జూలై 1 డాక్టర్స్ డే! ఎలా మొదలైందో తెలుసా..?

ఇవాళ ఓ ముఖ్యమంత్రి పుట్టినరోజు.. అదే ఆయన గౌరవార్థం జాతీయ వైద్యుల దినోత్సవంగా కూడా మారింది. ఎవరా మాజీ డాక్టర్ ముఖ్యమంత్రి…? ముఖ్యమంత్రి సరే… మరి వైద్యుడిగా కూడా ఆయన చేసిన అంత గొప్ప సేవలేంటి…? జూలై ఫస్ట్ అనే తేదీనే తన ప్రస్థానానికి ఓ పేజీగా మార్చుకున్న ఆ డాక్టర్ సాబ్ కథేంటో తెలుసుకుందాం రండి.

భారతదేశం ప్రతీ జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున ప్రముఖ వైద్యులను గౌరవించుకునే సన్మాన కార్యక్రమాలెన్నో చాలాచోట్ల చేస్తుంటారు. ఎందుకంటే.. పశ్చిమబెంగాల్ రెండో ముఖ్యమంత్రైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గౌరవార్థం ఈ తేదీకా విశిష్ఠత చేకూరింది.

బిధాన్ చంద్రరాయ్ డాక్టర్, కరుణామయుడు, పాలకుడు, దార్శనికుడు.. ఇలా అన్ని గుణాల సంగమం కాబట్టే ఆయన పుట్టినరోజున నేషనల్ డాక్టర్స్ డేకు కారణమైంది.

అసలు బిధాన్ చంద్రరాయ్ ఎవరు..?

1882, జూలై 1వ తేదీన పాట్నాలో జన్మించాడు. ఆయన జన్మించేనాటికి పాట్నా అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది. భారతదేశంలో ఇప్పటికీ అత్యంత విశిష్ఠమైన వైద్యులెవ్వరి పేరు చెప్పినా.. అందులో ముందువరుసలో ఉండే పేర్లలో బిధాన్ చంద్రరాయ్ ఒకరు. కలకత్తా మెడికల్ కళాశాల నుంచి మెడిసిన్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఇంగ్లాండ్ కు వెళ్లాడు. ఎంఆర్సీపీ, ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేశాడు. నాటిరోజుల్లో క్లిష్టతరమైన ఈ అర్హతలను సాధించిన వైద్యుడిగా గుర్తింపు పొందారు.

తన ఉన్నత చదువులు ముగియగానే భారత్ కు తిరిగివచ్చిన చంద్రరాయ్… తన జీవితం మొత్తాన్ని వైద్యం, ప్రజా జీవితానికే అంకితం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య సంరక్షణ సంస్కరణలతో పాటు, వైద్యవిద్య, ప్రభుత్వ వైద్య సంస్థల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేశారు. అలా ఆయన సేవలు హాస్పిటల్ క్లినిక్ గోడలు దాటి ఎల్లల్లేని గుర్తింపును పొందాయి.

రోగులను నయం చేయడం నుంచి రాష్ట్రాన్ని నయం చేసేవరకు!

వీలైనంత మంది పేద, మధ్య తరగతికి తన శక్తిమేరకు వైద్య సేవలందిస్తూనే ఉన్నా.. మరింత సమగ్ర ప్రజా సేవ చేయాలంటే మాత్రం రాజకీయాలే సరైనవని విశ్వసించాడు. అలా, అప్పటికే మహాత్మాగాంధీతో ఉన్న సత్సంబంధాలతో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1948లో పశ్చిమబెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చాక కూడా తిరిగి సీఎంగా ఎన్నికైన బిధాన్ చంద్రరాయ్.. 1962లో తాను కన్నుమూసేవరకూ కూడా పదవిలో ఉన్నారు. ఓవైపు బెంగాల్ విభజన సమస్యలు.. ఇంకోవైపు, సామూహిక వలసల ప్రభావానికి కొట్టుమిట్టాడుతున్న సమయంలో డాక్టర్ రాయ్ ఆధునిక పద్ధతులననుసరిస్తూ పట్టణ ప్రణాళిక, పారిశ్రామిక అభివృద్ధి, వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు పునాది వేశారు.

పశ్చిమబెంగాల్ లోని కళ్యాణి, దుర్గాపూర్, అశోక్ నగర్ వంటి అనేక ముఖ్యనగరాలు, పట్టణాల స్థాపన, అభివృద్ధిలో రాయ్ ది కీలకపాత్ర. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే విషంయలోనూ, సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే విషయంలోనూ ఆయన దార్శనికత నాటి పశ్చిమబెంగాల్ కు ఎంతగానో ఉపయోగపడింది.

ఎందుకు రాయ్ కి అంత పేరు..?

రాయ్ వైద్య, విద్యాసంస్థల రూపశిల్పి. సమాజ స్థితిగతులను మార్చే ప్రాధాన్యతాంశాలు విద్య, వైద్యమని నమ్మిన నాయకుడు. ఆయన స్థాపించిన కొన్ని పిల్లర్సే ఆయనేంటో చెబుతాయి.

ఇవాల్టికీ మనం వినే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల వెనుకుందీ రాయే. క్యాన్సర్ ట్రీట్మెంట్ కు కలకత్తాలో పెట్టింది పేరైన చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, ప్రస్తుతం పావ్లో హాస్పిటల్ గా పిల్చుకునే.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ కాలేజ్ వంటివెన్నో రాయ్ హయాంలో రూపుదిద్దుకున్నవే. వీటితోనే సరిపెట్టుకోలేదు.. పట్టణాలతో పాటే, గ్రామీణ వైద్యంపైనా దృష్టి సారించాడు. గ్రామీణారోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాడు.

అసలు జూలై 1 వైద్యుల దినోత్సవంగా ఎందుకు మారింది..?

1991లో భారత ప్రభుత్వం డాక్టర్ బిసీ రాయ్ జీవన ప్రస్థానానికి గుర్తింపుగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే, ఒకటే జననం, ఒకటే మరణమన్నట్టుగా… యాదృచ్ఛికంగా ఆ రెండూ ఒకే తేదీన సంభవించిన మహనీయుడు బీసీ రాయ్. 1882, జూలై 1న పుట్టిన బీసీ రాయ్.. 1962, జూలై 1ననే కన్నుమూశారు. ఒక డాక్టర్ గా తన దగ్గరకు వచ్చిన ఒక రోగి ఆరోగ్య సంరక్షణ పట్ల ఎలాంటి శ్రద్ధైతే చూపించారో… అదే శ్రద్ధను ముఖ్యమంత్రి అనే పదవిలో కూర్చున్న వైద్యుడిగా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించిన నాయకుడిగా కూడా బీసీ రాయ్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అందుకే, ఆయన బర్త్ అండ్ డెత్ డే అయిన జూలై 1ని భారతదేశ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఇవాళ, రేపట్లో ప్రతీదానికీ ఓ దినోత్సవాన్ని జరుపుకోవడం, వాటి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, వైద్యుల దినోత్సవం అందుకు భిన్నమైంది. ఇదో ఉత్సవమేం కాదు. పవిత్ర వృత్తి పట్ల బాధ్యతలను గుర్తు చేసేది.

బీసీ రాయ్ వారసత్వం నేటి వైద్యులకు స్ఫూర్తినిచ్చే ఓ పాఠం!

మెడిసిన్ చదవాలనుకునేవారి నుంచి నేడు డాక్టర్లుగా ఉన్నత స్థానాల్లో నిల్చినవారెందరికో బీసీ రాయ్ కథ ఎప్పటికీ ఓ ప్రేరరణే. సాటి మనిషి పట్ల సానుభూతి, కరుణ, క్రమశిక్షణ, దృక్పథంతో పాటు.. ఆయన నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాల్సిన అంశాలు.

బీసీ రాయ్ చనిపోయే ఒక ఏడాది ముందే 1961లో ఆయనను భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించుకుంది. తన వైద్య విజయాలతోనే కాకుండా.. నాయకుడైన డాక్టర్ గా తానున్న కాలంలో రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆయన చూపిన దార్శనికత ఆయన్ని భారతరత్నను చేసింది. అందుకే ఆయన స్మారకార్థం నిర్వహించే జూలై 1 వైద్యుల దినోత్సవానికి అంత ప్రత్యేకత!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles