ఇప్పుడంటే మీరట్ అని పిల్చుకుంటున్నాంగానీ… ఒకనాడు మైదంత్ కా ఖేరా అని పిల్చేవాళ్లు. ఎందుకంటే ఈ రాజధానిని నాడు రావణాసురుడి మామ, మండోదరి తండ్రి మయాసురుడు పాలించేవాడు. ఆ తర్వాత దీన్ని మైరాష్ట్ర అని కూడా సంస్కృత పేరుతో పిల్చేవారు. అలా మైరాష్ట్ర, మై దంత్ కా ఖేరా, మైరాట్ నుంచి ఇప్పుడు మీరట్ గా స్థిరపడిపోయింది. అలాంటి ఓ చారిత్రక ప్రాంతం మీరట్.. ఇప్పుడు కిడ్నాపర్స్ హబ్ గా సెలబ్రిటీస్ ని వణికిస్తూ వార్తల్లోకెక్కుతోంది.

బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముస్తాక్ ఖాన్ కు ఓ అవార్డ్ ఫంక్షన్ ఉంది. మీకు అవార్డ్ ఇస్తున్నాం. మీరు తప్పకుండా రావాలని ఫోన్ వచ్చింది. ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేయడంతో పాటు, ఆ కార్యక్రమానికి హాజరైనందుకు కొంత అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసేశారు. అదేదో బాగుందనుకున్న సదరు నటుడు ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో దిగిన తర్వాత కొందరు ముస్తాక్ ను కారులో ఎక్కించుకుని.. బిజ్నోర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎందుకు అటువైపుగా తీసుకెళ్తున్నారో తెలియని ముస్తాక్… అవార్డ్ ఫంక్షన్ కే వెళ్తున్నానుకుంటున్నాడు. కానీ, అక్కడికెళ్లాక తెలిసింది. తనను కిడ్నాప్ చేశారని. ముస్తాక్ ను ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. 12 గంటలపాటు టార్చర్ పెట్టారు. ముస్తాక్ ఖాన్ తో పాటు, అతడి కొడుకునూ ఫోన్ లో బెదిరించి ఇద్దరి ఖాతాల నుంచి రెండు లక్షల రూపాయలు కొల్లగొట్టారు. అయితే, ముస్తాక్ ఖాన్ చాకచక్యంగా అక్కడి మసీద్ ప్రార్థనలు విని అక్కడినుంచి ఎలాగోలా బయటపడి మసీదుకు వెళ్లాడు. తన పరిస్థితి చెప్పి తిరిగి రావడానికి అక్కడివారి సాయం కోరాడు. ఆ తర్వాత వెంటనే బిజ్నోర్ పోలీసులను సంప్రదించి… ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు పెట్టి ఎప్ఐఆర్ నమోదు చేశారు.
కేవలం ముస్తాక్ ఖాన్ ఒక్కడి విషయంలోనే కాదు… సెలబ్రిటీస్ టార్గెట్ గా ఈవెంట్స్ కు ముఖ్య అతిథుల పేరుతో పిలవడం, అవార్డ్స్ అందజేస్తామంటూఆశ పెట్టడం… కిడ్నాపర్స్ తెరలేపిన ఓ కొత్త డ్రామా.

గత 2024 డిసెంబర్ నెల ప్రారంభంలోనూ ఇలాంటి ఘటనే మరోటి అందుకో ఉదాహరణ. సునీల్ పాల్ అనే బాలీవుడ్ హాస్యనటుడు, స్టాండప్ కామెడీ షోస్ భాగస్వామి, ఓ సినిమా కూడా తీసిన దర్శకుడు.. డిసెంబర్ 2వ తేదీన హరిద్వార్ లో ఓ కార్యక్రమానికి వెళ్లుతున్న క్రమంలో… కిడ్నాప్ కు గురయ్యాడు. సునీల్ ను కిడ్నాప్ చేసిన అగంతకులు తాము అర్జంటుగా బంగారం కొనేందుకు తమకు డబ్బు కావాలంటూ… సునీల్ ఖాతాలో ఉన్న 8 లక్షల రూపాయలను బలవంతంగా కొల్లగొట్టారు. ఆ కేసునూ నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్న క్రమంలో… ఇద్దరు వ్యక్తులు ఆభరణాలు కొంటుండగా వారిని పట్టుకున్నారు.
సెప్టెంబర్ 8న ప్రముఖ టీవీ నటుడు రాజేశ్ పూరీ ఓ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్తుండగా.. కిడ్నాపర్స్ తనను అపహరించే యత్నం చేశారు. సేమ్ ముస్తాక్ ఖాన్ కేసులాగానే.. కిడ్నాపర్స్ రాజేశ్ పూరీకి ముందస్తుగా ఓ 35 వేల రూపాయల అడ్వాన్స్ పేమెంట్ తో పాటు.. విమాన టిక్కెట్స్ పంపించారు. అంత మర్యాద చేస్తున్నప్పుడు దాన్ని రాజేశ్ పూరీ కూడా అనుమానించలేకపోయాడు. అంగీకరించాడు. అయితే, అదృష్టవశాత్తూ మీరట్ నుంచి ఓ 12 కిలోమీటర్ల దూరంలోనున్న ఓ దాబా వద్ద ఓ వ్యక్తితో మాటలు కలిసి సందర్భంలో.. తానెందుకు వచ్చానో చెప్పినప్పుడు… ఆప్ వాపస్ చలే జావో, ఇదరు కుచ్ బీ ఠీక్ నహీ హై, కోయి ఫంక్షన్ బీ నహీ హై, ఔర్ ఆప్ కిడ్నాప్ హో గయే హో.. అంటూ చెప్పగానే రాజేశ్ లో అనుమానం మొదలైంది. దాంతో రాజేశ్ సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు ఫోన్ చేసి తన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే, అప్పటికే ఈ విషయంపై సినీ, టీవీ వర్గాల్లో చర్చ జరుగుతుండటంతో… CINTAA సభ్యులు వెంటనే మీరు జాగ్రత్త పడండి.. వారి ఉచ్చులో పడకండని చెప్పడంతో రాజేశ్ తన కిడ్నాప్ నుంచి తప్పించుకున్నాడు.
రాజేశ్ తన విషయాన్ని హాస్యనటుడు సునీల్ పాల్ తో… సునీల్ పాల్ కిడ్నాప్ కు 20 రోజుల ముందే షేర్ చేసుకున్నాడు. అయినా, అప్రమత్తత లేకపోవడమో… నమ్మకమో ఆ తర్వాత సునీల్ పాల్ కిడ్నాపర్స్ కు దొరికిపోయాడు. ఈ ఘటనలకు ఇప్పుడు ఢిల్లీకి దగ్గరగా ఉండే మీరట్ ఓ హబ్ గా మారిపోయింది. దీంతో సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికలు.. అనుభవజ్ఞుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.



