి చిరునామా అయిన తమిళనాడుకు వెళ్లాక తన జీవితం మారిపోయింది. అక్కడికెళ్లిన తనకు తాకయుకి గత జన్మంతా హిమాలయాల్లో గడిచిందని.. ఇప్పుడు కూడా హిందూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని ఆ జ్యోతిష్కులు చెప్పిన మాటలను నమ్మిన తాకయుకి ఇదిగో ఇప్పుడు బాబాగా అవతరించాడు.

అంతేకాదు, తనకూ ఓ కల వచ్చిందని.. ఆ కలలో తాను పూర్వజన్మలో ఉత్తరాఖండ్ లో ప్రయాణిస్తున్నానన్నాడు తాకయుకి. ఆ కల తన జీవితాన్నే మార్చివేసిందని చెబుతున్నాడతను.

మొత్తంగా ఆధ్యాత్మిక పరివర్తనతో తాకయుకి జీవితమే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జపాన్ లో కోట్ల రూపాయల వ్యాపార సామ్రజ్యాన్ని వదులుకుని.. ఓ సన్యాసి గుర్తింపుతో మోక్షం కోసం బహుదూరపు బాటసారై పయనిస్తున్నాడు బాల కుంభ గురుముని తాకయుకి. ఇప్పుడు టోక్యోలోని తన ఇల్లు కూడా శివాలయం నమూనాలో మార్చేశాడు. త్వరలోనే ఒక మందిరాన్ని కూడా నిర్మిస్తానంటున్నాడు.

జపాన్ లో తాకయుకి మిత్రుడైన భారత్ కు చెందిన రమేష్ సుంద్రియల్ ఏమంటాడంటే.. ప్రస్తుతం తాకయుకి పుదుచ్చేరీలో ఓ 35 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఓ శివాలయాన్ని నిర్మించబోతున్నాడని. ఇప్పటికే తాకయుకి ఉత్తరాఖండ్ లో ఓ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

మొత్తంగా దేవభూమి ఉత్తరాఖండ్ తో తనది జన్మజన్మల బంధమంటున్నాడు తాకయుకి. కొండలు, కోనల్లో గత జన్మలో తానెక్కడ జన్మించానో శోధిస్తున్నానంటున్నాడు. ఉత్తరాఖండ్ కన్వర్ యాత్రలో మొత్తంగా ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిల్చాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles