కోటీశ్వరుల్ని చేసిన ప్లాస్టిక్ గుండీల కథ!
ఓ చిన్నబటన్… 1700 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. గుజరాతంటేనే బిజినెస్. కొత్త కొత్త వ్యాపారాలకు ఓ హబ్. అలాంటి గుజరాత్ నుంచి ఇవాళ ప్లాస్టిక్ సామ్రాజ్యంలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగినవారే ఆ అన్నదమ్ములు. వాళ్లే బ్రిజ్లాల్ బ్రదర్స్.

అప్పట్లో మెటల్ బటన్స్ ఫ్యాషన్ ప్రపంచంలో బాగా నడుస్తున్న రోజులవి. ఆ క్రమంలో బ్రిజ్లాల్ బ్రదర్స్ తమ సొంత గ్రామంలో ఓ చిన్నతరహా పరిశ్రమగా ఆ మెటల్ గుండీల తయారీ కేంద్రాన్నిప్రారంభించారు. బాగానే నడుస్తున్న ఆ పరిశ్రమ నుంచి తమ పార్ట్నర్స్ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. దాంతో ఆ పరిశ్రమలో అపసోపాలు మొదలయ్యాయి. కానీ బ్రిజ్ లాల్ బ్రదర్స్ ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా.. కొత్త బిజినెస్ ఏం ప్రారంభించాలా అని యోచించారు. 1934వ సంవత్సరంలో వాళ్లిద్దరూ ముంబాయికి చేరుకున్నారు. అక్కడ ప్లాస్టిక్ బటన్స్ కొనే ఓ మిషన్ ను కొనుగోలు చేశారు. ప్లాస్టిక్ బటన్స్ తయారుచేసి అమ్మితే వచ్చినదానికన్నా ఉత్పత్తి ఖర్చు తక్కువే కానీ… మెటల్ బటన్స్ నడుస్తున్న ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్ బటన్స్ ను మార్కెట్ చేయడమనేది అప్పుడా ఆ బ్రదర్స్ కు ఓ సవాల్ గా మారింది. కానీ ఎంటర్ ప్రెన్యూర్ అంటే సవాళ్లను స్వీకరించేవారనే పర్యాయపదం కదా? అందుకే ఆ బ్రిజ్ లాల్ బ్రదర్స్ వెనుకడుగు వేయలేదు. ఎక్కడతై రిస్క్ ఉంటుందో అక్కడే అవకాశాలూ ఎక్కువని నమ్మిన ఆ అన్నదమ్ములిద్దరూ… ఆ రిస్క్ కే వెనుకడుగేస్తే డౌన్ ఫాల్ మొదలైనట్టేనని డిసైడ్ అయిపోయారు.
శరీరంపై బయటశక్తి ఏదైనా పనిచేసేవరకూ కూడా ఆ శరీరం యథాతథస్థితిలోనే ఉంటుంది… ఏదైనా శక్తి పనిచేసినప్పుడే మార్పనేది కనిపిస్తుందనే న్యూటన్ మొదటి లా సూత్రాన్ని ఒంటపట్టించుకున్న బ్రిజ్ లాల్ బ్రదర్స్… బరువైన మెటల్ బటన్స్ స్థానంలో తేలికపాటి ప్లాస్టిక్ బటన్స్ ను తీసుకురావాలని గట్టిపట్టు పట్టారు. వాళ్ల మార్కెటింగ్ వ్యూహాంలో ఒక్క ఛాన్సిచ్చి చూద్దామన్న మార్కెట్ వర్గాల ఆలోచనో… మొత్తానికి బ్రిజ్ లాల్ బ్రదర్స్ ప్లాస్టిక్ గుండీల ఫార్మూలా నచ్చో… సూపర్ సక్సెస్సయ్యారు ఆ సోదరులు. ఎప్పుడైతే ప్లాస్టిక్ గుండీలు సక్సెస్ అయ్యాయో… ప్లాస్టిక్ కు మంచి భవిష్యత్తుందని భావించిన ఆ అన్నదమ్ములిద్దరూ.. 1950లో ప్లాస్టిక్ కప్పులను దేశంలో ఇంటర్ డ్యూస్ చేశారు. ప్లాస్టిక్ కప్పులను మార్కెట్ లో చూసిన జనాలకు అవి తెగ నచ్చేశాయి. ఇంకేముందీ ప్లాస్టిక్ కప్పుల కథ మీడియా దృష్టినీ ఆకర్షించింది. కావల్సినంత పాప్యులారిటీ వచ్చేసింది. అదీ మళ్లీ సక్సెస్. అప్పుడే ఇక బ్రిజ్ లాల్ బ్రదర్స్ లో ఒకరి కుమారుడైన వామన్ పారిఖ్ వాళ్ల బిజినెస్ లో భాగస్వామయ్యాడు. ఇక ఆ తర్వాత 1964 నుంచి వాళ్లు ప్లాస్టిక్ పై మరింత దృష్టి కేంద్రీకరించారు. పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కొని తమ పరిశ్రమను మరింత విస్తరించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతీ ఇళ్లల్లో కనిపించే నీళ్ల డ్రమ్ముల తయారీ మొదలైంది.
1981లో బ్రిజ్ లాల్ బ్రదర్స్ కుమారులైన వామన్ పారిఖ్, శరద్ పారిఖ్ ఇద్దరూ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అలా వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారో, లేదో.. అప్పటివరకూ ఉన్న ఇనుప, కట్టె కుర్చీలు, టేబుల్స్ స్థానంలో ప్లాస్టిక్ కుర్చీలను తీసుకొస్తే ఎలాగుంటుందన్న ఆ అన్నదమ్ముల ఆలోచనే ఇవాళ మనమంతా ప్రతీ ఇళ్లల్లో, ఆఫీసుల్లో వాడుతున్న నీల్ కమల్ చైర్స్ రూపకల్పనకు కారణమైంది. నీల్ కమల్ పేరుతో బుట్టలు, పైపులు, గ్లాసులు ఎన్నోరకాల తయారీ మొదలైంది. అప్పుడే మరింత విస్తారించాలన్న వారి కాంక్షలో భాగంగా పరిశ్రమల అవసరాలపై దృష్టి సారించారు. పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్ ను తరలించే బాక్సుల తయారీపై దృష్టి సారించారు. 2005లో న్యూసీరిస్ ఆఫ్ ప్లాస్టిక్ పేరుతో దేశంలోని రిటైల్ మార్కెట్ లోకి ప్రవేశించారు. అలా సక్సెస్ కొనసాగుతూనే ఉంది.
ఇవాళ దేశంలోని ఏ ప్రాంతంలో చూసినా నీల్ కమల్ ఫర్నీచర్ కనిపించకుండా ఉండదు. అంతేకాదు ప్రతీ పట్టణంలోనూ కచ్చితంగా నీల్ కమల్ ఫర్నీచర్ షాపులూ విస్తృతంగా దర్శనమిస్తుంటాయి. బ్రిజ్ లాల్ బ్రదర్స్ వారి కొడుకులు కలిసి డౌన్ టూ ఎర్త్ గా ఉంటూనే ఆకాశమెత్తు ఎదిగారు. వారి బిజినెస్ వార్షిక ఆదాయం 1700 కోట్ల టర్నోవర్ కు చేరింది. ఏదైనా బిజినెస్ ను ఆరంభశూరత్వంతో ప్రారంభించడమే కాదు… దాంట్లో ఎన్ని ఆటుపోట్లెదురైనా ఓపికతో తట్టుకోని నిలబడ్డవాడే చివరకు విజయం సాధిస్తాడన్నది బ్రిజ్ లాల్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ స్టోరీ వింటే అనిపించట్లేదూ..?



