కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరు. నిజమే. ఆ పచ్చని ప్రకృతి.. ఓవైపు సముద్రం.. మరోవైపు బ్యాక్ వాటర్.. ఎక్కడికెళ్లాలన్నా ఇతర పట్టణాలకు భిన్నంగా బోట్లలో ప్రయాణం.. కొండలు, గుట్టలు… సరైన సమయంలో ప్రకృతిసిద్ధంగా వచ్చే రుతుపవనాలతో కురిసే వర్షపాతం.. కచ్చితంగా చూడదగ్గ ప్రదేశం. కానీ, ఇప్పుడక్కడి ప్రళయం మిగిల్చిన విషాదం… ఆ టూరిజం స్పాట్ ను డార్క్ టూరిజంగా మార్చేసింది.

ఒకరా, ఇద్దరా.. అదో ఉత్పాతం.. కొండచరియలు విరిగిపడ్డ బీభత్సంలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది ఆచూకీ, ఆనవాళ్లు కూడా ఆ చరియల కింద లభించలేదు. ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే మానవ మాత్రుల శక్తెంత.. అనే ప్రశ్నను ముందుంచిన ఓ భయానక దృశ్యానికి కేరళ కేరాఫ్ అయింది.
నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ వెలుగులీనే కేరళ.. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ బృందాలతో.. చుట్టపుచూపుగా వచ్చి రాజకీయాలు చేసే నాయకులతో.. ఓ నిర్జీవ ప్రదేశంలా చిమ్మచీకటిని కళ్లకు కడుతోంది. వచ్చే టూరిస్టులకు అక్కడి ప్రభుత్వం, పోలీస్ సిబ్బంది రావొద్దని.. పర్యాటకులు రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని.. అభ్యర్థించే, ఏకంగా హెచ్చరికలు కూడా జారీ చేసే కాలమొకటి దాపురించింది.
ఇంతకాలం టూరిజం స్పాట్ గా అందరి గుర్తింపు పొందిన దేవతలుండే ఓ స్వర్గంగా పిలువబడ్డ కేరళ.. ఇప్పుడు డార్క్ టూరిజం స్పాట్ గా వార్తల్లో నిలవడం ప్రకృతి సృష్టించిన మానవమాత్రులకందని ఓ దురదృష్టకర పరిణామం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ డార్క్ టూరిజం స్పాట్స్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. కేరళలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. విషాదాన్ని కళ్లతో చూసి రావాలని అక్కడికి వెళ్లేందుకు నానా ఇబ్బందులున్నా.. ఆ సవాళ్లన్నీ దాటిపోయి చూసి వచ్చే పర్యాటకం పెరిగిపోవడం మరో కోణం.
కనువిందు చేసే అందమైన ప్రకృతి కన్నా కూడా.. మిస్టరీయస్ గా, కాస్త థ్రిల్లింగ్ గా ఉండే ప్రాంతాలూ.. డార్క్ టూరిజం స్పాట్స్ గా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి. అలా తరచూ హత్యలు జరిగే ప్రాంతాలు, మారణహోమాలకు కేరాఫైన ప్రదేశాలు, ప్రకృతి బీభత్సాలు తరచూ సంభవించే టూరిస్ట్ స్పాట్స్ అంటే… పాజిటివ్ వైబ్స్ ను ఇష్టపడేవారికి కాకపోయినా… కొందరిలో మాత్రం ఆ క్యూరియాసిటీ కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు విషాద కేరళ కూడా అలాంటి టూరిస్టులతో సందడిగా మారుతుండటం ఓ చర్చగా మారింది. వార్తల్లోకెక్కింది.
మళయాళ మనోరమ, ఎన్డీటీవీ, ఇతర ప్రముఖ ఛానల్స్ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ కథనాలు, లైవ్ రిపోర్టింగ్ తో.. విహార కేరళపై ఎంత ఆసక్తి కనబర్చారో.. విషాద కేరళపై కూడా పర్యాటకులు అంతే క్యూరియాసిటీని ప్రదర్శించడం మరో కోణం.
మరీ ముఖ్యంగా ఇరువైఫుళ నదీ ఒడ్డున.. వాయినాడ్ లో జూలై 30వ తేదీన.. 86 వేల చదరపు మీటర్ల భూమి ఏవిధంగా జారిపోయింది.. ఆ రెండు కొండ చరియల ఎత్తు రాష్ట్రపతి భవన్ కన్నా ఐదు రెట్ల ఎత్తు ఎక్కువలో ఎలా ఉన్నాయి.. అవి ఉన్నపళంగా కుప్పకూలితే ఏం జరుగుతుందో.. ఉపగ్రహ చిత్రాలను చూపిస్తూ కొన్ని ఛానెల్స్ చూపిస్తున్న కథనాలు కూడా ఇప్పుడు కేరళవైపు మళ్లీ పర్యాటకులను క్యూ కట్టిస్తున్నాయి. అయితే, ఈ విషాద సమయంలో పర్యాటకుల తాకిడితో.. నిన్నటివరకూ టూరిజం స్పాట్ గా వార్తల్లో నిల్చిన కేరళను ఇప్పుడు డార్క్ టూరిజం స్పాట్ గా పతాకశీర్షికలకెక్కిస్తోంది.



